డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ప్రేమ జంట అలా కొలను ఒడ్డున, చెట్ల గుంపులమధ్య విహరిస్తూ కబుర్లు చెప్పుకుంటోంది.
‘‘నా గురించి నీకు ఓ రహస్యం చెప్పేదా’’
‘‘ఏమిటో చెప్పు’’
‘‘నన్ను మీరు పెళ్లాడాలని అనుకుంటున్నారు కాబట్టి ఈ రహస్యం మీకు తెలియాలి. నేను మా అమ్మా నాన్నల కన్నబిడ్డను కాను’’ అంది ఆమె అతడి చేతిలో చేయి వేసి.
‘‘నిన్ను పెంచుకున్నారన్నమాట’’.
‘‘ఔను. వాళ్ళకు వివాహం అయాక చాలాకాలం పిల్లలు కలగలేదు. అప్పుడు వాళ్ళు నది మధ్య వెలసిన ఓ అమ్మవారిని సందర్శించి సంతానం ప్రసాదించమని కోరారు. వాళ్ళు తిరిగి వస్తూంటే నెల్లాళ్ల పసికందు ఓ నిర్జన స్థలంలో వాళ్ళ కంటబడింది. అమ్మవారు ఈ విధంగా వాళ్ళ కోరిక తీర్చిందని ఆ పసికందుని ఇంటికి తీసుకువచ్చి కన్నబిడ్డలా పెంచారు. ఆ పసికందు నేనే. తర్వాత నాకు ఓ చెల్లి, తమ్ముడు పుట్టారు కానీ మావాళ్ళు నన్ను కన్నబిడ్డగానే చూసుకుంటూ వచ్చారు.
‘‘మరి ఈ రహస్యం మీ ఇరుగు పొరుగు వాళ్ళకు తెలిసే ఉండాలి’’.
‘‘అప్పుడు మా అమ్మా నాన్నలు మరో ప్రాంతంలో ఉండేవారు. తర్వాత వాళ్లు మొహంజోదడోకి వలస వచ్చారు. అందువలన ఇక్కడ వాళ్ళకు నా జన్మ రహస్యం తెలియదు’’.
‘‘నీ కన్న తల్లిదండ్రులు తెల్లవాళ్లయి ఉండాలి. అందుకే నువ్వంత తెల్లగా ఉన్నావు’’.
‘‘నన్ను చూసి ఇంత చక్కని పిల్ల తమకు దక్కడం ఆ అమ్మవారి వరప్రసాదమే అని మా అమ్మా నాన్నలు అనుకున్నారట’’.
అజోడా మోరీ చేతిని తన చేతుల్లోకి తీసుకుని ‘‘నా హృదయేశ్వరి, ప్రాణేశ్వరి మోరీ! నువ్వు ఏ కులంలో పుట్టినా, మీ వంశం ఏమైనా, మీ వృత్తి ఏమైనా, మీ సాంఘిక హోదా ఏమైనా నువ్వు ముమ్మాటికీ నా భార్యవు కాబోతున్నావు. నీ జన్మ గురించి ఎవరికీ మావాళ్ళకి కూడా చెప్పనవసరం లేదు. ఈ రహస్యం నా వరకే పరిమితమయి ఉంటుంది’’ అన్నాడు.
ఈ మాటలతో మోరీ భావ విహ్వలమై ‘‘మీలాంటి ఉత్తముడికి భార్య కాబోవడం నిజంగా నా అదృష్టం’’ అంది చెమ్మగిల్లిన కళ్ళతో.
దీంతో అజోడా నిగ్రహించుకోలేక తన ప్రేమను ఆమెను కౌగిలించుకుని హృదయానికి హత్తుకుని వ్యక్తపరిచాడు. ఆమె బాహువులు కూడా అతణ్ణి బిగువుగా బంధించాయి.
దీంతో ఇద్దరి ప్రేమపై పరస్పర ఆమోదముద్ర పడింది. అది అజోడా ఉత్సాహానికీ, ఆత్మవిశ్వాసానికి వేయి ఏనుగుల బలం ఇచ్చింది.
ఇద్దరూ గాలిలో తేలిపోతున్నట్టు నడుస్తూ ఓ నౌక అద్దెకు తీసుకుని కొలనులో విహరించసాగారు. అజోడా తెడ్డు వేస్తున్నాడు.
‘‘నాకు ఇక్కడే ఉండిపోవాలని ఉంది. కానీ తిరిగి నోరాదడో వెళ్లాలి కదా! రాత్రి కార్యక్రమం ఉందిగా!’’ అంది మోరీ.
‘‘మనం తప్పక ఇక్కడకు వచ్చి కొన్ని వారాలుందాం. అదెప్పుడో చెప్పేదా?’’
