చిత్తూరు

కట్టలు తెగిన రైతుల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, నవంబర్ 29: పంటలు పెట్టడానికి వర్షం లేదు. బావుల్లో, బోర్లల్లో నీళ్లు అడుగంటి పోయాయి. పక్కనే కాలువలో పరవళ్లు తొక్కుతున్న గంగమ్మను చూసి ఇంతకాలం వేచి చూసిన రైతులు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నారు. తలుపులు పగులగొట్టి తెలుగుగంగ నీటిని తమ చెరువుకు మళ్లించుకున్నారు. ఈ సంఘటన మంగళవారం తొట్టంబేడుమండలం చిట్టత్తూరు గ్రామం వద్ద జరిగింది. చెన్నై నగరం సాగునీటికి తెలుగుగంగ నీరు సుమారు నెలరోజులుగా వెళ్తుంది.వర్షం లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నాటిన వరిపైరు, వేరుసెనగ ఎండిపోయే స్థితిలో ఉంది. దీంతో రైతులందరూ ఏకమై తెలుగుగంగ కాలువకు అమర్చిన తలుపులను ఎత్తడానికి ప్రయత్నించారు. అయితే అధికారులు ముందుజాగ్రత్తగా తలుపులకు వెల్డింగ్ చేయడంతో రైతుల ప్రయత్నాలు ఫలించలేదు. దీంతోమూకుమ్మడిగా దాడిచేసి తలుపులను పగుల గొట్టారు. తలుపులు తెరచుకోవడంతో తెలుగుగంగనీరు చెరువుకు వెళ్తోంది. విషయం తెలుసుకున్న తెలుగుగంగ అధికారులు హుటాహుటిన వచ్చి నీళ్లు మళ్లించకుండా అడ్డుపడ్డారు. అయితే రైతులు ఎదురు తిరిగారు. వర్షం లేక నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే చూస్తూ ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు. కేసులు పెట్టినా, అరెస్ట్‌చేసినా భయపడేది లేదని, ఎండిన పైర్లు ఎండిపోకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి తేల్చుకుంటామని, కాలువకు అడ్డుకట్ట వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. రైతుల ఆవేశాల్ని చూసిన అధికారులు అక్కడినుంచి జారుకున్నారు. రైతులుమాత్రం ఉదయం నుంచి తెలుగుగంట కట్టపైనే ఉండి చెరువుకు నీళ్లు పారించుకుంటున్నారు. చెరువునిండితే పంటలు పండుతాయని, ఆనందంగా ఉంటామని రైతులు తెలిపారు.
డిసెంబర్ 21 నుంచి

రుయా ఎముకలు, కీళ్ల వార్డులో శస్త్ర చికిత్సలు
తిరుపతి, నవంబర్ 29: రుయా ఆసుపత్రిలో ఎముకల కీళ్ళ మార్పిడి శస్త్ర చికిత్సలను డిసెంబర్ 21వ తేదీ నుంచి నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర కుంటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పూనమ్‌మాలకొండయ్య చెప్పారు. మంగళవారం రుయా ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాయలసీమలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా రుయాను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మంత్రి కామినేని శ్రీనివాసులు రుయాను సందర్శించి సి ఎం చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు రుయాను అభివృద్ధి చేయడానికి తాను అనేక పర్యాయాలు ఇక్కడకు రావడం జరిగిందన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచే ఎముకలు, కీళ్లు శస్తచ్రికిత్సా విభాగాలు నూతన భవనంలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈమేరకు ఆ విభాగాధిపతి శ్రీనివాసులు రెడ్డిని ఆదేశించడం జరిగిందన్నారు. జాతీయ రహదారుల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అలిపిరి వద్ద ఉన్న ఈ విభాగం ద్వారా రోగులకు, యాత్రికులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని మాలకొండయ్య తెలిపారు. ఈకార్యక్రమంలో మెడికల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సబ్యులు డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ బాబ్జీ, డి ఎం అండ్ హెచ్ ఓ విజయగౌరి, ఐసిడిఎస్ పిడి శ్రీలక్ష్మీ, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ బి.ఎస్.నాయక్, ఆర్ ఎం ఓ గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.

పహిందూ చైతన్య సమితి ఫిర్యాదుతో
500 నకిలీ లడ్డూలు స్వాధీనం
తిరుపతి, నవంబర్ 29: తిరుపతిలోని ప్రధాన ఆలయాల వద్ద శ్రీవారి లడ్డూ ప్రసాదమంటూ నకిలీ లడ్డూలు విక్రయిస్తున్న తీరుపై హిందూ చైతన్య సమితి అధ్యక్షుడు తుమ్మా ఓంకార్ ఫిర్యాదు చేయడంతో ఈస్ట్‌పోలీసులు దాడులు చేసి 500 నకిలీ లడ్డూను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ నకిలీ లడ్డూలను ఒక్కొక్కటి వంద రూపాయలకు అమ్ముతున్నారని తెలిపారు. రాత్రిపూట ఆర్టీసి బస్టాండ్, రైల్వేస్టేషన్, గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు ఆలయాల వద్ద ఈముఠాలు లడ్డూలను విక్రయిస్తున్నాయన్నారు. వీటిని తిరుమలలో విక్రయించే శ్రీవారి లడ్డూలుగా భావించి ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న భక్తులు మోసపోతున్నారన్నారు. తమ స్వగ్రామాలకు తీసువెళ్లేసరికి అవి దుర్వాసన వస్తుండటంతో స్వామివారి లడ్డూల తయారీ బాగలేదంటూ అసత్యప్రచారం జరుగుతోందన్నారు. దీనిని నియంత్రించడానికి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయన సి ఐ పి.ఎస్.వి.రామకిషోర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన స్థానిక ఆర్టీసి బస్టాండ్ వద్ద నకిలీ లడ్డూలు విక్రయిస్తున్న మహిళను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద ఉన్న 500 లడ్డూలను స్వాధీనం చేసుకున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు అశోక్, అనిల్, వంశీ, సూర్య తదితరులు పాల్గొన్నారు.
గంగమ్మకు 1.8 లక్షల విరాళం
తిరుపతి, నవంబర్ 29: స్థానిక తాతయ్యగుంట గంగమ్మకు మంగళవారం కడపజిల్లా పులివెందలకు చెందిన నక్క సరస్వతమ్మ, నక్కా వెంకటసుబ్బయ్యలు లక్ష 80రూపాయలను విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని ఆలయ ఇ ఓ పి.సుబ్రహ్మణ్యంకు అందించారు.
15లోగా అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయండి
* ఏ క్షణానైనా మంత్రులు తనిఖీలు చేయవచ్చు
* నగరపాలక సంస్థ కమిషనర్ వినయ్‌చంద్

తిరుపతి, నవంబర్ 29: ఎస్వీ యూనివర్శిటీలో ఇస్కా సదస్సు జరుగుతున్న సందర్భంగా డిసెంబర్ 15వ తేదీలోగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిపనులను పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగుతున్న సందర్భంగా తిరుపతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసుకునే అరుదైన అవకాశం లభించిందని చెప్పారు. నగరంలోని రహదారులు, ఎయిర్‌పోర్టు, బస్టాండులు, రైల్వేస్టేషన్లు, అలిపిరి, బాలాజీ కూడలి, యూనివర్శిటీ కూడలీ, పూర్ణకుంభం సర్కిల్ ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేయాలన్నారు. రాష్ట్ర మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసులు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాణిక్యాల రావు డిసెంబర్ 15వ తేదీలోపు ఎప్పుడైనా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించే అవకాశం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో పనుల్లో నాణ్యత లోపించకుండా వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అంతరాయం లేకుండా రాత్రివేళల్లో కూడా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.
1న జనన, మరణ నమోదుల
నూతన సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ
* ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు హాజరుకావాలి
* కమిషనర్ వినయ్‌చంద్ వెల్లడి
తిరుపతి, నవంబర్ 29: జనన, మరణ నమోదులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాఫ్ట్‌వేర్‌పై డిసెంబర్ 1వ తేదీన మధ్యాహ్నం 2గంటలకు నగరపాలక సంస్థ ఆవరణలోని వై ఎస్ ఆర్ మీటింగ్‌హాల్లో నిర్వహించే శిక్షణకునగరంలోని ప్రైవేట్ ఆస్పత్ల్రు డాక్టర్లు, అక్కడ పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లు తప్పని సరిగా హాజరు కావాలని తిరుపతి నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారిణి డాక్టర్ ఉషాకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నూతన సాఫ్ట్‌వేర్ ద్వారా జనన, మరణ నమోదులు చేయట గురించి అన్ని మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లోని ప్రజలు సమానంగా ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి వచ్చేటప్పుడు తమవెంట తప్పనిసరిగా లాప్‌ట్యాప్స్, హాస్పిటల్ మెయిల్ ఐడీలు తీసుకురావాలని ఆమె తెలిపారు.
గరుడోత్సవాల నిర్వహణలో ఐక్యంగా పనిచేయాలి
* కళాకారులకు చిన్నంగారి రమణ పిలుపు
తిరుపతి, నవంబర్ 29: శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ 60 సంవత్సరాలను పూర్తిచేసుకుని వజ్రోత్సవాలను నిర్వహించుకుంటున్న సందర్బంగా నిర్వహించనున్న గరడోత్సవాలను విజయవంతం చేయడంలోకళాకారులు, సభ్యులు ఐక్యంగా పనిచేయాలని టిటిడి మాజీ డిప్యూటి ఇ ఓ చిన్నంగారి రమణ అన్నారు. మంగళవారం స్థానిక శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ కార్యాలయంలో పరిషత్ సభ్యులు, కళకారుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమం విజయవంతం కావడానికి అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. కార్యదర్శి ఎల్.జయప్రకాశ్ మాట్లాడుతూ 60 సంవత్సరాల క్రితమే తిరుపతిలోని కొన్ని కళా, సాంస్కృతిక సంస్థల కలయికతోప్రారంభమై టిటిడి సహకారంతో గరుడ జాతీయ నాటకోత్సవాలు నిర్వహించడానికి సిద్ధమైందని అన్నారు. వజ్రోత్సవాల విజయోత్సవానికి అందరూ నిజాయితీగా, నిబద్ధతతో, తారతమ్యాలు లేకుండా, అంకితభావంతో, బాధ్యతాయుతంగా పనిచేస్తామని చిన్నంగారి రమణ అందరి చేత ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమంలో ఉపకార్యదర్శి కోనేటి సుబ్బరాజు, కొత్తపల్లి మునిరత్నం, పి. ఆర్.నాయుడు, ఎం.కోదండపాణి రెడ్డి, కె.నారాయణ, కె.ఎన్.రాజ, దళవాయి సుధాకర్, శేషాద్రినాయుడు, గజేంద్ర, రుక్మాంగధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకోండి
* చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ వినతి
* బడి రుణం తీర్చుకుందాం ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు
చిత్తూరు, నవంబర్ 29: ప్రతి ఒక్కరూ తాము చదువుకున్న పాఠశాల రుణాన్ని ఏదోరకంగా తీర్చుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ విజ్ఞప్తిచేశారు. జిల్లావిద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో మంగళవారం బడి రుణం తీర్చుకుందాం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గాంధీ సర్కిల్‌వద్ద స్థానిక ఎమ్మెల్యే డిఎ సత్యప్రభ, ఇన్‌చార్జ్ మేయర్ సుబ్రహ్మణ్యం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో దాతలు కూడా తమవంతు సహాయ సహకారాలను అందించి పేద పిల్లల విద్యకు ఊతం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ప్రస్తుతం మంచి ఉద్యోగం, వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతి ఒక్కరూ తాము చదువుకుని ప్రయోజకులయ్యేందుకు సహకరించిన పాఠశాల అభివృద్ధికి ఇతోధికంగా సాయం అందజేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ పాఠశాలలను తట్టుకుని నిలవాలంటే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగాఉన్నా విద్యాశాఖకు నిధుల విడుదలలో మాత్రం ఏనాడూ అన్యాయం జరగలేదన్నారు. ఇదేక్రమంలో దాతలు సహకరించి సహాయ సహకారాలు అందజేస్తే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. ఈ విషయంలో విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని ఆమె కోరారు. చిత్తూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి బెల్లంకొండ సుధాకర్ మాట్లాడుతూ బడి రుణం తీర్చుకుందాం కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలకు వస్తు, నగదు రూపంలో సాయం చేయవచ్చని వెల్లడించారు. పాఠశాలల్లో అదనపు తరగతులు, నీటి ట్యాంకులు, మైదానాల ఏర్పాటు చేయు వారు తమ కుటుంబ సభ్యుల పేర్లను పెట్టుకోవచ్చని తెలిపారు. అదే విధంగా వైద్య శిబిరాలను నిర్వహించి పేద విద్యార్థుల ఆరోగ్య పరిక్షణలో భాగస్వాములు కావచ్చని పేర్కొన్నారు. ఇదేక్రమంలో దివ్యాంగ పిల్లలకు మూడు చక్రాల సైకిళ్లు, కళ్లద్దాలు, బ్రెయిలీ పుస్తకాలు, ఊతకర్రలు, వినికిడి యంత్రాలు, ల్యాప్‌టాప్‌లులను బహూకరించవచ్చన్నారు. అదే విధంగా ఉత్తమ ప్రతిభతో మంచి మార్కులు సాధించి పై చదువులు చదవలేని వారికి ఆర్థిక సాయంచేసి ఆదుకోవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ స్థానిక పిసిఆర్ పాఠశాల నుంచి ఎన్‌టిఆర్, గాంధీ, ఎంఎస్‌ఆర్ సర్కిళ్ల మీదుగా జిల్లా పరిషత్ కార్యాలయం వరకు సాగి తిరిగి గాంధీ సర్కిల్‌కు చేరుకుంది. కాగా ఈ కార్యక్రమం లో చిత్తూరు రూరల్ మండల విద్యాశాఖాధికారి కేశవపిళ్లై, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజేంద్ర, ఎస్‌టియు రాష్ట్ర నాయకులు గంటామోహన్‌తో పాటు, నగరంలోని పిసిఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, షర్మన్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

రేఖ హత్య కేసులో
నిందితుడి లొంగుబాటు
* అత్యాచారానికి యత్నించి హత్యకు పాల్పడ్డాడు
తిరుపతి, నవంబర్ 29: ఎమ్మార్‌పల్లిలోని హరిపురం కాలనీకి చెందిన రేఖ అనే మహిళను దారుణంగా కొట్టి హత్య చేసిన కేసులో ఆప్రాంతానికి చెందిన శరత్‌కుమార్ అలియాస్ శివ అనే యువకుడు మంగళవారం పోలీసులకు లొంగిపోయాడు. ఇందుకు సంబంధించి డి ఎస్పీ కనకరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హరిపురం కాలనీకి చెందిన రేఖ తమ ఇంటి వద్ద జరుగుతున్న ఓ జాతర సందర్భంగా రాత్రివేళలో బయటకు వచ్చింది. ఒంటరిగా ఉన్న ఆమెను గుర్తించిన శరత్‌కుమార్ పక్కనే ఉన్న పాడుబడ్డ ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో పక్కనే ఉన్న రాయితో ఆమె ముఖంపై కొట్టి హత్యచేసి అక్కడ నుంచి పరారయ్యాడు. నిందితుడు తమిళనాడులోని తిరువళ్ళూరులో ఓ కంపెనీలో ప్రైవేట్ సెక్యూరిటి గార్డుగా పనిచేస్తున్నాడు. కాగా హత్య తరువాత పరారైన నిందితుడు తాను పోలీసులకు చిక్కడం తథ్యమని భావించి ఇంటికి చేరుకుని గ్రామ వి ఆర్వో తులసమ్మకు జరిగిన సంఘటన గురించి వివరించాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అతనిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

భక్తుల సౌకర్యాల్లో రాజీ లేదు
* టిటిడి ఇ ఓ స్పష్టం
తిరుపతి, నవంబర్ 29: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసిన నేపథ్యంలో తిరుమలకు వచ్చిన భక్తులకు తమ వద్ద డబ్బులేకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, జల ప్రసాదాలు, వసతి కల్పిస్తున్నామని, భక్తులకు సౌకర్యాల విషయంలో రాజీలేకుండా చర్యలు తీసుకుంటున్నామని టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు తెలిపారు. భక్తులు సులభంగా, సంతోషంగా టిటిడి సేవలు పొందేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో మంగళవారం జరిగిన వారపు సమావేశంలో ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇ ఓ మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన, నాణ్యమైన ఉచిత అన్నప్రసాదాలు, జల ప్రసాదాలు, దర్శనం, వసతి అందించాలని టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. పెద్దనోట్ల రద్దుకారణంగా భక్తులు ఇబ్బంది పడకుండా డిసెంబర్ చివరి వరకు అన్నప్రసాదాల అదనపు కౌంటర్లను కొనసాగించాలన్నారు. అన్నప్రసాద భవనాలలో ఏ సమయానికి అన్నప్రసాదాలు పంపిణీచేస్తారు, భక్తులు ఏ ఏ హాలులోకి వెళ్లాలనే సమాచారాన్ని భక్తులకు తెలిసేలా డిస్‌ప్లే బోర్డులలోనిత్యం ప్రసారం కావాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములలో నగదు కార్యకలాపాలు వేగవంతం చేయాలన్నారు. టిటిడిలో పాటు, రవాణా, అన్నప్రసాదంలో వంట తయారీ చేసే వంట కార్మికులు కల్యాణకట్ట, తదితర శాఖలలో శారీరకంగా ఒత్తిడి ఎదుర్కొనే వారికి హెల్త్ ఇన్సూరెన్స్‌ను అమలు చేయాలని కోరారు. దివ్యదర్శనం కాంప్లెక్స్‌లో భక్తులకు ఇబ్బంది లేకుండా లగేజి కౌంటర్లు, కాఫీ, టీ, పాలు,మంచినీరు సదుపాయాలు, లడ్డూ టోకన్ల స్కానింగ్, తిరునామం కేంద్రాలను సులభంగా గుర్తించేలా ప్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ఆధార్‌కార్డును తప్పనిసరిచేస్తూనే , ఒకవేళ ఆధార్‌కార్డును తీసుకొని రాని పక్షంలోపాన్‌కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సులతో ఏదో ఒక గుర్తింపు తీసుకువచ్చినా శ్రీవారిమెట్టునడక మార్గంలో, తిరుపతి, తిరుమలలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అటు శ్రీవారి మెట్టు ఘాట్‌రోడ్డు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. శ్రీవారిమెట్టు నడకమార్గంలో భక్తులకు నిత్యం శ్రీవారినామ సంకీర్తనలు వినిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమలలో ఉన్న 15పై చిలుకు కాషన్ డిపాజిట్ కౌంటర్లను దాతల విరాళాల సేకరణ, సమాచారం, టిటిడి డైరీలు, క్యాలెండర్లు, ప్రచురణల అమ్మకాల కేంద్రాలుగా మార్పులు చేయడానికి తీసుకోవాలని రిసెప్షన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎఫ్ ఎ సి ఎ ఓ బాలాజి, ఆలయ డిప్యూటీ ఇ ఓ కోదండరామారావు, ఎస్ ఇ 2 రామచంద్రారెడ్డి, వి ఎస్ ఓ లు రవీంద్రారెడ్డి, విమలాకుమారి, జి ఎం శేషారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి శర్మిష్ట, ఈడిపి ఓ ఎస్డీ బాలాజి ప్రసాద్, రిసెప్షన్ అధికారులు హరీంద్రనాథ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.