డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నాకోసం వచ్చాను. నాకు కాబోయే జీవిత భాగస్వామిని కోసం ఎంత దూరమైనా రావడానికి నేను సిద్ధం’’.
మోరీ నవ్వింది.
‘‘ఈ ఊరి బైట జోగార్ అనే ఊరు ఉంది. అక్కడి జలపాతం, కొలను ప్రసిద్ధి. ఆ దృశ్యం చూడ ముచ్చటగా ఉంటుంది. రేపు ఉదయం వెళదాం’’.
ఆమె వౌనం చూసి ‘‘నువ్వు ఎక్కడ బస చేశావు?’’ అని అడిగాడు.
‘‘ఇక్కడ కళాకారిణిల ఇంటిలో’’.
‘‘మా చుట్టాలు జలపాతం చూడడానికి పిలిచారు, వెళతా అని చెప్పి వచ్చేయ్’’.
ఆమె ఆలోచనలో పడింది.
‘‘నన్ను నిన్నూ అక్కడకు వెళుతున్నా, అక్కడ తిరుగుతున్నా, తిరిగి వస్తున్న ఎవరూ పోల్చరు కదా! ఇక్కడైనా నాతో కొద్దిసేపు అలా వాహ్యాళి చేస్తూ గడపవా మోరీ? రేపో మాపో మనం భార్యాభర్తలు కాబోతున్నాం’’.
‘‘నేను ఇలా అంటున్నందుకు నన్ను మీరు క్షమించాలి చిన్నయ్యగారూ. కానీ మనం భార్యాభర్తలవడం ఖాయం కాదు కదా. మీ వాళ్ళు కాదంటే..’’
‘‘వాళ్ళు ఏమననీ, నినే్న నేను ధర్మపత్నిని చేసుకుంటా.. నా ప్రేమను సందేహించకు మోరీ’’.
అంతలా అతడు అంటున్నప్పుడు తను వెళ్ళకపోతే అతణ్ణి వేధించినట్టే అవుతుంది. అతడు చెప్పినట్టు జలపాతానికి వెళుతూండగా కానీ తిరిగి వస్తూండగా కానీ అక్కడ విహరిస్తున్నవారు ఎవరూ పోల్చరు.
‘‘అలాగే చిన్నయ్యగారూ, వస్తాను. ఎక్కడ మిమ్మల్ని కలవమంటారు?’’
‘‘ఈ ఊరి దారి ముఖ్య రహదారిని కలిసే చోట సూర్యోదయం అయిన ఒక ఘడియకు బండిలో నిలబడి ఉంటా’’.
‘‘అక్కడకు నడకన వెళితే..’’
‘‘నిన్ను అంత దూరం నడిపిస్తానా మోరీ? నేను ఎత్తుకుని తీసుకెళతా కానీ నిన్ను నడవనీయను. నీకు ముల్లు గుచ్చుకున్నా, నీ కాళ్ళు కందిపోయినా నా ప్రాణం విలవిల్లాడుతుంది.’’
‘‘నన్ను అంతలా ప్రేమిస్తున్నారా?’’
‘‘కావలిస్తే పరీక్షించి చూడు’’.
‘‘స్పష్టంగా కనబడుతున్నదానికి పరీక్ష ఎందుకులెండి. అలాగే వస్తాను’’.
‘‘మనసు మార్చుకోవు కదా? అలా చేస్తే నేను పిచ్చివాడినయిపోతా’’.
‘‘తప్పకుండా వస్తా, చిన్నయ్యగారూ’’ అంది అతడి చేతిలో చేయి వేస్తూ.
‘‘నాదో విన్నపం. మనం ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు ‘చిన్నయ్యగారూ’ అని నన్ను పిలవకు’’.
‘‘మరెలా పిలవాలి?’’
‘‘ఏవండోయ్’’ అను.
సిగ్గుతో ఆమె చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి.
‘‘పోండి’’ నేనలా పిలవలేను. మనం దంపతులయాక అలా పిలవగలను. ఈలోగా మిమ్మల్ని చిన్నయ్యగారనే అంటాను’’.
‘‘సరే.. నేను నీ మాట కాదనగలనా?’’’
ఇంతలో ఎవరో వచ్చి ‘‘మోరీగారు, మీరు వేదికమీదకు వెళ్లాలి’’ అని అన్నారు.
ఆమె అజోడాతో ‘వెళ్లివస్తా’ అని చెప్పి వెళ్లిపోయింది.
అజోడా కార్యక్రమం చూస్తున్న జనంలో ఒకడయాడు.
అజోడా కార్యక్రమం తర్వాత బసకు వచ్చి తన ప్రియురాలితో కలయిక గురించి ఆలోచించసాగాడు. రాత్రల్లా మర్నాడు ఆమెతో గడపబోయే అమృత ఘడియల గురించి కలలుకంటూ కాలయాపన చేశాడు.
తాను మోరీకి ఇవ్వబోయే కానుకను తీసి చూశాడు. అది విలువైన రాళ్ళు పొదిగిన బంగారపు కడియాలు. చేతికి ఆరు చొప్పున పనె్నండు కడియాలు. సుమేర్‌నుంచి ఓ బంగారు వర్తకుడి వద్ద కొన్నాడు.
ఆమె ఆ కడియాలు తీసుకోకపోతే? ఆమె తీసుకున్నా తన తల్లిదండ్రలకు కనబడకుండా ఎలా ఉంచగలదు? దానికి తాను ఉపాయం ఆలోచించి ఉంచాడు.
చీకటితోనే లేచి స్నానాదులు ముగించుకుని జలపాతం వద్ద ఇద్దరూ ఆరగించబోయే అల్పాహారాన్ని మూటగట్టి బండిలో ఉంచాడు. ఈ ప్రయాణంలో జుంబాని తీసుకువెళ్లకూడదని నిశ్చయించాడు. ప్రేమ యాత్రలో పానకంలో పుడకలా జుంబా ఎందుకు?
రాబోయే ప్రియురాలి పొందు అజోడాలో ఆత్రుత కలిగించింది. అందుకే చీకటితోనే లేచి సిద్ధం అయాడు. జుంబా ఎడ్లకు నీళ్ళు, దాణా పెట్టి పూన్చాడు. బండి కన్నుల్లో కందెన వేశాడు. బండిలో పట్టు పరుపు పరిచాడు. దానిపై చేరబడడానికి పట్టు మెత్తలు అమర్చాడు. బండి రంగు రంగుల పూలతో చూడముచ్చటగా ఉంది. ఎద్దుల కొమ్ములకు ఎరుపు రంగు పూసి దానిపై నీలం రంగు చుక్కలు అదాడు. ఎడ్ల నుదుర్లపై ఎర్రని బొట్లు, శరీరాలపై పసుపు పచ్చని వస్త్రాలు శోభిస్తున్నాయి. ఎడ్ల కాళ్లకు కట్టిన అందెలు మెడలకు కట్టిన గజ్జెలు శబ్దం చేస్తూ వాహనం పరిగెడుతుంటే రతీ మన్మధుల శృంగార శకటంలా వనె్నలీనుతోంది.
అజోడా బండిని తోలుకుంటూ తెలతెలవారుతూండగా దారుల కూడలికి చేరుకున్నాడు. బండిని నిలబెట్టి దగ్గరే నిలబడి మోరీ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆమె వచ్చే దారివైపు చూస్తూండడంలో అతడికి విసుగు కలగడంలేదు. పైగా రోమాంచితం అవుతున్నాడు. హృదయేశ్వరితో ప్రథమ సంయోగం కదా!
సూర్యోదయం అయిన ఒక ఘడియ అని ఆమెతో అన్నాడే కానీ తాను ఆతురతతో సూర్యోదయంతోనే చేరుకున్నాడు. ఒక ఘడియ కూడా అయిపోవచ్చింది. ఆమె జాడ లేదే!
ఆమె మాట తప్పిందేమో! ఔను, తాను అదృష్టవంతుడై ఉంటే తను ఆమెను ఎంత గాఢంగా ప్రేమించాడో, ఆమె కూడా అంత గాఢంగా ప్రేమించదా? సంపన్నతలో, సామాజిక హోదాలో, వంశ ప్రతిష్ఠలో తాను ఆమెకు ఎక్కువే గానీ తక్కువ కాదు. మరి ఆమెకు ఎందుకు ఈ అహంకారం? ఆమె అత్యంత చక్కనిదే. ఆమెను చూసినవాళ్ళు వెనక్కి తిరిగి చూసి మనసులో మెచ్చుకుంటూ ముందుకు సాగుతారు. తాను మాత్రం అందంలో ఆమెకు తక్కువా? ఎతె్తైన విగ్రహం, పసిడి ఛాయ, సూటి దీర్ఘ నాసిక, నిండు పెదవులు, నల్లటి పట్టు దారాల్లా మెరిసే జుత్తు, కత్తుల్లాంటి మీసాలు, తన పురుషోచిత సౌందర్యాన్ని ఏ సుందరాంగైనా మెచ్చుకుంటుంది.
- ఇంకా ఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు