క్రైమ్/లీగల్

పల్నాడులో రాజుకున్న రాజకీయ కక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 25 : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత గుంటూరు జిల్లా పల్నాడులో ఆధిపత్యపోరు మరోసారి భగ్గుమంది. ముఖ్యంగా గురజాల నియోజకవర్గ పరిధిలో టీడీపీ ఓడిపోవడంతో గ్రామాల్లోని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను వైసీపీ నాయకులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. దుర్గి మండలం జంగమహేశ్వరపాడు గ్రామంలో పోలింగ్ సమయంలో రేగిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో శనివారం పరస్పరం రాళ్లదాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇక మాచవరం మండలంలో ఎన్నికల అగ్గి రాజుకుంటూనే ఉంది. శుక్రవారం ప్రారంభమైన ఘర్షణలు శనివారం కూడా కొనసాగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తమపై దాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని, అక్రమంగా లాఠీచార్జి చేశారంటూ వైసీపీకి చెందిన మహిళలు శనివారం మాచవరం పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి నినాదాలు చేశారు. వారికి సర్దిచెప్పేందుకు వచ్చిన సీఐ రత్తయ్యను కూడా మహిళలు చుట్టుముట్టి పోలీసులు వ్యవహరించిన తీరుపై నిలదీశారు. అనంతరం ఇరువర్గాలకు నచ్చజెప్పిన పోలీసులు పోలీసు పహారాను కొనసాగించారు. ఇలావుండగా శనివారం దాచేపల్లి మండలం శ్రీనివాసపురం, పిడుగురాళ్ల పట్టణంలోని అయ్యప్ప నగర్‌లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం మారణాయుధాలతో దాడులకు తెగబడటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.
ఈ ర్యాలీలు భారీ శబ్దాలతో తెలుగుదేశం ప్రాబల్యం గల ప్రాంతాలలోకి ప్రవేశించడంతో వివాదాలు చెలరేగుతున్నాయి. దాచేపల్లి మండలం శ్రీనివాసపురం గ్రామంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఎన్నికల ముందు నుండే వివాదాలు ఉన్నాయి. పోలింగ్ సమయంలో ఒక వృద్ధుడిని ఓటు వేయించే విషయంలో చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి పోలింగ్ బూత్‌లోనే ఇరుపార్టీ కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం వైసీపీ కార్యకర్తలు ట్రాక్టర్‌లో మైకులు పెట్టి గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. దీంతో పాటు బాణాసంచా కాల్చారు. వైసీపీ కార్యకర్తలు కాల్చిన బాణ సంచా తెలుగుదేశం నాయకుల ఇళ్ల మీద పడింది. అంతేగాక మైక్ శబ్దం తగ్గించ మంటే వైసీపీ నాయకులు నిరాకరించారు. ఈక్రమంలో వైసీపీ, తెలుగుదేశం నాయకుల మధ్య మాటా మాటా పెరిగి వివాదానికి దారితీసింది. దీంతో ఇరుపార్టీల కార్యకర్తలు కర్రలు, గొడ్డళ్లు ఇతర మారణాయుధాలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇరువురు వ్యక్తులు గాయపడటంతో వారిని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఇరు పార్టీల నాయకులను అదుపులోనికి తీసుకున్నారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పోలీసు ఫికెట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా పిడుగురాళ్ల అయ్యప్ప నగర్‌లో వైసీపీ, టీడీపీ ఇరువర్గాలు ఒకరినొకరు విమర్శించుకుంటూ దాడులకు దిగారు. ఇందులో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఇదే దాడిలో గాయపడిన మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పల్నాడు ప్రాంతంలో ప్రత్యేక దృష్టిసారించారు.