క్రైమ్/లీగల్

ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో కీలక మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఫిబ్రవరి 15: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మావోయిస్టు అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజకుమార్, సీనియర్ జర్నలిస్టు హేమచంద్ర పాండే ఎన్‌కౌంటర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈమేరకు గురువారం ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 29 మంది పోలీసులకు సమన్లు జారీ చేస్తూ కేసు విచారణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు పూర్వపరాలను పరిశీలిస్తే 2010 జులై 2న ఆదిలాబాద్ జిల్లా వాంకిడి అడవుల్లో మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు ఆజాద్, ఢిల్లీకి చెందిన జర్నలిస్టు హేమచంద్రపాండే పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన సంఘటన అలజడి సృష్టించింది. బూటకపు ఎన్‌కౌంటర్‌తోనే పోలీసులు ఆజాద్, హేమచంద్రపాండేలను మట్టుబెట్టారని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆజాద్ భార్య పద్మ, హేమచంద్రపాండే భార్య బబితలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ కోసం సామాజిక వేత్త అగ్నివేష్, సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్‌భూషన్‌లు పిటిషన్ దాఖలు చేయగా ఎన్‌కౌంటర్ ఘటనపై సిబిఐ విచారణ చేపట్టింది. ఎన్‌కౌంటర్ జరిగిన సంఘటన స్థలం, పరిసర గ్రామాల్లో దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు ఇది బూటకపు ఎన్‌కౌంటర్ కాదని, పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లోనే వీరు మృతి చెందినట్లు సుప్రీం కోర్టుకు నివేదించారు. సీబీఐ దర్యాప్తు నివేదిక ప్రకారం సుప్రీం కోర్టు ఎన్‌కౌంటర్‌గా తేలుస్తూ పిటిషనర్లు వేసిన వాజ్యాన్ని కొట్టివేసింది. అయితే ఈ కేసు విచారణ స్థానిక జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వెసులుబాటు కల్పించడంతో 2015లో జిల్లా జూనియర్ కోర్టులో ఎన్‌కౌంటర్ ఘటనపై ఆధారాలు నిరూపించాలని, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.
జూనియర్ కోర్టులో వాదనల అనంతరం కేసును కొట్టివేయగా జిల్లా కోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఆజాద్ భార్య పద్మ తిరిగి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో మూడు వాయిదాల అనంతరం గురువారం కోర్టు విచారణలో భాగంగా ఆజాద్ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 29 మంది పోలీసులను ప్రతివాదులుగా చేరుస్తూ న్యాయమూర్తి భరతలక్ష్మి సమన్లు జారీ చేయడం కీలక పరిణామంగా మారింది. బూటకపు ఎన్‌కౌంటర్‌పై పూర్తిస్థాయి వాదనలు వినిపించాలని, 29 మంది పోలీసులు తదుపరి కేసు విచారణకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఏర్పడింది.

చిత్రాలు..కేసు విచారణ అనంతరం కోర్టు నుండి బయటకు వస్తున్న
ఆజాద్ భార్య పద్మ, ఆమె తరపున వాదించిన న్యాయవాదులు
*పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఆజాద్ (ఫైల్‌ఫోటో)