చిత్తూరు

తిరుపతి ప్రతిష్ట ఇనుమడించేలా సైన్స్ కాంగ్రెస్ నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 20: వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో జరిగే సైన్స్ కాంగ్రెస్‌కు విచ్చేసిన అతిథులను అదేవిధంగా తిరుపతి విశిష్టతను తెలపాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని తిరుపతి సబ్ కలెక్టర్ హిమాంశు శుక్ల తెలిపారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు విచ్చేయు అతిథులకు రిసెప్షన్, ఫుడ్, రవాణా పలు అంశాలపై తిరుపతిలోని వివిధ హోటళ్ల యాజమాన్యాలతో జిల్లా పర్యాటక శాఖ వారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. యాజమాన్యాలతో జిల్లా పర్యాటక శాఖ వారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఇస్కా 2017 సమావేశం తిరుపతిలో నిర్వహించడం మంచి శుభపరిణామమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడానికి 16 కమిటీలను నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. జనవరి మొదటి వారంలో నిర్వహించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఈ కార్యక్రమాలకు శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయ అధికారులు, జిల్లా అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, తిరుపతి మునిసిపాలిటీ అధికారులు సంయుక్తంగా నిర్వహించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. అదేవిధంగా తిరుపతి పరిసర ప్రాంతాల విశిష్టత గురించి వివిధ కళల గురించి వచ్చే అతిథులకు మనం తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని ఆయన తెలిపారు. సుమారు 15 వేల మంది ఈ సభలకు హాజరవుతారని ఆయన తెలిపారు. ఇప్పటి నుంచి ఆయా కమిటీలు అవగాహన కార్యక్రమాలకు పెద్దపీట వేయాలని ఆయన తెలిపారు. నగరంలో పేరొందిన నక్షత్ర హోటళ్లలో సుమారు 4000 గదులను డిసెంబర్ 28వ తేదీ లోపల విశిష్ట అతిథులకు అందజేయవలసిన బాధ్యత మీపై ఉందని ఆయన తెలిపారు. నక్షత్ర హోటళ్లకు అవసరమైన అన్ని వౌళిక వసతులు కల్పించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి నక్షత్ర హోటళ్లో సైన్స్ కాంగ్రెస్ సంబంధించిన ఫ్లెక్సీ బోర్డులు ప్రదర్శించాలని 5 రోజుల్లో ప్రతిరోజూ ప్రతి హోటళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఆయన తెలిపారు. గాంధీ రోడ్డు నుంచి ఎస్వీ యూనివర్సిటీ రోడ్డు వరకు సుందరీకరణ పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. వచ్చిన అతిథులకు చిత్తూరు జిల్లాలోని ఆలయాల విశిష్టత గురించి తెలియజేయవలసిన బాధ్యత మీపైన ఉన్నదని ఆయన తెలిపారు. భారత దేశంలోనే డి ఆర్ డి ఓ, ఇస్రో, కేంద్ర సంస్థల నుంచి వచ్చే ప్రతినిధులకు మీ హోటళ్లలో వసతి సౌకర్యం ఏర్పాటుచేయాలని ఆయన తెలిపారు. విద్యార్థుల కోసం శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో సమారు 3000 రూములు వసతి సౌకర్యం కల్పించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. పట్టణంలో సుందరీకరణ , నీటి సరఫరా, పరిశుభ్రత , సాంస్కృతికం సమన్వయ బాధ్యతలను చేపట్టడానికి కమిటీలను నియమించామని ఆయా కమిటీలలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రావీణ్యం పొందిన ఆచార్యులకు పరిశోధక విద్యార్థులను అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారుల సమన్వయంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమిటీలు నియమించడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. పలువురు విఐపిలకు తిరుమలలో వసతి, దర్శన సౌకర్యం ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి రోజూ జరిగే సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి సంబంధించిన అంశాలపై సంబంధిత హోటళ్లలో బ్రోచర్లు అందుబాటులో ఉంచడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీతో పాటు నగరంలోని ఇతర యూనివర్సిటీలు, టిటిడి కళాశాలలకు చెందిన వసతిగృహాలను, వసతి సౌకర్యాలను కల్పించడానికి చర్యలు చేపట్టడం జరుగుతోందని ఆయన తెలిపారు. అనంతరం చంద్రవౌళి మాట్లాడుతూ పర్యాటక రంగం ద్వారా జిల్లాలో చంద్రగిరి కోట సౌండ్ లైటింగ్ సిస్టం, రూ.3కోట్లతో నిర్మాణ పనులు ఈనెల ఆఖరులోపు ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాయలచెరువు ఆరణియార్ సాగర్ ప్రాజెక్టుల నందు బోటు సౌకర్యం ఏర్పాటు చేయుచున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి నాగేశ్వరరావు, జిల్లా టూరిజం రీజనల్ డైరెక్టర్ చంద్రవౌళి, ఎస్వీ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ డెవలెప్‌మెంట్ డీన్ ఆచార్య విజయ్ భాస్కర్‌రావు, ఆచార్య వి.శకుంతల, తిరుపతిలోని 20 హోటళ్ల యాజమాన్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
23న తిరుపతికి ముఖ్యమంత్రి రాక
చిత్తూరు, అక్టోబర్ 20 : రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం తిరుపతి నగరానికి రానున్నారని అధికారులు తెలిపారు. సిఎం 20న ఉదయం 9 గంటలకు తిరుపతి నగరానికి చేరుకుని ఎస్వీ యూనివర్శిటి మైదానంలో జరిగే మారథాన్ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవంలో పాల్గొంటారు. అనంతరం అక్కడే జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. అదే రోజు ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం పయనమవుతారు.
ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య
* ఇద్దరూ హెచ్‌ఐవి బాధితులు, నిరక్షరాస్యులు
* మృతదేహాల వద్ద సూసైడ్‌నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

మదనపల్లె, అక్టోబర్ 20: ప్రియురాలిని చంపి, ప్రియుడు గుళికల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. ముదివేడు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిమ్మనపల్లె మండలం ముష్టూరు పంచాయతీ వెంకటాపురానికి చెందిన రెడ్డెప్పకు కురబలకోట మండలం తెట్టుకు చెందిన గాయత్రితో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరు తెట్టు పంచాయతీలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవారు. వీరికి కుమారుడు (13), కుమార్తె (11) సంతానం. వీరు 9, 7 తరగతులు చదువుకుంటున్నారు. అయితే ఏడాదిన్నర సంవత్సరం క్రితం భర్త హెచ్‌ఐవి వ్యాధితో మృతిచెందగా, గాయత్రికి సైతం హెచ్‌ఐవి సోకింది. ఇదిలావుంటే తెట్టుకు చెందిన శ్రీనివాసులు గాయత్రితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరికీ హెచ్‌ఐవి ఉండటంతో మదనపల్లె ప్రభుత్వాసుపత్రి ఏఆర్‌టి సెంటర్‌లో చికిత్సలు చేయించుకుంటూ మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో వేరుగా నివాసం ఉంటున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో కూలీపనులు చేసుకునే గాయత్రి వారానికొక సారి పిల్లలల వద్దకు వచ్చి వెళ్లేది. పిల్లలిద్దరు గాయత్రి అమ్మనాన్న వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. గాయత్రి తనతోనే కాకుండా మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, అందరికీ హెచ్‌ఐవిని అంటిస్తోందని ప్రియుడు శ్రీనివాసులు పలుమార్లు హెచ్చరికలు చేసినా ఆమె తీరుమారలేదు. ఇలాగే కొనసాగితే మరింతగా హెచ్‌ఐవి విస్తరించడంతో పాటు అవమానంగా శ్రీనివాసులు భావించాడు. మదనపల్లె మార్కెట్‌లో పనులు ముగించుకుని బుధవారం సాయంత్రం శ్రీనివాసులు, గాయత్రి కలిసి తెట్టు గ్రామానికి బయలుదేరారు. అంగళ్లు పంచాయతీ తుమ్మచెట్లపల్లె సమీపంలోని బీడు భూముల్లో ఇద్దరు కలసి వెళ్లారు. అక్కడ ప్రియురాలిని బండరాయితో హతమార్చిన ప్రియుడు అదే రాత్రి స్వగ్రామం తెట్టుకు చేరుకున్నాడు. జరిగిన విషయం తెట్టుకు చెందిన విద్యార్థుల చేత సూసైడ్‌నోట్ రాయించి, ఆ రాత్రి గుళికల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆ పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. రెండుచోట్ల మదనపల్లె రూరల్ సిఐ మురళీ, ఎస్‌ఐ వేంకటేశ్వర్లు పరిశీలించి మృతుడు శ్రీనివాసులు వద్ద లభించిన సూసైడ్‌నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పన్నుల పేరుతో వాహనాలు, వ్యాపారులపై వేధింపులు
* వాణిజ్యపన్నుల శాఖ, సబ్‌కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా
* రిలే దీక్షకు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, టిడిపి, కాంగ్రెస్, వైకాపా మద్దతు
* నేడు సంపూర్ణబంద్‌కు అన్ని పార్టీల పిలుపు
మదనపల్లె, అక్టోబర్ 20 : వివిధ పన్నుల పేరుతో వాహనాలు, వ్యాపారులను వేధింపులకు గురిచేస్తున్న మదనపల్లె వాణిజ్యపన్నులశాఖ అధికారి శ్రీనివాసులునాయుడును వెంటనే సస్పెండ్ చేయాలని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మున్సిపల్ చైర్మన్ శివకుమార్, పిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, టిడిపి నేత గంగారపు రామ్‌దాస్‌చౌదరి, వైకాపా నియోజకవర్గం సమన్వయకర్త గుండ్లూరు షమీంఅస్లాం, నాయకులు నవాజ్, ఎఐఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎ మహమ్మద్‌ఆలీఖాన్, సిపిఐ సాంబశివ డిమాండ్ చేశారు. వ్యాపారుల ఆందోళనలు గురువారం రెండవరోజు కొనసాగాయి. బెంగళూరు బస్టాండ్ సర్కిల్‌లో చేపట్టిన రిలేదీక్షలో పాల్గొని శుక్రవారం మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలలో వాణిజ్యపన్నుల అధికారుల వేధింపులకు నిరసనగా సంపూర్ణబంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, సినిమా థియేటర్లు, వ్యాపారులు, చేనేత కార్మికులు, ఆటోలు, రవాణాశాఖ, దుస్తుల దుకాణాలు, జ్యుయలరీ దుకాణాలు, ఫ్యాన్సీస్టోర్లు, ట్రేడర్లు, బియ్యం వ్యాపారులు, తోపుడుబండ్లు, లారీ, ట్రాక్టర్, ఆటో యాజమానులు, డ్రైవర్లు బంద్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. గురువారం మదనపల్లె పట్టణంలోని అన్ని దుకాణాలు స్వచ్ఛంధంగా మూసివేశారు. అనంతరం అప్పారావువీధి, నెహ్రూబజార్, చిత్తూరు బస్టాండ్ వాల్మీకిసర్కిల్ మీదుగా గాంధీరోడ్డు ముంబై-చెన్నై జాతీయరహదారి సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా, రాస్తారోకో చేపట్టారు. అనంతరం ర్యాలీగా బర్మావీధి, సిటిఎంరోడ్డు మీదుగా వాణిజ్యపన్నులశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ర్యాలీగా ఆర్టీసీ బస్టాండ్, ఆసుపత్రిరోడ్డు, మల్లికార్జున సర్కిల్ మీదుగా బెంగళూరు బస్టాండుకు చేరుకున్నారు.
తిరుమలలో బ్యాటరీ ( ఎలక్ట్రికల్) బస్సులు
* ఇ ఓ డాక్టర్ సాంబశివరావు వెల్లడి
* తిరుపతి రవాణా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ఆయుధపూజ

తిరుపతి, అక్టోబర్ 20: కలియుగ వైకుంఠమైన తిరుమలను కాలుష్య రహితంగా పెంపొందించేందుకు త్వరలో రెండు బ్యాటరీ ( ఎలక్ట్రికల్ ) బస్సులను ప్రయోగాత్మకంగా నడపనున్నట్లు టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావుతెలిపారు. టిటిడి రవాణా శాఖ తిరుపతి విభాగంలో ప్రతియేటా నిర్వహించే ఆయుధపూజ గురువారం స్థానిక వర్క్‌షాపులో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఇ ఓ మాట్లాడుతూ రవాణావిభాగం, తిరుపతిలో శ్రీవారి భక్తులకు, ఉద్యోగులకు విశేష సేవలు అందిస్తూ స్వామివారి భక్తి వైభవవ్యాప్తికి విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణ రథాలు హిందూ సనాతన ధర్మవ్యాప్తికి కృషి చేస్తుండగా, తిరుమలలోని ధర్మరథాలు భక్తులకు వివిధ ప్రాంతాలకు ఉచితంగా చేరవేసేందుకు సహకరిస్తున్నట్లు వివరించారు. డ్రైవర్లు తమ నైపుణ్యం, అనుభవంతో తిరుమల ఘాట్‌రోడ్డును ప్రమాదరహితంగా మార్చి అందరి మన్ననలు అందుకుంటున్నారని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం తిరుపతి జెఇఓ పోలాభాస్కర్ మాట్లాడుతూ టిటిడి రవాణా విభాగం నడకదారి భక్తులకు ఉచిత లగేజి రవాణా ద్వారా సేవలు అందిస్తున్నట్లు వివరించారు. తిరుమలలో బ్యాటరీ కార్లు, వృద్ధులకు, వికలాంగులకు చాలా ఉపయోగకరంగా నడుపుతున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో విశేష సేవలు అందించినందుకు అభినందించారు. అంతకుముందు ఈవో,జె ఇ ఓ, రవాణా విభాగం జనరల్ మేనేజర్ శేషారెడ్డి ఆధ్వర్యంలో శ్రీవారి విగ్రహానికి, సంచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని వివిధ టిటిడి వాహనాలను పుష్పగుచ్ఛాలు, అరటి తోరణాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు. ఈకార్యక్రమంలో డి ఎల్ ఓ వెంకటరమణ, సర్వీసుల విభాగం డెప్యూటీ ఇ ఓ విజయసారధి, రవాణా విభాగం ఎ ఇ ఓ దేవేంద్రబాబు, డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ రమేష్, డ్రైవర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
రక్తదానం చేయండి - ప్రాణం నిలబెట్టండి
* అర్బన్ ఎస్పీ జయలక్ష్మి
తిరుపతి, అక్టోబర్ 20: రక్తదానం చేయడమంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరి ప్రాణం కాపడటమేనని, అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని అర్బన్ ఎస్పీ జయలక్ష్మి పిలుపునిచ్చారు. పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం తిరుపతి అర్బన్ కార్యాలయం ప్రాంగణంలో స్విమ్స్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పోలీస్ డాక్టర్ సి.లత చేతుల మీదుగా ప్రారంభించిన ఈ కార్యక్రమం సందర్భంగా ఎస్పీ జయలక్ష్మి మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకొని ప్రతియేడాది పోలీస్‌శాఖ పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తోందన్నారు. ఇందులో భాగంగానే స్విమ్స్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశామన్నారు. రోడ్డు ప్రమాదాలు లేక ప్రసవ సమయంలోనూ మరికొంత మందికి శస్తచ్రికిత్స సమయంలో మరికొంతమందికి అవసరమైన రక్తం అందక ప్రాణాలు పోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రక్తదానం అంటే ప్రాణదానంతో సమానమన్నారు. రక్తదానం చేయడంపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన పోలీసులకు ఎస్పీ చేతులమీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు.