రాష్ట్రీయం

డేగకళ్లు చూస్తున్నాయి.. జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: టిడిపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసి, రాజకీయంగా లబ్ధిపొందేందుకు ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వైకాపా అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని, అందువల్ల మంత్రులంతా ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో అజండా ప్రకారం అధికారిక అంశాలపై చర్చ పూర్తయిన తర్వాత రాజకీయ అంశాలపై చాలాసేపు చర్చ జరిగిందని తెలిసింది. ఈ సందర్భంగా ఇష్టాగోష్టిగా చంద్రబాబు మాట్లాడుతూ, విపక్ష నాయకుడు అధికారంలోకి రావాలని తపన పడుతున్నారని, అలాంటి అవకాశం మనం ఇవ్వకూడదన్నారు. ప్రతీ విషయాన్ని రాజకీయ లబ్ధికోసం ప్రయత్నించడం రివాజుగా జగన్ పెట్టుకున్నారని ఆరోపించారు. గోదావరి నీటిని కృష్ణాకు తరలించి, కృష్ణాడెల్టా భూములకు ఖరీఫ్‌లో ముందుగా నీటిని అందించేందుకు ఉద్దేశించి ‘పట్టిసీమ’ ప్రాజెక్టు చేపడితే, దాన్ని జగన్ రచ్చ రచ్చ చేశారని చంద్రబాబు అన్నారు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతికోసం అంతర్జాతీయ స్థాయిలో మంచినగరంగా తీర్చిదిద్దేందుకు భూసేకరణ చేస్తే, రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు జగన్ ప్రయత్నించారని గుర్తు చేశారు. ఇటీవల కాపు రిజర్వేషన్ అంశాన్ని కూడా రాజకీయ లబ్ధికోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నించారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మాణం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తవకముందే ఇందులో అక్రమాలు జరిగాయని అప్పుడే వైకాపా యాగీ చేయడం ప్రారంభించిందని అన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వపరంగా తెలిసో, తెలియకో ఏదైనా పొరపాటు జరిగితే ప్రభుత్వాన్ని బజారుకు ఈడ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు హెచ్చరించారు. అందువల్ల ప్రభుత్వపరంగా తీసుకునే కార్యక్రమాలు, పథకాలతోపాటు నిధుల విడుదల, వినియోగం సందర్భంగా తీసుకునే చర్యలను ఒకటికి నాలుగు పర్యాయాలు పరిశీలించాలని ఆయన సూచించారు. ఎక్కడా ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని, ఏవైనా తప్పులు జరిగితే మంత్రులే బాధ్యత వహించాల్సి వస్తుందని బాబు హెచ్చరించారని తెలిసింది. ప్రజలు 2014 ఎన్నికల్లో మనకు అధికారం అప్పగించారని, ప్రజల అభిప్రాయం, అవసరాల మేరకే ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించాల్సి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, సమజాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని, గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు ఏవైనా పనులపై మీవద్దకు (మంత్రుల) వస్తే, జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వపరంగా మనం నిజాయితీగా పనిచేస్తూ వెళితే, జగన్ రాజకీయ అవసరాలకోసం గొడవ చేసినా ప్రజలు పట్టించుకోరని బాబు పేర్కొన్నట్టు తెలిసింది.