డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యాహ్నం ఓ నూతి వద్ద బండి ఆపి తెచ్చుకున్న యవ రొట్టెలు, పప్పు, కూర తిన్నారు. నూతి వద్ద ఓ మహిళ తాడు కట్టిన కుండను బావిలోకి దింపి నీళ్ళు తోడుతోంది. ఆమె నీళ్ళు పోస్తే నోటికి అరచేయి పెట్టి తాగారు. కొంతసేపు విశ్రమించి బైలుదేరారు.
రాత్రి ఓ పల్లెకు చేరి అక్కడే ఆహార అంగడిలో భోంచేసి ఇద్దరూ బండిలో నిద్రపోయారు. నిద్రపోయేముందు విప్పి ఉంచిన ఎడ్లకు దాణా, నీళ్ళు ఇచ్చాడు జుంబా.
మర్నాడు అజోడాతో జుంబా ఇలా అన్నాడు.
‘‘చిన్నయ్యగారూ, ముందు వచ్చేది అడవి. అందుకోసం మనం ఒంటరిగా కాక బిడారుతో కలిసి ప్రయాణం చేయడం మంచిది. లేకపోతే దోపిడీ దొంగలు, అడవి మృగాల బెడద ఉంటుంది’’ అన్నాడు.
ఆ కాలంలో బిడారులో ప్రయాణం చేసేవాళ్ళు రక్షణ కోసం తోడు భద్రతా సిబ్బందిని ఉంచుకునేవారు. వాళ్ళకు తృణమో పణమో ఇచ్చినా లేక వేడుకున్నా బిడారులో చేర్చుకునేవారు.
‘‘ఔను, జుంబా, ఏదైనా బిడారు వచ్చేవరకు వేచి ఉందాం’’ అన్నాడు అజోడా.
ఆరోజు బిడారు రాలేదు. మర్నాడు ఉదయం ఒక బిడారు వస్తే దాంట్లో చేరి బయలుదేరారు. అడవి దాటాక బిడారు మరోవైపు వెళ్లిపోయింది. వీరు మరోవైపు మళ్లారు.
ఆ రోజు, ఆ మర్నాడు ప్రయాణం చేసి రాత్రికి గోతున్‌దడో కొన్ని ఘడియల దూరం ఉందనగా చీకటి పడింది. దాంతో అక్కడే విశ్రమించి తెలతెలవారుతూండగా బయలుదేరి గోతున్‌దడో చేరారు.
అక్కడ ఓ ప్రయాణీకుల బసలో విడిది చేశారు. అక్కడ ప్రయాణికులకు గదులున్నాయి. ఎడ్ల బళ్ళకు వెనక శాలలున్నాయి.
స్నానాదులు చేసి అజోడా దళారీ సుమాగా కార్యాలయానికి వెళ్ళాడు. అజోడాకి స్వాగతం పలిగి గౌరవించాడు సుమాగా. తర్వాత అజోడా తల్లిదండ్రుల యోగక్షేమం అడిగి తెలుసుకున్నాడు. అజోడాని తన ఇంటికి తీసుకెళ్లి భోజనం ఏర్పాటు చేసి ఆదరించాడు.
‘‘మీరు మా ఇంటిలో ఉండి మా ఆతిథ్యం స్వీకరించాలి’’ అన్నాడు సుమాగా.
‘‘లేదు, నేను ఇవాళే తిరిగి వెళ్లాలి. నాకు ఇంకా పనులున్నాయి’’.
తర్వాత వాణిజ్య చర్చలు జరిగాయి. తమ ఎగుమతుల సరుకు లోధాల్ రేవుకు సకాలం ఎందుకు చేరలేదని అడిగాడు అజోడా.
‘‘ఇటీవల సముద్రంలో తరచు తుపానులు సంభవించడంవలన ఇతర వర్తకుల రెండు ఓడలు ములిగిపోయాయని తెలిసింది. అందువలన మీ సరుకును లోధాల్ రేవుకు పంపకుండా మా వద్దే పదిలంగా ఉంచాం. ఇప్పుడు సముద్రంలో సామాన్య పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీ సరుకును ఇతర వర్తకుల సరుకును మూడు రోజుల క్రితం లోధాల్ రేవుకు పంపించాం. ఈపాటికి ఓడలు బయలుదేరి ఉంటాయి’’.
‘‘ఈ కబురు మాకు తెలియజేయవలసిందే’’.
‘‘అయ్యా, ఓ రత్నాల వ్యాపారి ద్వారా మీకు కబురు పంపించా. కానీ అతడు గోతున్‌దడో తిరిగి రానే లేదు. అతడు మీకు కబురు అందించి ఉంటాడనుకున్నా. కానీ మొహంజోదడో వెళుతుండగా దారిలో అతడిని దోపిడీగాళ్ళు హత్య చేసి రత్నాలు దోచుకున్నారని ఇటీవల తెలిసింది.
