క్రైమ్/లీగల్

హత్య కేసులో యువకునికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిదిండి, ఏప్రిల్ 25: మండల పరిధిలోని కోరుకొల్లు గ్రామ శివారు గంజాలవారితోటలో 2010 ఏప్రిల్ నెలలో జరిగిన హత్య కేసులో నిందితుడైన గంజాల దుర్గారావు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన గుడివాడ రెండవ అదనపు జిల్లా స్పెషల్ జడ్జి జి వల్లభనాయుడు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కేవలం రూ.300 బాకీ గురించి జరిగిన తగాదా పెద్దగా మారి గంజాల దుర్గారావు కోపంతో సమీపంలో ఉన్న కమ్మ కత్తెను తీసుకుని బీభత్సం సృష్టించి గంజాల పాములను హత్య చేశాడు. గంజాల పాములు భార్య నాగలక్ష్మి చేసిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ రామకోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

రిజిస్ట్రేషన్ చేయని రెండు ట్యాంకర్ల సీజ్

గుడివాడ, ఏప్రిల్ 25: రిజిస్ట్రేషన్ చేయని మరో రెండు మంచినీటి ట్యాంకర్లను ట్రాక్టర్లతో సహా సీజ్ చేసినట్టు గుడివాడ ఆర్టీవో సురేష్ చెప్పారు. బుధవారం పట్టణంలో రవాణాశాఖ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. స్థానిక తాలూకా రిజర్వాయర్ దగ్గర అనధికారికంగా మున్సిపాలిటీ నీటిని తరలిస్తుండగా ఆర్టీవో సురేష్ తనిఖీలు చేశారు. ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయకుండా, నెంబర్లు లేకుండా తిరుగుతున్న రెండు ట్యాంకర్లను సీజ్ చేసి స్థానిక ఆర్టీసీ డిపోకు తరలించారు. ఈ సందర్భంగా ఆర్టీవో మాట్లాడుతూ పట్టణంలో విచ్చలవిడిగా అన్‌రిజిష్టర్డ్ ట్యాంకర్లు తిరుగుతున్నట్టుగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటిపై ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నామని, ఎక్కడైనా నెంబర్లు లేని ట్యాంకర్లు తిరుగుతున్నట్టుగా తెలిస్తే వెంటనే ఆర్టీవో కార్యాలయానికి సమాచారమివ్వాలని ఆర్టీవో సురేష్ చెప్పారు. ఇదిలా ఉండగా పట్టణంలో ఇప్పటి వరకు మూడు మంచినీటి ట్యాంకర్లను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఇంకా ఐదారు ట్యాంకర్లు నెంబర్లు లేకుండా తిరుగుతూనే ఉన్నాయి. ఈ ట్యాంకర్లన్నింటికీ తాలూకా రిజర్వాయర్‌లో ఎందుకు మంచినీటిని నింపుతున్నారో అర్ధం కాని పరిస్థితి. ట్యాంకర్లకు నీటిని నింపాలంటే మున్సిపల్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి. ఇప్పటికే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ వస్తున్నారు. వీటితో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు దాదాపు 10కి పైగా మంచినీటి ట్యాంకర్లను తిప్పుతున్నారు. వీటి ముసుగులో రిజిస్ట్రేషన్ కాని, నెంబర్లు లేని ట్యాంకర్లు మున్సిపల్ అధికారుల కళ్ళుగప్పి పట్టణ ప్రజలకు సరఫరా కావాల్సిన నీటిని తరలించుకుపోతున్నారు. తాలూకా రిజర్వాయర్ దగ్గర ఎటువంటి నిఘా లేకపోవడం వల్ల నిత్యం వేల లీటర్ల నీరు దుర్వినియోగమవుతోంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మున్సిపల్ కౌన్సిల్ అనుమతి ఉన్న మంచినీటి ట్యాంకర్ల ద్వారా పట్టణంలో అవసరమైన ప్రాంతాల్లో ప్రజలకు మంచినీరు సరఫరా అయ్యేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.