క్రైమ్/లీగల్

నకిలీ ఎంఎస్‌కే అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: ప్రముఖ క్రికెటర్, బీసీసీఐ చీఫ్ సెలక్టర్, గుంటూరు జిల్లా వాసి ఎంఎస్‌కే ప్రసాద్ పేరును వాడుకుని నగదు వసూలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఫోన్‌లో ఎంఎస్‌కేలా మాట్లాడి ప్రముఖుల వద్ద నుండి నాగరాజు అనే వ్యక్తి నగదును వసూలు చేస్తున్నట్లు ఆధారాలు లభించడంతో విజయవాడ పోలీసులు గురువారం అతడిని అరెస్ట్ చేసి రూ. 1.80 లక్షలు, పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక మాచవరం పోలీసు స్టేషన్‌లో గత నెల 22న వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం, యవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు (24) ప్రస్తుతం విశాఖ నగరం మధురవాడ గాయత్రీనగర్‌లో ఉంటున్నాడు. ఎంబీఏ వరకు చదువుకుని క్రికెట్‌పై ఆసక్తితో క్రికెట్ బాగా ఆడేవాడు. 2006లో అండర్ 14 విశాఖకి సెలక్ట్ అయ్యాడు. 2014లో ఆంధ్రా తరపున రంజీలో కూడా అడాడు. 2016లో 82 గంటలపాటు నాన్‌స్టాప్ క్రికెట్ ఆడి గిన్నిస్ రికార్డులోకి ఎక్కగా, అతని ప్రతిభ చూసి చాలా సంస్థలు స్పాన్సర్‌షిప్ కోసం ముందుకి వచ్చాయి. తద్వారా నాగరాజుకు వచ్చిన సొమ్ముతో బాగా జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యంతో 2018లో ధోని క్రికెట్ అకాడమి పెడుతున్నానని నమ్మించి నందం వేణుగోపాల్ అనే ప్రముఖ వ్యక్తిని మోసం చేసి రూ. 22,300ను తీసుకోగా దానిపై వేణుగోపాల్ విశాఖ 3వ టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టడంతో నాగరాజును అరెస్ట్ చేశారు.
కేర్ ఆసుపత్రి యాజమాన్యానికి గంటా శ్రీనివాసరావు పీఏ పేరుతో ఫొన్ చేసి రూ. 60 వేలు వసూలు చేసిన కేసులో విశాఖ 3వ టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాగా, మరలా అరెస్ట్ చేశారు. తిరిగి 2019 సంవత్సరం ఫిబ్రవరి నెలలో టీ 20 మ్యాచ్‌కి టికెట్ ఇస్తానని నమ్మించి మనోజ్ అనే అతని వద్ద నుండి రూ. 20వేలు వసూలు చేసిన మోసం కేసులో విశాఖ పీఎమ్ పాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నాగరాజు క్రికెట్ ఆడుతున్నప్పుడు బహుమతుల ప్రదానోత్సవానికి హాజరైన బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ మాటతీరును గమనించి ఆయన మాదిరిగా మాట్లాడటం నేర్చుకుని తన ఫోన్‌నెంబర్‌కు ఎంఎస్‌కే ప్రసాద్ పేరుతో ట్రూకాలర్‌లో నమోదు చేయించుకున్నాడు. నగరంలోని ప్రముఖుల ఫోన్‌నెంబర్లు సంపాదించి వారికి ఫోన్ చేసి ఎంఎస్‌కే ప్రసాద్‌లా మాట్లాడుతూ బుడుమూరు నాగరాజు అనే అతను కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుకి సెలక్ట్ అయ్యాడని హైదరాబాద్‌లోని సెలక్ట్ మొబైల్ షాపు ఎండీ మురళీని నమ్మించి రూ. 2.88 లక్షలు వసూలు చేశాడు. విజయవాడలోని రామకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సొసైటీ వారికి ఫొన్ ద్వారా ఎంఎస్‌కే ప్రసాద్‌లా మాట్లాడి వారి వద్ద నుండి రూ. 3.88 లక్షల వసూలు చేశాడు. బాధితులు అతనిపై వివిధ పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదు చేయగా గురువారం నిందితుడ్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి రూ. 1,80,500 నగదు, పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.