డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మళ్లీ అలానే మాట్లాడ్తున్నావు నువ్వు. నేను మీతో రావడానికి సాకులు చెప్పే స్థాయిలో మా పరిచయం లేదు. ఆవిణ్ణి ఒప్పించి వస్తానని నేను మాట వరసకు అన్నదాన్ని నువ్వు మరోలా అర్థం చేసుకున్నట్టుగా ఉన్నావు.
మీతో రావడానికి నేను మానసికంగా సిద్ధం కాకపోవడంవల్లే అలా అన్నాను. ఇందులో ఆవిణ్ణి ఒప్పించవలసిందేమీ లేదు. నేను రావాలా.. వద్దా? అని నిర్ణయించుకోలేకపోవడమే అసలు సమస్య!’’ అన్నాడు సామ్రాట్ అసలు విషయం చెబుతూ.
‘‘మరింకేం.. నేనిలా అడుగుతున్నందుకైనా మాతో రావాలని నిర్ణయించుకో! నీ చేతిలో పనేగా!’’ అన్నాడు మహర్షి బ్రతిమాలుతున్నట్లుగా.
‘‘ఏ సంగతీ రేపు చెప్తాను’’ అని ఈ విషయాన్ని అప్పటికి దాటవేశాడు మహర్షి.
***
ఎటుచూసినా పచ్చగా ఉన్న ఎతె్తైన చెట్లూ, వంపులు తిరిగిన రహదారీ, మధ్య మధ్యలో సెలయేళ్లూ, ఆకాశాన్ని తాకుతున్నాయా అనిపిస్తోన్నట్టు నిటారుగా ఉన్న కొండ శిఖరాలూ, ప్రయాణం జరుగుతున్నంతసేపూ అదో అద్భుతమైన ప్రపంచమనిపించింది సామ్రాట్‌కు.
ప్రతి అణువునా అందాన్ని సంతరించుకున్నట్టున్న ఆ ప్రకృతి అందాలకతడి మనసు ఎంతో పులకరించింది. ‘ఇటువంటి చోటికి తానూ సాహిత్య.. ఇద్దరే వస్తే.. ఈ ప్రపంచంలోని ఆనందాన్నంతా దోసిలితో పట్టి తాగినట్టుగా అనిపించదూ!’ ఆ ఆలోచనకే అతడి మనసంతా ఎంతో సంతోషంతో నిండిపోయింది.
నిర్దేశించిన ప్రదేశానికి చేరుకోగానే వ్యాన్‌లోంచి సామాన్లు దింపి కొందరు గుడారాలు వేసే కార్యక్రమంలోనూ, మరికొందరు వంట ఏర్పాట్లు చూసే ప్రయత్నంలోనూ పడగా మిగిలిన వాళ్లలో జల్సారాయుళ్ల బాపతు వాళ్లు మందు సరంజామాను, పేక దస్తాల్ని బయటకు తీసి విశాలంగా ఉన్న ఒక చెట్టు క్రింద జంబుఖానా పరిచి తమ దుకాణం తెరిచారు.
మహర్షీ, సామ్రాట్ వాళ్లకు దూరంగా ఒక చోటకూర్చుని మాట్లాడుకుంటోండగా ఒక వ్యక్తి వారి దగ్గరకు వచ్చాడు. మహర్షి అతడికి ఎదురేగి అతడితో కరచాలనం చేశాడు.
తర్వాత సామ్రాట్‌కు అతణ్ణి పరిచయం చేశాడు. ‘‘ఈయన గౌతమ్ అని.. ఈయన సహకారంవల్లే మనమీరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం’’ అని ‘‘మీరు మాట్లాడుతూ ఉండండి. ననె్నవరో పిలుస్తున్నారు. అదేవిటో చూసి ఇప్పుడే వస్తాను’’ అంటూ చెట్టు క్రింద జనం వైపు నడిచాడు మహర్షి.
‘‘అతడు సామ్రాట్‌తో చేయి కలిపి, ‘‘దేనికీ మొహమాటపడకండి. ఇదంతా మన సామ్రాజ్యం. మన ఆజ్ఞ లేనిదే ఇక్కడ చీమలు కూడా కదలవు’’ అని నవ్వి, ‘‘పదండి, కొంచెం అలా ముందుకు వెళ్లి మా సామ్రాజ్యాన్ని చూసొద్దాం’’ అన్నాడు.
కాళ్ల క్రింద పచ్చిక మెత్తగా తగుల్తోంటే ఆ హాయిని అనుభవిస్తూ మరి కొంచెం దూరం ముందుకు నడిచి ఒక కొండవాగు దగ్గరకు చేరారిద్దరూ.
వాగులోని వీటి ప్రవాహం వాగుమధ్య అక్కడక్కడా ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను తాకుతూ, దిశను మార్చుకుంటూ నెమ్మదిగా కదులుతోంది.
మోకాళ్లవరకూ పాంట్లు మడతపెట్టి వాగులోకి దిగి మధ్యలో ఉన్న బండరాళ్ల మీదకు చేరుకుని కూర్చుందుకు అనువుగా వున్న ఒక బండరాయిమీద కూర్చున్నారు.
‘‘మీ పేరేమిటన్నారూ.. సామ్రాట్ కదూ.. మీకిదే మొదటిసారా అడవిని చూడ్డం?’’ అన్నాడు గౌతమ్.
‘‘అహ.. చాలాసార్లు చూశాను, కాకపోతే.. సినిమాల్లో!’’ అన్నాడు సామ్రాట్ నవ్వుతూ.
‘‘ఊ.. ఫర్వాలేదు. చతరులే! ఏం చేస్తోంటారు మీరూ?’’ అన్నాడు గౌతమ్.
చెప్పాడు సామ్రాట్.
‘‘మీ పనే హాయి! చక్కగా జనం మధ్య బ్రతుకుతున్నారు. మా బ్రతుకులు చూడండి. ఈ అడవికే అంకితమైపోయాయి’’ అన్నాడు గౌతమ్ దిగులు పడుతున్నట్టుగా మొహంపెట్టి.
‘‘లోకంలో వున్న వైచిత్రి అదే కదా! మనం కోరుకున్నది మనకు దొరకదు, మనకు దొరికింది మనకు నచ్చదు’’ అన్నాడు సామ్రాట్.
‘ఇంకా చెప్పమన్నట్టు’ చూశాడు గౌతమ్ అతడివైపు.
‘‘రణగొణధ్వనులు లేకుండా ఇటువంటి ప్రశాంత వాతావరణంలో రోజూ గడిపే అవకాశం వస్తే ఎంత బావుంటుందో అనిపిస్తుంది నాకు. ఇక్కడి గాలి స్వచ్ఛమైనది. నీరు కాలుష్యం లేనిది. చక్కగా ఓ కుటీరం నిర్మించుకుని దాని చుట్టూ బ్రతకడానికి అవసరమైన కొద్దిపాటి పంటలూ స్వయంగా పండించుకుంటూ జీవితం గడిపితే జన్మ ధన్యమైనట్టే అనిపిస్తుంది నాకు.
మీరడగవచ్చు. అలా ఎటువంటి మార్పూ లేకుండా ఎంతకాలం గడపగలరని. అది మన ఆలోచనల్ని బట్టి ఉంటుంది. మనసా, వాచా, కర్మణా మనం ఎటువంటి జీవితాన్ని అభిలషిస్తున్నాం? అనేదాన్ని బట్టి ఉంటుంది. కాదంటారా?!’’ అన్నాడు సామ్రాట్.
‘‘మీకూ నాకూ ఆలోచనల్లో చాలా తేడా ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకు. ఈ అడవిలో నులక మంచంమీద వెల్లకిలా పడుకుని ఎతె్తైన చెట్ల సందుల్లోంచి ఆకాశంలో కదిలే మేఘాల్ని చూస్తూ, వాగులో నీళ్లు త్రాగుతూ, దుంపలు, కాయలు తింటూ జీవితాన్ని గడపాలనే ఊహ మనసులోకి వస్తేనే భయంకరంగా ఉంటుంది నాకు.
కానీ చూశారా చిత్రం! ఈ వాతావరణాన్నిష్టపడే మీకు జీవితంలో ఎక్కువ సమయం ఇక్కడ గడిపే అవకాశం లేదు. జనారణ్యాన్నిష్టపడే నాకు ఈ అడవిలో ఎక్కువ సమయం గడపక తప్పడంలేదు.
అందుకే అప్పుడప్పుడూ మీబోటి స్నేహితుల్నిక్కడికి ఆహ్వానిస్తోంటాను. నేను బయటి ప్రపంచంలో ఉంటే ఎలా బ్రతుకుతానో అలా ఉండే ప్రయత్నం ఇక్కడున్నా చేసుకుంటూంటాను అప్పుడప్పుడూ’’ అన్నాడు గౌతమ్.
‘‘ఎంత అడవైనా ఇక్కడ మీకెటూ వసతి సౌకర్యం ఉంటుంది కదా! చక్కగా సహధర్మచారిణితో మకాం పెడితే మీకూ ఒంటరితనపు బాధ తప్పుతుంది కదా!’’ అన్నాడు సామ్రాట్.
‘‘మీరు మళ్లీ మొదటికి వస్తున్నారు. భార్య ఎప్పుడూ మనతో ఉండేదే! రోజూ నా మొహం ఆవిడా, ఆవిడ మొహం నేనూ చూసుకుంటూ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎన్ని రోజులు గడపగలం?

-ఇంకా ఉంది

సీతాసత్య