డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇన్ని వస్తువులు తన కోసం కొనుక్కున్నా మాజా మోరీకి ఒక వస్త్రం కాని, పూసల హారం కానీ కొనిపెట్టలేదు. ఆమె పిసినారి కాదు.
మోరీపట్ల భర్తకు ఏమంత ఆసక్తి లేదు. కానీ మోరీ అంటే కొడుకు అజోడా మరీ ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. అందుకే మోరీ అంటే (మాజా)ఆమెలో అసూయ జనించింది. ఆమెను మరీ నెత్తికెక్కించుకోకూడదు. ఆమె మనసు బాధపడాలి, అదీ ఆమె ఉద్దేశం.
అలాగే బళ్లని తెరలు, దుప్పట్లు అమ్మే అంగడి ముందు ఆపి ఆ అంగడిలో దుప్పట్లు, తెరలు, తుండుగుడ్డలు, ద్వారాలకు వేలాడదీసే పూసల తోరణాలు కొన్నారు. ఈ సామాన్లు కూడా వెనక బండిలో పెట్టించి ఇంటి ముఖం పట్టారు మాజా, మోరీలు.
తనకు యజమానురాలు ఏ బహుమానం కొనలేదని మోరీ బాధపడలేదు. దానికి కారణం యజమానురాలు ఇచ్చిన స్వర్ణ కంకణాలు, చిన్నయ్యగారు ఇచ్చిన స్వర్ణ హారం చాలా విలువైనవి అవడం వల్ల. వాటి ముందు పూసల హారాలు, తలపాగాలు ఏపాటి? వాటిని తన జీతంతో కొనుక్కోవచ్చు.
దారిలో ఓ ఇంటి ముందు పసి పిల్లవాడు చక్రాల మీదున్న మట్టి ఎద్దు బొమ్మని తాడుతో లాగుతున్నాడు. లాగుతూంటే ఎద్దు తల కిందకీ మీదకీ ఆడిస్తోంది. తల, మెడ ఎద్దు ముందు కాళ్ల మధ్యనున్న అడ్డుపుల్లకు అతికి ఉన్నాయి. అంటే మెడకున్న రంధ్రం గుండా పుల్ల పోవడం వల్ల కదలికకు తల, మెడ ఆడుతూ చూడముచ్చటగా ఉంది.
దారికి రెండో వైపు గృహ నిర్మాణం సాగుతోంది. ఓ వడ్రంగి దంతపు కొలమానంతో తయారుచేస్తున్న ద్వారబంధాన్ని కొలుస్తున్నాడు. చిత్రమేమిటంటే కొలమానంపై విభజన గుర్తులు నలుసు కంటే సూక్ష్మంగా ఉన్నాయి. అంటే వాస్తు శిల్పులు, యంత్రకులు చేసిన నిర్మాణాల్లో తేడా వచ్చినా అది నలుసుకంటే చిన్నది.
రహదారిమీద ఇంకా బళ్ళు వస్తున్నాయి. కొన్నిటికి పరదాలు లేవు. ఓ బండిలో ఓ మహిళ, ఓ పురుషుడు కూచుని ఉన్నారు. వాళ్ళను చూసి మాజా బండి చోదకుడిని ఆపు అంది. బండి ఆగింది.
ఆమె బండి దిగి ఆ మహిళ వద్దకు వెళ్లి ‘ఏమే అంబా! మా ఇంటిదారి మరిచిపోయావా ఏమిటి?’ అంది.
‘‘ఓహో మాజానా! నీ ఇంటిదారి నేను మరిచిపోవాలన్నా మరవగలనా అమ్మా! మావాడికి పెళ్లి అయిందిగా. మొన్నటివరకు పెళ్లి సందడి, ఇప్పుడు కొత్త కోడలు రాక సందడి. ఏంటి మా కోసం అంగళ్ళలో కొద్దిగానైనా సరకు ఉంచావా?’’ అని హాస్యమాడింది.
‘‘ఈమె మోరీ. మా భవంతి నిర్వాహకురాలు. ఈమె భవంతికి కావాలసిన సామాన్లు కొంటానంటే నేనూ తోడు వచ్చా. కొన్ని కొనుగోళ్ళు చేశా. నువ్వు కూడా అంగళ్ళ వీధికి వెళుతున్నట్టుంది?
‘‘ఔను. మాజా. మా కొత్త కోడలు వస్తోందిగా! ఆమె కోసం ఆభూషణాలు కొనడానికి వెళుతున్నాం.’’
‘‘మీ కోడల్ని పెళ్ళిలో చూశా. ఆమె మీ ఇంటికి వస్తే మరి మీరు దీపం పెట్టనక్కరలేదు. అంత చక్కనిది’’.
‘‘అంతా అమ్మవారి దయ. మాజా నువ్వు కోడల్ని ఎప్పుడు తెచ్చుకుంటున్నావు? ప్రధాన పూజారిగారి మనవరాలని అజోడాకి ఇస్తున్నట్టు విన్నాం. అది నిజమేనా?’’
‘‘వాళ్ళు సందేశాలు పంపారు కానీ మావాడు తేల్చలేదు. మా వారికి ఆ సంబంధం ఇష్టమే’’.
‘‘ఔను, మంచి సంబంధం. ప్రధాన పూజారిగారితో వియ్యం అంటే మాటలా? తొందరగా కానిచ్చేయ్’’
‘‘నా చేతిలో ఉంటేగా, సరే వెళ్లి వస్తా’’ అంటూ బండి ఎక్కింది.
వాళ్ళు ఇంటికి చేరుతూండగా దీపాలు పెట్టే వేళయింది.
***
మర్నాడు మోరీ ఆకుపచ్చ పట్టు తల పాగా, బంగారు హారం, చేతికి కడియాలు, కుండలాలు ధరించి రాచఠీవితో వచ్చింది. ఆమెను చూసి అజోడా వ్యాఖ్య చేయకుండా ఉండలేకపోయాడు.
‘‘ఓ మాట చెప్పేదా మోరీ? ఏమనుకోవు కదా?’
‘‘చెప్పండి చిన్నయ్యగారూ, తమరు దయామయులు’’.
‘‘ఈ తలపాగా, కుండలాలు, మెడలో స్వర్ణహారం నీ అందానికి రాజరికపు హుందాతనం కూడా తెచ్చిపెట్టాయి’’.
‘‘అంతా తమరి ప్రసాదమే’’
‘‘నీకు అందం, హుందాతనం మేం ప్రసాదించామా?’’ అన్నాడు అజోడా నవ్వుతూ.
‘‘ఈ ఆభూషణాలు ప్రసాదించింది మీ కుటుంబమే కదా, చిన్నయ్యగారూ’’
‘‘అవి నీవు నీ పనితీరు, నృత్య గాన నైపుణ్యంతో సంపాయించుకున్నవి. అది సరే కాని ఇవాళ నువ్వు అర్చనలో ‘‘ఓ పశుపతీశ్వరా, సర్వజీవి రక్షకా..’ అనే కీర్తన పాడాలి. అది ఎన్నిసార్లు పాడినా వినాలనే ఉంటుంది.’’
మోరీ నవ్వుతూ ‘‘ఆ పాటని తమరే కాదు అమ్మగారు కూడా మెచ్చుకుంటారు కానీ నాకు నచ్చేది ‘కనికరించు నన్ను ముక్కంటి దేవా..’
‘‘ఔను.. అదీ బాగుంటుంది కానీ నువ్వు ఏ పాట పాడినా నీ గొంతు మాధుర్యం దాన్ని వినసొంపుగా చేస్తుంది.’’
‘‘అన్నట్టు చిన్నయ్యగారూ ఈ రాత్రి నగర రంగస్థలంలో నా కార్యక్రమం ఉంది.’’
‘‘అందుకా ఈ శృంగారం. నే తప్పకుండా నా మిత్ర బృందంతో వస్తాను’’
‘‘కార్యక్రమానికి భవంతి వెనుక నా గదిలోకి వెళ్లి అభ్యాసం చేయాలి. వాద్యగాళ్లు వచ్చే ఉంటారు. అర్చనలో భక్తిపాట పాడి అభ్యాసానికి వెళతానని అమ్మగారికి చెప్పాను’’.
‘‘అన్నట్టు అంగళ్ళ వీధికి వెళ్లి బోలెడన్ని సామాన్లు నువ్వు, అమ్మా కొనుక్కొచ్చారట?’’
‘‘తమకు, పెద్దయ్యగారికి శాలువలు, పక్క బట్టలు, ద్వారాలకు తెరలు, పూసల తోరణాలు కొన్నారు. అమ్మగారు తమకోసం వస్త్రాలు, శృంగార సామాన్లు కొనుక్కున్నారు. తమరు చూడలేదా?’’
‘‘ఇంకా చూడలేదు. చూస్తాలే..’’
అజోడా ఆమెతో ఇంకా ఏమేమో మాట్లాడటానికి ఆతురత పడుతున్నాడు కానీ ఆమె మనసంతా ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండడంతో ‘సరే, చిన్నయ్యగారూ, వంటింటి కాలువలో మురుగునీరు నిలిచిపోయిందని వంటవాళ్ళు గొడవ చేస్తన్నారు.
- ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు