డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమరు అనుమతిస్తే వెళ్ళి శుభ్రం చేయించే ఏర్పాటుచేస్తా’’ అంది.
అజోడా ఆమెను ఆపలేకపోయాడు. ఆమెపై కోపం వచ్చింది. తనంటే అంత నిర్లక్ష్యమా! ఆమె తన ఇంటిలో సేవకురాలు కాని తన విధులు ఆమె సవ్యంగా నిర్వర్తిస్తోంది. అందరూ ఆమె పనిని మెచ్చుకుంటున్నారు. అటువంటిది తాను ఏ అధికారంతో ఆమెను నిలదీయగలడు?
ఆమె అంటే తనకు అంత ఇష్టమా? ఔను ఇష్టమే! చక్కనిది, ఒకసారి ఆమెను చూస్తే మళ్లీ మళ్లీ చూడాలని అనిపించే చక్కదనం. పనిమంతురాలు. బంగారానికి తావి అబ్బినట్లు జనం మైమరిచేలా పాడుతూ నృత్యం చేయగలిగే నృత్యాంగన, గాయని. నాగస్వరం వాయిస్తున్న పాములవాడిని చూసి పడగలు ఆడిస్తున్న సర్పాల్లా ప్రేక్షకులు ఆమె నృత్యాగానాన్ని తలలు ఆడిస్తూ తన్మయం చెందుతున్నారు. అటువంటి సౌందర్యం, మధుర కంఠస్వరం ఆస్వాదించాక ఎవరు మాత్రం ఆకర్షితులవరు?
తన గదిలో ఆమె అభ్యాసంచేస్తున్నపుడు భవంతి నలుమూలలా మారు మోగే ఆమె పాట వినడానికి పరిచారికలు, పరిచారకులు ఆ గది ముందు గుమికూడేవారు. దాంతో ఆమె భవంతి పనులకు అంతరాయం కలగడంవలన గదిముందు వాళ్ళు గుమికూడదని ఆదేశం జారీ చేస్తూ పూజాగృహంలో ఉదయం తన పాట వినవచ్చని ప్రకటించింది. అటువంటి ఆమె గానామృతాన్ని సేవించి తాను ఆమె ప్రేమలో పడ్డాడా? ఆమె తనను మోహపాశంలో బంధించిందా? ఆమెను తాను ప్రేమించినా ఆ ప్రేమ ఫలిస్తుందా? తనకూ ఆమెకూ పెళ్లి సాధ్యమేనా? తాను ఆమెను పెళ్లి చేసుకునే ఆలోచన చేసేవరకు వచ్చాడా? వేరే చెప్పాలా నాయనా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే జవాబు. ఔను అంది మనసు.
కానీ తానెక్కడ, ఆమె ఎక్కడ? అసాధ్యమేకాదు, అసంభవం! కానీ తానే సాధ్యం చేయాలి. లేకపోతే అన్ని అడ్డంకులే. ఆమె తనంతట తాను తనను పెళ్లాడతానని అంటుందా? ఎన్నటికీ అనదు.
ఆమె తెల్లగా ఉన్నా నల్లజాతికి చెందింది. తాను తెల్లజాతి మనిషి. తన పూర్వీకులు హిమాలయ పర్వతాల ఆవలి నుంచి వలస వచ్చినవాళ్ళు. తన జాతికి చెందినవారి కళ్ళు చీల్చినట్టుంటాయి. ఆమె జాతివాళ్ళు ఉత్తర భారతీయ సంతతివారే.
తాను వాణిజ్య వర్గానికి చెందిన అతి సంపన్నుడు. ఆమె తండ్రి తన చేనేత వస్త్ర కర్మగారంలో పనిచేసే ఉద్యోగి. తన కుటుంబానికి ఆ సమాజంలో ఎనలేని గౌరవం ఉంది. మొహంజోదడోలో అర్చకులే పాలకులు కూడా. వాళ్ళు కూడా తన కుటుంబాన్ని గౌరవంగా చూస్తారు. తన తండ్రి నగర ప్రముఖులలో విశిష్టుడు. పాలక వర్గానికి నిధులు అవసరమైనప్పుడు సర్దే వర్తకుల్లో అతడు ఒకడు.
తన తండ్రి ప్రధాన పూజారిని తన భవంతిలో విందుకు ఆహ్వానించినప్పుడు అతడు పూజారి వర్గాన్ని వెంట బెట్టుకుని ఆతిథ్యం స్వీకరించి ఆ విందులో పాల్గొంటూ వుంటాడు. కొండమీద ఏ ఉత్సవం జరిగినా తన కుటుంబాన్ని పూజారి వర్గం గౌరవ మర్యాదలతో స్వాగతం పలుకుతుంది.
వాణిజ్యంలో కూడా తన కుటుంబానిది అగ్రస్థానమే. తాము ఉత్పత్తి చేసే వస్త్రాలు, తైలాలు, ఆభూషణాలు మెసపటోమియా, ఈజిప్ట్‌లకు ఎగుమతి అవుతున్నాయి. ఆ విధంగా మోరీ కుటుంబం సామాజిక స్థాయి, తన కుటుంబ సామాజిక స్థాయికి చాలా తక్కువ.
ఐతే తమ సమాజంలో రెండు జాతుల మధ్య వివాహాలు అరుదైనా జరుగుతూ ఉంటాయి. కానీ మోరీ విషయంలో ఆర్థిక భేదం మరీ ఎక్కువగా ఉండడంవలన తాను ఉడుము పట్టు పడితేనే తమ వివాహం సాధ్యం అవుతుంది. ఆలోచించిన కొద్దీ ఆమె పట్ల అతడి ప్రేమ బలీయమవుతోంది.
ఆ రాత్రి అతడు మోరీ సంగీత నృత్య కార్యక్రమం చూడడానికి మిత్రులతో వెళ్లాడు. ముందుగా ఓ నల్లజాతి యువతి నర్తిస్తోంది. కటిపై కుడిచేయి ఉంచి ఎడం చేతిని ఎడం తొడపై దరువుకు అనుగుణంగా తాటిస్తూ చిందులేస్తోంది.
ఆమె ధరించిన కంచు గాజులు మధురమైన ధ్వని చేస్తున్నాయి. ఎడం చేతికి మూలంనుంచి మణికట్టువరకు కంచు గాజులున్నాయి. కుడి చేతి మోచేతికీ, మణికట్టుకీ రెండేసి కంచు గాజులున్నాయి.
మెడలో రెండు పతకాలుగల హారం నిరచ్ఛాదిత రొమ్ముల మధ్య ఓలలాడుతోంది. ఆమె నృత్య కళా వైభవాన్ని ఆస్వాదిస్తున్న స్ర్తి పురుష ప్రేక్షకుల దృష్టంతా ఆమె నైపుణ్యంపైనే ఉంది. కాని వెకిలి నవ్వులు ఎగసక్కెపు కేరింతలు లేవు. వేల సంవత్సరాల క్రిందట పదును తేలిన ఆ నాగరికతకు నిదర్శనం. మన జాతీయ సంగ్రహాలయంలో ఉన్న ఆనాటి నర్తకి కంచుబొమ్మ
తర్వాత తన కోకిల కంఠాన్ని పలికిస్తూ, అపురూప నృత్య పటిమను ప్రదర్శిస్తూ మోరీ ప్రేక్షకుల మదిని దోచేసింది. ఆ నృత్య గానం చూస్తూ అజోడా గుండె చిందులు వేసింది. ఇంటికి వచ్చాక చెవిలో ఆమె కంఠస్వరమే మారుమోగుతోంది. ఆమె నృత్యమే కళ్ళ ఎదుట ఆడుతోంది. ఆ సౌందర్య మూర్తిని, కళా నిక్షేపాన్ని సొంతం చేసుకోకపోతే తన బతుకు వ్యర్థమనిపిస్తోంది అతడికి. రాత్రంతా ఆ ఆలోచనల జాలంలోనే గడిపాడు. ఎంత త్యాగమైనా చేసి ఆమెను జీవిత భాగస్వామిని చేసుకోవాలనీ, తన ప్రగాఢ ప్రేమని ఆమెకు వ్యక్తపరచాలని దృఢనిశ్చయం చేసుకున్నాడు ఉదయం లేవగానే.
ఉదయం మోరీ పనిలోకి వచ్చి భవంతి పారిశుధ్యం పరిశీలిస్తూ అజోడా గదికి వచ్చింది. అతడు వ్యాయామశాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు.
‘‘చిన్నయ్యగారూ నమస్కారం’’ అంది అతణ్ణి చూసి వంగి దండం పెడుతూ.
‘‘నిన్న నీ కార్యక్రమం అద్భుతం విలక్షణం, అనితర సాధ్యం. నీకు అభినందనలు’’.
‘‘్ధన్యవాదాలు చిన్నయ్యగారూ! అంతా మీ చలవ.’’
ఆమెను తీక్షణంగా చూశాడు. మెరుస్తున్న నక్షత్రాలున్న నీలం పట్టు తలపాగా, దానికి ముత్యాల హారం, మెడలో వెండి పతకంగల హారం శబ్దం చేస్తూ కదలాడుతోంది.
తాను నిత్య జీవితంలో అనేక సుందరాంగుల్ని చూస్తూంటాడు కానీ వాళ్ళముందు ఈమె చుక్కలమధ్య చంద్రబింబంలా అందాల వనె్నలు చిందిస్తున్నట్టు కనిపించింది అతడికి. - ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు