డైలీ సీరియల్

దూతికా విజయం-11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతో శ్రద్ధతో వీరభద్రుడు ఆమె ముఖంలోకి చూశాడు.
సరస్వతి చిలిపి కళ్ళను అటూ ఇటూ తిప్పి ‘‘దానాలన్నింటిలోకి పురుషుడు స్ర్తికి ఇవ్వగలిగిన ఉత్కృష్టదానమేది?’’ అని కొంటెగా అతన్ని కవ్వించింది.
ఆ చిలిపితనానికి చిలిపితనమే జవాబుగా ఉంటుందనే ఉద్దేశంతో ‘గర్భాదానం!’ అని వీరభద్రుడు కూడా మరింత కొంటెగా సవాలుగా సరస్వతి ముఖంలోకి తీక్షణంగా చూశాడు.
ఆ క్షణంలో సరస్వతి సిగ్గుపడి నేల చూపులు చూసింది. అతను చెప్పిన జవాబు తాను ఆశించినదే ఐనప్పటికీ, ఆ చెప్పిన ధోరణీ, ఉపయోగించిన కంఠస్వరం ఆమెలో ఎంతో గగుర్పాటును రేకెత్తించినవి. పురుషుని అహంభావమంతా, స్ర్తికి పైఎత్తునే ఉండి ఆమెను దిగదొక్కాలనే అధికార వాంఛనంతా మేళవించుకున్న ఆ పదాల పదును ఆమెను తీవ్రంగా గాయపరచింది.
మరో సందర్భమైతే వీరభద్రుని ముక్కు తన అరచేతి దెబ్బకు మొహంలో సమమట్టానికి దిగి ఉండేది. తగుదునని పురుషుడు స్ర్తికి గర్భాదానం చేయడంలోనే తన గొప్పనంతట్నీ ప్రకటిస్తూన్నట్లు మగజాతికి ప్రాధాన్యం ప్రధాన ప్రాతినిధ్యం వహించిన రీతిలో మాట్లాడినందుకు ఆమె మగువ మనసు మండిపడింది. ఐతే అది మరుక్షణంలోనే దానంతటదే చప్పగా చల్లారింది. ఎందుకంటే రుూ జవాబు కర్ణపుటాలకు వాడిములుకై తగిలినప్పటికీ, తాను ఆశించినదాన్ని, సిగ్గువిడవలేని తన ఆడగొంతులోంచి వెలికిరాని మాటల్ని వీరభద్రుని నోటినుంచి వెలువడేటట్లు చేయడంవల్ల తన మార్గం మరీ సుగమమైంది కదా!
‘‘తమనుంచి ఆశించిందదే!’’’ అన్నది సరస్వతి చూపుల్ని మరింతగా భూమిలోకి దిగదొక్కుతూ.
‘‘నీకేనా రుూ దానం!’’ అధికారంతోపాటు కంఠస్వరంలో హుందాతనం కూడా ప్రవేశించింది. తాను దాత స్థానానికి పోగానే, తనను యాచకురాలి స్థానానికి దిగదొక్కి, ఇంతకుముందు ‘మీరు’ అనే గౌరవ సంబోధనను, ‘నీవు’గా మార్చేశాడు! ఆడది కొంచెం సడలిస్తే ఆమెను మరింత కిందిలాగి తాను పైమెట్టునుండేందుకు వెనుక ముందులాలోచించని పురుషుని అక్రమం మరోమారు రుజువైంది. అందుకనే కదా తనకు మగజాతి అంటేనే మంట!
రాణి పేరు అడ్డం పెట్టుకొని, తానే రుూ దానాన్ని గ్రహించేందుకు వచ్చిందని వీరభద్రుడు భ్రమించి ఉండొచ్చు. ఇంకా నయం తానే గ్రహీతననుకొని ఇప్పుడే, ఇక్కడే ఈ దానానికి సంబంధించిన క్రియాకాండా, కర్మకాండా మొదలుపెట్టలేదు. ఎంత కుటిల స్వభావమో వీళ్ళది!
తొందరపడి వెంటనే సరస్వతి జవాబిచ్చింది. ‘‘అపచారం రాణిపట్ల ద్రోహం తలపెట్టడం నాబోటి చెలికత్తెకు అసాధ్యమైన భావం!’’
వీరభద్రుడు కాస్త చల్లారాడు. అంతలోనే తనకు పట్టబోయే అదృష్టాన్ని ఆకళింపు చేసుకోవటంతో అతని ముఖం క్రమంగా వికసిస్తూ కాంతివంతమవసాగింది. అదృష్ట దేవత పూనినందుకు ఏకాంతమైనట్లయితే నాట్యప్రదర్శన ఇచ్చి ఉండేవాడు.
ఎలాగో తనను తాను సంభాళించుకుంటూ ‘‘ఇపుడైతే ఆస్తిపాస్తులన్నీ హరించుకుపొయ్యాయి కానీ మా పూర్వీకులు దానకర్ణులు. దానాలకు మా వంశం ఎంతో ప్రసిద్దికెక్కింది!’’ అన్నాడు.
ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహించి అర్థించిన దానాల్లాంటివే అయి ఉండొచ్చేమో వీరభద్రుని వంశీకులు నడిపిన దానక్రతువులు? దాన్ని తర్కించటం వల్ల ప్రయోజనం లేదు. కాస్సేపు వీరభద్రుడు గర్వపడి ఆ మైకంలో తేలిపోతే, ఆ తన్మయతలోనే అతని ముక్కుతాడు పోసి తనను అనుసరించేట్లు చేయవచ్చునని సరస్వతి సరైన అంచనా వేసింది.
అందుకని అంగీకారసూచకంగా తల ఆడించిందామె.
‘‘సంతానగోపాలుని ఎంతో భక్తితో కొలిచింది మా రాణి. రాత్రి స్వామి ఆమెకు స్వప్నంలో కనిపించి, తాను తన అంశను తమలో ప్రవేశింపజేసి తమ ద్వారా భక్తురాలికి వరప్రసాదాన్ని అందజేస్తానని సెలవిచ్చారు. వెంటనే రాణి నన్నీ దౌత్యానికి నియోగించింది’’-
వీరభద్రుని విగ్రహం ఉబ్బితబ్బిబ్బయింది. సంతానగోపాలుడు అతని మనస్సనే కాళిందుని మీద భరతనాట్యం తొక్కుతున్నట్లనిపించింది. దేవాంశ ప్రకాశించిన శరీరంలోకి దివ్యశక్తులు దిగుమతై అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నవి.
‘‘ఆలస్యం- అమృతం విషం! అందులోనూ స్వామి ఆజ్ఞ అవనే అయింది. స్వామి కార్యనిర్వహణలో ఎలాంటి జాప్యాన్ని ఆ సంతాన గోపాలుడు సహించడు!’’
వీరభద్రుడు లేచి నాట్యమాడటమొక్కటే తక్కువైన రీతి తోచాడు సరస్వతికి. ఇప్పుడే సంతాన గోపాలస్వామిని కీర్తిస్తూ ఆయన ఆజ్ఞను చాటుతూ వీధినపడడు కదా! రుూ మగాళ్ళకు ఎంత తొందర! అందులోను ప్రణయ వ్యవహారాల్లో కాలాచక్ర వేగాన్ని కూడా ఓడించాలనే ప్రయాసతో ఎంతకైనా దుస్సాహసం చేస్తారు కదా!
‘‘అది నిజమేననుకోండి. మా రాణి స్వప్నం విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. మీకు బహుశా రుూరాత్రి స్వామి తన సందేశాన్ని ఆజ్ఞగా జారీ చేసి తీరుతాడనటం తిరుగు ఉండని మాట. నాకు ఎంత గాఢ విశ్వాసం లేకుంటే నేనీ ప్రమాదకరమైన పనికి ఒప్పుకుంటాను! బహుశా నాక్కూడా ఇవాళో రేపో సంతాన గోపాలస్వామి స్వప్నంలో సాక్షాత్కరించి దూతికా వ్యాపారానికి ఆజ్ఞ ఇవ్వవచ్చు’’.
‘‘మరి దీన్ని గూర్చి తర్కించటం దేనికి?’’ అన్నాడు వీరభద్రుడు చికాకు చూపుతూ. మదనగోపాలుడే ఆవేశించిన రీతిలో ఆవేశపడుతున్నట్లు తోచిందామెకు.
‘‘రాణివాసంలోకి ప్రవేశించమటంటే అంత తేలిక అనుకుంటున్నారా? ఎంత స్వామి ఆజ్ఞ అయినప్పటికీ, మిగతా ప్రజలను ముఖ్యంగా రాజుగారిని కూడా స్వామి ఆజ్ఞ అనే కారణంతో సమాధానపరచలేము. మీకేం ఘనస్వాగతం ఇచ్చి కన్యా విన్యాసాలతో ఆహ్వానిస్తున్నా రనుకుంటున్నారా?’’ ‘‘మరి?’’ అన్నాడు వీరభద్రుడు.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు