చిత్తూరు

సహేతు విమర్శలు చేసినపుడే జర్నలిజం వృత్తికి సార్థకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 19: ఏ రంగంపై నైనా సహేతుమైన విమర్శలు చేసి వార్తాకథనాలను ప్రచురించినపుడే జర్నలిజం వృత్తికి సార్థకత చేకూరుతుందని అర్బన్ ఎస్పీ జయలక్ష్మి అన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్ష కార్యదర్శి గిరిబాబు, సుధీర్‌రెడ్డిల ఆధ్వర్యంలో మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా మీడియా, పోలీస్ వ్యవస్థలకు సమాజంలో ఉండాల్సిన బాధ్యతాయుతమైన అంశాలను నిర్మొహమాటంగా తెలిపారు. ఇందులో ప్రధానంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాపట్ల ప్రజల్లో అపారమైన నమ్మకాలున్నాయన్నారు. వాటని పరిరక్షించబడాలంటే పాత్రికేయులు వాస్తవాలతో కూడుకున్న వార్తాకథనాలు ప్రచురించాలన్నారు. వ్యక్తిగత కక్షలకు పాత్రికేయులు ఏ పరిస్థితిలోనూ దిగజారకూడదన్నారు. ఏ శాఖలో అయినా, ఏ ఉద్యోగిలో అయినా వారు పోలీసులా లేక ఇతర విభాగంలో పనిచేసే అధికారులా అన్నవాటితో సంబంధం లేకండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారన్నారు. అన్నింటిని గుర్తించే అవకాశం కొన్ని సందర్భాల్లో పై అధికారులకు కూడా లేకపోవచ్చన్నారు. అలాంటి వాటిని పాత్రికేయులు గుర్తించి వార్తారూపంలో ప్రచరిస్తే ఆ పొరపాట్లు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా పాత్రికేయ వృత్తికి కూడా ఒక సార్థకత చేకూరుతుందన్నారు. వ్యవస్థలో జరిగే అనేక సంఘటనలను ప్రపంచానికి తెలియజేసే పాత్రికేయులు సమాజం మెచ్చుకునేలా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక పాత్రికేయులు, పోలీసుల మధ్య బాధ్యతతో కూడుకున్న సంబంధాలు పెరిగినపుడు సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఇక ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి ప్రతి వ్యక్తి ఎవరికి వారు క్రమశిక్షణతో నడుచుకోవాలని, అందులోనూ బాధ్యతాయుతమైన వ్యవస్థలో ఉన్న పాత్రికేయులు మరింత దృష్టిపెట్టాలని ఆమె సూచించారు. వాహనాల పార్కింగ్‌కు సంబంధించి తిరుపతిలో తగిన సౌకర్యాలు లేవన్నారు. అందుకే టిటిడి, నగర పాలక సంస్థ సమన్వయంతో ఒక ప్రణాళికను రూపొందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో దుకాణాలు పెరిగినంతగా స్థలం పెరగదుకదా అన్నారు. ఉన్న స్థలంలోనే ట్రాఫిక్ వ్యవస్థను నియంత్రించడానికి తమ సిబ్బంది అహర్నిశలూ కృషిచేస్తున్నారన్నారు. ఇతర పట్టణాల్లో ఏదైనా దుకాణం ముందు ఒక వాహనాన్ని నిలిపితే వెంటనే ఆ యజమానులు గానీ, అక్కడున్న సిబ్బందికానీ ప్రశ్నిస్తారన్నారు. తద్వారా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోతుందన్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో అలాంటి వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతిలాంటి పుణ్యక్షేత్రంలో నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తూపోతూంటారన్నారు. ఈ క్రమంలో నేరాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయన్నారు. వీటిని నియంత్రించాలంటే పాత్రికేయులు, పోలీసుల మధ్య సమాచార వ్యవస్థ పరిపూర్ణంగా ఉండాలన్నారు. ఇక పోలీస్‌శాఖ తరఫున తాము నగరంలో పెద్ద ఎత్తున సిసి కెమెరాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో వి ఐపి ల తాకిడి ఎక్కువగా ఉంటుందన్నారు. దేశంలో అత్యంత ప్రముఖులు వచ్చినపుడు వారికి సంబంధించిన భద్రతాచర్యలు ఎస్పీజి కనుసన్నల్లో సాగుతాయన్నారు. అలాంటపుడు స్థానికంగా ఉన్న ఎస్పీ ఒక అధికారిగా మాత్రమే ఎస్పీజి ఆదేశాలను పాటించాల్సి ఉంటుందన్నారు. ఆ సమయంలో పాత్రికేయులు కూడా సహకరించాల్సి ఉంటుందన్నారు. గతంలో పాత్రికేయుల సంఖ్య పరిమితంగా ఉండేదని, నేడు ఆ సంఖ్య భారీగా పెరిగిందన్నారు.
ఇలాంటపుడు వి ఐ పిలు వచ్చినపుడు పాత్రికేయులు ఎస్పీజి ఆదేశాల ప్రకారం స్థానిక పోలీసులు పాటించే చర్యలకు సహకరించాలని ఆమె కోరారు. ఈసందర్భంగా ఆమె ప్రెస్‌క్లబ్ రూపొందించిన గుర్తింపుకార్డులను పలువురు పాత్రికేయులకు అందజేశారు. అనంతరం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ నాయకులు సురేంద్రరెడ్డి, నరేంద్ర, గురవారెడ్డి, నారాయణరెడ్డిలతో పాటు ఎపి యు డబ్ల్యుజె నాయకులు చంద్రశేఖర్ నాయుడు, మురళి పాల్గొన్నారు.