చిత్తూరు

దాహం తీర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 2 : తన అధికార దాహం, తన కుమారుడి అధికార దాహం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూపిస్తున్న శ్రద్ద రాష్ట్ర వ్యాప్తంగా తాగడానికి నీరులేక గొంతెండుతున్న ప్రజల దాహార్తిని తీర్చడానికి శ్రద్ధ చూపడంలేదని వైకాపా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. తాగునీటి సమస్యపై వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్టవ్య్రాప్తంగా వైకాపా నేతలు చేస్తున్న నిరసనలో భాగంగా సోమవారం వైకాపా నేతలు తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైకాపా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ మాత్రం దృష్టి పెట్టడంలేదని నిప్పులు చెరిగారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు తాగునీరు, సాగునీరుకు ఇబ్బందులు లేకుండా పోయిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు అవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రజా సంక్షేమ హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ముఖ్యంగా లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని ప్రభుత్వ అధికారులను అవినీతి వైపు ప్రోత్సహించడంలో బాబు ప్రత్యేక దృష్టి పెట్టారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో నిందితుడైన చంద్రబాబు కెసిఆర్‌తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు ఆరోపించారు. ఇదే అవకాశంగా తీసుకుని కెసిఆర్ తెలంగాణలో రెండు ప్రాజెక్టులు నిర్మిస్తున్నా అభ్యంతరం చెప్పడానికి చంద్రబాబు సాహసం చేయడం లేదని విమర్శించారు. తెలంగాణలో రెండు ప్రాజెక్టులు పూర్తయితే శ్రీశైలంకు నీళ్లు రావని, దీంతో తెలుగుగంగకు కూడా నీరు ఉండదని, అదే జరిగితే రాయలసీమ ప్రజలకు తాగడానికి చుక్కనీరు దొరకదన్నారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో, 600 మండలాల్లో 359 మండలాలను ప్రభుత్వం అధికారికంగా కరవు మండలాలుగా ప్రకటించిందని, మరో 100 మండలాల్లో కరవు తీవ్రంగా ఉందన్నారు. ప్రజలకు తాగునీరు అందిస్తే తన హెరిటేజ్ సంస్థ ద్వారా ఉత్పత్తి అయ్యే మజ్జిగ, నీటికి డిమాండ్ ఉన్నదన్నదే చంద్రబాబు చింత అని ఆరోపించారు. ప్రజల దాహార్తి తీర్చడానికి డబ్బులు లేవంటున్న చంద్రబాబు వైకాపా ఎమ్మెల్యేలను కొనడానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడంటే ఆయన రాజకీయ దాహం ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడమే చంద్రబాబు లక్ష్యంగా వైకాపా ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. అయితే ప్రజల పక్షాన పోరాడే వైకాపా బాబు దుర్మార్గాలను చూస్తు ఊరుకోదని, ఎక్కడికక్కడ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పోరాడితే పోయేదేమిలేదు..బానిస సంకెళ్లు తప్ప అన్న సంకల్పంతో ప్రజలు వైకాపా వెంట ప్రభుత్వ బెదిరింపులకు బెదరకుండా ఉద్యమాల్లో పాల్గొంటున్నారన్నారు. 42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉన్నా తాము చేపట్టిన ఈ ధర్నాకు వేల సంఖ్యలో మహిళలు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరచి ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టకపోతే 1999లో జరిగిన రాజకీయ పరిణామాలు పునరావృతం అవుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్, మహిళ నాయకురాలు కుసుమకుమారి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్ర, నాయకులు సిద్దారెడ్డి, ముద్రనారాయణ, ఎస్కేబాబు, భువనేశ్వరి, తిరుమల వైకాపా నేతలు మురళి, చిన్నముని తదితరులు పాల్గొన్నారు.

రోడుడ్రపమాదంలో ఇద్దరు మృతి

బంగారుపాళ్యం, మే 2: బెంగళూరు-చెన్నై జాతీయ రహదారి మండలంలోని కాటప్పగారిపల్లె సమీపంలో సోమవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. పోలీసుల కథనం మేరకు మైసూరు నుంచి కాసిపెంటకు వెళ్తున్న పాల ట్యాంకరు బెంగళూరు కత్తిరికుప్పంకు చెందిన వారు ఎస్‌ఆర్‌పురం నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సుధాకర్(35), కృష్ణమ్మ(60) అక్కడికక్కడే మృతి చెందారు. పిల్లలు రుద్రగణేష్(14), సుజనశ్రీ(10), గిరి(35)లకు గాయాలైయ్యాయి. గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నెట్టికంఠయ్య తెలిపారు.

కృష్ణా పుష్కరాలకు టిటిడి శ్రీవారి
నమూనా ఆలయ నిర్మాణం
* టిటిడి ఇవో డాక్టర్ డి సాంబశివరావు వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, మే 2 : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నమూనా ఆలయాన్ని కృష్ణా పుష్కరాల్లో ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయాలను నిర్మించడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను టిటిడి ఇవో సాంబశివరావు ఆదేశించారు. స్థానిక టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం సీనియర్ అధికారులతో ఇవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సప్తగిరి మాసపత్రికకు తిరుమల, తిరుపతి, ఇతర ప్రాంతాల నుంచి ప్రతినెలా వందలాది చందాలు వస్తున్నాయని, వీటిని సరిచూసుకుని పత్రిక చేరని వారికి వెంటనే అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. సప్తగిరి మాసపత్రిక రానివారు టిటిడి కాల్‌సెంటర్ 0877-77777, 33333, 2264252, టోల్ ఫ్రీ నంబర్ 1800425333333కు తెలియజేస్తే చందాదారులకు పంపబడుతుందని అన్నారు. ఇదివరకు టిటిడి నిర్మించిన ఆలయాల్లో విగ్రహాలకు సంబంధించి, ఆలయ నిర్మాణ శైలిని పరిశీలించడానికి, మార్పులు చేర్పులు చేయడానికి సిఇ ఆధ్వర్యంలో ఒక స్థపతి, అర్చకులు, ఇంజినీర్లు, అధికారులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల టిటిడిలో విలీనమైన ఉపమాక, అనంతవరం, ఒంటిమిట్ట ఆలయాల్లో స్థానికంగా ఉన్న శ్రీవారి సేవకుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. మే 10న శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవం సందర్భంగా ప్రత్యేకంగా పుస్తకాలు, సిడిలను ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది ధర్మరథం ప్రయాణించే మార్గం, శ్రీవారి కల్యాణాలు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఇవో ఆదేశించారు. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభంకానున్న శుభప్రదంకు అవసరమైన పుస్తకాల ముద్రణ పూర్తి చేయాలని ఆయన అన్నారు. శుభప్రదం శిక్షణనిచ్చే బోధన సిబ్బందికి మే మొదటి వారంలో తిరుపతిలో శిక్షణ ఇవ్వాలన్నారు. ఆయా ప్రాంతాల్లో మీడియా ద్వారా పిల్లలు వారి తల్లితండ్రులకు శుభప్రదం గురించి తెలియజేయాలని కోరారు. చెన్నైలోని సమాచార కేంద్రంలో జరుగుతున్న ఎలక్ట్రికల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆర్‌ఓ తాగునీరు ఏర్పాటు చేయాలని, ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు అందించాలని ఇవో అధికారులను ఆదేశించారు. అలిపిరి వద్ద వాటర్ కూలర్స్ ఏర్పాటు చేయాలని, నడకదారిలో ఎండవేడి నుంచి భక్తులకు ఉపశమనం కల్పించేందుకు మెట్లపై వైట్ పెయింట్ వేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్‌సిసి క్యాడెట్స్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని డిఇఓను ఆదేశించారు. ఈ సందర్భంగా భగవద్ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా మే నెల సప్తగిరిని టిటిడి ఇవో డి సాంబశివరావు ఆవిష్కరించారు. దీనిలో రామానుజుల వారి జీవిత విశేషాలు, తిరుమల ఆలయంతో ఆయనకు ఉన్న అనుబంధం, భక్తులకు ఆయన అందించిన ఉపదేశాలు, ప్రముఖ పండితుల ప్రత్యేక వ్యాసాలు పొందుపరిచారు. ఈ సమీక్షలో టిటిడి జెఇఓ పోల భాస్కర్, న్యాయాధికారి వెంకటరమణ, ఎఫ్‌ఏ అండ్ సిఏఓ బాలాజీ, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమాచారహక్కు చట్టం అప్పీళ్ల విచారణలో ఇష్టమొచ్చినట్లు రాస్తే చర్యలు
* తహశీల్దార్లను హెచ్చరించిన
సమాచారహక్కు చట్టం కమిషనర్
మదనపల్లె, మే 2: అపిలియన్ అడిగిన సమాచారం ఏమిటి.. ‘నాట్ వ్యాలీడ్ దిస్ ఎనీ అదర్ పర్పస్’ అని రాయడానికి మీరెవరు? అలా రాసేఅధికారం మీకులేదు, పేదలపై పెత్తనం చెలాయిస్తున్నారా? ఇష్టం వచ్చినట్లు రాస్తే చర్యలు తప్పవంటూ సమాచార హక్కుచట్టం కమిషనర్ లామ్ తాంతియాకుమారి తహశీల్దార్లను హెచ్చరించారు. సోమవారం మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్‌హాల్‌లో అప్పీళ్ళపై విచారణ ప్రారంభంలోనే పీలేరు మండలం ఉమామహేశ్వర్ అనే వ్యక్తికి చెందిన భూములు ఇతరుల పేరుతో పట్టాలు చేయడం, వారిపేరున పట్టాదారు పాస్‌బుక్కులు చేయడం జరిగిందని బాధితుడు సమాచారహక్కు చట్టం ద్వారా ఇందుకు సంబంధించిన రికార్డులు నకలు ఇవ్వాలని పిఐఓను అర్జీరూపంలో అడిగారు. దీనిపై కమిషనర్ విచారించగా రెవెన్యూ అధికారి దిక్కులు చూస్తు, వెంట తెచ్చుకున్న రికార్డులు తిరగేస్తు, పొంతనలేని సమాధానం చెబుతుంటే తహశీల్దారు చెప్పినట్లు చేశామని ఆర్‌ఐ వెంకటరమణారెడ్డి సమాధానం ఇచ్చారు. అసలు తహశీల్దారు రాకుండా మీరెందుకు వచ్చారు అని పీలేరు ఆర్‌ఐని సమాచారహక్కు చట్టం కమిషనర్ తాంతియాకుమారి నిలదీశారు. సమాచారం అడిగిన ప్రతి పౌరుడికి సకాలంలో ఇచ్చే బాధ్యత సంబంధిత అధికారిపై ఉందన్నారు. పౌరుడు సమాచారంహక్కు చట్టం పరిధిలో ఏమిఅడిగినా ఇవ్వాల్సిందే అన్నారు. అధికారులు విధినిర్వహణ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. 3రోజులలో ఇచ్చే సమాచారం మూడు మాసాలైన ఇవ్వడానికి అర్జీదారులను తిప్పుకోవడం సమంజసం కాదన్నారు. ఈ విచారణలో రూ.60వేలు జరిమానా, ఇద్దరు తహశీల్దార్లుకు షోకాజు నోటీసులు ఇచ్చారు.

అడవుల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు
*ఏనుగుల దాడులను అరికడతాం
* చిత్తూరు వెస్ట్ డిఎఫ్‌ఓ చక్రపాణి వెల్లడి
మదనపల్లె, మే 2: జిల్లాలో అడవుల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు తయారుచేస్తున్నట్లు చిత్తూరు వెస్ట్ డివిజన్ ఫారెస్ట్ అధికారి టి చక్రపాణి తెలిపారు. సోమవారం మదనపల్లె అటవీశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అడవులపై వర్కింగ్‌ప్లాన్ (అభివృద్ధి ప్రణాళికలు) తయారు చేస్తున్నామన్నారు. ప్రతిపదేళ్ళకు ఒకసారి అడవుల అభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యలపై తయారు చేసిన ప్రణాళికలను ఆర్నెల్లు ముందుగా కేంద్రప్రభుత్వానికి సమర్పించి అనుమతి తీసుకోవాల్సివుందని అన్నారు. 2017 నాటికి సమయం సమీస్తున్న నేపథ్యంలో అడవులలో ప్రస్తుత పరిస్థితి ఏవిధంగా ఉంది, అదేవిధంగా చెట్లు, రోడ్లు, చెక్‌డ్యామ్‌లు, గడ్డివారి స్థితిగతులపై సర్వేచేసి 0.1హెక్టారులో శాంపిల్‌గా సర్వేచేస్తారన్నారు. జిల్లాలో 224ప్రాంతాలలో సర్వేచేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా మదనపల్లె మండలం చీకలబైలు అటవీప్రాంతంలో సర్వే చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా రానున్న వర్షాకాలంలో అడవులలో విత్తనాలు వేయడానికి విఎస్‌ఎస్ సభ్యుల ద్వారా 9500హెక్టార్లలో 95టన్నుల విత్తనాలు, హెలీక్యాప్టర్ ద్వారా 7500 హెక్టార్లలో 75టన్నుల విత్తనాలు చల్లేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విఎస్‌ఎస్ ద్వారా విత్తనాల వేయడానికి రూ.2.3కోట్లు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. చింత, వేప, శ్రీగంధం, ఎర్రచందనం, వెదురు, అటవీప్రాంతంలో ప్రకృతిగా పెరిగే విత్తనాలు వేస్తున్నట్లు ప్రకటించారు. 2015-16సంవత్సరంలో రూ.8కోట్లు ఖర్చుచేయగా, అందులో ఎక్కువగా కుప్పం నియోజకవర్గంలో ఏనుగుల దాడుల నుంచి సంరక్షించేందుకు రూ.4 కోట్లుతో కంచె వేశారన్నారు. దీంతో ఏనుగుల దాడులు 90శాతం వరకు ఆపగలిగామన్నారు. విలేఖరుల సమావేశంలో మదనపల్లె సబ్ డివిజనల్ అటవీశాఖ అధికారి జి ధర్మరాజు, మదనపల్లె అటవీశాఖ అధికారి వి మాధవరావు, సిబ్బంది ఉన్నారు.
అభివృద్ధి పనులు పూర్తిచేయండి
* జడ్పీ సిఇఓ పెంచలకిషోర్
శ్రీ కాళహస్తి, మే 2 : మునిసిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈ నెలలోపు పూర్తిచేయాలని జన్మభూమి నోడల్ అధికారి, జడ్పీ సిఇఓ పెంచలకిషోర్ మునిసిపల్ కమిషనర్ శ్రీరామశర్మను, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జన్మభూమి పనులు, ఇతర అభివృద్ధి పనులపై ఆయన సోమవారం మునిసిపల్ కార్యాలయంలో సమీక్షించారు. ఏయే పనులు ఏ స్థాయిలో ఉన్నాయో, ఎందుకు ఆలస్యం జరుగుతుందో తెలుసుకున్నారు. నిధులు ఉన్నా పనిచేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద మంజూరు చేసిన నిధులను వెంటనే ఖర్చు చేయాలన్నారు. పనుల్లో నాణ్యత ఉండాలని, లేకుంటే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ముక్కంటిని దర్శించుకున్న ఆదాయపన్ను శాఖ డిసి
శ్రీకాళహస్తి, మే 2 : ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఆదాయపన్ను శాఖ డైరెక్టర్ జనరల్ ఎస్‌కె మిశ్రా సోమవారం ఉదయం శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి వచ్చారు. కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులతో వచ్చిన ఆయనకు దేవస్థానం ఇఓ భ్రమరాంబ వేద పండితులతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ఆయన ప్రత్యేక రాహు-కేతు పూజలు చేయించుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న తరువాత దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు ఆశీర్వదించారు. దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
* జిడి నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి
కార్వేటినగరం, మే 2: వైకాపా జెండా, అజెండాతో గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జిడి నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం ముందు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యేలను కొని రాజకీయాలు చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రజలను ఆదుకుంటామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు అధికార దాహం తప్ప మరో ఆలోచన లేదన్నారు. తాను అధికారం వద్దనుకుంటే ఆ అధికారం తన కొడుకుది కావాలే తప్ప మరొకరు ఆ పదవిలో కూర్చోకూడదన్నదే బాబు కుట్రపూరిత ఆలోచనలని అన్నారు. అందుకే ఆయన రాష్ట్భ్రావృద్ధిపై దృష్టి పెట్టకుండా అక్రమార్జనపై దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీరాములునాయుడు, సింగల్‌విండో అధ్యక్షుడు లోకనాథరెడ్డి, ఎంపిటిసి సభ్యులు మునికృష్ణ, అన్నపూర్ణమ్మ తదితరులున్నారు.

టిటిడి పాలక మండలి పదవీకాలం పొడిగింపు
* మరో ఏడాది పాటు పొడిగింపు ఇచ్చిన ప్రభుత్వం * బోర్డు నుంచి సాయన్న ఔట్
తిరుమల, మే 2 : టిటిడి పాలకమండలి పదవి కాలాన్ని మరో ఏడాదికి పొడిగిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిఓ విడుదలైంది. టిటిడి పాలక మండలి చైర్మన్‌గా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని, మరో 18 మందిని సభ్యులుగా ఏడాది కాలానికి టిటిడి పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పదవీకాలం ముగిసిన అనంతరం పాలక మండలి కొనసాగింపుపై తర్జనభర్జనలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పొడిగింపుపై జిఓ విడుదల చేసింది. దేవాదాయ చట్టం ప్రకారం పాలక మండలి పదవీకాలం రెండేళ్లుగా నిర్ణయించబడింది. దీంతో ప్రస్తుత పాలక మండలి మరో ఏడాదికాలం పొడిగిస్తూ జిఓ నంబర్ 188 జారీ చేశారు. ఇదిలావుండగా ప్రస్తుత టిటిడి పాలక మండలి సభ్యుడిగా ఉన్న తెలంగాణ ఎమ్మెల్యే జి సాయన్నను పాలక మండలి సభ్యత్వం నుంచి తప్పిస్తూ శనివారం జిఓ జారీ అయ్యింది. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గత మూడు పాలకమండలి సమావేశాలకు సాయన్న హాజరు కాకపోవడంతో టిటిడి ఇవో సాంబశివరావు దీనిపై దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాయడంతో సాయన్నను పాలకమండలి నుంచి తప్పిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.

గుండెపోటుతో టమోటా రైతు మృతి
మదనపల్లె, మే 2: గుండెపోటుతో ఓరైతు మృతిచెందిన సంఘటన మదనపల్లె-పుంగనూరు రోడ్డుమార్గంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల మేరకు పుంగనూరు మండలం ఈడిగపల్లెకు చెందిన వెంకటరమణ (35) ఆరుగాలం పండించిన పంటను మార్కెట్‌కు తరలించి తిరిగి ఆర్టీసీ బస్సులో ఇంటికెళ్తుండగా మార్గమధ్యలో గుండెపోటు వచ్చింది. ఈ విషయం ఆర్టీసీ కండక్టరుకు చెప్పడంతో బస్సును నిలిపి, మార్గమధ్యంలో పుంగనూరురోడ్డు బైపాస్ సర్కిల్ ప్రాంతంలో దిగబెట్టారు. రోడ్డుప్రక్కనే పడి మృతిచెందడం స్థానికులు గుర్తించి మృతుడి జేబులో మదనపల్లె మార్కెట్‌లోని మండీలో కాయలు అమ్మినట్లు పట్టీలో పేరు, ఆర్టీసీ బస్సు బస్సుటికెట్ ఆధారంగా పేరు, అడ్రస్సు కనుగొన్నారు. ఈవిషయం రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు.

‘గిట్టుబాటు ధర ఇచ్చేందుకే ధాన్యం సేకరణ’
చంద్రగిరి, మే 2 : చంద్రగిరి మండలంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధాన్యం సేకరిస్తున్నట్లు రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ సప్తగిరి ప్రసాద్ సోమవారం అన్నారు. చంద్రగిరిలోని సివిల్ సప్లై గోడౌన్ వద్ద వరి ధాన్యం సేకరణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటలను గిట్టుబాటు ధరల్లేక దళారులకు విక్రయించి మోసపోతున్నారని , దీనిని నిర్మూలించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల వద్ద గిట్టుబాటు ధరలకు ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారని తెలిపారు. రైతులను ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ముఖ్యమంత్రి కూడా రైతు బిడ్డ కావడంతో కష్టాలను గ్రహించారని, అందుకే నేరుగా ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నదని, రైతులకు రావాల్సిన నగదు ఆయా ఖాతాల్లో జమచేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కిరణ్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా పుష్కరాలకు సహకరించాలని టిటిడిని కోరా
* డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్
తిరుమల, మే 2: కృష్ణా పుష్కరాల్లో తనవంతుగా ధార్మిక, సాంస్కృతిక సేవలు అందించి సహకరించాలని టిటిడిని కోరినట్లు ఏపి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో టిటిడి ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టి ఎనలేని సేవ చేసిందన్నారు. అలాగే గోదావరి తీరాన శ్రీవారి ఆలయాన్ని నిర్మించి భక్తులకు శ్రీవారి దర్శన ప్రాప్తి కలిగేలా ఇలాంటి సేవా భావాన్ని కొనసాగిస్తూ రానున్న కృష్ణా పుష్కరాల్లో కూడా టిటిడి సేవ చేయాలని ఆయన ఇవో సాంబశివరావుకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు కదలివచ్చి కోలాటాలు, భజనలుచేసి భక్తి విశ్వాసాలు చాటాలన్నారు. ఇటువంటి సామూహిక ధార్మిక భజనలు, కోలాటాల వల్ల సమష్టి కృషితో లభించే తృప్తి బోధపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘వందరోజుల పనుల అభివృద్ధి ప్రణాళిక’
తిరుపతి, మే 2 : నగరపాలక సంస్థ పరిధిలో వందరోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రణాళికను కమిషనర్ వి వినయ్‌చంద్ రూపొందించి దానిపై ఆయా శాఖ అధికారులతో సమీక్షించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్, ప్రణాళిక, ఆరోగ్య, రెవెన్యూ, మెప్మా విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

తిరుమల్లో బోల్తాపడ్డ ట్రాక్టర్
* ఇద్దరి పరిస్థితి విషమం
* ఆరుగురికి గాయాలు
తిరుమల, మే 2: తిరుమల్లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిరుమల్లో విద్యుత్ పనులు చేసుకునే కాంట్రాక్ట్ డ్రైవర్ నారాయణస్వామి సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు 8మంది కూలీలను ట్రాక్టర్‌లో ఎక్కించుకుని జిఎన్‌సి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వైపు వచ్చాడు. ఈ క్రమంలో వాహనం ఔటర్‌రింగ్ రోడ్డులోని సేవా సదన్ సమీపాన ఉన్న మలుపు తిరుగుతున్న సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పి పిట్ట గోడను ఢీకొట్టడంతో బోల్తా పడింది. వెనుకభాగంలో కూర్చుని ఉన్న ఎనిమిది మంది కూలీలు టిప్పర్ కింద ఇరుక్కుపోయారు. దీనిని గమనించిన స్థానికులు టిప్పర్ కింద చిక్కుకున్న కూలీలను బయటకు లాగారు. అంబులెన్స్‌లో వారిని అశ్విని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు కూలీల పరిస్థితి విషమంగా ఉండటంతో రుయా ఆసుపత్రికి తరలించారు. ఇందులో యేసు (32), శ్రీను (42), నారాయణస్వామి నాయుడు (55), బోసు (30), యేసుపాదం (22)లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో గోదావరి జిల్లాకు చెందిన మధు (22), చిన్నారెడ్డి (20)లుగా గుర్తించారు. కాగా ట్రాక్టర్ బ్రేకులు ఫెయిల్ కావడంతోనే వాహనాన్ని అదుపు చేసేందుకు పిట్ట గోడను ఢీకొని ట్రాక్టర్ బోల్తా పడిందని డ్రైవర్ నారాయణస్వామి తెలిపాడు. కాగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపినందుకు, పోలీసులకు తన సమాచారాన్ని తప్పుగా ఇచ్చినందుకు నారాయణస్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు.