క్రైమ్/లీగల్

అత్యాచారం విలువ రూ.6500?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ‘అత్యాచారం విలువ 6500 రూపాయలుగా వెలకడతారా? సమంజమేనా? ఇదేం పని’ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగిక దాడులకు గురైన మహిళలపట్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిలదీసింది. లైంగిక దాడులకు, అత్యాచారాలకు గురవుతున్న మహిళలను ఆదుకోవడంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయా కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వాల స్పందన సరిగా లేదని వ్యాఖ్యానించింది. అత్యాచార బాధితులకు అతిస్వల్ప మొత్తాలను పరిహారంగా చెల్లించి ‘దానం’ చేస్తున్నట్లు భావిస్తున్నారా అని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘నిర్భయ’ పథకం కింద చాలా రాష్ట్రాలకన్నా ఎక్కువ నిధులు పొందుతున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం సగటున ప్రతి అత్యాచార బాధితురాలికి కేవలం 6000-6500 రూపాయలు చెల్లించడంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు అత్యాచారానికి మీరు కట్టే విలువ ఇదేనా అని నిలదీసింది. ఢిల్లీలో 2012లో జరిగిన సామూహిక అత్యాచారం, హత్య సంఘటన తరువాత 2013లో ‘నిర్భయ నిధుల పథకం’ అమల్లోకి తీసుకువచ్చారు. దీని ప్రకారం మహిళా సంరక్షణ కోసం స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వాలకు పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తున్నారు.
కాగా అత్యాచార బాధితులకు ఇస్తున్న ఆర్థిక సహాయంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ను జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం గురువారంనాడు పరిశీలించింది. ఈ సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం మధ్యప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై మండిపడింది. ‘మీరు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం అత్యాచార బాధితులకు సగటున ఆరువేల రూపాయలు చెల్లిస్తున్నారు. మీరేమైనా దానం చేస్తున్నారా? అలా ఎలా చేస్తారు? ఒక అత్యాచారం విలువ రూ 6500గా వెలకడతారా?’ అని నిలదీసిన ధర్మాసనం ‘మధ్యప్రదేశ్‌లో అత్యాచార సంఘటనల లెక్కలు అద్భుతం. మీ రాష్ట్రంలో 1951 మంది అత్యాచార బాధితులున్నారు. వారిలో ఒక్కొక్కరికి సగటున 6000 నుంచి 6500 రూపాయలు చొప్పున చెల్లించారు. ఇది సరైనపనేనా, సరిపోతుందా? ఇదేం పని?’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇది పూర్తిగా స్పందనలేని వైఖరి’గా విమర్శించిన ధర్మాసనం మధ్యప్రదేశ్ తీరును ఎండగట్టింది. నిర్భయ పథకం కింద పెద్దమొత్తం నిధులు పొందినప్పటికీ 1951మంది బాధితులకు కేవలం కోటి రూపాయలు మాత్రమే చెల్లించింది. నిర్భయ బాధితులకు నిర్భయ పథకం కింద ఎంత చెల్లించినదీ పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించని హర్యానా ప్రభుత్వ వైఖరిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్భయ పధకం కింద వస్తున్న నిధులు, బాధితుల సంఖ్య, వారికి చెల్లించిన పరిహారం వివరాలను అఫిడవిట్ల రూపంలో నివేదించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలను సుప్రీంకోర్టు గతనెలలో ఆదేశించింది. కాగా ఇంకా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంది. కాగా ఈ కేసు విచారణ సందర్భంగా హర్యానా ప్రభుత్వ న్యాయ ప్రతినిధిని సుప్రీంకోర్టు కడిగి పారేసింది. ‘అఫిడవిట్ దాఖలు చేయకపోవడాన్నిబట్టి మీ రాష్ట్రంలో మహిళల రక్షణపై ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతోంది. కావలసినంత సమయం తీసుకోండి, మీ రాష్ట్రంలో మహిళలకు చెప్పండి, వారి భద్రతను మీరు పట్టించుకోవడం లేదని’ అని వ్యాఖ్యానించిది. కాగా సిక్కిం మినహా మరే రాష్ట్ర ప్రభుత్వమూ అఫిడవిట్లు ఇవ్వలేదన్న ఒక పిటిషనర్ వాదనను సుప్రీం తప్పుపట్టింది. ఈ సందర్భంలో మేఘాలయ ప్రభుత్వ న్యాయప్రతినిధి జోక్యం చేసుకుని తమ రాష్ట్రంలో 48 మంది అత్యాచార బాధితులకు 30.55 లక్షల రూపాయలు చెల్లించామని తెలిపారు. మిగిలిన ప్రభుత్వాలు నాలుగు వారాల్లోగా నివేదికలు సమర్పించాలని మరోసారి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో 2012లో జరిగిన సామూహిక అత్యాచారం సంఘటనపై దాఖలైన ఆరు పిటిషన్లను ఈ ధర్మాసనం విచారణ జరుపుతూ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తోంది.