డైలీ సీరియల్

దూతికా విజయం-34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ గుంపులోకల్లా నేర్పరి ఐన నేరగాడ్ని చూసి మిగతా అందరూ వణికిపోతూంటారు. పెద్ద నేరం, చిన్న నేరాన్ని హరాయించుకుంటుంది.
ఐతే ఈ సందర్భంలో మాత్రం ఎవరి భాగాలను వారే నిర్ణయించుకున్నారు. కాలక్రమేణా- లేదా అవకాశాన్ని బట్టి తమ భాగం అధికంగా రావాలనే పేచీ మధ్యలో రావచ్చు. ఉదాహరణకు వీరభద్రుడు మరింత అధికంగా ప్రతిఫలాన్ని కోరవచ్చు. ఇప్పుడు జయపాలుడు తనను కోరటం లాంటిదే- అధికారాన్ని రాబట్టుకునేందుకు వేసే ఎత్తు!
చేసేదే చట్టవిరుద్ధమూ, న్యాయబాహ్యమైన పని కనుక, ఎవరు ఏది అడిగినా, అది ఎంత అన్యాయంగా వున్నప్పటికీ, దాన్ని ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు. ఈ దక్కేది కూడా చేయి జారుతుందేమోనని భయపడి వింత కోర్కెలను సహితం తీర్చవలసిన బాధ్యత, లేదా ఈ వ్యూహాన్ని అంతటితో తెగగొట్టి చేతులు కడుక్కోవటం లాటిది జరిగి తీరాలి.
ఇక తాను ఆశించిన స్వార్థం చాలా వింతయినదీ, ఎంతో లోతైనదీను. అందుకనే తనకూ, ఆ భగవంతునికీ మినహా మరెవ్వరికీ తెలియదు. భగవంతుడు ఎటూ నోరు మెదపడు; తాను చెప్పదు కదా! పైకి మాత్రం తన నిస్వార్థం వెల్లడవుతూనే వుంటుంది కనుక, తననెవ్వరూ అనుమానించరు. తనంటే సానుభూతి కూడా ఉంటుంది.
తన ప్రభు భక్తికి రాణి ఎంతో సంతోషించి తన మీది గౌరవ మర్యాదల్ని పెంపొందించుకుంటుంది. రాణి పరమ రహస్యం తెలిసిన తనకు, ఆమెమీద పరోక్షమైన అధికారం ప్రబలుతుంది. ఇంత గొప్ప త్యాగాన్ని తనకుగాను చేసిన కారణాన తనను తన రెండో ప్రాణిగానే రాణి భావిస్తుంది.
గర్భప్రాప్తి కాగానే వీరభద్రుడూ, ద్వారపాలకుడూ రంగం నుంచి శాశ్వతంగా విరమించక తప్పదు. మిగిలేది తను. రాణి ప్రణయ రహస్యం తెలిసిన వ్యక్తి. అవసరమైతే దాన్ని ప్రయోగించగల సామర్థ్యమున్న వ్యక్తి తనొక్కతే కనుక రాణికి తానంటే గడగడలాడే పరిస్థితి ఏర్పడక తప్పదు.
ఇప్పటికిప్పుడు తనకు జరిగే మేలేమీ లేదు. రాణి తనను బంగారంలో ముంచెత్తగలదు కాని ఆ ద్రవ్యాన్ని అనుభవించే సావకాశాలు లేవు. తన జీవితమే ఈ రాణివాసానికి అంకితమైపోయింది. ఐతే ఉత్తరోత్రా జరిగేదేమిటో తనకు స్పష్టంగా తెలుస్తూనే వున్నది.
తన పథకం మూడు పంచవర్ష ప్రణాళికలకు విస్తరించబడి వున్నది. రాణి కడుపు పండి ఆమెకొక కొడుకు పుడితే, రాణి కన్నతల్లి అయినప్పటికీ, తాను పెంపుడు తల్లి అవుతుంది. మూడో పంచవర్ష ప్రణాళికాంతంలో ఈ ముసలిరాజు పరలోకాలకు పయనమవటం, తన రుూ రాణి కుమారుడు సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది.
ఐతే అంత చిన్నవాడు సహజంగానే తన తల్లి సలహాల ప్రకారం పరిపాలిస్తాడు. అప్పుడు తాను కూడా రాజమాతతో సమానం. ఆ మాటకొస్తే రాజమాత కన్నా తన మాటకే ఎక్కువ విలువ వుంటుంది. ఎందుకంటే తల్లి మాట వినవలసిన రాకుమారుడు, తనమాట వినవలసిన రాజమాతను గమనించి, తన ఆధిక్యతను అంగీకరిస్తాడు. ఈ విధంగానే తన మాటలకే చలామణి అధికం. రాణి అంతరాంతాల్లో తనకు భయపడ్డదే కనుక, తన మాటకు ఎదురుండదు. ఈ విధంగా తన భాగాన్ని వడ్డీతో సహా రాబట్టుకుంటుంది!
తన ఈ ఆలోచనల సూచనలు కూడా ఎవ్వరికీ తెలియవు కనుక తన పథకానికి ప్రతిబంధకాలను ఏర్పరిచే అవకాశం ఎవ్వరికీ ఉండదు.
ఇంత గొప్ప తిమింగలాన్ని గురి చూసి తాను - అవసరమైతే తగిన ఎరను వేయవలసే వున్నది. అందుకనే అత్యవసర పరిస్థితుల్లో జయపాలునికి లొంగయినా సరే తన భాగాన్ని సాధించుకొనేందుక్కూడా వెనుకాడవలసిన పనిలేదని తను నిర్ణయించుకున్నది.
జయపాలుని దృష్టి మరల్చేందుకు ఇచ్చే లంచాన్ని, నూరు నాణాల నుంచి నూట యాభై చేసింది సరస్వతి. ఈ విధానం కూడా ఎల్లకాలమూ పనిచేస్తుందనే నమ్మకం లేదు. మాయ చేయటం, ప్రతిసారీ ఒకో కొత్త సాకు కనిపెట్టడం, అనుభవాన్ని కూడా నమ్మకుండా ఉండేట్లు సమర్థించటం మాటలుకాదనే విషయం తనకు తెలియకపోలేదు. తన శక్తియుక్తులే తనకు శ్రీరామరక్షగా ఉండగలవని ఆమెకో గుడ్డి నమ్మకం ఏర్పడింది.
***
ఆడవేషంలో వున్న వీరభద్రునితోపాటు సరస్వతి దక్షిణ ద్వారాన్నిదాటి కోటలోకి ప్రవేశించింది. మామూలుప్రకారం జయపాలుడు దివ్వెనార్పకపోవటం ఆమెను ఆశ్చర్యపరిచింది. బహుశా మరిచిపోయి ఉంటాడేమోనని ఆమె సరిపెట్టుకున్నది.
‘‘ఎవరూ?’’
‘‘నేను చిన్నరాణి ప్రియసఖి సరస్వతిని’’
‘‘ఆమె ఎవరు?’’
‘‘నా చెల్లెలు శారద’’.
‘‘రాజానుమతి ఉన్నదా?’’
‘‘ఇదిగో’’
ఆమె అందించిన గుడ్డ సంచీ అందుకున్నాడు జయపాలుడు. అంతా పాత పాటే కదానని అతను ‘వెళ్ళవచ్చు’అని అనకుండానే ఆమె వీరభద్రునితో సహా ఉద్యానవనంలోని చెట్ల చాటుకు వెళ్లింది. జయపాలుడు తమను అనుసరిస్తున్నాడని తెలుసుకోగానే ఆమె అక్కడే ఆగింది.
‘‘ఎంత?’’ అన్నాడు జయపాలుడు.
ఎన్నడూ అడగని ప్రశ్న అది!
‘‘నూట యాభై!’’
ఈ ప్రకారం వీడికీ దాదాపు తనకు గిట్టినంతా గిట్టుబాటవుతున్నదని వీరభద్రుడు మనసులో లెక్కకట్టుకున్నాడు. తన ప్రతిఫలం కూడా పెంచవలసిన అవసరం ఏర్పడిందా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనీ, తైలమున్నంత వరకే దీపం వెలుగుతుంటుందనీ, తారాబల చంద్రబలాలు ఎప్పుడు తన జీవితాకాశం నుంచి విరమిస్తవో తెలియవు కనుక, తొందరపడకుంటే ప్రయోజనం లేదనే జ్ఞానం అతనిలో వెలగసాగింది.
‘‘ఇంతేనా?’’ అన్నాడు జయపాలుడు.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు