డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత

సందీప్ తండ్రికి పదే పదే చెప్పడం మొదలుపెట్టాడు. తండ్రిని ఒప్పించాలని శతవిధాలా ప్రయత్నం చేసాడు- ‘‘నాన్నగారూ! మరి ననే్నం చేయమంటారు? నాకు బిజినెస్ అంటే పడదు. నాకు బిజినెస్‌కి చుక్కెదురు. నేను అసలు ఒక మంచి వ్యాపారవేత్తను చస్తే కాలేను. నా స్వభావం అది కాదు. నా స్వభావాన్ని నా మనస్సును మార్చుకోలేను. ఇది పదహారణాల సత్యం. నేను ఈ విషయం గురించి ఎంతో ఆలోచించాను. నేను ఎంతో దగ్గరిగా చూసాను. మీ జీవితాన్ని, ఈ వ్యాపారస్థుల జీవితాలని- ఒకటే రోడ్డు- వేల నుండి లక్షలదాకా లక్షల నుండి కోట్లదాకా సంపాదించాలనే ఒకే ఒక కోరిక. ఈ సంపాదన కోసం ఉరుకులు పరుగులు.. జన్మంతా ఒకటే పరుగు.. నాకు ఈ జీవితం అంటే ససేమిరా ఇష్టం లేదు. భౌతికంగా కాని మానసికంగా కాని సంతోషం లేని జీవితం.. ఒక అడ్వెంచర్, థ్రిల్ లేని జీవితం. అసలు ఇది ఒక జీవితమా! ఇంకో విషయం నాన్నగారూ! నన్ను మరోలా మలచాలని చూడకండి. దీనివలన ఏ లాభం ఉండదు. నా ఇష్టానికి విరుద్ధంగా మీరు బలవంతం చేసారనుకోండి. నేను పిచ్చివాడినైపోతాను. మీరు ఇరవై నాలుగు గంటలు నన్ను చూస్తూ మీరు అపరాధం చేసానేమోనని బాధతో పశ్చాత్తాపపడతారు. మీరు కూడా ఆనందంగా బతకలేరు. మీరు అలలని ఏ దిశ వైపు వెళ్తాయో వెళ్ళనీయండి. అంత వేగంగానూ వెళ్ళనీయండి. అంతేకాని ప్రవాహాన్ని మరోవైపు తిప్పాలన్న ప్రయత్నం చేయకండి.
జవాబు వినగానే శేఖర్‌బాబుకి నోట మాట రాలేదు. లోపలి సూర్యుడు మునిగిపోసాగాడు. కళ్ళలో కన్నీళ్ళు తిరిగాయి. వీడేనా నా కొడుకు? నా రక్తం! అసలు తన వలన ఏదైనా తప్పు జరిగిందా? తను కొడుకులను అర్థం చేసుకోలేకపోతున్నాడా? తను రాత్రింబవళ్ళు వ్యాపారంలోనే మునిగిపోయాడు. తనకి విత్తసత్యమే జీవన సత్యం అయింది. సందీప్ తన నుండి దూరం దూరం పోతున్నాడన్న సత్యాన్ని తను గ్రహించలేకపోయాడు..
ఈసారి రణనీతిని మార్చాడు. తర్కంతో కాకుండా ప్రేమతో జయించాలని అనుకున్నాడు- ‘‘బాబూ! ఆలోచించరా! అసలు మన ఏడు తరాలు ఎవరైనా మిలటరీలోకి వెళ్ళారా! కనీసం ఉద్యోగం కూడా ఎవరు చేయలేదురా! ఈ విధంగా నన్ను గాయపరచడం నీకేమైనా బాగుందా! చెప్పు. పోనీలేరా! నువ్వు బిజినెస్ చెయ్యకు, కానీ ఇంజనీర్ అయి ఉద్యోగం అయినా చేసుకో. ఈ విషయంలో అభ్యంతరం చెప్పను. ససేమిరా చెప్పను. కానీ నిన్ను ఆర్మీలోకి పంపించను. చస్తే పంపించను. నా మాట వినరా బాబూ! ఈ సైన్యం గురించి మరచిపో..’’
విజేత కావాలన్న ఉద్దేశ్యంతో సందీప్ తండ్రితో అన్నాడు- ‘‘మీ తరం చరిత్రను నాపై మోపాలంటే మరి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి. మన పూర్వులు రాజపుత్రులు. మనం రాజపుత్రుల నుండి జైనులయ్యాము. రాజపుత్రులలో ప్రతి రాజపుత్ కుటుంబం నుండి పెద్దవాడిని సైన్యంలో పంపించాలన్న ఆచారం మనకు ఉండేది. ఆ కాలంలో అందరు పంపించేవాళ్ళు కూడా. దేశ సేవ చేయడం వాళ్ళ ధర్మం అని అనుకునేవాళ్ళు. అందువలన నేను వెళ్ళడానికి మీరు అనుమతించండి. సిద్ధార్థని మీ ఇష్టం. మీకు అనుకూలంగా మలచుకోండి’’.
ఏమిటి? ఏమిటన్నాడు? కొడుకుని కాదు కొడుకు కొత్త అవతారాన్ని చూస్తున్నట్లుగా అనిపించింది. అసలు వీడిలో ఈ కొత్త రూపం ఎప్పుడు దిద్దుకుంది? తన పూర్వరాజుల చరిత్ర తన ద్వారా కొడుకుకి చేరాలి కాని కొడుకు ద్వారా చరిత్ర తనదాకా చేరుతోంది.. ఓ రామా! కొడుకు వ్యక్తిత్వం వికసిస్తోందా లేక తన వ్యక్తిత్వం కుంచించుకుపోతోందా!
కొడుకు జవాబుతో ఇక చేసేది ఏమీ లేక తండ్రి తన ఓటమిని అంగీకరించాడు. అసలిక వాడికి దేవుడు దిగివచ్చినా నచ్చచెప్పలేడు అన్న సంగతి తేలిపోయింది. ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా ఇక వాడు చస్తే మారడు. వాడికి రెక్కలు వచ్చాయి. వాడు ఎగరక మానడు.. కొడుకు పూర్తిగా చేతినుండి జారిపోనీయడం కంటే తను వాడి కలలలో, వాడు చేసే పనులలో భాగస్వామి కావడమే మంచిది.
ఆ రాత్రి కుమిలి కుమిలి ఏడుస్తున్న తన భార్యకు నచ్చచెప్పాడు శేఖర్‌బాబు- ‘‘చూడు! అపాయం ఎక్కడ లేదని? ఎక్కడైనా ఉంది. చావు బతుకులు ఆపై వాడి చేతిలోనే ఉన్నాయి. గాలివాటాన్ని గుర్తించు. సందీప్‌ని సంతోషంగా డెహరాడూన్‌కి పంపించు’’.
స్టేషన్‌కి సందీప్‌కి వీడ్కోలు చెప్పడానికి ఇంటిల్లిపాదే కాదు, బంధువులే కాదు ఆ వాడవాళ్ళందరూ వచ్చారు. ఆ వాడ వాళ్ళందరి దృష్టిలో ఇది ఎంతో ముఖ్యమైన సంఘటన. ఎంత సహసం? వ్యాపార కుటుంబం.. అందులోనూ మార్వాడీ వాళ్ళ కుటుంబం.. వాళ్ళ కొడుకు సైన్యంలో.. నాయనమ్మ పిల్లికి భయపడుతుంది. అమ్మ బల్లికి భయపడుతుంది. పిల్లికి, బల్లికి భయపడే ఆ కుటుంబంలోంచి.. ఆ వంశస్థుడు. కత్తులు, కటారులు, రైఫిళ్ళు.. పిస్తోలు గుళ్ళు.. ఈ ప్రపంచంలోకి.. అసలు ఎందుకిట్లా జరుగుతోంది? ఎంతోమంది సందీప్‌ని తమ బస్తీకే గర్వం అన్నట్లుగా చూసారు.. కొందరి చూపుల్లో ఆశ్చర్యం, జాలి దయలు కనిపిస్తున్నాయి.. అసలు ఆర్మీ ఏం ఇస్తుందని? భవిష్యత్తులో తండ్రిలా బతకగలుగుతాడా? ఆ వాడలోని ఒక ముసలామె ఎంతో ఉత్సాహంతో తల ఊపుతూ అన్నది.. వాహ్! దేశ సేవ కోసం సందీప్ వెళ్తున్నాడు. ఎంత అదృష్టం..’’ ఈ మాటలు విన్నాక ఆనందంతో శేఖర్‌బాబు ఆయన భార్య ముఖాలు వికసించాల్సింది. కాని వాడిపోయాయి. మహుశ ఈ సమయంలో దేశభక్తి వెనకబడ్డ వర్గం వాళ్ళలోనే ఉందేమో...
గార్డ్ సిగ్నల్ ఇచ్చాడు. ట్రైన్ కదలగానే తన తల్లి-తండ్రి వెక్కి వెక్కి ఏడవడం చూసాక సందీప్‌కి కళ్ళు చెమ్మగిల్లాయి. ఎవరో తడిసిన తువాలను పిండినట్లుగా, ఎవరో ఆత్మని పిండినట్లుగా అనిపించింది.

- ఇంకా ఉంది

టి.సి.వసంత