డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఊ.. చెప్పు. నువ్వు చెప్పడం పూర్తయితే నేను చెప్పవలసింది కూడా ఉంది నీతో!’’ అన్నాడు సామ్రాట్.
‘తాను చెప్పబోయే మాటల ప్రభావం అతడు తనకు చెప్పాలనుకుంటున్న విషయం మీద ఏమైనా ఉంటుందా?’ అని ఒక్క క్షణం ఆలోచించి, చివరకు అంది సామ్రాజ్ఞి, ‘‘మీరలా ఊరెళ్లగానే నేనూ మా పుట్టింటికి వెళదామని బయలుదేరాను..’’ అని ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాల్ని ఏదీ దాచకుండా తన మానసిక సంఘర్షణతో సహా స్పష్టంగా వివరించింది సామ్రాజ్ఞి. సామ్రాజ్ఞి చెప్పిన విషయాల్ని మామూలు పరిస్థితుల్లో అయితే తను వేరే విధంగా అర్థం చేసుకునేవాడేమోగానీ సాహిత్యతో తన పరిచయం, తరువాతి అనుభవాలు, ముఖ్యంగా ఆమెతో వైజాగ్ వెళ్లిరావడం.. ఇవన్నీ సామ్రాట్‌కు మగాడి బలహీనతను కూడా ఆడది తన బలంతో ఎలా బలోపేతం చేయగలదో తెలియచెప్పడంతో- ఏమీ దాచకుండా సాహిత్యతో తనకు పరిచయం అయినప్పటినుంచి తనూ సాహిత్యా విశాఖపట్నం వెళ్లడం వరకూ అంతా వివరంగా చెప్పాడు.
అతడు చెప్పింది ఊపిరి బిగబట్టి విన్న సామ్రాజ్ఞి అతడి దగ్గరగా జరుగుతూ అంది, ‘‘ఇహనుంచీ మీ స్నేహితురాల్నీ, పెళ్లాన్నీ, ప్రేయసినీ అన్నీ నేనే!’’
ఆమెను దగ్గరకు తీసుకుంటూ, ‘‘అంతా మనసు మాయ సామూ.. మున్ముందు నువ్వు పుట్టింటికి ఒంటరిగా వెళ్ళే అవసరం ఎప్పుడూ రాదు. నువ్వు నా ప్రేయసివైన తర్వాత నాకు వేరే వాళ్ళతో ఆనందం వెదుక్కుంటూ పొరుగూరు వెళ్లాల్సిన అవసరమూ ఇక ఎంత మాత్రమూ ఉండదు’’ అన్నాడు సామ్రాట్.
అతడి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, ‘‘నిజం చెప్పు.. సాహిత్య నాకంటే బావుంటుంది కదూ?!’’ అంటూ అతడికి మరింత దగ్గరగా జరిగింది సామ్రాజ్ఞి.
****
‘‘నీకో విషయం చెప్పాలి సాహిత్యా..’’ అన్నాడు గౌతమ్.
ఎటువంటి ఉపోద్ఘాతమూ లేకుండా కుండబ్రద్దలు కొట్టినట్లుగా విషయాన్ని మొహంమీద చెప్పే సహజ ధోరణికి భిన్నంగా ఆ రోజు అతడలా అనడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది సాహిత్యకు.
నవ్వుమొహంతో అతణ్ణి చూసి అంది సాహిత్య, ‘‘నేనూ మీకు చాలా ముఖ్యమైన విషయమొకటి చెప్పాలి. ముందుగా మీరు చెప్తారా? నన్ను చెప్పమంటారా?’’
‘‘అనుకున్నదేదైనా వెంటనే చేసెయ్యకపోతే నేనుండలేనని నీకు తెల్సుగా. నేనే చెప్తాను ముందుగా! ఆడదాన్ని ఒక భోగ వస్తువులానే చూసే నా మనస్తత్వాన్ని గురించి పునరాలోచించుకునే సంఘటన ఒకటి జరిగిందీ మధ్య’’ అంటూ సామ్రాజ్ఞితో తను ఒక రాత్రి హోటల్ గదిలో ఉన్న ఉదంతాన్ని వివరంగా చెప్పాడు గౌతమ్. అతడి వివరణనూ, విశే్లషణనూ విన్న సాహిత్య అంది, ‘‘ఆవిడెవరో ఐటెంటికీ క్రైసిస్‌తో బాధపడుతూ దాదాపు మీతో అనుభవం పొందే స్థితికి వచ్చిన తర్వాత మీరు మీ సహజ ప్రవర్తనకు భిన్నంగా సిద్ధార్థుడు, బుద్ధుడిలా మారినట్టుగా వ్యవహరించడం.. నిజంగా ప్రపంచ వింతే! అంతకంటే పెద్ద విశేషం.. మీరా అనుభవాన్ని నిజాయితీగా నాతో పంచుకోవాలని అనుకోడం’’ అంటూ ముందు నడిచి అతడి నుదుటి మీద ముద్దుపెట్టుకుని, సామ్రాట్‌తో తన పరిచం గురించీ, తన మానసిక ఒంటరితనం ఆ పరిచయాన్ని పెంచి పోషించడం గురించీ చెప్పి చివరగా సామ్రాట్‌తో తాను చేసిన ప్రయాణాన్ని కూడా ఏమీ దాచకుండా చెప్పింది. అంతా విన్న గౌతమ్ అన్నాడు, ‘‘ఆవిడతో నా ప్రయాణపుటనుభవం.. భర్తనుంచి తనకు కావలసింది దొరకని స్ర్తి మనసు తాత్కాలికంగానైనా ఎటువంటి ఆలోచనల వెంట పరుగు పెడుతుందో స్పష్టంగా తెలియచెప్పడంతోపాటు నేను నీ పట్ల ప్రవర్తిస్తోన్న విధానాన్ని పునఃస్సమీక్షించుకోమని చెప్పకనే చెప్పింది. ఇహ మనం చేయవలసిన పని ఒకటి మిగిలి ఉంది’’. ఏవిటన్నట్టు చూసింది సాహిత్య.
‘‘ఆ రాత్రి.. నా ఆలోచన్లో మార్పుకు కారణమైన సామ్రాజ్ఞి అనే ఆవిణ్ణీ, ఇంతకాలమూ నీ పట్ల నా బాధ్యతను తన భుజాలకెత్తుకుని తిరిగి క్షేమంగా నిన్ను నాకప్పగించిన నీ బాయ్‌ఫ్రెండ్‌నూ కల్సుకుని అభినందించడం’’ అన్నాడు గౌతమ్. గౌతమ్ మాటలు విన్న సాహిత్య ఆశ్చర్యపోతూ అంది, ‘‘మీకా రాత్రి ప్రయాణంలో తారసపడింది సామ్రాజ్ఞా?!’’
ఈసారి ఆశ్చర్యపోవడం గౌతమ్‌వంతైంది. ‘‘అవును తన పేరు సామ్రాజ్ఞి అనే చెప్పిందావిడ. ఆవిడ నీకు తెలుసా?’’
‘‘ఆ.. ఆవిడే కాదు.. ఆవిడ భర్త కూడా నాకు బాగా తెలుసు. అలానే మీరు నా బాయ్‌ఫ్రెండ్ అన్నారే.. ఆయన మీక్కూడా తెలుసు. సామ్రాట్, సామ్రాజ్ఞీ భార్యాభర్తలు!’’ అంది సాహిత్య. ఒక్క క్షణం నివ్వెరపోయి ఆ దిగ్భ్రమ నుంచి కోలుకున్నాక అన్నాడు గౌతమ్, ‘‘ఈ ప్రపంచం చాలా చిన్నదనడానికి మన రెండు జంటల ఉదంతాన్ని మించిన గొప్ప ఉదాహరణ ఏదీ ఉండబోదు. ఇంతకాలమూ నినె్నంతగా కోల్పోయానో అర్థమైంది నాకు. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేయ్! ఇహ నుంచీ ఇద్దరమూ కలిసే ఉందాం. సామ్రాట్ వంటి వాళ్లతో నీకు మళ్లీ కొత్త పరిచయాలేర్పడతాయని అనడంలేదు నేను. ఇహనుంచీ మనం భార్యాభర్తలం మాత్రమే కాదు స్నేహితులం కూడా!
జీవన ప్రయాణంలో మనకెంత ఎక్కువమందితో పరిచయమైతే మన ఆలోచనా పరిధి అంత విస్తృతమవుతుందని మనిద్దరికీ తెలుసిప్పుడు’’.గౌతమ్ మెడ చుట్టూ చేతులు వేసి అతడి మొహాన్ని దగ్గరకు లాక్కుంటూ, ‘‘అలాగే కానీ.. మీ మనసులోని మాట నిజాయితీగా చెప్పండి- సామ్రాజ్ఞా? నేనే? మా ఇద్దరిలో ఎవరందంగా ఉంటాం?!’’ అంది సాహిత్య.

సమాప్తం

సీతాసత్య