డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-68

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెర్రిగా ఆవిడ వంక చూచాను. ఎంత నిజం? వదిన ఎంత సింపుల్‌గా చెప్పేసిందో. వౌళి మొహంలో రఘు పోలికలు తలుచుకుంటూ కళ్ళు దించుకున్నాను.
కొట్టు అతడు అన్నాడు, ‘‘ఒక పని చేద్దాం. ఆ నగలు నాకివ్వండి. మరోసారి పాలిష్ చేయించి మంచి బాక్స్‌లో పెట్టిఇస్తాను’’ అన్నాడు. వౌనంగా అందించాను. వదిన సంతృప్తిగా చూచింది.
దగధగ మెరుస్తున్న ఆ నగలతో తేజ చూడముచ్చటగా ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి నిద్ర చాలకేమో! నిన్నటి రోజు హడావిడితో మొహం అలసినట్లు ఉంది. అయినా ఏదో కొత్త అందం ఇనుమడిస్తోంది. అది కేవలం సంతోషం, ఆనందం. నా చిన్నప్పటి పాట గుర్తుకు వచ్చింది. అందమే ఆనందం..? లేక ఆనందమే అందమా?
తేజా వంక వాళ్ళ మామ్మ చూస్తూ అంది- ‘‘మీ కోడలికి అన్ని నగలు తెచ్చారు. మీరు మాత్రం ఏమీ పెట్టుకోవడం చూడలేదు’’ అని.
నవ్వి ఊరుకున్నాను. ఒక చేతికి వాచ్, మరో చేతికి నాలుగు బంగారు గాజులు, మెళ్ళో ఒక చైన్, ఆ చైన్ క్రింద డైమండ్స్‌తో చేసిన ఓం అన్న అక్షరానికి చుట్టూ ఎర్రని కెంపులుతో లాకెట్, ఇంతే నా అలంకారం.
పెళ్లిలోనూ, రిసెప్షన్‌లోనూ అందరు ఆడవాళ్ళు అధునాతన నగలతో మెరిసిపోయారు. ఆ రోజు అక్కడ కనిపించిన డైమండ్స్‌కు వెల కట్టాలనిపించింది. డిట్రాయిట్ ప్రాంతంలో ఉన్న వాళ్ళెవరూ వాళ్ళ సంపద బహిర్గతం చేయడానికి ఏ మాత్రం వెనుకాడినట్లు కనిపించలేదు.
వచ్చిన అతిథులందరూ వెళ్లిపోయారు. భాస్కర్, శేఖర్ కుటుంబం కూడా వెడతామన్నారు. నన్ను తప్పకుండా ఇండియా వెళ్ళేలోపల వాళ్ళింటికి రావాలని చాలా గట్టిగా చెప్పారు.
అథులందరూ వెళ్ళగానే వౌళి పైకి తన రూంలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి తేజ కూడా వెళ్లింది.
మూర్తిగారు, రూం ఇచ్చేసి, తమ ఇంటికి వచ్చేయమని కోరారు.
మీరు ‘‘ఒక్కరూ ఎందుకు, పైగా మా ఇల్లు కూడా ఖాళీ అయిపోయింది. అందరూ వెళ్లిపోయారు’ అంది సావిత్రి.
కొద్దిసేపు ఆలోచించాను. మరో రెండు మూడు రోజుల్లో వెళ్లిపోతాము. తను హోటల్‌లో ఉండిపోతే వౌళి అనవసరంగా తన గురించి శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది.
వాడికి తేజతో గడపటానికి ఇదే మంచి సమయం అనిపించింది.
అంగీకరించాను. సామానంతా తీసుకుని మూర్తిగారి ఇంటికి వెళ్లిపోయాం.
సావిత్రి బాగా అలసిపోయింది. పోయినవారం రోజులుగా ఎక్కడా రెస్ట్ లేదు.
‘‘మీరు మీ రూంకి వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకోండి. మళ్లీ నాకేదో మర్యాద చెయ్యాలని చూడకండి’’ అన్నాను.
‘‘నిర్మొహమాటంగా ఆ పని చేయబోతున్నాను’’ అంటూ నాకు నా రూం చూపించి వెళ్లిపోయింది. సావిత్రి అన్నట్లు ఇల్లు నిశ్శబ్దంగానే ఉంది. ఇంట్లో వాళ్ళు తప్ప పైవాళ్ళు ఎవరూ లేరు.
మూర్తిగారి తమ్ముడు వెడుతూ, వాళ్ళ తండ్రులను కూడా తీసుకువెళ్లాడు. ఇక ఉన్నది సావిత్రి తల్లిదండ్రులే!
విండోలోంచి బయటకు చూస్తూ నుంచున్నాను. ఎవరింటి ముందు చూచినా విశాలమైన లాన్స్ పచ్చగా, ఆరోగ్యంగా మిసమిసలాడుతున్నాయి. ఆ లాన్ చివరగా ఏ ఏటికి ఆ ఏడు పెట్టే రంగు రంగుల పెట్యూనియాస్, జిన్నియాస్ చక్కగా విచ్చి అందమైన బోర్డర్‌గా కనిపిస్తున్నాయి.
పక్కగా రకరకాల గులాబీలు అన్ని రంగుల్లో అరచేయి సైజు పూలు ఊగుతున్నాయి.
గడ్డిమీద లాన్ స్ప్రింకర్స్ సన్నటి వర్షంలా గడ్డినంతా తడుపుతున్నాయి.
ఆ సబ్ డివిజన్‌లో ఉన్న ఇళ్లన్నీ ఇంచుమించు ఓలాగే ఉన్నాయి. అన్ని ఇళ్ళముందు విశాలమయిన స్థలం అందులో లాన్, పూలు, పచ్చగా ఆరోగ్యంగా ఉన్నాయి.
కొద్ది దూరంలో చిన్న చిన్న స్విమ్మింగ్ సూట్స్ వేసుకున్న పిల్లలు స్ప్రింక్లర్స్ కింద నీళ్ళల్లోకి పరుగెడుతూ ఆడుకుంటున్నారు.
ఈ దేశం, ఈ సమానత్వం ఎలా సాధించింది? ఈ ప్రశ్న నాలో ఎప్పుడూ తలెత్తుతూనే ఉంటుంది. అందులో ఎకనామిక్స్‌తో నిండిన నా మనసుకు ఎప్పుడూ ప్రశ్నలే! మన దేశపు లగ్జరీస్ అన్నీ ఈ దేశపు సగటు మనుషులకు దక్కుతున్నాయి.
పని చేసే ప్రతివాడికి, కనీస అవసరాలన్నీ తీరుతున్నాయి. ఓ కారు, ఓ ఇల్లు, కనీస అవసరాలలోనే వస్తాయి ఈ దేశంలో.
ప్రతివాడికి ఉద్యోగం ఉంది. చదవాలనుకున్న ప్రతి బిడ్డకు చదువు అందుబాటులో ఉంది. ఇక్కడ పేదరికం అంటే- బద్ధకమనే అనిపిస్తోంది. కష్టపడదలచుకోనివాడిదే బీదరికం.
ఆలోచనలు వెంటాడుతూనే ఉన్నాయి. వచ్చి మంచంమీద వాలాను.
నేనెప్పుడయినా ఇలాంటి రోజు వస్తుందని అసలు అనుకున్నానా?
ఇలా అమెరికా రావడం, ఆరునెలల క్రితం వరకూ ఎవరో తెలియని ఒకరింట్లో ఉండటం, ఈ కొత్త అనుబంధాలు, బంధుత్వాలు నా మనసులో ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి.
నా కళ్ళు ఎప్పుడు మూతలు పడ్డాయో, అలసిపోయిన శరీరం నిద్రని ఆవహించింది. ప్రశ్నించే మనసు నోరు మూసుకుంది. సంతృప్తిపొందిన హృదయం సమాధానపడింది.
సాయంత్రం 7 గంటలు దాటుతుంటే వౌళి, తేజా హోటల్ నుంచి వచ్చారు. ఇద్దరూ హాయిగా రెస్ట్ తీసుకుని ప్రెష్‌గా వచ్చారు. వాళ్ళిద్దరూ పక్క పక్కన నడిచి వస్తుంటే నా కళ్ళకు చాలా ముచ్చటగా అనిపిస్తోంది.
వౌళి బ్లూజీన్స్, గోల్ఫ్ షర్ట్‌తో ఎంతో ఇన్ఫార్మల్‌గా, కంఫర్ట్‌బుల్‌గా కనిపించాడు. తేజాలో ఏదో కొత్త అందాలు స్ఫురించాయి. లేత పింక్ రంగు చుడీదార్ వేసుకుంది. మెడమీద పచ్చటి పసుపు తాడు, కొత్త నల్లపూసలు మెలికలు తిరిగాయి. ఒక చిన్న సన్నటి గొలుసు వాటిమధ్య నుంచి తొంగిచూస్తోంది.
చేతినుంచి కూడా ముందు రోజున్న చాలా గాజులు తీసేసింది. ఒక్క 2 బంగారు గాజులు మాత్రం ఉన్నాయి.
‘‘అదేమిటి? అప్పుడే తీసేశావ్?’’ అంది వాళ్ల అమ్మమ్మ!
‘‘అబ్బ, ఒకటే చప్పుడు చేస్తున్నాయి అమ్మమ్మా’’ అంది.
అమ్మమ్మగారికి సమాధానం నచ్చలేదు కాని, పక్కనే వున్న కొత్త మొగుడుముందు మనవరాలిని చీవాట్లు పెట్టడం ఇష్టంలేక కాబోలు ఏమీ అనకుండా ఊరుకుంది.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి