క్రైమ్/లీగల్

కూలి అడిగినందుకు యజమాని దాష్టీకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జూన్ 2: చేసిన పనులకు కూలి డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ట్రాక్టర్ యజమాని ఆగ్రహంతో కూలీలను తన ట్రాక్టర్‌తో ఢీకొట్టడంతో అన్నదమ్ములిద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మదనపల్లె రూరల్ ఎస్‌ఐ దిలీప్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా వున్నాయి. మండలంలోని వలసపల్లె పంచాయతీ ములకలదినె్నకు చెందిన గంగులప్ప, పార్వతమ్మల కుమారుడు ఎస్.హరికుమార్ (28) బసినికొండకు చెందిన చంద్రానాయక్ ట్రాక్టర్ యజమాని వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో హరికుమార్ 15 రోజుల క్రితం మరో వాహనానికి డ్రైవర్‌గా వెళ్లాడు. ఆదివారం విధులు ముగించుకున్న హరికుమార్ బసినికొండలో ఉంటున్న ట్రాక్టర్ యజమాని చంద్రానాయక్ వద్దకు వెళ్లి తనకు రావాల్సిన కూలి డబ్బులు తీసుకుందామని వెళ్లాడు. ఆ సమయంలో ట్రాక్టర్ యజమాని లేకపోవడం, పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ ఎల్లారుబైలుచెరువులో ఇసుక తవ్వకాల వద్ద ఉన్నట్లు తెలుసుకుని హరికుమార్ అక్కడకు వెళ్లాడు. తనకు రావల్సిన కూలి డబ్బులు ఇవ్వాలని యజమాని చంద్రానాయక్‌ను అడిగాడు. పనులకు సక్రమంగా రాకుండా మోసం చేసిన నీకెందుకు డబ్బులు ఇవ్వాలంటూ ట్రాక్టర్ యజమాని తిరగబడ్డాడు. కూలి డబ్బుల విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ట్రాక్టర్ యజమాని చంద్రానాయక్ డ్రైవర్ హరికుమార్‌పై చేయి తీసుకున్నాడు. కూలి డబ్బులు ఇవ్వకుండా చేయి చేసుకుంటావా.. ఇసుక వేసుకుని మదనపల్లెకు ఎలా వస్తావో చూస్తానంటూ హరికుమార్ ట్రాక్టర్ యజమానికి వార్నింగ్ ఇచ్చి ఇంటకొచ్చేశాడు. జరిగిన విషయం గ్రామంలో తన స్నేహితులకు చెప్పి ద్విచక్రవాహనంలో తనతో పాటు కూలి పనులు చేసిన తన చిన్నాన్న కుమారుడు నాగభూషణం (18)తో పాటు మరికొంతమందిని వెంటబెట్టుకుని పుంగనూరు రోడ్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద వెళ్తుండగా ఎదురుగా ట్రాక్టర్‌లో ఇసుకలోడుతో వస్తున్న చంద్రానాయక్ వాహనాన్ని ఆపారు. అతను ఆగకుండా వెళ్లిపోతుండడంతో హరికుమార్, నాగభూషణం ద్విచక్ర వాహనంలో ట్రాక్టర్‌ను వెంబడించారు. కృష్ణాపురం సమీపంలో ట్రాక్టర్‌ను అడ్డుకోగా ట్రాక్టర్ యజమాని చంద్రానాయక్ ట్రాక్టర్‌ను ఆపకుండా వారిద్దరి పైనుండి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో హరికుమార్, నాగభూషణం అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఇద్దరినీ ఆసుపత్రికి తరలించే యత్నంలో ఉండగా అప్పటికే చనిపోయి ఉండటంతో వెనుదిరిగారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన మదనపల్లి రూరల్ ఎస్‌ఐ దిలీప్‌కుమార్ మృతదేహాలకు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికుల విచారణ, జరిగిన సంఘటనపై హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ తెలిపారు.