చిత్తూరు

రైతులు, నిరుపేదల సంక్షేమమే టిడిపి ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెదురుకుప్పం, జూన్ 12: గ్రామాలలోని రైతులు మరియు నిరుపేద కుటుంబాల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల వారి సహకారంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రభంజనాన్ని సృష్టించి అధికారం చేపట్టిందన్నారు. అలాంటి కుటుంబాల జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా ఆ రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కాపు కార్పొరేషన్ ద్వారా దళితుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టారని, దీనిపట్ల ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలోని ప్రతి నిరుపేద కుటుంబానికి పనులు కల్పించి వేతనాలను సక్రమంగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ రుణమాఫీ పట్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దశల వారీగా మాఫీ ప్రక్రియను చేపట్టడం జరుగుతుందన్నారు. వరి ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పించి రైతు నుంచి ప్రభుత్వం నీరజ ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. నల్లబెల్లంను సైతం దళారీలతో ప్రమేయం లేకుండా ప్రభుత్వమే కొనుగోలుచేస్తూ రైతులకు సక్రమంగా నగదును వారి వ్యక్తిగత ఖాతాలకు నేరుగా చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియ వల్ల ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేనప్పటికీ రైతు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పలు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, వాటిని సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరువు కాలంలో పంటలు కాపాడుకునేందుకు ఉపాధి హమీ పథకం ద్వారా ప్రభుత్వం నీటి కుంటలు ఏర్పాటుచేసుకునేందుకు నిధులు కేటాయిస్తున్నదని అన్నారు. ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలోని రైతులు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ వ్యవసాయం మరియు పాడి రంగాలపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని, ఈ రెండు రంగాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ సాగుబడి వ్యయం రెట్టింపు స్థాయిలో పెరిగినందున బ్యాంకర్లు అదనపు రుణాలు చెల్లించాలని, రుణ పరిమితిని సైతం గణనీయంగా పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల ఏర్పాటు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. మహిళా సంఘాల ప్రతినిధులు ఆర్థికంగా , రాజకీయంగా, సామాజికంగా వారు అభివృద్ధి చెందే విధంగా పలు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని చెరువులను నీరు-మీరు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడం వలన ఇటీవల కురిసిన వర్షాలకు నీటి నిల్వలు పెరిగాయని తెలిపారు. జన్మభూమి కమిటీ సభ్యుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందేలా చూడాలన్నారు. సంక్షేమ పథకాల అమలుపరచడంలో జన్మభూమి కమిటీ సభ్యులు ఏకపక్షంగా వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురాకూడదన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మోహనమురళి, వెదురుకుప్పం చంద్ర, మాజీ ఎంపిపి దేవరాజులు రెడ్డి, జగన్నాథరెడ్డి, బాబునాయుడు, లోకేష్ రెడ్డి, వెంకటేష్, శ్రీరామ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

తిరుమలలో ఇఓ, జెఇఓ నిరంతర తనిఖీలు
తిరుమల, జూన్ 12: గత మూడురోజులుగా తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ దృష్ట్యా టిటిడి ఇఓ డాక్టర్ డి సాంబశివరావు, తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు తిరుమలలోని అనేక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతున్న కారణంగా తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇ ఓ డాక్టర్ సాంబశివరావు పాత అన్నదాన ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కామన్ లగేజి సెంటర్‌లోను, కాలిబాట భక్తులకు లగేజీలు అందించే జిఎస్‌పి టోల్‌గేట్ లగేజి సెంటర్‌లో తనిఖీలు నిర్వహించారు. ఇంకా త్వరితగతిన లగేజిలు అందిచే విధంగా చర్యలు చేపట్టాలని అక్కడి విజిలెన్స్ అధికారులు విమలకుమారి, ఎవిఎస్‌ఓ లు వెంకటాద్రి, చిరంజీవులుకు పలు సూచనలు చేశారు. అక్కడ భక్తులతో ముచ్చటించి వారికి అందుతున్న సౌకర్యాలను గురించి వాకబు చేశారు. అనంతరం రూ.300 కాంప్లెక్స్‌లో కూడా తనిఖీలు నిర్వహించి భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. కాగా తిరుమల జె ఇ ఓ కె.ఎస్ శ్రీనివాసరాజు నారాయణ గిరి ఉద్యానవనాలతో సర్వదర్శనం మరియు కాలిబాట భక్తుల క్యూలైన్లను తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాలిబాట భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు తగిన రీతిలో అందుతున్నట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.

ఐసిడిఎస్‌ను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది
* యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ విమర్శ
తిరుపతి, జూన్ 12: ఐ సి డి ఎస్‌ను నిర్వీర్యం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నుట్లు కనిపిస్తోందని ఏపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ విమర్శించారు. తిరుపతిలో జరుగుతున్న యూనియన్ జిల్లా మహసభల్లో రెండవ రోజైన ఆదివారం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలు సరిగా నిర్వహించకపోవడానికి ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు. ఇందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్న కారణంగానే ఐసిడిఎస్ ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహించలేక పోతున్నారని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని, ప్రీస్కూల్ మెమో నె.3211ను వెంటనే రద్దు చేయాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లోవౌలిక వసతులు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వాణిశ్రీ, నాయకురాండ్రు కాంచనమాల, అమ్మాజి, లక్ష్మీనరసమ్మ, నాగరాజమ్మ, శైలజ పాల్గొన్నారు.
యూనివర్శిటీల్లోని తాత్కాలిక సిబ్బందిని
శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి
* ఎయుఇడబ్ల్యూయు మహాసభల తీర్మానం

తిరుపతి, జూన్ 11: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో టైం స్కేల్, డైలీ వేజ్, కన్సాల్డేటెడ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి వారికి పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించాల్సిందేనని ఆల్ యూనివర్సిటీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ నాల్గవ రాష్ట్ర మహాసభలో నాయకులు తీర్మాణం చేశారు. గత రెండురోజులుగా తిరుపతి ఎస్వీయూలో జరుగుతున్న మహాసభలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడమే కాకుండా పిఎఫ్, ఇఎస్‌ఐ , ప్రమాద బీమా సౌకర్యాలు చేయాలని తీర్మానించామన్నారు. అలాగే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేయాలన్నారు. 10వ పీఆర్‌సి ప్రకారం కనీస బేసిక్‌ను అమలుచేయాలన్నారు. ఏ హోదాలో ఉన్న ఉద్యోగికైనా రూ.5 లక్షలు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, చనిపోతే రూ.5లక్షల పరిహారం, వారి కుటుంబంలో ఒకరికి అదే కేటగిరిలో ఉద్యోగం ఇవ్వాలని సభ తీర్మానించిందన్నారు. అగ్రికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీల్లో టైం స్కేల్ ఉద్యోగులకు హెచ్ ఆర్ ఎ, సిసి ఎ, కేడర్‌వైజ్ స్కేల్స్, లీవు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆర్టికల్చరల్‌లో కేడర్ వైజ్‌గా స్కేల్స్, లీవు సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్య, ప్రైవేటీకరణ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలన్నారు. ప్రైవేటు, విదేశీ యూనివర్సిటీలను అనుమతించకూడదన్నారు. కార్మిక చట్టాల్లో సవరణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మహాసభలు విజయవంతం కావడానికి సహకారం అందించిన వివిధ విశ్వవిద్యాలయాల్లోని వీసిలకు, రిజిస్ట్రార్‌లకు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

వైభవంగా ముగిసిన మహాభారత
ఉత్సవాలు
వెదురుకుప్పం, జూన్ 11: మండలంలోని దేవలంపేట, చెంచుగుడి గ్రామాలలో గత 15 రోజులుగా జరుగుతున్న మహాభారత ఉత్సవాలు ఆదివారంతో వైభవంగా ముగిశాయి. ఉదయం దుర్యోధన వధ కార్యక్రమం, సాయత్రం జరిగిన అగ్నిగుండ ప్రవేశంలోభక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సహకరించిన పరిసర గ్రామస్థులకు ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

‘అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలి’
చంద్రగిరి, జూన్ 12: అగ్రిగోల్డ్‌లో నగదు డిపాజిట్ చేసిన వాళ్లని మరియు అగ్రిగోల్డ్‌కు సంబంధించి ప్లాట్లు కొనుగోలుచేసిన వారిని, ఇతర అగ్రిగోల్డ్ బాధితులందరినీ రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలంటూ అగ్రిగోల్డ్ భూముల వద్ద బాధితులు ఆదివారం ధర్నాచేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రగిరి మండలంలో ముంగిలిపట్టు దళితవాడ వద్ద అగ్రిగోల్డ్ సంస్థ గతంలో 23 ఎకరాల 66 సెంట్ల స్థలంలో 437 ప్లాట్లు వెంచర్ వేసి వాటిని పలువురికి ప్లాట్లు పూర్తిగా అమ్మివేసింది. ఒక్కొక్కరు రూ.4లక్షల చొప్పున ప్లాట్లను కొనుగోలుచేశారు. అయితే అగ్రిగోల్డ్ దివాలాతీయడంతో వాటి భూములు, వ్యవహారాలకు సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నాయి. దీంతో అగ్రిగోల్డ్‌కు భూములమ్మిన రైతులు ఇదే అదునుగా భావించి భూములు దున్నడం ప్రారంభించారు. దీనిని తెలుసుకున్న గణేష్ వనం ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ అనే పేరుతో ప్లాట్ల కొనుగోళ్లందరూ పైపేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మా ప్లాట్స్‌మాకు ఇప్పించి అగ్రిగోల్డ్ చెప్పిన విధంగా ప్లాట్‌ను అభివృద్ధి చేసి మాకు సహాయ పడాలని, అటు హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు, ఇటు ప్రభుత్వానికి విన్నవిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లం కొండ శ్రీనివాసులు తెలిపారు.అందులో భాగంగా ఆ ప్లాట్స్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేసి ఈ ప్లాట్స్‌లోకి రైతులు రూకూడదంటూ బోర్టులు ఏర్పాటుచేశారు. ఆ ప్లాట్స్‌ను ఎవరూ ఆక్రమించుకోకుండా తాము కాపాడుకుంటామని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు సుమారు 1000 కోట్లు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించి ఉన్నందున ప్రభుత్వం అగ్రిగోల్డ్‌లో డిపాజిట్ చేసినవారికి, ప్లాట్లు కొనుగోలు చేసినవారికి తదితర బాధితులకు ప్రభుత్వం వారి వారి నగదు చెల్లించి అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అన్నారు. ఇందులో భాగంగా ప్లాట్స్ వద్ద ప్లాట్స్ కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేసుకొన్న పత్రాలను చేతిలో ఉంచుకొని నిరసన తెలిపారు. బోర్డును ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు శివరామప్రసాద్, రామారావు, లలితకుమారి తదితరులు పాల్గొన్నారు.

ఛానల్ ప్రసారాలు పునరుద్ధరించాలి
* విద్యార్థి సంఘాల డిమాండ్
తిరుపతి, జూన్ 12: ప్రభుత్వం నిలిపివేసిన ఓ ఛానల్ ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఎస్వీయూలోని విద్యార్థి సంఘాలు ఆదివారం వర్శిటీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నోటికి నల్ల రిబ్బన్‌లు కట్టుకుని తమ నిరసన తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో రెండు చానళ్లను మూసివేసినప్పుడు ఇది అప్రజాస్వామిక మన్న చంద్రబాబు నాయుడు, ఇప్పుడు తన ఏలుబడిలో ఓ ఛానల్ ప్రసారాలను ఆపివేయడం అరాచకమని ఆరోపించారు. ప్రజా సమస్యలను ప్రసారం చేస్తే అది ప్రభుత్వ వ్యతిరేక విధానమా అన్ని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు. ప్రజా స్వామ్యాన్ని, రాజ్యాంగ నిబంధనలు కాలరాస్తూ మీడియా వాణికి సంకెళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. ఇది మీడియా గొంతును కట్టిపడేయడమే అన్నారు. ఈకార్యక్రమంలో వైకాపా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వి.హరిప్రసాద్ రెడ్డి, ఎం ఎస్ ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు వెంకటస్వామి, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు జి.సుబ్రహ్మణ్యం, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి శశికుమార్, బి ఎన్ పి జాతీయ అధ్యక్షులు పోతులూరి మాసమయ్య, ఎన్ జె ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రదీప్, బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు మురళీమోహన్ యాదవ్ పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కాపుల సంక్షేమానికి కృషిచేస్తోంది
* జిల్లా టిడిపి ప్రచార కార్యదర్శి చింతగింజల శ్రీరామ్
పీలేరు, జూన్ 12: రాష్ట్ర ప్రభుత్వం కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి చింతగింజల శ్రీరామ్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర కాపునాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ దీక్ష చేపట్టడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాపులను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం వెయ్యికోట్లు నిధులను మంజూరుచేస్తూ ప్రత్యేక కాపుకార్పొరేషన్ ఏర్పాటుచేసి కాపులలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు సబ్సీడీ రుణాలను బ్యాంకర్ల ద్వారా ఇవ్వడం జరిగిందన్నారు. ముద్రగడ పద్మనాభం దీక్షవెనుక వై ఎస్ ఆర్ సి పి నాయకులు ఆయన్ను రెచ్చగొట్టి దీక్షను చేయాలని చెప్పడం దారుణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు కాపుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త కోట పల్లి బాబురెడ్డి, మండల కన్వీనర్ కేశవర్థన్, యూత్ కన్వీనర్ స్పోర్ట్స్ మళ్లి, నాయకులు సుబ్రహ్మణ్యం, శివ, లడ్డూజాఫర్ తదితరులు పాల్గొన్నారు.