డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మనం ఏకాంతంలో కలుసుకోవడం మంచిది కాదనిపించింది చిన్నయ్యగారూ. ఎవరికి తెలిసినా స్ర్తిగా నా పరిస్థితి ఏమవుతుందో తమరు ఆలోచించాలి’’.
‘‘మరి నిన్న ఒప్పుకున్నావే?’’
‘‘ఒప్పుకున్నా కానీ తర్వాత నాకు ధైర్యం కలగలేదు. మన వివాహం నిశ్చయమయాక మనం కలుసుకోవడం భావ్యమని నా అభిప్రాయం’’.
‘‘నా మీద నీకు నమ్మకం లేదా?’
‘‘లేకేం చిన్నయ్యగారూ, మనం దగ్గరయాక వివాహం ఏదో కారణాన అవకపోతే నేను తలెత్తుకు తిరుగలనా? తమరు దయ చేసి నా పరిస్థితి గ్రహించండి.’
కొద్ది క్షణాలు అజోడా వౌనంగా ఆలోచించి, ‘‘ఔను, మోరీ, నువ్వన్నది అక్షరాలా నిజం. అలా కోరడం నా పొరబాటే. నువ్వు మా వంశ గౌరవానికి తగినదానివేనని ఈ ఉదంతంతో నిరూపించావు’’ అన్నాడు.
‘‘నే వెళ్లివస్తా’’ అంది మోరీ.
‘‘మరి మన వివాహం గురించి నీ అంగీకారం మాటేమిటి? ఔనే కదా?’’
‘‘ఇవాళ చెప్తానన్నా కానీ ఉదయమే చెప్తానని చెప్పలేదే?’’ అంది మోరీ కొంటెగా.
‘‘ననె్నందుకు ఇంతలా ఏడ్పిస్తున్నావు మోరీ? నేను రాత్రల్లా నిద్రపోలేదు, తెలుసా?’’
‘‘ఇంక హాయిగా నిద్రపోండి’’
‘‘అంటే నువ్వు ఔనన్నట్లేనా?’’
‘‘ఔను.. ఔను.. ఔను..ఔను......’’
‘‘ అబ్బా నాలుగు సార్లు ఔనన్నావు.. ఆహా ఏమీ నా అదృష్టం! నా మనసు రెక్కలు తొడుక్కుని ఎక్కడెక్కడికో ఎగిరిపోవాలని ఉబలాటపడుతోంది’’.
‘‘చిన్నయ్యగారూ! తమరి మనసు ఉబలాటపడితే చాలదు. మీ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు కూడా ఉబలాటపడతారా అని?’’
‘‘అది నాకు వదిలేయమని నీకు చెప్పాగా. ఇంతకీ నాలో నీకేం నచ్చిందని ఔనన్నావు?’’
‘‘మీ స్వభావం?’’
‘‘ఎటువంటిది నా స్వభావం?’’
‘‘నా ఒప్పుకోలే మీ మంచి స్వభావానికి నిదర్శనం’’
‘‘మాటకారివే! నీలో నాకు ఏం నచ్చిందో చెప్పేదా?’’
‘‘సెలవివ్వండి’’
‘‘నేను నీకు ఒక్క క్షణం దూరంగా ఉండలేనట్టుగా నువ్వు చేసిన నీ మాయ’’
‘‘మాయ అంటే?’’
‘‘మాయ అంటే సౌందర్యం, మాట, పాట, నృత్యం, సొగసు...’’
‘‘చాలు లెండి.. ఇప్పుడు మీ మనసుకు రెక్కలు తొడుక్కుని ఎగిరిపోవాలని ఉంటే మీ పొగడ్తలతో నా మనసుకి బండరాళ్ళు కట్టుకుని నీళ్ళలో ములిగిపోవాలని ఉంది’’ అంది నవ్వుతూ.
‘‘అది హాస్యం! నిజానికి నీ మనసుకి ఏం చేయాలని ఉంది?’’
‘‘ఓ కన్యకి సుందరుడు, దృఢకాయుడు, సంపన్నుడు, ప్రతిష్ఠుడు అయిన వరుడు దొరికితే ఆమెకు ఏం చేయాలని ఉంటుంది?’’
‘‘ఏం చేయాలని ఉంటుందా? నృత్యం చేయాలని ఉంటుంది.’’
‘‘ఊహూ! చంద్రవంకకు మబ్బు ఉయ్యాల కట్టి ఊగుతూ చుక్కలను అందుకోవాలని ఉంటుంది.. సరే సెలవిప్పించండి. వెళ్లి వస్తా’’
‘‘ఔను, నీకు పనులున్నాయిగా, వెళ్లు. తర్వాత ఇద్దరం కలసి రెక్కలు కట్టుకుని ఎక్కడికో ఎగిరిపోదాం. అలాగే చంద్రవంకకు మబ్బు ఉయ్యాల కట్టి ఊగుతూ చుక్కలని అందుకుందాం’’.
ఇద్దరూ నవ్వుల జడివానలో తడిసి ముద్దయ్యారు.
మోరీ వయ్యారంగా నడిచి వెళుతూంటే ఆవైపే చూస్తూ నిల్చున్నాడు అజోడా. ఆమె ద్వారం వద్దకు వెళ్లి తిరిగి చూసి చిన్నగా నవ్వుతూ వంగి ‘సెలవు చిన్నయ్యగారూ’ అంది. అజోడా గుండెమీద చేయి పెట్టుకుని తల వంచి మందహాసం చేశాడు. ఆమె వెలుగులీనుతున్న కళ్ళతో అతణ్ణి చూసి శబ్దం కాకుండా నవ్వి వడివడిగా బైటకు నడిచింది.
ఆ మర్నాడు అజోడా వాళ్ళ అమ్మ మాజా వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఆమె తన శోభాయమానంగా అలంకరించిన గదిలో ఆసనంపై కూచుని ఎదురుగుండా వెండి పంజరంలో చిలుకతో వినోద సంభాషణ చేస్తోంది.
‘‘ఏమే, సుందరీ! రాత్రి బాగా పండుకున్నావా?’’ అంది మాజా చిలకతో.
‘‘పండు తిన్నా’’ అంది చిలక.
‘‘నీ ఇల్లు బంగారంగానూ. రాత్రి పండు తినడమేమిటే?’’
‘‘పండు తిన్నా.. పండు తిన్నా.. పండు తిన్నా..’’
‘‘దీనికి ఎన్నిసార్లు చెప్పినా పండు తినడానికీ, పండుకోవడానికీ తేడా తెలిస్తేనా?’’
‘‘నాన్న వచ్చాడు... నాన్న వచ్చాడు’’ అరిచింది చిలక.
‘‘నోర్మూయ్యవే.. నేను నాన్న అంటే నువ్వు కూడా మావాడిని నాన్నా అంటావే... ఏరా నాన్నా..’’
‘‘నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలమ్మా’’
‘‘చెప్పరా’’
‘‘నా పెళ్లి గురించి నాన్నగారు, నువ్వు ప్రస్తావిస్తూంటారు కదా!’’
‘‘ఔనురా.. ప్రధాన పూజారిగారి మనవరాలి సంబంధం మీ నాన్నగారికి బాగా నచ్చింది. వాళ్ళు కూడా చేసుకోమని గుర్తుచేస్తూంటారు. నువ్వు మాత్రం అలాగే చెప్తానులే అంటూ దాటవేస్తూ వచ్చావు. వాళ్ళు తొందర పెడుతున్నారురా’’.
‘‘నాకు ఆ సంబంధం వద్దు..’’
‘‘మీ నాన్నగారు ఆ సంబంధం చేసుకోవడానికి ఎంత ఉబలాటపడుతున్నారో తెలుసా? ఆ సంబంధం చేసుకుంటే సమాజంలో మన గౌరవం అనేక రెట్లు వృద్ధి చెందుతుందట. పిల్ల కూడా చక్కగా ఉంటుంది.’’
‘‘నేను ఆమెను చేసుకుంటే మీకు సంతోషంగా ఉండవచ్చు కానీ నాకు మాత్రం బతుకు మోయలేని భారం అవుతుంది.’’
‘‘ఎందుకు నాన్నా అలా అంటున్నావు?’’
‘‘నేను మరో అమ్మాయిని చేసుకోవాలని నిశ్చయించా..’’
‘‘ఎవరా అమ్మాయి?’’
‘‘సౌందర్యంలో, గుణంలో, మంచితనంలో ఆమెకు ఆమే సాటి’’
‘‘ఎవరురా ఆ మాయలమారి?’’
‘‘ఆమె చక్కదనాన్ని చూసిన జనం ఆమెనే చూస్తూ ఉండిపోతారు. ఆమె పాట పాడితే కినె్నరలు కూడా మైమరిచి ఆమె గాన సంద్రంలో ఓలలాడుతారు. ఆమె నృత్యం చూసి అప్సరసలు కూడా సిగ్గు మొగ్గలవుతారు.

- ఇంకా ఉంది