‘‘అయ్యో పాపం’’
‘‘అందుకే బిడారులో ప్రయాణం చేయడం శ్రేయస్కరం అంటారు పెద్దలు. అది సరే కాని మీ నాన్నగారు బకాయిల గురించి గుర్తుచేస్తూ ఎవరి ద్వారానో కబురు పంపించారు. దాంతో నేనే వచ్చి మీకు ఆ సొమ్ము చెల్లిద్దామని అనుకుంటున్నా. ఈలోగా తమరే విచ్చేశారు’’ అని పాత బకాయిల సొమ్మును లెక్కవేసి అజోడాకు అప్పజెప్పాడు.
‘‘మా తర్వాత ఎగుమమతి సరుకు ఒక మాసంలో సిద్ధం అవుతుంది. దాన్ని మీరు రప్పించుకుంటారా?’’
‘‘ఇప్పుడు పరిస్థతి సామాన్యం అయింది కదా. సరుకును సిద్ధం చేయండి. నేను మాసం తర్వాత సరుకును రప్పించే ప్రయత్నం చేస్తా’’.
‘‘సరే వెళ్లివస్తా’’ అని అజోడా ప్రయాణీకుల బసకు బయలుదేరాడు. ఈలోగా జుంబా ఎడ్లకు దాణా, నీళ్ళు పెట్టి తనూ భోంచేసి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాడు.
అజోడా తిరిగి రాగానే మధ్యాహ్నం బయలుదేరి సాయంకాలానికి నోరాదడో చేరుకున్నారు.
అజోడా నోరాదడోలో మూడు దినాలకు బస అద్దెకు తీసుకున్నాడు. కొద్దిసేపు విశ్రమించి కాలి నడకన మోరీ కార్యక్రమ స్థలానికి బయలుదేరాడు. మోరీ క్రిందటి రోజే అక్కడకు చేరిందని, నిన్న రాత్రి దగ్గర మరో ఊళ్ళో ఆమె నృత్యగాన కార్యక్రమం జరిగిందని రాత్రి విన్నాడు. నోరాదడోలో ఈ రాత్రి, రేపు రాత్రి అమె కార్యక్రమం ఉంటుందని తెలిసింది.
మోరీ ఇంకా కార్యక్రమం స్థలానికి రాలేదు.
వేదికను కార్యక్రమం కోసం సింగారించారు. వేదికపై రంగు రంగుల వస్త్రాల్ని పరిచారు. నాలుగు వైపులా నాలుగు రాటలు పాతి వాటికి కాగడాలు కట్టారు. చీకటి పడ్డాక కార్యక్రమం వాయిద్యాల ధ్వనులమధ్య ఇద్దరు నర్తకుల నృత్యంతో ఆరంభమైంది.
అప్పుడే మోరీ అక్కడకు చేరింది. అజోడా ఎదురెళ్ళి ఆమెను పలకరించేసరికి ఆమె ఆశ్చర్యానందాలతో పులకించింది. వికసించిన వదనంతో ‘‘మీరు ఇక్కడకు వచ్చారా?’’ అంది నవ్వుతూ. అక్కడ జనం లేకపోతే ఆమె సంతోషంతో తనను వాటేసుకుందునేమో అనిపించింది అజోడాకు.
‘‘నీ కార్యక్రమం చూడడానికి ఏదో నెపంతో ఇక్కడకు వచ్చా మోరీ’’ అన్నాడు.
తనను చూడగానే మోరీ మొహంలో మెరిసిన తళుకు, హర్షాతిరేకాన్ని చూసి ఆనందడోలికలో ఊగసాగాడు అతడు.
మోరీ జనానికి దూరంగా వెళ్లి నిల్చుంది. ఇక్కడ ఆమెను గుర్తుపట్టేవారు లేరేమో. ఒంటరిగా నిలబడి ఉంది. తనకోసమే ఎదురుచూస్తోందని అనిపించి దగ్గరకు వెళ్లి ‘నిన్న చేరావుట’ అన్నాడు అతడు.
‘‘ఔను, చిన్నయ్యగారూ, నిన్న రాత్రి దగ్గిర ఊరిలో కార్యక్రమం జరిగింది’’.
‘‘బాగా జనం వచ్చారా?’’
‘‘వచ్చారు. కానీ మీరేంటి నాకోసం ఇంత దూరం వచ్చారు?’’
‘‘నీ కోసం రాలేదు’’ ‘‘మరెవరికోసం వచ్చారు?’’ - ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు