AADIVAVRAM - Others

ఏకాగ్రత ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఘవాపురంలో నివసించే రామయ్యకు ఎండుకట్టెలే జీవనాధారం. వాటి కోసం కష్టపడి అడవంతా గాలిస్తాడు. దొరికిన కట్టెల్లో చిన్నవాటిని విరిచి, పెద్ద దుంగల్ని గొడ్డలితో నరికి మోపులు కడతాడు. ఏ రోజు ఏరుకున్న కట్టెలు ఆ రోజే అమ్మేసి వచ్చిన సొమ్ముతో సంతృప్తిపడి ఇంటికెళ్లిపోతూ ఉంటాడు.
ఎండు చెట్లు దొరికే దాకా ప్రాణాలకు తెగించి మరీ అడవిలోకి చొచ్చుకుపోతాడు. అంతేకానీ తన ఆహారం కోసం పచ్చని చెట్లను నరకడు రామయ్య. పచ్చని చెట్లు ప్రాణమున్న మనుష్యులతో సమానం అని అతని ఉద్దేశం.
అయితే ఒకనాడు వెతగ్గా వెతగ్గా పెద్ద లావాటి మొదలున్న ఎండిన చెట్టు ఒకటి అతని కంట పడింది. దాన్ని చూడగానే ‘హమ్మయ్యా! వారం రోజుల వరకూ ఆహారానికి కొదవలేదు’ అనుకుని సంతోషపడుతూ చిన్నచిన్న కొమ్మల్ని ఒక పక్కగా పేర్చి లావాటి దుంగల్ని గొడ్డలితో నరకటం మొదలెట్టాడు.
అక్కడికి దగ్గర్లోనే ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు.
గొడ్డలి శబ్దాల వల్ల అతని ఏకాగ్రతకు భంగం వాటిల్లింది. పట్టలేని కోపంతో ఊగిపోయాడు. శబ్దం వచ్చే దిశగా ప్రయాణించి రామయ్యను చేరుకుని ‘నీకు బుద్ధుందా?’ అన్నాడు కోపంగా.
తెల్లబోయిన రామయ్య గొడ్డలి కిందపడేసి మునీశ్వరునికి నమస్కరించి ‘ఎందుకు స్వామీ?’ అని అడిగాడు వినయంగా.
‘నేను తపస్సు చేసుకుంటున్నాను. నా తపస్సును నీ గొడ్డలి శబ్దాలు భగ్నం చేసాయి...’
విషయం అర్థమైపోయింది రామయ్యకు.
‘నేను చేసేదీ తపస్సే స్వామీ...!’ అన్నాడు భక్తితో చేతులు జోడించి.
‘పుల్లలు కొట్టుకోవటం తపస్సు ఎలా అవుతుంది? హేళన చేస్తున్నావా? అయినా నాతో నీకు పోలికా?’ మరింతగా మండిపడ్డాడు మునీశ్వరుడు.
‘కోపం వద్దు స్వామీ. ఇది హేళన కాదు. నాదో సందేహం స్వామీ! దయచేసి కోపం మాని సమాధానం చెబుతారా?’
‘అడుగు...’ రౌద్రంగా అన్నాడు ముని.
‘మీరు దేనికోసం తపస్సు చేస్తున్నారో.. తెలుసుకోవచ్చా స్వామీ?’
‘ఆ మాత్రం తెలీదా? ఆ దేవదేవుని ప్రసన్నం చేసుకోవటానికి’
‘మీరు కనిపించని ఆ దేవదేవుని ప్రసన్నం చేసుకోవటానికి తపస్సు చేస్తున్నారు స్వామీ. కానీ నేను కనిపించే నా కుటుంబ సభ్యుల ఆకలి కోసం తపస్సు చేస్తున్నాను’
‘నాకే నీతులు చెబుతావా?’ ఉగ్రుడై పోయాడు మునీశ్వరుడు.
‘నిజం చెబుతున్నా స్వామీ. నా పనిలో నా వాళ్ల ఆకలి తప్ప, మరేదీ పట్టదు నాకు. ఏకాగ్రతతో నా పని నేను చేసుకుంటూ పోతాను. మీ తపస్సుకు భంగం కలిగితే మన్నించాలి’ అంటూ గొడ్డలి అందుకున్నాడు.
రామయ్య మాటలతో సిగ్గుపడ్డ మునీశ్వరుడు ఏకాగ్రతతో తపస్సు చేస్తే ఈ శబ్దాలేవీ తనని భంగపరిచేవి కావని భావించి వెనుదిరిగాడు.
చూశారా పిల్లలూ.. ఏ పని చేసినా ఏకాగ్రత ఎంత అవసరమో...

................................................................

పిల్లలూ! మీకు ఆడుకోవడానికి సమయం సరిపోవడం లేదా? అమ్మ ఎప్పుడూ చదువుకోండి, హోంవర్క్ చేసుకోండి అంటూ ఉందా? అయితే ఇలా వినండి. మీరు నేను చెప్పినట్టు గనుక చేశారో మీకు ఆడుకోవడానికి బోలెడంత టైమ్ మిగిలిపోతుంది.
* మొట్టమొదట మీరు చేయాల్సింది పొద్దునే్న సూర్యుడు రాక ముందే మీరు నిద్ర లేవాలి. అబ్బా! ఇది కష్టం అనుకొంటున్నారా. దీనికి ముందు రోజు మీరు త్వరగా బెడ్‌పైకి వెళ్లాలి. ఊఁ అని మూలుగుతున్నారా? అదిగో దానికీ ఓ చిట్కా చెబుతాను వినండి...
* ముందు మీరు నిద్ర లేవగానే బ్రెష్ చేసేసుకొని పాలు తాగండి. కాసేపు ముందు రోజు స్కూల్‌లో చెప్పిన పాఠాలు అన్నీ ఒక్కసారి చదువుకోండి. ఆ రోజు ఏవైనా టెస్టులు ఉంటే వాటి గురించి నెమరువేసుకోండి.. ఓ గంట చదువుకోండి. ఆ తర్వాత స్నానం పానం అన్నీ చేసుకోండి. మీరు స్కూల్ టైమ్‌కన్నా ముందే రెడీ అయిపోతారు. వెంటనే అమ్మా నాన్నా నేను రెడీ అనగలుగుతారు. అంతే మీ అమ్మ మిమ్మల్ని మెచ్చుకుంటుంది కదా..
* స్కూల్ నించి రాగానే ముందు కాళ్లూ చేతులు కడుక్కోండి. స్కూల్ యూనిఫామ్ మార్చుకోండి. ఏదైనా మీ కోసం దాచింది, లేదా మీ కోసం తయారుచేసి పెట్టింది హాయిగా కూర్చుని మీ అమ్మకో లేక అమ్మమ్మకో, లేక మీ నాన్నమ్మకో స్కూల్ కబుర్లు చెబుతూ వాటిని తినండి. అలా తినేసాక మీ టీచర్స్ ఏం హోంవర్క్ చెప్పారో మీ అమ్మతో చెబుతూ వాటిని పూర్తి చేయండి. అప్పుడు మీ అమ్మనే కాసేపు ఆడుకోని రండి అని చెబుతుంది.
అప్పుడు ఎంచక్కా ఆడుకోవడానికి మీ స్నేహితులను పిలవండి.. మీకిష్టమైన ఆటలు క్రికెట్ లేక కోడు బిళ్లనో, కబడ్డీనో, ఇలా ఎన్నో ఆటలు మీకిష్టమైనవి గంట లేక రెండు గంటలు ఆడుకోండి. స్నేహితులతో మంచి కథలు చెప్పండి. ఆ తరువాత ఇంటికి రండి. కాళ్లూ చేతులు కడుక్కొని రాత్రి భోజనం చేసేయండి. కాసేపు కూర్చుని ఆ రోజు చదువుకోవాల్సిన పాఠాలను చదువుకోండి. కాసేపు టీవీ చూడండి. రాత్రి హాయిగా నిద్రపోండి. నిద్రపోయే ముందు రోజూ ఒక గ్లాసు పాలు తాగండి. హాయిగా నిద్రపడుతుంది. తెల్లవారగానే మీకు అలారం లేకుండానే మెలకువ వచ్చేస్తుంది. మీరు రాత్రి పడుకునేటప్పుడే మీ మైండ్‌కి చెప్పండి ఇన్ని గంటలకు లేవాలని. అంతే మీకే మెలకువ వచ్చేస్తుంది. మళ్లీ మామూలే... సరదా సరదాగా.. ఓకేనా..
-మీ తాతయ్య
జంగం శ్రీనివాసులు

బాలభాష

చదువుసందెలు

విఘ్నమ్ము లేకుండ
విద్య నియ్యవయ్య
విఘ్నేశ్వరుడ నీకు
వేయి దండాలు.

ఉంగరమ్ములు పెట్టి, ముంగురులు దువ్వి
ఒద్దపెట్టుకు తల్లి ముద్దులాడింది;
పలక బలపములిచ్చి, పద్యాలు పాడి,
సరసపెట్టుకు తండ్రి చదువు నేర్పాడు.

చదువుకో నాయన్న! చదువుకో తండ్రి!
చదువుకొంటే నీకు సౌఖ్యమబ్బేను!
ఆడుకో నాయన్న! ఆడుకో తండ్రి!
ఆడుకొంటే నీకు హాయి కలిగేను!

పిల్లలందరు రండి
బళ్లోకి పోయి
చల్లన్ని గాలిలో
చదువుకుందాము.

విసరూ విసరూ గాలి
విసరవే గాలి
మల్లెపూవుల గాలి
మామీద విసరు.

అరటిపండూ తీపి, ఆవుపాల్ తీపి
మాచిన్ని అబ్బాయి మాటల్లు తీపి

చదువంటె అబ్బాయి
చండికేశాడు
బద్దెపలుపా రావె
బుద్ధి చెప్పాలి

చదువంటె అబ్బాయి
సంతోషపడును
అగసాలి రావయ్య
నగలు చెయ్యాలి.

పొరుగు పిల్లలతోను
పోట్లాడబోక;
ఇరుగు పిల్లలతోను
యేట్లాడబోక.

చక్కగా నీ చదువు
చదువుకో తండ్రి!
చదువుకొంటే నీకు
సౌఖ్యమబ్బేను.
*

పొడుపు కథ
నిలబడితే
నిల్చుంటుంది
కూర్చుంటే
కూలబడుతుంది

జవాబు: నీడ

మంచి మాట

ఎప్పుడూ
ఆనందంగా ఉండేవాళ్లే
విజేతలుగా నిలుస్తారు.
-రమణమహర్షి

సామెతలు
* అభ్యాసం కూసువిద్య
* అత్తా ఒకింటి కోడలే
* అడవికాచిన వెనె్నల
* అడిగేవాడికి చెప్పువాడు లోకువ
* అచ్చి పెళ్లి బుచ్చి చావుకు వచ్చిందట
* అంత్య నిష్ఠూరంకన్నా ఆది నిష్ఠూరం మేలు
* అంగట్లో అన్నీ ఉన్నాయి. అల్లుడి నోట్లో శని ఉంది
* అత్తలేని కోడలుత్తమురాలు,
కోడల్లేని అత్త గుణవంతురాలు
* అందితే జుట్టు అందకపోతే కాళ్లు
* అగ్నికి వాయువు తోడైనట్లు
* అనువుగాని చోట అధికులమనరాదు
* అప్పిచ్చినవాడు బాగు కోరతాడు
తీసుకున్నవాడు చెడు కోరతాడు
* అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు
* ఆకాశానికి నిచ్చెన వేసినట్లు
* ఆడదాని మాట నీటిలో మూట ఒకటేనట

-కనె్నగంటి అనసూయ