‘‘చెప్పకండి, నాకు తెలుసు’’ అంది సిగ్గుతో.
‘‘తెలిస్తే చెప్పు’’
‘‘నే చెప్పను’’
ఆమె బుగ్గపై సుతారంగా వేలుతో కొట్టి ‘‘నే చెప్తా. మన ఆత్మలు, శరీరాలు ఒకటైనప్పుడు’’ అన్నాడు అతడు.
‘‘పోండి, మీరు కొంటైపోతున్నారు. అది సరే కాని మనం వెళ్లాలనుకుంటా’’.
‘‘ఔను, మనం ఇప్పుడు బయలుదేరితే సూర్యాస్తమయానికి రెండు గడియలకు ముందు నోరాదడో చేరుతాం’’ అన్నాడు అతడు నౌకను తీరం వైపునకు నడుపుతూ.
వాళ్ళు బండి దగ్గరకు వచ్చేసరికి ఎడ్ల జత దాణా తిని నీళ్ళు తాగి హాయిగా నెమరువేస్తున్నాయి. అజోడా ఎడ్ల శరీరాలని నిమిరి, గంగడోళ్ళను వాత్సల్యంగా తడిమాడు.
బండిని చూసినందుకు, ఎడ్లకు దాణా, నీళ్లు పెట్టినందుకు అక్కడ మనిషికి డబ్బు ఇచ్చి ఎడ్లను పూన్చమన్నాడు.
బండి ప్రయాణానికి సిద్ధమయ్యాక మోరీ ఎగిరి బండిలో కూచోబోతుండగా అజోడా వద్దని చెప్పి తానే ఆమెను ఎత్తి బండిలో కూచోబెట్టాడు. ఆమె సిగ్గుపడుతూ అడ్డు చెప్పలేదు. ఇద్దరూ మనస్ఫూర్తిగా నవ్వారు.
ఊసులు చెప్పుకుంటూ, పాటలు పాడుతూ వింటూ ప్రయాణం సాగించి ఉదయం బయలుదేరిన చోటుకు అంటే నోరాదడోలోని కూడలి వద్దకు చేరుకున్నారు.
మోరీ బండి దిగి ‘‘నేను వెళ్తున్నా. కార్యక్రమానికి సిద్ధం అవాలి, మీరు వస్తున్నారుగా?’’
‘‘బాగుంది మహారాణి, నేను ఇక్కడకు వచ్చింది అందుకే గదా!’’
‘‘అందుకేనా లేక..’’ అని నవ్వి ఊరుకుంది.
‘‘లేక ఏమిటి, చెప్పకూడదా?’’
‘‘నన్ను బుట్టలో వేసుకోవడానికి కదా’’ అని నవ్వింది.
‘‘తమరు బుట్టలో పడినట్టేనా?’’
‘‘దొరగారు అంతలా బుట్టలో వేస్తూంటే పడనా?’’
‘‘నాకు కావలసిందే అది. దేవుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. నా అభీష్టం నూటికి నూరుపాళ్ళు తీర్చావు’’.
‘‘అది సరే కానీ ఈ కడియాలు మీ వద్దే ఉంచండి..’’ అని తీయబోతూంటే అజోడా అడ్డి ‘‘మనం ఇక్కడే ఉన్నాం కదా. నీ వద్దే ఉంచు. నే వెళుతున్నపుడు ఇద్దువుగాని. రేపు మనం మరోచోటుకు వెళుతున్నాం. నువ్వు వస్తావుకదూ’’
‘‘దొరగారు ఆదేశిస్తే ఈ దాసి కాదనగలదా? తప్పక వస్తా. కాని ఎక్కడికి?’’
‘‘అది కూడా ఇక్కడికి దగ్గరగానే ఉందా. సరస్వతీ నది మధ్య చిన్న ద్వీపం మీద అమ్మవారి కోవెలుంది. అక్కడ మొక్కుకుంటే కోరిక నెరవేరుతుందట. మనం అమ్మవారిని దర్శించి మన వివాహం నిరాఘాటంగా జరగాలని ప్రార్థిద్దాం’’.
‘‘ఐతే తప్పక వస్తాను’’
‘‘ఇవాళలాగే వచ్చేయ్’’
‘‘అలాగే సెలవ్’’
ఆమె వెళుతుంటే ఆమె నాగుపాములా మెలికలు తిరుగుతూ నడుస్తున్న సొగసైన తీరును చూస్తూ నిలబడ్డాడు. ఆమె కొద్దిదూరం వెళ్లి తిరిగి అతణ్ణి చూసి చేయి ఆడించి గబగబా వెళ్లిపోయింది.
అజోడా బరువైన మనసుతో బండి ఎక్కి బసకి బయలుదేరాడు. - ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు