డైలీ సీరియల్

దూతికా విజయం-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను ఇరవై ఏళ్ళుగా ఎరిగిన మాధవీదేవి కాదీమె. ఈనాటి ఆమె ప్రవర్తన సరస్వతికి ఎంత ఆలోచించినా అంతుబట్టడంలేదు. రాణి తాను బైటపడకుండా గొప్ప నటనను ప్రదర్శిస్తోందనే సంగతి సరస్వతికి తెలుసు. నిన్న సాయంత్రం వరకూ మామూలుగా వున్న రాణిలో ఇంత గొప్ప మార్పు ఒక్క రాత్రిలో ఎలా వచ్చిపడిందో సరస్వతి ఊహకు అందడంలేదు.
ఏదో గొప్ప విషమ సమస్య మనసు పీడించి, పిండివేసేదే ఆమెను బాధపెడుతూండి ఉండాలి. తన ఆందోళన బహిర్గతం కాకుండా రాణి ఎంత చాకచక్యంతో సమర్థించగలదో చూడాలి.
తనవలెనే ఆమె స్థితిని ఇతరులు - ముఖ్యంగా ధర్మపాలుడు గ్రహించినట్లయితే లేనిపోని విచారణలూ, సంజాయిషీలూ అనవసరమైన రభసా తప్పవు. అందుకని చిన్నరాణి మనస్సును వినోద కార్యక్రమాల మీదికి మళ్లించే ప్రయత్నాలు విశేషంగా అనుసరించవలసి ఉంటుంది. అసలు సంగతి తెలుసుకున్నాక పరిష్కారాలు ఆలోచించవచ్చు. తన చాకచక్య ప్రదర్శనకు సమాయమాసన్నమైనదని గ్రహించింది సరస్వతి.
2
పోటీలు ఆరంభించవచ్చని రాజాజ్ఞ అయంది.
ముందుగా బలప్రదర్శన పోటీలు మొదలైనవి. వేదికమీదకు ఎక్కి తన కండరాల్ని చూపుతూ శరీరంలోని వివిధ భాగాలకు వాటిని బదిలీ చేస్తూ, శారీరక ప్రదర్శన జరిగింది. మొత్తం ఎనిమిదిమంది ఇందులో ఉన్నారు. ఏడోవాడుగా వచ్చిన పాతికేళ్ళ యువకుడు అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.
కండరాలు పెంచిన శరీరాల్లో అవి అలవిమాలిన పరిమాణానికి పెరిగి, సహజ శారీరక సౌందర్యాన్ని ధ్వంసం చేయడం సర్వసామాన్యం. ఎక్కడ ఎంతవరకూ పెరుగుతూ తూకంగా శరీర సౌందర్యం చెడకుండా ఉండగలదో అంతవరకే పెంచడమనేది వ్యాయామం చేసేవాడి చెప్పుచేతల్లో ఉండదు. కండలు పెంచడం ఒక్కటే అతనికి తెలుసు. వాటిని పెంచడంతోనే తన బాధ్యత తీరినట్లు అతను భావిస్తాడు. ప్రతి సంవత్సరమూ చూసే వికృతాకారాలకూ ఈనాడు రుూ యువకునిలో చూస్తూన్న శారీరక సౌందర్యానికీ ఎంతో వ్యత్యాసం వున్నది. దేన్నయితే చూస్తామని భావించి, ఊహించిన దృష్టికి ఈ యువకుడు గొప్ప ఆశాభంగాన్ని సృష్టించాడు.
ఇతర ప్రేక్షకుల సంగతి అలా ఉంచి మాధవీదేవిని పరిశీలనగా మనం చూస్తున్నట్లయితే, ఆ యువకుని బలప్రదర్శన ఆరంభమవగానే ఆమె ముఖకవళికలు క్షణంలో మారినవి. ముఖంలోని దైన్యమూ, దిగులూ మాయమై వాటి స్థానే ఎంతో ఆనందమూ, ఉత్సాహమూ ఉట్టిపడినవి. ఆ వికారాలను తనలో ఇముడ్చుకోలేకనేమో మాధవీదేవి ఒక దీర్ఘనిశ్వాసం ద్వారా కుదుటబడింది.
ఇదంతా గమనిస్తూన్న సరస్వతి మెల్లిగా తన చేతిని మాధవీదేవి వీపుమీద వేసి మునివేళ్ళతోనే హెచ్చరించింది. నోటితో మాట్లాడవలసిన అవసరం లేనప్పుడు, లేదా అవకాశం లేనప్పుడు తదితర శరీరాంగాల ద్వారా తమ భావాలను వ్యక్తం చేయగల సామర్థ్యం సామాన్యులకు ఉండదు. మాధవీదేవి, సరస్వతీ కూడా సామాన్యుల కోవకు చెందినవారు కాకపోవడంవల్లా, ఉభయుల విజ్ఞాన వికాసాలూ, లోకజ్ఞానమూ, సంస్కృతీ సమాన మట్టాల్లో ఉండటంవల్లా వారికది సుసాధ్యమైనది.
మాధవీదేవి మెరుపువలె ఒక్కసారి సరస్వతి కళ్ళలోకి చూసి తల తిప్పుకున్నది. ఆ భాష వారిద్దరికీ తప్ప మరెవరికీ అర్థమవదు.
అంతే- సరస్వతి మెరుపుతీగవలె మాయమైంది. తరువాతి కార్యక్రమాలు ఆరంభమయ్యే సమయానికి తన స్థానానికి వచ్చేసింది. అతి రహస్యంగా రాణి చెవుల్లో, ‘వీరభద్రుడు’ అన్నది. రాణి ఎంతో సంతోషించినట్లు కనిపించింది.
ఆ తరువాత పటిష్టమైన ఉక్కు కడ్డీలను వొంచడంలో పోటీ జరిగింది. ఇందులో ఐదుగురు మాత్రమే పాల్గొన్నారు. ముగ్గురికి పరాజయమే ప్రాప్తించింది. నాలుగోవాడు నానా అవస్థాపడి వొంచాడు. ఐతే ఆ అలసటతో స్పృహ తప్పి పడిపోతే మోసుకొని వెళ్ళవలసి వచ్చింది.
చివరివాడుగా వీరభద్రుడు రంగస్థలం ప్రవేశించాడు. అతని ముఖం చూస్తేనే విజయాన్ని వెంట పెట్టుకొచ్చాడనిపిస్తోంది. అతనింకా ఉక్కు కడ్డీలను చేతితోనైనా తాకకముందే ప్రేక్షకుల హర్షధ్వనులు మిన్నుముట్టాయి. తనకు తెలియకుండానే మాధవీదేవి కూడా ప్రేక్షకులను అనుసరించింది. సరస్వతి హెచ్చరించనట్లయితే అసహ్యకరమైన పరిస్థితి ఏర్పడేదే!
అందరూ ఎందుకంత తొందరపడాలో సరస్వతికి అర్థమవలేదు. ఎంత మహామహుడైనా- ఏ క్షణంలోనైనా పరాజయంపాలు కావచ్చు. విజయుడయ్యాక అభినందించవచ్చు కదా! ఇప్పుడు వీరభద్రుణ్ణి రుూ ఉక్కుకడ్డీలే జయిస్తే ఎంతమంది మొహాలు మాడి, మసిబొగ్గులవుతాయో ఎవ్వరూ ముందుగా ఊహించలేరు కదా!
చిత్రం! వీరభద్రుడు అవలీలగా ఆ ఉక్కు కడ్డీలను వొంచివేసి, ఎంతోమందిని నిరాశనుంచి కాపాడాడు. అందరికీ ఎంతో ఆనందాన్నిచ్చాడు. తామిచ్చిన ఉత్సాహం అయోగ్యతకు అంకితమవనందుకు అందరూ హర్షించారు. ముఖ్యంగా చిన్నరాణి, ఆమెతోపాటు సరస్వతీను.
తరువాత నువ్వులు పిండి నూనె తీయటంలో పోటీలు. ఇందులో పదిమంది పాల్గొన్నారు. ఎంత ప్రయత్నించినా ఒక్క బొట్టుకన్నా ఎక్కువ నూనె పిండటం ఎవరివల్లా కాలేదు. తిరిగి వీరభద్రుని వంతు వచ్చింది. అతను వేదికమీదికి వస్తూండగానే తిరిగి కరతాళ ధ్వనులు విననైనవి. రుూసారి మాత్రం చిన్నరాణి ముందుగా హర్షించకుండా అతి ప్రయత్నంమీద నిభాయించుకుంది. అది గ్రహించి సరస్వతి మనసు కుదుటపడింది.
గుప్పెడు నువ్వులు వీరభద్రుని చేతిలో ఎంత ఆవేదనను అనుభవించాయో బొటాబొటా రాలిన వాటి కన్నీరే తెలియచెపుతూన్నది. రెండు క్షణాల్లో అతను అరచేతిని విప్పాడు. తైలంతో తడిసిన ఆ చేతిలో సూర్యకిరణాలు ధగధగా మెరిసిపోతూన్నవి. ప్రేక్షకులందరూ మరోసారి చప్పట్లు చరిచారు. ఇందులో చిన్నరాణితోపాటు ఆమె చెలికత్తె సరస్వతికూడా పాల్గొన్నది.
తరువాతి కార్యక్రమం మల్లయుద్ధం. బహుశా ఇందులో వీరభద్రుడు పాల్గొనడని మాధవీదేవి తలంచింది. ఒకవేళ అతను కూడా పాల్గొనేట్లయితే వరుసగా రుూ కార్యక్రమాల్లో పాత్ర వహించడంవల్ల ఎంతో అలసిపోయి ఓటమి ఎదురౌతుందేమోనని ఆమె గుండెలు గుబగుబలాడినవి. మల్లయుద్ధంలో వీరభద్రుడు పాల్గొనలేదు.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు