క్రైమ్/లీగల్

సరిహద్దుల్లో జోరుగా గంజాయి స్మగ్లింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 29: గంజాయి స్మగ్లింగ్‌కు తెలంగాణ, ఆంధ్రా, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న భద్రాచలం రాజమార్గంగా మారింది. ఆయా రాష్ట్రాల నుంచి తెలంగాణలోని భద్రాచలం రావడానికి సులువైన మార్గం ఉంది. ఈ నేపథ్యంలో రూ.కోట్ల విలువైన గంజాయి ఈ సరిహద్దు నుంచే దేశం నలుమూలలకూ తరలిపోతోంది. స్మగ్లర్లు వివిధ పద్ధతుల్లో గంజాయిని చాకచక్యంగా దేశంలోని పలు ప్రాంతాలకు చేరవేస్తున్నారు. గంజాయిపై నిర్దిష్టమైన నిఘా అంటూ లేకపోవడంతో క్వింటాళ్ళ కొద్దీ గంజాయి సులువుగా తరలిపోతోంది. ఎవరైనా సమాచారం ఇస్తే తప్ప పట్టుబడటం లేదు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ఏజెన్సీకి సరిహద్దున ఉన్న చత్తీస్‌గఢ్, ఆంద్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దులోని ఒడిశా సమీప గ్రామాల్లో గంజాయి సాగవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మూడు ప్రాంతాలకు సరిహద్దున ఉన్న సీలేరు నది పరివాహక ప్రాంతంలోని ఒడిశా గ్రామాలు పప్పులూరు, కుర్మనూరు, సరిగడ్డ, రాచాబేడ, సబన్‌గూడ, నిమ్మలపాలెం, తెందులూరు, గుర్రాలూరులో గంజాయి వనాల పెంపకం నిరాటంకంగా సాగుతోంది. ఇక్కడ పెంచిన గంజాయి దేశంలోని పలు పట్టణ ప్రాంతాలకు అడ్డదారుల్లో స్మగ్లింగ్ అవుతోంది. గంజాయి సాగు ప్రాంతాలకు భద్రాచలం సరిహద్దుగా ఉండటంతో ఇక్కడ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు, పట్టణాలకు స్మగ్లర్లు సులువుగా తరలిస్తున్నారు. తెలంగాణలోని వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ మీదుగా బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కత్తా, పూనె, ఢిల్లీ వంటి నగరాలకు గంజాయిని వివిధ మార్గాల్లో చేరవేస్తుండగా తమిళనాడులోని మధురై, కేరళోని సముద్ర తీరానికి సైతం పంపుతున్నారు. అక్కడి నుంచి సముద్ర మార్గాన హాంకాంగ్, బ్యాంకాక్, సింగపూర్, మలేషియా తదితర దేశాలకు గంజాయి రవాణా అవుతోంది. అయితే గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసే విషయంలో ఏ ఒక్క శాఖ కూడా సక్రమంగా పనిచేయడం లేదు. నిర్దిష్టమైన నిఘా అంటూ లేకపోవడంతో స్మగ్లర్లు యథేచ్ఛగా తరలించుకు పోతున్నారు. ఆబ్కారీ, రెవెన్యూ, అటవీశాఖలకు గంజాయి నియంత్రణ బాధ్యతలు ఉన్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండగా అడపాదడపా పోలీసుల తనిఖీల్లో మాత్రమే గంజాయి పట్టుబడుతోంది. గడిచిన ఆరు నెలల కాలంలో భద్రాచలం కేంద్రంగా రవాణా అవుతున్న రూ.కోట్ల విలువైన గంజాయిని పోలీసుశాఖ పట్టుకుందంటే ఏ మేరకు తరలిపోతుందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి వంటి మాదకద్రవ్యాల నియంత్రణ బాధ్యతను ఆయా శాఖలు పటిష్టంగా తీసుకునేలా ప్రభుత్వాలు కూడా ఆదేశాలు ఇవ్వకపోవడం కూడా స్మగ్లర్లకు కలిసోస్తుంది. కాగా గంజాయి అక్రమ రవాణాలో ఒకప్పుడు గిరిజనులు మాత్రమే ఉండేవారు. స్మగ్లర్లు గిరిజనుల ద్వారా గంజాయిని గమ్యస్థానాలకు చేర్చేవారు. ఈ క్రమంలో వారు పట్టుబడితే వారు జైలు నుంచి బయటకు వచ్చే వరకు కుటుంబాల పోషణ చూడటమే కాకుండా బెయిల్ వచ్చే వరకు స్మగ్లర్లు వారికి అండగా నిలిచేవారు. అయితే గంజాయి స్మగ్లింగ్‌లో లాభాలు అధికంగా ఉండటంతో ఇప్పుడు ధనవంతులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. వారు కూడా అమాయక కూలీలతో స్మగ్లింగ్‌ను నడుపుతున్నారు. ముఖ్యంగా గిరిజన యువత గంజాయి రవాణాల్లో బలిపశువులవుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు పోలీసులకు పట్టుబడిన వారంతా యువకులే కావడం ఇందుకు నిదర్శనం. గంజాయి అక్రమ రవాణాలో స్మగ్లర్లు ఎప్పటికప్పుడు ఎత్తుకు పైఎత్తులు వేస్తుండటం గమనార్హం. భారీ ఎత్తున గంజాయి రవాణా అవుతుంటే పట్టుబడుతుండటంతో వాటిని లిక్విడ్ రూపంలో కూడా మార్చుతున్నారు. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో పిండిమిల్లుల్లో గంజాయిని మర పట్టిస్తూ ఆ పొడిని సీసాల్లో నింపుతున్నారు. చూడటానికి జెండూబామ్‌లా ఉండే సీసాల్లో రూ.500 నుంచి రూ.1000వరకు విలువైన గంజాయి పొడిని నింపుతున్నారు. వీటిని యువకులు జేబుల్లో, సంచుల్లో పెట్టుకొని సులువుగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు.