క్రైమ్/లీగల్

ఒడిలో మృత శిశువుతో.. ఎనిమిది గంటలు నరకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంపచోడవరం, జూన్ 14: జ్వరంతో మృతిచెందిన రెండు నెలల పసికందు మృతదేహాన్ని స్వగ్రామం తరలించే అవకాశం లేక సుమారు ఎనిమిది గంటలు ఒడిలోనే పెట్టుకుని ఆసుపత్రి ఆవరణలోని కుర్చీలో నిస్సహాయంగా కూర్చుండిపోయిన మాతృమూర్తి దయనీయ గాథ ఇది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... విశాఖ జిల్లా కొయ్యూరు మండలం యు చీడిపాలెం పంచాయతీ పలకజీడి గ్రామానికి చెందిన గిరిజన దంపతులు సాదల రాంబాబురెడ్డి, అమ్మాజీ జ్వరంతో బాధపడుతున్న రెండు నెలల మగ శిశువుతో శుక్రవారం ఉదయం 6 గంటలకు వై రామవరం ప్రభుత్వ ఆసుపత్రికి ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఆసుపత్రి వైద్యులు చికిత్సచేసి పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్సులో రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఉదయం 10.30 గంటల సమయంలో శిశువుమృతిచెందాడు. ఆసుపత్రి అంబులెన్స్ అందుబాటులో లేనందున, ప్రైవేటు వాహనంలో శిశువు మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆసుపత్రి సిబ్బంది సూచించారు. దీనితో రాంబాబురెడ్డి ఆటో కోసం ప్రయత్నించగా, రూ.6000 అవుతుందని తెలిపారు. అంత సొమ్ము లేకపోవటంతో తిరిగి ఆసుపత్రికి చేరుకున్నాడు. తమ స్వగ్రామానికి ఎలా వెళ్లాలో తెలియక ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ మృతశిశువును ఒళ్లో పెట్టుకుని, దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆ దంపతులు ఆసుపత్రిలోని బెంచీపై కూర్చుని ఉండిపోయారు. ముద్దులొలికే చిన్నారి కన్నుమూసినా అంత్యక్రియలకు స్వగ్రామం తీసుకెళ్లలేక నరకయాతన అనుభవించారు. గంటల తరబడి మృతశిశువుతో ఆసుపత్రిలోనే ఉండిపోయిన వారిని సిబ్బంది ఎవరూ పట్టించుకోపోవడం గమనార్హం. కాగా, ఈ సమాచారం తెలుసుకుని ‘ఆంధ్రభూమి’ అక్కడకు చేరుకుని వైద్యాధికారులను ప్రశ్నించగా వారిలో చలనం వచ్చింది. వెంటనే రాత్రి 7.30 గంటల సమయంలో అంబులెన్సులో వారిని పలకజీడి గ్రామానికి తరలించారు. మృతిచెందిన శిశువును తరలించేవరకూ మార్చురీలో పెట్టకుండా తల్లి ఒడిలో వదిలేయటం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి అద్దంపడుతుంది. ఈ సంఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్తీక్‌ను వివరణ కోరగా ఆసుపత్రికి ఒక్క అంబులెన్స్ మాత్రమే ఉందని, శుక్రవారం బ్లడ్ బ్యాంకు నిమిత్తం చింతూరు పంపామని, మరో అంబులెన్స్ లేకపోవటంతో మృతదేహాన్ని తరలించలేకపోయామని చెప్పారు.