చిత్తూరు

ఎన్‌టిఆర్‌కు ఘననివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 18: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు వర్ధంతిని తిరుపతిలో తెలుగు తమ్ముళ్లు వేడుకగా నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక టౌన్‌క్లబ్ జంక్షన్ వద్ద ఉన్న ఎన్‌టి ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర బ్లడ్ బ్యాంక్, సాయిసుధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన మహా నాయకుడు ఎన్‌టిఆర్ అన్నారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అన్న నినాదంతో యావత్ రాష్ట్రాన్ని కదలించారని, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడ్డారని తెలిపారు. తుడా చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఎన్‌టి ఆర్ ఆశయాలను సీఎం చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ రాష్ట్భ్రావృద్ధికి, ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నారని చెప్పారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ఎన్‌టిఆర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పేరుగాంచిన మహా నటుడన్నారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి ప్రజలను మెప్పించారన్నారు. టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎన్.విజయలక్ష్మి మాట్లాడుతూ తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం, స్విమ్స్ ఆస్పత్రి, తిరుపతికి తెలుగుగంగ నీరుతోపాటు నగరాభివృద్ధికి పాటుపడ్డారని కొనియాడారు. తిరుమల గిరులు నేడు పచ్చదనంతో శోభించడం వెనుక ఎన్‌టిఆర్ కృషే కారణమన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు వూకా విజయ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎన్‌టిఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ సేవా సమితి సభ్యులు నాగసాయి, కార్తీక్ ఆధ్వర్యంలో ఎస్.ఐ.హెచ్.ఎం. విద్యార్థులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి డైరెక్టర్ అంబూరు సింధూజ, డాక్టర్ సంజయ్, డాక్టర్ ఆశాలత, శాఫ్ డైరెక్టర్ శ్రీ్ధర్ వర్మ, నరేగా సభ్యులు సింగం శెట్టి సుబ్బరామయ్య, నాయకులు ఊట్ల సురేంద్ర నాయుడు, సరోజమ్మ, కల్పన, శివరాయల్, మునిశేఖర్ రాయల్, మునిశంకర్ నాయుడు, ఉంగరాల హరి, ఎస్వీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ ఎల్ ఆర్ నాయుడు, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు రవినాయుడు, రాగల ఆనంద్ గౌడ్, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

రజకులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు కేటాయించండి
* ఏపీ రజక జనసేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కినపల్లి లక్ష్మయ్య
తిరుపతి, జనవరి 18: రజకులకు రాజ్యాధికారం ఇవ్వాలని, ఇందులో భాగంగా జిల్లాలో రానున్న ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని ఏపీ రజక జనసేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కినపల్లి లక్ష్మయ్య కోరారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జయహో రజక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన అక్కినపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ తిరుపతి నగరంలో రజకులకు ఎలాంటి రాజకీయ గుర్తింపులేకపోవడం బాధాకరమన్నారు. వెంటనే నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలన్నారు. నిత్యం టీడీపీ పటిష్టతకు కృషి చేస్తున్న రజకుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ నివేదికను వెంటనే ఇవ్వాలని కోరారు. జిల్లాలో దోభీ ఘాట్‌ల నిర్మాణాలకు అనేక ప్రాంతాల్లో రజకులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. వాటిని పరిష్కరించి నూతన దోభీ ఘాట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహ యాదవ్‌లు మాట్లాడుతూ రజకుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతోందని అన్నారు. రానున్న కాలంలో వారికి తగిన ప్రాధాన్యత కూడా ఉంటుందని వివరించారు. రజకుల సమస్యలేవైనా వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, టీడీపీ జిల్లా కార్యదర్శి మధు, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు వూకా విజయ్‌కుమార్, టీడీపీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ యాదవ్, టీడీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పుష్పావతి యాదవ్, గ్రంథాలయ బోర్డు డైరెక్టర్ సూరా సుధాకర్ రెడ్డి, చిత్తూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ పి.షణ్ముగం, ఏపీ రజక జనసేవా సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లెల నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి క్రిష్ణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగయ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు లక్ష్మయ్య, నారుూబ్రాహ్మణ వెల్ఫేర్ కమిటీ డైరెక్టర్ రుద్రకోటి సదాశివం, రమణ, మల్లిఖార్జున, బి.శివయ్య, గంధం బాబు, రాజయ్య, కుమార స్వామి, అర్తల రమేష్, జి.రాము, సురేంద్ర, జీవకోన సుధాకర్, విజయ్, గుణశేఖర్, జగదీష్, కుమ్మరితపు సుబ్రమణ్యం, సుబ్బరాయుడు, రామమూర్తి, రెడ్డెప్ప, ఎస్టీవీ నగర్ మురళి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

దేవాలయ ఉద్యోగులకు కనీస వేతనం చెల్లింపునకు చర్యలు
* ఆన్‌లైన్ సేవలు అమలు
* ఆర్‌జేసీ భ్రమరాంబ వెల్లడి
శ్రీకాళహస్తి, జనవరి 18: దేవాలయ ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌జేసీ భ్రమరాంబ వెల్లడించారు. శుక్రవారం ఆమె స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏడు జిల్లాలకు సంబంధించిన ఆలయ కార్యనిర్వహణాధికారులు, సిబ్బందితో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ తిరుపతి మల్టీజోన్2 పరిధిలో ఉన్న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని 6(ఎ), 6(డి) పరిధిలో పనిచేస్తున్న ఆలయ ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించేందుకు కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇదివరకే టైమ్‌స్కేల్ ఉన్న ఉద్యోగులకు 2015 ప్రకారం పీఆర్‌సీ అమలు పరచడం, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయడం, దేవాలయ ఆస్థుల వేలం నిర్వహించడానికి ఉన్నతాధికారుల ఆమోదం, ప్రతి మూడు నెలలకు ఒకసారి దేవాలయ నిధులు ఖర్చుచేయడం వంటి అంశాలపై ఆమె సమీక్షించారు. అందులో భాగంగా విత్‌డ్రాయల్ అనుమతి తీసుకోవడానికి 10 లక్షల విలువ దాటిన టెండర్లను ఈ ప్లాట్‌ఫారం ద్వారా వేలం నిర్వహించడానికి, వివిధ రకాల ఆస్థులకు సంబంధించిన నిధుల గురించి చర్చించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ చట్టంలోని సవరణలు, వాటి అమలు తీరుపై కూడా ఆమె దేవాలయ కార్యనిర్వాహణాధికారులతో చర్చించారు. దేవాలయాల నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వాటిని ఆర్థిక సలహాదారు ఏవి రాజశేఖర్, ప్రధాన కార్యాలయ సహాయ కమిషనర్ రత్నంరాజు, ఐటీ మేనేజర్ ప్రసాద్ తదితరులు ఆన్‌లైన్ అకౌంట్ సిస్టమ్‌పై, కంప్యూటర్ల వినియోగం వంటి అంశాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయంలో నిర్వహిస్తున్న అకౌంట్‌లో పారదర్శకత, భక్తులు ఆన్‌లైన్ ద్వారా సేవల రిజిస్ట్రేషన్, రికార్డుల నిర్వహణను కంప్యూటరీకరించి, మ్యాన్యువల్ సిస్టమ్‌ను పూర్తిగా తొలగించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 93 దేవస్థానాల ఈవోలు, 260మంది కంప్యూటర్ ఆపరేటర్లు హాజరయ్యారు.

దేశాభివృద్ధి ఫెడరల్ ఫ్రంట్‌తోనే
* బాబు టీడీపీని రాహుల్ గాంధీ పాదాల చెంత ఉంచాడు
* నాలుగేళ్లల్లో రూ. 11లక్షల కోట్ల ప్రజాధనం లూటీ
* వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణ
తిరుపతి, జనవరి 18: దేశాభివృద్ధి ఫెడరల్ ఫ్రంట్‌తోనే సాధ్యమని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఫెడరల్ ఫ్రంట్‌కు సంబంధించి కేటీఆర్, జగన్‌తో కలిసి చర్చించడాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడటం వారి అవకాశవాద రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుంటే దేశం కోసం, ప్రజల కోసమంటూ బాకా ఊదుకుంటారన్నారు. ఇతర రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కుదిరితే వాటిని తప్పుబడతారని చెప్పారు. చంద్రబాబు ఎన్ని అరాచకాలు చేసినా వాటికి కూడా సంక్షేమం, అభివృద్ధి అంటూ నామకరణం చేస్తారని విమర్శించారు. వైకాపా, టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుని రానున్న ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. ఓటుకు నోటు విషయంలో ఇరుక్కున్న చంద్రబాబు, కేసీఆర్‌కు భయపడి ఆంధ్రాకు వచ్చేశారన్నారు. ఒక్క తప్పుకూడా చేయని జగన్‌ను 18 నెలలు జైలులో పెట్టించాడన్నారు. అయినా వైకాపా అధినేత ఎవరికీ భయపడకుండా, నిబద్ధతతో ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నారని తెలిపారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాహుల్ గాంధీ పాదాల వద్ద టీడీపీని ఉంచాడన్నారు. నాలుగు సంవత్సరాలు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నా ఏనాడు రాష్ట్రం కోసం బాబు ఆలోచించిన దాఖాలాల్లేవన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కావాలని అభిలషిస్తున్న తరుణంలో ప్రత్యేక ప్యాకేజీ ఒక సంజీవిని అంటూ బాబు చెప్పుకున్నాడన్నారు. ఈ ముసుగులో కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేసి లెక్కలడిగితే బీజేపీతో పొత్తు వదులుకున్న ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. వైకాపా ఇప్పటికీ ప్రత్యేక హోదాకోసం పోరాడుతోందని, ఎవరు ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉంటారో వారితో కలిసి పనిచేయడానికి తమ అధినేత జగన్ ఆలోచనన్నారు. బాబు హయాంలో అభివృద్ధి పేరుతో రూ. 11లక్షల కోట్ల ప్రజా ధనం లూటీ జరిగిందని భూమన ఆరోపించారు. జగన్ పేరు చెబితే బాబుకు రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయందని, చచ్చిన కాంగ్రెస్‌తో వైకాపా జతకట్టే పరిస్థితిలేదని, ఆపార్టీతో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితేలేదని భూమన స్పష్టం చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో వైకాపా నాయకులు పాలగిరి ప్రతాప రెడ్డి, ఎస్‌కే బాబు, ఎంవీఎస్ మణి తదితరులు పాల్గొన్నారు.

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీ ఆర్
* రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి
బైరెడ్డిపల్లి, జనవరి 18: బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి పాటుపడిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం బైరెడ్డిపల్లి చెక్‌పోస్టు వద్ద జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తోందన్నారు. చిత్ర, రాజకీయ రంగాల్లో తనకంటూ చెరగని ముద్ర వేసుకొని ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ నిలిచిపోయారన్నారు. సామాన్యులకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ అన్ని పార్టీలు కొనసాగించడం విశేషమని తెలిపారు. తిరుమలలో పచ్చదనం వెల్లివిరియడానికి హెలికాప్టర్ ద్వారా విత్తనాలు వెదజల్లించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఆరోగ్యం కోసం స్విమ్స్, బర్డ్స్ ఆసుపత్రులు తిరుపతిలో ఏర్పాటుచేయడం, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసి చిత్తూరు జిల్లాలో చెరగని ముద్ర ఎన్టీఆర్ వేసుకున్నారన్నారు. ఈకార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కిషోర్‌గౌడ్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ కదిరప్ప, మండల నాయకులు సుబ్రమణ్యంశెట్టి, అమరనాథరెడ్డి, అమరనాథ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కాల్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు
* జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, జనవరి 18: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా కాల్ సెంటర్ ఏర్పాటుకు అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఎన్నికలు సంఘానికి వివరించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ అధికారి జిల్లా అధికారులతో వీడియాకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్నికల కమిషన్ రాష్ట్రాల వారిగా జిల్లా కాల్ సెంటర్ 1950 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటకు సంబంధించి చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డీసీసీ 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, మ్యాపింగ్ , బి ఎస్ ఎన్ ఎల్ టవర్ల ఏర్పాట్లు కూడా పూర్తి చేశామన్నారు. సి టీవీలు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానింగ్ ఇంటర్ నెట్ తదితర ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయని ఎన్నికల కమిషన్ కు వివరించారు. ఇందుకు ప్రత్యేక అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్‌ను నియమించామన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలు అమలు చేస్తామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జేసి గిరీష, మదనపల్లి , తిరుపతి సబ్ కలెక్టర్లు మహెష్ కుమార్ , కీర్తి , తిరుపతి కమిషనర్ విజయరామరాజు, డి ఆర్ వో గంగాధర్ గౌడ్ ఇతర జిల్లా ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. తరువాత జరిగిన సమావేశంలో జిల్లాలో తయారు చేసిన ఓటర్ల జాబితాలో ఓటర్ ఫోటోలు లేక పోవడంపై కొందరి అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం, ఇటీవల జిల్లాలో తయారు అయిన ఓటర్ల జాబితాలో ఓటర్ ఫోటోకు బదులుగా పలు చోట్లు కొందరు ఆధార్ కార్డులను పొందుపరచడం , తదితర వాటిపై సమీక్షించి 48 గంటల వ్యవధిలో పక్కా జాబితాను తయారు చేయాలని ఈ ఆర్ ఓలను ఆదేశించినట్లు తెలిసింది.
పకడ్బందీగా రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి
జిల్లా కేంద్రంలో ఈ నెల 26వ తేదిన జరగబోవు రిపబ్లిక్ దినోత్సవ వేడుకలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు కొత్త పోలీసు మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లును కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఈ వేడుకలకు వచ్చే వారికి ఎటు వంటి ఇబ్బందులు లేకుండా పలు ముందస్తు చర్యలు తీసుకోవాలని , ఎర్నాట్లు అన్ని పక్కాగా ఉండాలన్నారు. మైదానంలో జరుగుతున్న గ్యాలరీ ఏర్పాటు పనులను పరిశీలించి ఇవి తర్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రంమలో జేసి 2 చంద్రవౌళి, ఈ ఈ గోపిచంద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ను కలిసిన జిల్లా ఎస్పీ
జిల్లా సచివాలయంలో శుక్రవారం కలెక్టర్ ప్రద్యుమ్నను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కలిశారు. ఈసందర్భంగా పలు అంశాలపై వీరు ఇరువురు చర్చించారు. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికలపై జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించినట్ల సమాచారం . ఈ నెల 26వ తేదిన చిత్తూరులో జరిగే రిపబ్లిక్ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పై కూడా చర్చించారు.

డీఎస్సీకి 1457 మంది గైర్హాజరు
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, జనవరి 18: జిల్లాలో డీఎస్సీ ఎస్జీటీ పోస్టులకు శుక్రవారం జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 1457 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో ఉదయం జరిగిన పరీక్షలకు 2680 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా అందులో 766మంది, చెన్నైలో వంద మందికిగాను 58 మంది ఈ పరీక్షలకు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 2680 మందికి గాను 633 మంది అభ్యర్థులు ఆప్‌సెంట్ అయ్యారు. డీ ఎస్సీ రాత పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ పరీక్షలు ఈనెలాఖరు వరకు జరగనున్నాయి.

నౌహీరా షేక్‌కు రిమాండ్ పొడిగింపు
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, జనవరి 18: దేశవ్యాప్తంగా డిపాజిట్లు పేరుతో అనే మందిని మోసగించిన హీరా సంస్థ అధినేత నౌహీరా షేక్ కు వచ్చెనెల ఓటవ తేది వరకు రిమాండ్ పొడిగిస్తూ జిల్లాన్యాయమూర్తి రవీంద్రబాబు శుక్రవారం ఆదేశించారు. హీరా గ్రూపు కంపెనీల గొలుసు కట్టు వ్యాపారంలో ప్రజల వద్ద నుంచి అనేక లక్షల రూపాయలను డిపాజిట్లగా స్వీకరించి వాటిని దారి మళ్లించన కేసులో ఇటీవల ఆ సంస్థ అధినేత నౌహీరా షేక్ సీబీసీ ఐడి పోలీసులు ముంబాయిలో అరెస్టు చేశారు. ఈమెపై చిత్తూరు జిల్లాలో పలు చోట్లు కేసులు నమోదు కావడంతో గతంలో చిత్తూరు కోర్టులో హాజరు పరచడంతో న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు. అప్పటి నుంచి చిత్తూరు సబ్ జైలులో ఆమె రిమాండ్ ఖైదీగా ఉండగా, తదుపరి కేసుల విచారణ నిమిత్తం సీ బీ సీ ఐడి అధికారులు కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు కస్టడీకి కూడా తీసుకొన్నారు. ఈ నేపధ్యంలో పోలీసు కస్టడీ సైతం ముగియడంతో ఆమెను తిరిగి కోర్డు ద్వారా చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. శుక్రవారం కలకడ పోలీసు స్టేషన్‌లో నమోదు అయిన కేసు విచారణ కోసం కోర్టుకు హాజరు పరచగా ఆమెకు వచ్చే నెల ఒకటవ తేది వరకు రిమాండ్ పొడిగిస్తూ జిల్లా న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో నౌహీరా షేక్‌ను తిరిగి చిత్తూరు సబ్ జైలుకు తరలించారు.

దళితులు, బడుగులకు మనోధైర్యం అవసరం
* ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, జనవరి 18: దళితులు, బడుగు వర్గాలు ధైర్యంగా ఉండాలని, పాతకాలం నాటి కర్మ సిద్ధాంతంతో మన బతుకులు ఇంతే అనుకునే రోజులు పోయాయని, సమస్యల పట్ల బడుగులు మనోధైర్యం కలిగివుండాలని, కర్మ సిద్ధాంతం అనే భావాలు తొలగిపోవాలంటే విద్యావంతులు కావడం ఒక్కటే మార్గమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గం బ్రాహ్మణ పట్టు పంచాయతీ కుండా దళితవాడలో దళిత సంఘాలు ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే నేడు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రి పేదలకు, వృద్ధులకు అందిస్తున్న వెయ్యి రూపాయల పెన్షన్‌ను రూ. 2వేలు చేశారని, వికలాంగులకు రూ. 3వేలు, డయాలసిస్ పేషంట్లకు రూ. 5వేలు అందించారన్నారు. అంటరానితనం రూపుమాపాలంటే రాబోవు తరాలకు పిల్లలకు పూర్తిస్థాయిలో విద్యను అందించాలని, విదేశాలకు పంపే ఆలోచనలో మనలో రావాలన్నారు. నేడు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో, గురుకులాలలో ప్రభుత్వం మంచి విద్యను అందిస్తోందని, దీనిని వినియోగించుకోకుంటే నష్టపోతామని స్పష్టం చేశారు. జర్మనీ దేశానికి వెళ్లిన బాబాసాహెబ్ అక్కడ సంస్కృతం నేర్చుకుని తిరిగి భారతదేశం వచ్చి మనుధర్మ శాస్త్ర చదివి అగ్రవర్ణాల వారు కుట్రపూరితంగా రాశారని గుర్తించారన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ భారత రాజ్యాంగాన్ని రచించి, సమానత్వం కోసం అలుపెరగని పారాటం చేసిన నాయకుడయ్యాడన్నారు. అంబేద్కర్ దళితులకే దేవుడు కాదని, దేశంలో సగ భాగంగా ఉన్న మహిళలకు కూడా ఆయన దేవుడయ్యాడని చెప్పారు. ఈసందర్భంగా సూరప్పకశంలో 146 ఎకరాల భూ సమస్యలను పరిష్కరించవాలని అందిన వినతిపై ఆయన స్పందిస్తూ భూ సమస్యలపై ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం చైర్మన్ సహఫంక్తి భోజనంలో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కె.సీ.కుసుమకుమారి, దళిత సంఘాల నాయకుడు డాక్టర్ శ్రీహరి, శ్రీనివాస్, సుదర్శన్, చంద్రశేఖర్, సోమయాజులు, చిరంజీవులు నాయుడు, గ్రాస్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కర్ణాటకకు చెందిన తొమ్మిది మంది అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
* 97 గ్రాముల బంగారు, రూ. 30వేలు నగదు స్వాధీనం
తిరుపతి, జనవరి 18: ఆర్టీసీ బస్టాండ్‌లో, బస్సుల్లో ప్రయాణికుల్లా నటిస్తూ, దేవాలయాల్లో భక్తుల వ్యవహరిస్తూ చోరీలకు పాల్పడే కర్ణాటక రాష్ట్రం, గదగ్ జిల్లా, గవర్నమెంట్ ఆశ్రయ కాలనీకి చెందిన 9 మంది అంతరాష్ట్ర ముఠా సభ్యులను తిరుపతి క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి క్రైం పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సబ్ డివిజన్ డీఎస్పీ ఆర్.రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ అరెస్ట్ అయిన వారిలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారని చెప్పారు. వీరి నుంచి రూ. 2.91లక్షలు విలువ చేసే 97 గ్రాముల బంగారు, రూ. 30వేలు నగదు, చోరీలకు వినియోగించే టాటా సుమో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు చోట్ల చోరీలకు పాల్పడి, అరెస్టై జైలు శిక్ష కూడా అనుభవించారన్నారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో చోరీ చేస్తున్న వీరిని సీసీ టీవీ ఫుటేజ్‌లో గుర్తించడం జరిగిందన్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు కూడా గాలిస్తున్నాయన్నారు. ఈనెల 17న టాటా సుమోలో వచ్చిన ఈ ముఠాను గుర్తించి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వెహికల్ పార్కింగ్ స్థంలో సీసీఎస్ సీఐ కే.రసూల్ అరెస్టు చేశారన్నారు. వీరిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు, తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు, క్రైం పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదై ఉన్నాయన్నారు. అరెస్ట్ అయిన వారిలో కర్ణాటక రాష్ట్రం, గదగ్ జిల్లా గవర్నమెంట్ ఆశ్రమ కాలనీకి చెందిన ముట్టుగారి బేల (45), రేణుక (55), అడల్ కార్తీక్ (20), సంతోష్ గైక్వాడ్, వాణిశ్రీ (50), సవిత (30), నాగరాజు (21), నల్లపోతుల మధు (20), హరేముట్లు అనూష్ (24)లు ఉన్నారని చెప్పారు. ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు నిందితులను సీఐ రసూల్ అరెస్టు చేయగా, సీఐ పద్మలత, హెడ్ కానిస్టేబుల్ రవి ప్రకాష్, దాము, కోమల పాల్గొన్నారని తెలిపారు. వీరికి రివార్డుల నిమిత్తం ఎస్పీకి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన చెప్పారు.
18 టిపిటి 22. తిరుపతి క్రైమ్ పోలీసులు పట్టుకున్న దొంగలు, వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న నగదు, నగలు

ఫ్లెమింగో ఫెస్టివల్‌కు ప్రత్యేక టూర్ ప్యాకేజీ
తిరుపతి, జనవరి 18: శ్రీ పొటి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సూళ్లూరు పేటలో ఈనెల 20, 21, 22 తేదీల్లో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రూ. 900ల నామ మాత్రపుధరతో ప్రత్యేక ప్యాకేజీ టూర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ టూరిజం డివిజనల్ మేనేజర్ ఆర్.వి.సురేష్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతిలోని శ్రీనివాసం వద్దగల ఏపీ టూరిజం కౌంటర్ నుంచి బస్సు బయలు దేరుతుందని, ఆసక్తిగల వారు 8238449391, 0877-2289123 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

తెలుగువారి వెన్ను విరిచిన టీఆర్‌ఎస్‌తో జగన్ బంధం దుర్మార్గం
* ఎమ్మెల్యే సుగుణమ్మ
* బీసీలకు తీరని అన్యాయం చేసింది టీఆర్‌ఎస్
* తుడా చైర్మన్ నరసింహ యాదవ్ ధ్వజం
తిరుపతి, జనవరి 18: రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి సహకరించకుండా తెలుగువారి వెన్ను విరిచిన కేసీఆర్‌తో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకోవడం దుర్మార్గమని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ మండిపడ్డారు. తుడా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్వర్గీయ ఎన్‌టి రామారావు స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమానికి, రాష్ట్భ్రావృద్ధికి పాటుపడుతున్నారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన మంత్రులు, నాయకులు రెచ్చగొట్టేలా సంస్కార హీనంగా మాట్లాడటం సరికాదన్నారు. దేశ చరిత్రలోనే సంస్కారంలేని సీఎంగా కేసీఆర్, ఆయన మంత్రులు నిలిచిపోతారని చెప్పారు. వారికి సంస్కారవంతమైన భాష రాదా, తెలియదో అర్థం కావడంలేదన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఏపీలో అవినీతి చక్రవర్తి జగన్‌ను కలుపుకోవాలని చూడటంతోనే వారి వాస్తవ రూపాలు బట్టబయలు అవుతున్నాయన్నారు. సమైక్యాంధ్ర ప్రదేశ్‌ను తన స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ విడగొడితే, జగన్ తన స్వార్థం కోసం రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. తుడా చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు రాజకీయ బిక్ష పెట్టిన టీడీపీపై విమర్శలు చేయడం తల్లిపాలు తాగి రొమ్మును గుద్దినట్లు ఉందన్నారు. సీఎంను విమర్శించే స్థాయి, ఏపీలో బీసీలకు జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రశ్నించే స్థాయి తలసాని శ్రీనివాస యాదవ్‌కు లేదన్నారు. యాదవులకు ఇప్పటి వరకు ఏపార్టీ చేయని సహకారం, అభివృద్ధికి కృషి చేసింది చంద్రబాబు నాయుడని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేలా తలసాని మాట్లాడటం హేయకరమన్నారు. తలసానికి బీసీలపై అంతప్రేమ ఉంటే తెలంగాణలో బీసీలకు కేసీఆర్ చేసిన అన్యాయంపై ప్రశ్నించాలన్నారు. ఏపీ ప్రభుత్వం అందించిన విద్యుత్‌కు ఇప్పటి వరకు బకారుూలు చెల్లించకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను ఒప్పించి ఏపీకి బకారుూలను ఇప్పించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్, నేడే తాను పోరాడి ప్రత్యేకహోదా తెప్పిస్తానంటే నమ్మేంత అమాయకులు తెలుగువారు కాదని చెప్పారు. తన స్వార్థం కోసం, కేంద్రంలో బీజేపీని కాపాడేందుకే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ పార్టీలను ఏకం చేసి, బాబును వాటికి దూరం చేయాలని ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాడన్నారు. ఆ కక్షతోనే నేడు వైకాపా అధినేతను ఫ్రంట్‌లోకి ఆహ్వానించడం, బాబుపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇవేవీ తెలియకుండా తలసాని శ్రీనివాస యాదవ్ సైతం గుడ్డిగా విమర్శలు చేయడం మానుకోవాలని నరసింహ యాదవ్ హితవు పలికారు.