డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ- 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అక్కర్లేదు చిన్నయ్యగారు. నాకు నడక అలవాటే. అంతేకాక ఉదయాన నడక వంటి వ్యాయామం మరోటి లేదు’’.
‘‘సరే నీ ఇష్టం’’
‘‘నే వెళ్లి వస్తా చిన్నయ్యగారూ’’ అని మోరీ వెళ్లిపోయింది.
***
హనోడా భవంతి వర్తకుల వాడలో ఉంది. అతడు వర్తకులందరిలో అత్యంత సంపన్నుడు. అక్కడి సమాజంలో అతడికి ప్రత్యేక స్థానం ఉంది. మొహంజొదడో పూజారి వర్గమే అక్కడి పాలక వర్గం. ఆ వర్గంతో హనోడాకి సన్నిహిత సంబంధం ఉంది. ఆ వర్గీయులు హనోడాను గౌరవించేవారు. మరి ఎప్పుడు నగర పాలక వర్గానికి ఖర్చుల నిమిత్తం ధనం కొరవడినా హనోడా లాంటివారే ఆదుకునేవారు.
మర్నాడు మోరీ ఉదయమే హనోడా భవంతికివచ్చింది. రెండస్ధుల భవంతి ముప్ఫై మూడు అడుగుల వీధిలో వుంది.
అనేక గదులు, నడవలు గల ఆ ఇంటిలో స్నానాల గదుల్లోంచి వచ్చే మురుగునీరు వీధి కాలువల్లోకి పారుతుంది. కాలువలపై రాతి పలకలు కప్పబడి ఉంటాయి.
ఆ ఇంటిలో భూగర్భ గదులు కూడా ఉన్నాయి. అవి వేసవిలో చల్లగా ఉంటాయి. ఆహార దినసులు, ఇతర ఆహార పదార్థాలలు నిల్వ ఉంచేందుకు గోదాములు కూడా ఉన్నాయి.
భవంతి ముఖద్వారం చుట్టూ గోడలపై ముచ్చటైన శిల్పాలు చెక్కి ఉన్నాయి. రంగు రంగుల గోడలతో ఆ భవంతి చూడముచ్చటగా ఉంది.
మోరీ భవంతి ముఖద్వారం వద్దకు చేరగా కాపలాదారు ద్వారం తెరిచి ‘‘రండి అమ్మా’’ అంటూ ఆహ్వానించాడు. వెనుకగా ఉన్న పరిచారిక ‘‘మీ కోసం అమ్మగారు ఎదురుచూస్తున్నారు’’ అంది. ఆమె వౌరీని భవంతి వెనుకవైపునకు తీసుకెళ్లింది.
పూజాగృహంలో అమ్మవారి విగ్రహం ముందు మాజా కూచుని పూలదండ గుచ్చుతోంది. మోరీని చూసి ‘‘రా, మోరీ రా, నేను స్నానానికి వెళుతునాను, నువ్వు ఈ దండ గుచ్చుతూ ఉండు’’ అంది.
మోరీ దండ గుచ్చడంలోనూ కళాత్మకత ప్రకటించింది. గుచ్చిన పూలు తీసేసి, ఎరుపు తెల్లపూలు కలిపి ఒక అంగుళం మేర గుచ్చి, పసుపు, నీలం పూలు మరో అంగుళం మేర గుచ్చుతూ పోతూ రంగు రంగుల చక్కని బొద్దు కదంబం తయారుచేసింది.
మాజా స్నానం చేసి వచ్చి ఆ రంగు రంగుల దండని చూసి ‘‘చక్కగా ఉంది’’ అని మెచ్చుకుని అమ్మవారి ముందు దీపం వెలిగించింది. పెద్ద కళ్ళు, పెద్ద బొట్టు, మెడలో బంగారు, రత్నాల హారాలతో దేదీప్యమానంగా వుంది అమ్మవారి విగ్రహం.
మాజా అమ్మవారి మెడలో పూలదండ వేసి పూలు జల్లింది. మోరీ కూడా పూలు జల్లింది. మాజా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తోంది.
అప్పటికే స్నానాదలు చేసి హనోడా, అజోడా వచ్చారు. వాళ్ళు కూడా పూలు జల్లి దండాలు పెట్టి దైవాన్ని వౌనంగా స్తుతించారు.
‘‘మోరీ, ఇంక గానం చేయి అమ్మా’’ అంది మాజా.
మోరీ ముందు తీగ వాయిద్యాన్ని మీటుతూ నెమ్మదిగా ఆలాపన చేస్తూ స్వరం హెచ్చించింది. గొంతు గంటలా మోగుతూ వీనుల విందు చేయసాగింది. దాంతో భవంతిలోనున్న సేవకులంతా ఆ రాగాలాపనని, స్వరకల్పనని విని అక్కడకు చేరారు. దైవ సన్నిధిలో ఎవరిని ఆపగలరు! ఆ అపురూప సంగీత ఝరిలో అంతా తడిసి ముద్దయ్యారు.
పూజ అయ్యాక అజోడా మోరీతో ‘‘మధురాతి మధురంగా పాడావు, మోరీ!’’ అన్నాడు.
మోరీ సిగ్గుతో కింద చూపు చూసింది.
‘‘ఏదీ మరోపాట పాడు, మోరీ’’ అని కోరాడు అజోడా.
మోరీ పాట అందుకుంది. ఈసారి ఆమె ఇంకా భావనాయుతంగా పాడేసరికి అజోడా ‘అద్భుతం అద్భుతం’ అని చప్పట్లు కొట్టాడు.
‘‘నీ కంఠంలో తేనెపట్టు కాని ఉందా ఏమిటి?’’ అని వినోదంగా అడిగాడు హనోడా. అందరూ బిగ్గరగా నవ్వారు.
మోరీ రోజూ ఉదయం హనోడా భవంతికి వస్తోంది.
ఓ రోజు మాజా భర్త హనోడాతో ‘‘ఏవండోయ్, నాకు ఇంటి పనులతో ఒక్క క్షణం తీరిక దొరకడంలేదు. ఎప్పుడు పనివాళ్ళు ఏదో ఒక సమస్య తెచ్చి పెట్టి సమాధానం చెప్పమంటారు. ఇంత పెద్ద భవంతి, ఇంతమంది పరిచారకులు, పరిచారికలు, బోలెడంత పనులు! మోరీని పనివాళ్ళమీద అజమాయిషీకి పెట్టుకుందామా అని అనుకుంటున్నా. చురుకైన పిల్ల. నాకు బాగా సహాయపడుతుంది’’.
‘‘నాన్నగారూ, మన భవంతికి ప్రధాన పూజారిగారు విచ్చేసినప్పుడు అమ్మ మోరీనే విందుకు ఏర్పాట్లు గట్రా చేయమంది. ఆమె పనివాళ్ళ చేత చక్కగా పని చేయించి విందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. విందులో ఆమె నృత్యగానం చూసి పూజారి వర్గం అంతా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు కూడా’’ అన్నాడు అజోడా.
‘‘ఔను, ప్రధాన పూజారిగారు ఎవరా అమ్మాయని నన్ను అడిగి తెలుసుకుని తెలివైన పిల్ల అని మెచ్చుకున్నారు. ఆమె మన ఇంటిలో పనిచేస్తే నాకేం అభ్యంతరం లేదు’’ అన్నాడు హనోడా.
‘‘సరే, రేపు లీబోని నన్ను కలుసుకోమని చెప్పండి’’ అంది మాజా. తల ఆడించాడు హనోడా.
మర్నాడు ఉదయమే లీబో మాజా ముందు చేతులు కట్టుకు నిలబడ్డాడు.
‘‘లీబో! ఆ దినం ప్రధాన పూజారిగారు పరివార సమేతంగా మా భవంతికి విచ్చేసినప్పుడు మీ అమ్మాయి మోరీ నాకు చాలా సాయం చేసింది. మోరీని మా భవంతిలో నాకు సాయంగా ఉంచుకుందామని నిశ్చయించా. ఆమె ఉదయం నుంచి దీపాలు పెట్టేవరకూ మాతోనే ఉంటుంది’’.
‘‘అమ్మగారూ! అది దాని అదృష్టం, మా పుణ్యఫలం. మేం మీ కుటుంబ సేవకులం. నెలకు వరహా జీతం ఇస్తానన్నారుగా, అది చాలు.’’
‘‘జీతం మాకు వదిలిపెట్టు లీబో. ఆమె దుస్తులు, అలంకారాలు మా హోదాకు తగ్గట్టు ఉండాలి కాబట్టి అవి మేమే చూసుకుంటాం’’.
‘‘చిత్తం తమ దయ’’
- ఇంకా ఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు