డైలీ సీరియల్

దూతికా విజయం-10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దయచేసి తలుపు వేసెయ్యండి!’’ అన్నది సరస్వతి ప్రార్థనా స్వరంతో.
‘‘ఎందుకూ? అసలు నీవెవరివీ? రుూ బ్రహ్మచారి మఠంలోకి రుూ రాత్రివేళ రావటమేమిటీ? ఎవరైనా చూస్తే ఇంకేమన్నా ఉన్నదా? నాతో నీకేం పనీ? వెంటనే జవాబు చెప్పి వచ్చిన తోవ చూసుకో!’’ అధికార స్వరంతో భయం వెన్నాడగా కలిగే తొందరపాటుతో ప్రశ్నల వర్షం కురిపించాడతను.
సరస్వతి మేలి ముసుగు తీసి నిజరూపాన్ని బైటపెట్టింది. తాను ఏవగించుకోవలసిన స్ర్తి కాదనీ, ఉత్తమాభిరుచులూ, విజ్ఞానమూ కలిగిన కోమలేననీ అతను అర్థం చేసుకునేందుకు అవకాశమిచ్చింది.
‘‘మీ ప్రశ్నలన్నిటికీ కాస్త తీరిగ్గా జవాబులు చెపుతాను. దయచేసి తలుపు మూయండి’’.
ఈమె సామాన్యురాలు కాదని వీరభద్రునికి అర్థమై ఉండాలి. తలుపు మూశాడు. ఐతే ఇంటి లోపలి భాగానికి దారితీయలేదు. అల్లంత దూరాన వున్న దివిటీ వెలుగు చెదురుతూ, బెదురుతూ అస్పష్టంగా కనిపిస్తున్నది. ఆమె అపాయకరమైన వ్యక్తి కాదనేది తేలిపోవటంతో వీరభద్రుని మనస్సు కాస్త కుదుటపడింది.
‘‘అలా వెలుగులోకి వెళ్దామా’’ అన్నది సరస్వతి.
‘‘తామెవరో?’’ అని నీళ్లు నమిలాడు వీరభద్రుడు. ఇప్పటికి తనలోని రాజసాన్ని గ్రహించి ఇవ్వవలసిన మర్యాద తప్పనిసరై, చెల్లించేందుకు వీరభద్రుడు సిద్ధమైనట్లు తోచిందామెకు.
‘‘రాణివాసపు రమణిని. పేరు సరస్వతి!’’ చిరునవ్వు ముత్యాలు పట్టు తివాసీలమీద దొర్లినంత సున్నితంగా మాటల్ని దొర్లించిందామె.
‘‘నమస్కారం!’’
సరస్వతి ప్రతినమస్కారం చేస్తూనే తాను ఉన్నత స్థానానికి తరుమబడిందనే విషయాన్ని గ్రహించింది. అర్థించవలసిన తాను ఆజ్ఞాపించగల స్థోమతకు ఎగబాకే అవకాశాలు చాలా ఉన్నవనిపించింది. తన రూప లావణ్యాలే గాక, తన శరీరం మీది విలువైన నగల ధగధగలకు బ్రహ్మచారి మూర్చబోయి ఉండాలి.
‘‘మరేం భయపడకండి!’’
తన ఇంటిలోకి వచ్చి తననే భయపడవద్దనే రుూ భామ తత్వం అతనికి అంతుబట్టలేదు. తను అరిచి గోలచేస్తాడని ఆమె అపోహపడి ఉండొచ్చు.
‘‘్భయం కాదు.. ఎవరో, ఏమిటో, ఎందుకో తెలియక గాభరా.. దయచేయండి’’ అని వీరభద్రుడు ఆమెను దివిటీ దగ్గరకు తీసుకువెళ్లి ఉన్నతాసనాన్ని చూపించాడు.
‘‘నేను స్ర్తిని. తమకు అపరిచితను. తామే ఆ ఉన్నతాసనంమీద కూర్చుంటే నేను ఇక్కడ రుూ జింక చర్మం మీద కూర్చుంటాను’’.
ఎంత సంస్కారం! ఎంత వినయం! సద్గుణరాశి అయి ఉండాలీమె! ఏ జాతి ఐతేనేమి? గొప్ప గుణాలను గౌరవించడం విద్యా వివేకాలున్నవారి విధి కదా!
‘‘మీరు నాకు అతిథులు.. అతిథిని సత్కరించే అవకాశాన్ని నాకు ఇచ్చి తీరాలి!’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘అలాక్కాదు. తాము జనప్రీతి పొందిన కళాకారులు. మహాపండితులు కూడా ననుకుంటాను. ఏమైనప్పటికీ తమను ఉన్నతాశీనుల్ని చేయవలసిన విధి నాకు ఉన్నది, నా కోర్కెను మన్నించ ప్రార్థన!
వీరభద్రుడు కరిగిపొయ్యాడు. ఈమె ఎందుకు వచ్చినట్లో అంతుబట్టలేదు.
‘‘తమకు నావల్ల కావలసిన సహాయం?’’
‘‘చిన్నరాణి తమ యోగక్షేమాలు విచారించమన్నది’
‘‘కృతజ్ఞుడ్ని’’
‘‘వ్యక్తిగతంగా ఆమె తమ కళాకౌశలాన్ని సత్కరించదలచి నా చేత తమకీ బహుమతిని పంపింది. స్వీకరించమని వేడుకుంటున్నాను’’.
సరస్వతి ఒక చిన్న సంచీని బొడ్డులో నుంచి తీసి అందించింది. దాన్ని అందుకుంటూనే దాని బరువును బట్టి అది సువర్ణమై ఉంటుందని వీరభద్రుడు గ్రహించాడు. లోపలి నాణాల శబ్దం కూడా రుూ విషయానే్న రుజూ చేసింది. తన తాహతుకు తగినట్లుగా రాణి బంగారు నాణాలు పంపక రాగివి పంపుతుందా?
ఈ మన్ననతో అతని మనసు ఆనందడోలికల్లో ఊగిసలాడింది. తన దారిద్య్ర పిశాచిని పారద్రోలేందుకు లక్ష్మీదేవే చిన్నరాణి అవతారాన్ని దాల్చి తనకు వరాలను ప్రసాదించినట్లనిపించింది.
‘‘రాణికి నా ప్రణామాలు, కృతజ్ఞతాపూర్వక అభినందనలందజేండి’’ అన్నాడు వీరభద్రుడు.
తాను వచ్చిన కార్యాన్ని గూర్చి వివరించటమెలాగా అని సరస్వతి మనసులో మథనపడుతోంది. సందర్భం లేకపోయినా, రాకపోయినా దాన్ని సృష్టించి తనకు కావలసిన మార్గానికి అతన్ని మళ్లించుకోవలసిన బాధ్యత తనకున్నది. దూతికాక్రియలో పాల్గొనటం తనకిదే మొదలు; బహుశా తుది కూడా అయితే బాగుండుననిపించిందామెకు.
‘‘మాటల్లోనేనా కృతజ్ఞత!’’ వీరభద్రుని ముఖ కవళికలేమిటోనని సరస్వతి చాలా పరిశీలనగా అతని ముఖంలోకి చూసింది.
‘‘రాణి నా నుంచి ఏదో ఆశిస్తోంది’’ అన్నాడు వీరభద్రుడు స్వగతంలోవలె- ఆ మాటలు సరస్వతికి వినిపించాలనే ఉద్దేశించాడనేది స్పష్టం చేశాడు. వీరభద్రుని చురుకుతనానికి సరస్వతి లోలోన హర్షించింది.
ఇతను వొఠ్ఠి మొద్దు, మొరటువాడు, మూర్ఖుడు అయినట్లయితే తాను సిగ్గువిడిచి, నోరు తెరిచి ముతక భాషలో మాట్లాడితేనే కాని అతనికి అర్థమై ఉండేది కదా. ఇపుడు అతని చురుకుతనంవల్ల తన పని సులభసాధ్యమేగాక సూచనలతో, అడ్డదారుల్లో, సంస్కారయుతంగా తన అభిప్రాయాలను- అంతకన్న రాణి కోర్కెలను తెలియజెప్పే అవకాశం వున్నది. చూడబోతే కులదేవతలందరూ కూడబలుక్కొని తనకీ రాత్రి సానుకూల వాతావరణానే్న సృష్టించేందుకు నడుములు బిగించినట్టున్నారు.
‘‘ఏదైనా కొలువిప్పిస్తే చిన్నరాణి సేవా తత్పరతలో శక్తివంచనలేకుండా ప్రాణాలను కూడా అర్పించి ధన్యుణ్నవుతాను’’ అన్నాడు వీరభద్రుడు ఒక్క క్షణం ఆగి.
‘కొలువు’ అనే పదానికి మారుగా ‘కొలుపు’ అనే దిద్దుబాటు ఉంటే సరిపోతుంది కదా అనుకున్నది సరస్వతి.
‘‘ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి’’ అన్నది సరస్వతి.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు