క్రైమ్/లీగల్

అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్‌కు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల విలీనానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లలో శాసనసభ స్పీకర్‌కూ, శాసనమండలి చైర్మన్‌కూ హైకోర్టు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు శాసనసభ కార్యదర్శికి, ఎన్నికల కమిషన్‌కూ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. శాసనసభలో సీఎల్పీ విలీనానికి సంబంధించి భట్టి విక్రమార్క, ఉత్తమకుమార్‌రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ షబ్బీర్ అలీ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటీషన్లను హైకోర్టు మంగళవారం నాడు విచారించింది. సీఎల్పీ విలీనానికి ముందు తమ పార్టీ నుండి గెలిచి ఫిరాయింపులకు పాల్పడిన వారందరికీ నోటీసులు ఇవ్వాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించాలని వారు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు కోరారు. కాంగ్రెస్ ఎల్పీని , టీఆర్‌ఎస్‌లో విలీనం చేసేందుకు కుట్ర జరుగుతోందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. విలీనం చేస్తూ శాసనసభ కార్యదర్శి జారీ చేసిన బులిటెన్‌ను కొట్టివేయాలని కోరారు. తెలంగాణ స్పీకర్ తమ అధికార పరిధిని దాటి వ్యవహరించారని ఆరోపించారు. ఒక వేళ విలీనం చేస్తే ముందుగా తమకు నోటీసులు ఇవ్వాలని కోరినా దానిని స్పీకర్ పట్టించుకోలేదని చెప్పారు. విచారణ అనంతరం ఉన్నత న్యాయస్థానం 10 మంది ఎమ్మెల్యేలతో పాటు శాసనసభ స్పీకర్‌కు, కార్యదర్శికీ, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, లింగయ్య, హరిప్రియ, ఉపేందర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రేగ కాంతారావు,ఆత్రం సక్కు, హర్షవర్థన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, జాజుల సురేందర్‌లకూ నోటీసులు జారీ చేసింది. మరో పక్క షబ్బీర్ అలీ దాఖలు చేసిన పిటిషన్‌పైనా విచారించిన హైకోర్టు మండలి చైర్మన్, మండలి కార్యదర్శి, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. దాంతో పాటు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకరరావు, దామోదర్‌రెడ్డి, సంతోష్‌కుమార్, ఆకుల లలితకు కూడా నోటీసులు జారీ చేశారు. అనంతరం పిటిషన్‌పై విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.