డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాకారుల్లో ఉన్నంత ఆకర్షణ కూడా తనలో లేదా? తనలో ఏ ఆకర్షణా కనిపించకపోవడంవల్లనేనా- దీపం వెలుతుర్లో తనకు నిద్రపట్టదని చెప్పినవాడు కూడా అంత హాయిగా తన ఉనికినే పరిగణనలోకి తీసుకోని వాడిలా అంత హాయిగా నిద్రపోతున్నాడతడు?
పరస్తుతి, ఆత్మనిందలతో మనసులో ఎంతసేపు ఎన్ని విధాలుగా విత్కరించుకున్నా ఆలోచనలు ఒక కొలిక్కి రాలేదు సామ్రాజ్ఞికి.
చివరకు ‘తాను ఆడదైనా కాకపోయి ఉండాలి లేదా అతడు మగాడైనా కాకపోయి ఉండాలి’ అనే నిర్థారణకు వచ్చి మంచంమీద నుంచి లేచి నిలబడి సోఫాలో పడుకున్న అతడి దగ్గరగా వెళ్లింది.
‘అతణ్ణి తట్టి లేపాలా? వద్దా’ మళ్లీ సంశయం.
పేరు పెట్టి పిలవాలంటే.. కనీసం అతడి పేరు కూడా తనకు తెలియదు. ఎంత చిత్రం! పేరూ, ఊరూ లాంటి కనీస వివరాలు కూడా తెల్సుకోకుండా ఒక అపరిచిత వ్యక్తిని నమ్మి అతడితో కలిసి రాత్రివేళ జంటగా ఒక గదిలో గడుపుతోంది తను!
ఒక రకమైన నిర్వేదం ఆవహించిందామెను. తనేం చేస్తోందో తనకే తెలియని ఆ మానసిక స్థితిలో అతడి వంటిమీద చేయి వేసిందామె.
నిద్ర నటిస్తున్నాడో, నిజంగా నిద్రపోతున్నాడో గానీ ఆమె చేతి స్పర్శకు ఒక్క ఉదుటన లేచి కూర్చున్నాడతడు.
మంచంమీద పడుకుని నిద్రపోతూ ఉండవలసిన ఆమె తను పడుకున్న సోఫా దగ్గరకు వచ్చి నిలబడి తనను తట్టి లేపడంతో ఆమెవైపు ఆశ్చర్యంగా చూసి, ‘‘ఏవైంది.. ఏమైనా పీడకలొచ్చి భయపడి నన్ను లేపారా?’’ అన్నాడు.
‘‘నీతో కలిసి ఈ గదిలో గడపడమే ఓ పీడకలలా ఉంది నాకు’’ అని మనసులో అనుకుని ‘‘ఊహూ.. నిద్రపట్టడంలేదు నాకు. కొత్త చోటు కావడంవల్లేమో?’’ అంది సామ్రాజ్ఞి.
అతడు నవ్వి ‘‘నాకా ఇబ్బంది లేదులెండి. ఎటువంటి చోటైనా ఇలా పడుకుంటే అలా నిద్ర వచ్చేస్తుంది నాకు’’ అన్నాడు.
‘‘మీ ఇంట్లో కూడానా?’’ అంది సామ్రాజ్ఞి.
‘‘అంటే..?’’ అన్నాడతడు.
‘‘మీ భార్య నిద్రపోకుండా మెలకువగా ఉన్నా మీకిలానే నిద్రపడుతుందా? అని అడుగుతున్నాను’’ అంది సామ్రాజ్ఞి.
ఆమెలో తను అంతవరకూ చూడని కొత్త మనిషి కనిపించిందతడికి.
కొద్ది గంటల క్రితం గదిలో ప్రవేశించినప్పటి బెరుకు ఆమె కళ్లలో ఎంత మాత్రమూ కనిపించలేదతడికా క్షణంలో.
ఎంతో పరిచయమున్నవాడితో ఎటువంటి అరమరికలూ లేకుండా వ్యవహరించే దానిలా ఉందామె వాలకం. ‘‘మీ ప్రశ్న నాకు సరిగా అర్థం కాలేదు’’ అన్నాడతడు, ఆమె మనసులో ఏం ఉందో ఊహించే ప్రయత్నం చేస్తూ.
‘‘ఉహూ.. నేనొప్పుకోను. నా ప్రశ్న మీకర్థమైనా అర్థంకానట్టు నటిస్తున్నారు’’ అంది సామ్రాజ్ఞి.
‘‘ఇందులో నటించడానికేవుంది? నాకు నిజంగానే మీ ప్రశ్న అర్థం కాలేదు’’ అన్నాడతడు.
‘‘సరే.. పోనీ మరోలా అడుగుతాను. మీ భార్య అందంగా ఉంటారా?’’’
‘‘ఊ.. ఫర్వాలేదు’’.
‘‘అంటే.. అందంగా ఉంటారనా? ఉండరనా?’’
‘‘తామునిగింది గంగ, తావలచింది రంభ.. అంటారు కదా! అటువంటప్పుడు అందానికి నిర్వచనం ఇదీ! అని ఎవరు చెప్పగలరు?’’
‘‘సరే.. ఇంతకూ మీ భార్య మీరు వలచిన రంభేనా? అది చెప్పండి పోనీ!’’
‘‘నా భార్యను నేను వలచి పెళ్లి చేసుకోలేదు. మా అమ్మా నాన్నలు ఇష్టపడి నాకు అప్పగించారు, ‘ఈవిడే నీ భార్య! అని’’
‘‘అంటే పెళ్లి చేకున్న తర్వాతైనా ఆమెలో రంభ లక్షణాలు కనిపించలేదా మీకు?’’ అంది సామ్రాజ్ఞి.
ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తోన్న అతడితో అంది సామ్రాజ్ఞి, ‘‘పోనీ ఇది చెప్పండి, మీ భార్య నాకంటే అందంగా ఉంటారా?’’
నీళ్లు నమిలాడతడు ఏం చెప్పాలో తెలియక.
‘‘కనీసం ఇదైనా చెప్పండి.. నాలో అందం ఏ కోశానైనా ఉందా?’’
ఈసారి అతడి కళ్లలోకి మెరుపొచ్చింది.
‘‘మీకేం.. చక్కగా మహారాణిలా ఉంటారు. ఏ మహారాజుకో భార్య కాదగ్గ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి మీలో. మీకు తెలియదేమోగానీ.. మీలో మీకే తెలియని ఏదో ఠీవి ఉంది.
ఎదుటివారిని ఆమడ దూరంలో నిలబెట్టగలిగే శక్తివంతమైన కళ్లు మీకో పెద్ద ఆకర్షణ. మీతో చనువుగా మాట్లాడ్డానికి ఎవరైనా జంకుతారు. మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం ఎవరికీ ఒహపట్టాన సాధ్యంకాదు’’ అన్నాడతడు.
అతడి మాటలు విన్నాక- ‘అతడు మగాడో కాదో తనకు తెలియదు గానీ తాను మాత్రం ఆడదే!’’ అనిపించిందామెకు.
‘‘అందుకేనా నాకు ఆమడ దూరంలో వుంటూ నా లక్షణాలన్నీ గమనిస్తున్నారు మీరు?!’’ అంది సామ్రాజ్ఞి.
అతడికి విషయం అర్థమైంది, ‘ఎంతోమంది ఆడవాళ్లలానే ఆమె కూడా ఐడెంటిటీ క్రైసిస్’తో బాధపడుతోంది.
ఆమెను ఆడదానిగానే గుర్తించనట్టుగా ఉన్న తన ప్రవర్తన ఆమె అహాన్ని దెబ్బతీసింది. ఒంటరిగా ఉన్న ఆమె పరిస్థితిని ఒక మగవాడిగా తాను ఉపయోగించుకోకపోవడం ఆమె స్ర్తిత్వానికే సవాలుగా ఆమె భావించింది.
అందుకే బస్ ప్రయాణంలో తాను ముట్టుకుంటే మైలపడిపోతానన్నట్టుగా తనతో అంటీముట్టనట్టు వ్యవహరించిన ఆమె, తననూ అలానే ఉండాలని భావించిన ఆమె.. బస్‌లో తోటి ప్రయాణికుల మధ్య ఉన్నంతసేపూ మనసులోకి వేరే ఆలోచనల్ని రానివ్వలేదు. ఎందుకంటే అప్పుడు బస్‌లో తమ చుట్టూ సమాజపు ప్రతినిధులున్నారు.
కానీ ఇప్పుడు ఇక్కడ హోటల్ గదిలో ఎవరి చూపూ పడని చోట తామిద్దరూ మాత్రమే ఉన్నారు.

-ఇంకా ఉంది

సీతాసత్య