డైలీ సీరియల్

దూతికా విజయం-57

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరభద్రుని చిరునామా కాని, తదితర వివరాలు కాని ఎవర్ని అడిగి తెలుసుకొనేట్లు? తన దూరపు బంధువొకాయన రాజుగారికొలువులో వున్నాడు. వీరభద్రుడు అందరి దృష్టినీ ఆకర్షించి, అందర్నీ ఒప్పించి, మెప్పించిన మేటిగా చాలా స్వల్పకాలంలోనే కీర్తికాంత వరించిన వీరుడుగానే ముద్రవేయబడి ఉండటంవల్ల మాటల సందర్భంలో ఆ దూరపు బంధువు ద్వారానే వీరభద్రుని వివరాలు రాబట్టవచ్చుననే ఆశ సరస్వతి మనసును ఆవరించి ఆక్రమించింది.
రాకరాక వచ్చిన చుట్టాన్ని బంధువులు ఆహ్వానించి ఎంతగానో ఆదరించారు. బంధుత్వం కన్న రాణివాసపు రమణి, అందునా రాణి ప్రియసఖి కనుక రాజరికపు ప్రాతినిధ్యాన్ని గౌరవించటంలో ఆ బంధువులు తృప్తిని, గర్వాన్ని పొందారనటం సమంజసం.
మాటల సందర్భంగా తెలివిగా, ఎవరికీ ఏ అనుమానమూ కలుగకుండానే వీరభద్రుని గూర్చిన అనేక వివరాలను సరస్వతి సేకరించగలిగింది!
వీరభద్రుడు పరదేశి; చిన్నతనం నుంచీ దేహ పరిశ్రమనే ఆదర్శంగా ఆరాధిస్తున్న బ్రహ్మచారి. రాజాదరణను పొందుదామనే ఆశతో మూడుమాసాల క్రితమే పట్టణానికి వచ్చాడు. ఎక్కడా ఇల్లు దొరకక వేశ్యవాటిలో ఒక పాడుబడిన పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. రాజుగారి కొలువులో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోననే ఆశతో మరికొన్నాళ్ళు ఇక్కడే ఉండేందుకు నిశ్చయించుకున్నాడు. బీదరికం కారణంగా ప్రస్తుతం అతను పొందగలిగిన దేహదారుఢ్యానికి తగిన పోషణ లభించక నానా అవస్థ పడుతున్నాడు.
వింటున్నకొద్దీ సరస్వతికి గుండెలు జారుతూన్నవి. సరిగ్గా తన స్వప్నానుభూతులకూ ఈ సత్యానికీ చాలా దగ్గిర పోలికలున్నవి. చివరకు ఆ స్వప్నాంతమే తప్పనిసరవుతుందనే అనుమానాలు వేళ్ళు తన్నుకొని తగినంతగా బలపడినవి.
ఇంతలో ఈ పథకాన్ని మానుకోవటం ఆమెకు ఉత్తమోత్తంగా కనిపించింది. కాని తాను హృదయపూర్వకంగా రాణి ఎదుట చేసిన ప్రతిజ్ఞ పెద్ద ప్రతిబంధకంగా ఉన్నది. నిజానికి స్వప్నానుభూతికే బేల అయిపోయే తత్వంకాదు తనది! తనకూ ఒక గొప్ప ఆశయం, ఆదర్శం ఉన్నవి. తిమింగలం లాటి దాన్ని పట్టుకునే ఉద్దేశ్యంతో ఈ మహాసాగరంలోకి నడుం బిగించి దూకింది తాను. మన్నికకు ఎన్నిక చేసి తాను రూపొందించిన వలపు వల విసిరివేయందే ఏమీ తేలదు. తిమింగలం కన్న వల దృఢమైనదైతే తనశక్తి యుక్తులన్నిటినీ ఉపయోగించి తిమింగలాన్ని ఒడ్డుకు లాక్కోగలదు. కాని తన వలకన్న తిమింగలమే బలమైనదైతే, వల తునాతునకలైపోతుంది. తనకు జలసమాధి తప్పదు!
ధీరమతులు ఏ కార్యాన్నీ మధ్యలో వదిలివేయరు. ఆ మాటకొస్తే తనింకా ఒడ్డునే ఉన్నది. మొలవరకూనన్నా దిగలేదాయె. మధ్యకు వచ్చి లోతు అందుతుందో లేదో ఇంకా చూడనే లేదు. ఇప్పుడే దిగజారటం తన పిరికితనం. తనలో తాను సిగ్గుపడవలసిన విషయం! ఆ స్వప్నమే రానట్లయితే ఈ స్థితిలో ఇలాం టి అనుమాన పిశాచాలు తనను బాధించేవి కావు కదా! స్వాప్నవిక దృశ్యాలకూ, నిజమైన వాటికీ ఒక పోలికను గ్రహిస్తుండటంవల్లనే కదా ఈ దిగజారే మనస్తత్వం తనలో తీవ్రంగా పనిచేస్తున్నది!
ఆ కలను గూర్చి మరిచిపోవాలని ఆమె గట్టి ప్రయత్నం చేసింది. కాని అది తనలో కలిగించిన సంచలనం, చేసిన గాయం, ఈ జీవితాంతంవరకూ మరువలేనిది! దాన్ని మరిచిపోవలేకపోయినా, ఈ ప్రయత్నంలో దాని ప్రస్తావన, లేదా, కనీసం ఆ పోలికలను ఊహించకుండా ముక్కుకు సూటిగా ముందుకు సాగిపోవాలనే దృఢనిశ్చయాన్ని ఏర్పరచుకున్నదామె.
మానవులు ఎప్పుడూ ఎన్నో పన్నాగాలను పన్నుతూ వలలు పన్నుతూనే ఉన్నారు. ఒక్కోసారి తాను పన్నిన వలలో తనే చిక్కుకపోటమూ జరుగుతుంది... వీటన్నిటికన్నా బలవత్తరమైన, ఏ మానవశక్తికీ తల వొంచని వల ఆ విధి పనే్న ఉంచాడు. ఏ వలలోనైనా చిక్కుకోవటం, తప్పించుకోవటం జరుగవచ్చు కాని విధి పన్నిన వలనుంచి ఎన్నటికీ, ఎవ్వరూ తప్పించుకోలేరు. లోక చరిత్ర ఈ విషయాన్ని ప్రతి క్షణమూ రుజూ చేస్తూనే వున్నది కదా!
కనుక జరుగవలసినంది జరిగే తీరుతుందనే సిద్ధాంతాన్ని అనుసరించి తన పురోగమనాన్ని గూర్చి కలతపడవలసిన అవసరం లేదు.
పోతే తాను తెలుసున్న విషయాలు కొన్ని చాలా అనుకూలంగానూ, కొన్ని చాలా ప్రతికూలంగానూ తోచినవి.
వీరభద్రుని వసతి గృహం వేశ్యావాటికలో ఉండటంవల్ల చీకటిపడిన తరువాత రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. విటులు, రసికులైనవారు మాత్రమే హడావిడిగా తమను మరెవరైనా గమనిస్తారేమోననే శంకతో తలలు వాల్చి, సాధ్యమైనంత త్వరలో తన గూళ్ళను జేరే పక్షుల వలె శరవేగంతో నడిచిపోతూ ఉంటారు.
రాజవీధిన నడిచే ఈ రకం రసికులు బాగా పేరుపడినవారూ, జీవితంలో ఢక్కాముక్కీలు తిన్నవారూ, సామాజిక కట్టడుల్ని బహిరంగంగా అతిక్రమించి భరించగలిగినవారూ, తమకేమీ లెక్కలేదనే నిర్లక్ష్య భావాలతో నిలదొక్కుకోగలినవారూ, తాగుబోతులూ, జూదరులూ, అవసరమైతే రొమ్మిచ్చి పోరాడగల ధైర్యశాలురూ, రక్షక భటులను కూడా లెక్కచేయనివారూ లేదా వారి బంధు మిత్ర వర్గంలో జేరిపోయినవారూ, చాలా తేలికైన జీవితానికి అలవడినవారూ, రంగేళిరాయుళ్ళూ, వేశ్యలకు ప్రియులుగా, ఇష్టులుగా ఉంటూ వారికి రక్షణనిస్తూ, ఆనందాన్ని జుర్రుకోవటమే చేసే ఘనకార్యంగా భావించేవారూ, నేరాలు చేయటంలో దిట్టలూ- ఈ రకరకాల నీచాభిరుచులతో జీవిత చక్రాన్ని దొర్లించే జనాభా సంచరిస్తూ ఉంటుంది!
ఇదివరకు పరిచయమే లేని ఒక కీకారణ్యంలోకి ప్రవేశించిన విధంగా ఈ రాత్రి తాను వీరభద్రుని గృహానికి వెళ్ళవలసి ఉన్నది. నిజానికి ఈ వేశ్యవాటిక మహారణ్యంలాటిదే! అడవిలో వలెనే బహుకొద్ది క్రూరమృగాలవలె తాను ఊహించే నీచాభిరుచులున్న మానవులుంటారు. ఐతేనేం కీకారణ్యంలో నాలుగే నాలుగు సింహాలు, పులులు ఉంటేనే చాలు; వాటి బలాతిశయాలూ, ధైర్యసాహసాలూ, క్రౌర్యమే అడవిలో అల్ప ప్రాణులన్నిటికీ ప్రమాదకరంగా ఉంటవి కదా! ఈ స్వల్ప సంఖ్యాకంగా ఉండే క్రూరమృగాలే, అధిక సంఖ్యాకంగా వున్న అల్పజీవుల్ని పరిపాలిస్తూ తమ అదుపాజ్ఞల్లో ఉంచగలుగుతూన్నవి.
లేడి లాటి లలన తాను; తాను సింహం లాంటి వీరభద్రుణ్ణి వశం చేసుకునేందుకు నిశ్చయించుకున్నది. సింహాన్ని బంధించాలంటే కీకారణ్యంలోకి ప్రవేశించే తీరాలి. అంతేకాదు- సరసరి దాని గుహలోకే జొరబడాలి. అంతేకాని కోరినంత మాత్రాన సింహమే సరాసరి దగ్గరికి వచ్చి మెడ వంచి తనను బందించేందుకు అనుమతిస్తుందా?
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు