డైలీ సీరియల్

పూలకుండీలు - 36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ రోజు
చుక్క తెగిపడ్డట్టు ముంబై నుండి హఠాత్‌గా హైదరాబాద్ హాస్పిట్లో ఊడిపడ్డాడు ఎల్లయ్య.
‘‘ఇల్లు వాకిలీ, పిల్లా జెల్లల్ని వదిలిపెట్టి ఏడు నెల్లనుండి ఇక్కడ కూర్చున్న ఇల్లాలు ఇంటిమీద ధ్యాసతో, పిల్లలమీది బెంగతో, ఆస్పత్రి వాతావరణంతో చిక్కి శల్యమై వుంటుంది’’ అనుకుంటూ వచ్చిన ఎల్లయ్య అంచనాలు తారుమారు చేస్తూ శాంతమ్మ కాస్తా వళ్ళు చేసి, నునుపు దేరింది. పైగా రంగు కూడా వచ్చి మంచి ఆరోగ్యంగా కన్పిస్తుండడంతో అలవికాని ఆశ్చర్యానికి లోనయ్యాడు.
భర్త తనను గుచ్చి గుచ్చి చూస్తుండడంతో కాస్త తడబాటుకు లోనైన శాంతమ్మ భయంతో కూడిన సిగ్గుతో లోనౌతూ ‘‘ఏందయ్య! కొత్తదాన్ని చూసినట్టు నాకెల్లి అట్లా చూస్తున్నావేంది?’’ అంటూ బెరుకు బెరుగ్గా ప్రశ్నించింది.
తన మనసు బావిలో అప్రయత్నంగా రకరకాల అనుమానపు ఊటలు ఎగజిమ్ముకొస్తుంటే ‘‘ఔను నాకు తెలవకడుగుతా! గుండెలు తీసి గుండెలు పెట్టే ఆపరేషన్ చేసినా ఎక్కువలో ఎక్కువ నెల రోజుల్లో ఇంటికి పంపస్తారుగదా! మరి ఇదేంది! గర్భసంచి ఆపరేషన్‌కి ఎవరన్న నెలలకొద్ది ఆస్పత్రిలోనే వుంచుకుంటారా?! ఇంకెన్ని రోజులుంచుకుంటారో అదన్నా చెప్పారా?
నీకు జరిగింది నిజంగా గర్భసంచి ఆపరేషనా? అసలేం జరిగిందేందో ఇప్పటికన్నా నిజం చెప్పు’’ భార్య పొట్టవంక అనుమానంగా చూస్తూ అన్నాడు ఎల్లయ్య.
‘‘నన్నడిగితే నేనేం చెప్పను?’’ అసలు విషయం బయటపడితే అతనేమంటాడోనన్న భయం ముక్తసరిగా సమాధానం చెప్పింది శాంతమ్మ.
‘‘ఇంటి దగ్గర అంతా ఎట్లున్నారో? ఏమో? డాక్టర్నడిగి మందులు రాయించుకొని వెంటనే ఇంటికి పోదాంపా అంతకూ అవసరమనుకుంటే మధ్య మధ్య వచ్చి చూపించుకోవచ్చు’’ మంట అంటుకునేముందు పొగచూరే పచ్చికట్టెల మాదిరిగా మనసు లోతుల్లో రగులుతున్న అనుమానపు పొగను బయటకు రానివ్వకుండా ప్రయత్నం చేస్తూ ఇంటికి వెళ్దామని తొందరపెట్టసాగాడు.
ఆ మాటలు వింటూనే వజ వజ వణికిపోయిన శాంతమ్మ ‘‘ఇక్కన్నించి పోవడం వుండడం మన ఇష్టమేనా? వాళ్ళెప్పుడు పంపిస్తామంటే అప్పుడే పోవాలగాని. మాట మాట్లాడితే ఇల్లో ఇల్లో అంటావేంది? ఇల్లునేమన్న దొంగలెత్తకపోతారా? నేను వచ్చేటపుడు పెద్దమనుషులకు ఏ లోటు రాకుంట ఏర్పాటుచేసి, పిల్లల్ని తీసుకపొయ్యి మా అమ్మగారింట్లోనే వదిలిపెట్టి వచ్చాను గదా, ఇంక భయమేంది? అయినా ఇయ్యాలొచ్చి పిల్లలు పిల్లలని మాట్లాడుతున్నావ్‌గాని వారం రోజుల్లో వస్తనని బొంబాయి బొయ్యినోనివి ఇటు తిరిగి కూడ సూడకుండ పోయిన్నాడు ఈ ప్రేమంత యాడికిబోయింది? ఇంకో పది పది హేను రోజుల్లో వస్తాగాని, ఆస్పత్రిలో అనవసరంగా గొడవ చెయ్యకు’’ అంటూ కావాలనే పుల్ల విరుపు మాటలు మాట్లాడింది.
భార్య మాట తీరును, ఆవిడ వంట్లో కొట్టొచ్చినట్టు కనబడుతున్న మార్పునూ గమనించి ఎల్లయ్య ‘‘నేనేం జెయ్యాల? పోతపోతనే ఫోనాడనో పోయిందని చెప్పాను గదా. దాంతోటి ఎవ్వరికి ఫోన్లు చెయ్యలేకపోయాను. ఆఖరికి మా పాత ఆర్‌ఇ వచ్చినాక ఆయన సెల్లో వున్న ఆ ఆర్‌ఎంపి లింగయ్య ఫోన్ నెంబర్ తీసుకొని నీ కోసం ఎమ్మటే ఫోన్ చేశానా లేదా’’ అంటూ తన ఇబ్బందులు తను చెప్పుకొచ్చాడు.
‘‘మాటలదేముంది ఎన్నైనా చెప్పొచ్చు’’ ఈసడించుకున్నట్టుగా మాట్లాడింది శాంతమ్మ.
శాంతమ్మ మాటలు విన్న ఎల్లయ్య ‘‘ఇప్పటిదాకా నేననుకుంటున్నట్టు నాది వట్టి అనుమానమే గాదు! ఖచ్చితంగా ఈడేదో జరిగింది. అందుకే తను ఇట్లా మాట్లాడుతుంది’’ అనుకోసాగాడు.
‘‘ఏంది నీలో నువ్వే ఏందో గుణుక్కుంటున్నావేంది?’’ మరింత చిరాగ్గా అడిగింది శాంతమ్మ.
ఆవిడ మాట తీరుకు మరింతగా విస్తుమోయిన ఎల్లయ్య ‘‘అసలు నీకేమైందో? నీ ఆపరేషన్ సక్సెసైందో లేదో? ఇంకో ఆస్పత్రికి బొయ్యి చెక్ చేయిద్దాం పా’’ గట్టి గట్టిగా అరుస్తూ గొడవకు లేచాడు.
అతని అరుపులను విన్న హాస్పిటల్ సిబ్బంది పరుగు పరుగున వచ్చి ‘‘ఏంటిది! హాస్పిటల్లో ఈ అరుపులేంటి?’’ అంటూ ఎల్లయ్యను గట్టిగా ప్రశ్నించారు.
‘‘ఏం లేదు మా యావిడను ఇంటికి పోదాం రమ్మంటున్నానంతే’’ ఓ పక్క శాంతమ్మ వంక ఉరిమి ఉరిమి చూస్తూ మరో వంక వాళ్ళకు చెప్పుకొచ్చాడు ఎల్లయ్య.
‘‘ఇప్పటికిప్పుడంటే ఎట్ల కుదురుద్ది? నాలుగు రోజులైనంక పోదాంలే నువ్వనసరంగా గోలజెయ్యకు. ఇపుడు పెద్ద డాక్టరమొచ్చిందంటే నిన్ను, నన్ను ఇద్దర్నీ కలిపి ముక్క తిట్లు తిట్టుద్ది’’ అంటూ భర్తను శాంత పర్చడానికి మెల్లగా ప్రయత్నించసాగింది శాంతమ్మ.
ఆవిడ ఎంత మెల్లగా మాట్లాడుతుంటే తనంతగా రెచ్చిపోతూ ‘‘చూడబోతే అసలు ఆస్పత్రోల్లకంటే ముందు నీకే ఇక్కన్నుంచి కదలడానికి ఇష్టం లేనట్టుంది. మర్యాదగా ఇంటికి పోదాం పదా’’ అంటూ శాంతమ్మ మీది మీదికి పోసాగాడు ఎల్లయ్య.
ఎల్లయ్య వ్యవహారాన్నంతా గమనించిన హాస్పిటల్ సిబ్బంది ఆ విషయాన్ని వెంటనే పైవాళ్ళకు తెలియజేశారు.
పైవాళ్ళు వెంటనే సెక్యూరిటీకి ఫోన్ చేశారు.
దాంతో ఒక్కసారిగా పరుగులు తీసుకుంటూ వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది, వచ్చీ రావడంతోనే ‘‘ఏంటిది నీ ఇష్టమొచ్చినట్టు అరవడానికి ఇది హాస్పిటల్ అనుకుంటున్నావా? లేకపోతే చేపల మార్కెట్ అనుకుంటున్నావా? ముందు బైటికి నడువ్’’ అంటూ ఎల్లయ్యను రెక్కలు పట్టి ఈడ్చుకుంటూ తీసుకుపొయ్యి హాస్పిటల్ ముందు రోడ్డుమీద పడేశారు.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు