డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానీ, ఈ రోజు అదృష్ట దేవత కనికరించి తన ప్రేమను పండించిన ఉదంతం తలపునకు రాగానే అతడి మనసులో పువ్వులు పూచాయి, హరివిల్లు విరిసింది.
మోరీ కూడా విడిదికి వెళుతూ ఆ రోజు తను అజోడాతో గడిపిన ప్రతి క్షణం గుర్తుచేసుకుంటోంది. అతడు తనను పిచ్చిగా ప్రేమిస్తున్నాడన్న మాట అక్షరాలా నిజం. అటువంటప్పుడు అతణ్ణి సంశయంలో పెట్టేకన్నా నాకు నువ్వు అంటే ఇష్టం అని చెప్పేయడం మంచిదే కదా!
దీంతో అతడిలో తమ వివాహానికి పోరాడే సంకల్ప బలం ఎన్నో రెట్లు పెరుగుతుంది. తనను పొందడానికి అతడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విజయం తప్పక అతణ్ణి వరిస్తుంది.
విడిదిలో తోటి కళాకారులు ఎలా సాగింది నీ జోగార్ జలపాతం దర్శనం అని అడిగారు. ‘‘దిగ్విజయంగా సాగింది. నన్ను తీసుకెళ్లిన ఆ కుటుంబం మాకు బంధువులే! ఎంతో ఆదరించారు. ముందు నేను రాలేనన్నా. కానీ వాళ్ళు వింటేనా! చివరకు సరేనన్నా’’ అని బొంకింది. ప్రేమలో, పోరులో అన్నీ సబబే కదా!
కొంతసేపు విశ్రమించి నృత్యగాన కార్యక్రమానికి శృంగారం మొదలెట్టింది.
అక్కడ అజోడాకి ఓ ఇబ్బంది ఎదురైంది. అతడి బండి చోదకుడు జుంబా వినోదం కోసం కొంతమంది స్థానికులతో పాచికలాట ఆడుతున్నాడు. అందరు ఆడుతున్నాడు. అందరు ఆడుతూ మద్యం సేవించసాగారు.
స్థానికులు గెలుస్తూ తాను ఓడిపోతుంటే జుంబాకు అక్కసుగా ఉంది. మద్యం మత్తు క్రోధాగ్నికి ఆజ్యం పోస్తుంది. పందెం డబ్బులు ఎలాగూ పోతున్నాయి. దాంతోపాటు వరుస ఓటములు అతడి ఆత్మ గౌరవాన్ని కుంగదీస్తున్నాయి. చివరకు నిండు బండికి చేట బరువులా ఓ స్థానిక విజేత అన్నమాటలు అతడి అసహనాన్ని భగ్గుమని మండేలా చేశాయి.
అసలు ఆ మనిషి అన్న మాటలు ఎత్తిపొడుపులు కావు. అతడు చెప్పింది సబమే కానీ ఆ పరిస్థితిలో ఆ మాటలు జుంబో మనసులో బాకుల్లా గుచ్చుకున్నాయి.
‘‘ఓడింది చాలు, నాయనా. ఇంక బుద్ధిగా విరమించుకో’’ అని సలహా ఇచ్చాడు ఆ స్థానికుడు.
దాంతో ఒత్తి కాలుతున్న చిచ్చుబుడ్డిలా ఉన్న జుంబా అతడిపై దాడి చేశాడు. మరి అతడూ మత్తులో తోక కాలిన తారాజువ్వలా ఉన్నాడు. జుంబా తలపై కర్రతో బాదగా తలకు గాయం అయి రక్తం కారింది. అక్కడి వాళ్ళు కట్టు కట్టారు.
అజోడా తిరిగి వచ్చి జుంబాని బండిమీద వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. వైద్యుడు కట్టుకడుతూ ‘‘్ఫర్వాలేదు త్వరగానే గాయం మానిపోతుంది’’ అన్నాడు.
‘‘మేం మొహంజొదోడో వాసులం. రెండు మూడు రోజుల్లో తిరిగి వెళ్లాలి’ అన్నాడు అజోడా.
‘‘ఇతడి గాయం తీవ్రమైనది కాదు కానీ దూర ప్రయాణం చేయడం మంచిది కాదు. వారం పది రోజుల్లో గాయం ఎండుతుంది. అప్పుడు ప్రయాణం చేయడం మంచిది. ఈలోగా నేనిచ్చిన మందు సేవించమనండి’’ అన్నాడు వైద్యుడు.
అజోడా జుంబాకు బాగా చీవాట్లు పెట్టి ప్రవాసంలో మద్యం తాగనని, పాచికలాట ఆడనని అతడి చేత ఒట్టు వేయించుకున్నాడు.
అక్కడ కార్యక్రమం మొదలయినా అజోడారాకపోవడం మోరీకి ఆరాటం కలిగించింది. ఇందాక నా కార్యక్రమం చూడడానికి ఇంత దూరం నుంచి వచ్చానని చెప్పిన మహానుభావుడు ఇంతవరకు రాలేదంటే నేను ఏమనుకోవాలి’’.
తను లేందే అతడి జీవితం శూన్యంట. మరి ఇప్పుడు ఆ శూన్యం ఏమైంది అనుకుంటూ ముందు కూచున్న జనంలోకి చూడసాగింది. ఇంకా అతడి జాడలేదు.
అతడితో చిరకాలం సాన్నిహిత్యం ఉన్నట్టు తాను ఎందుకలా అతడి రాకకోసం తహతహలాడుతోంది? తాను అతడికి అంత దగ్గరైందా? ఔనని ఆమె అంతర్వాణి జవాబు చెప్పింది. తప్పక వస్తాడని కూడా చెప్పింది.
తాను నర్తించి పాడే వంతు కూడా వచ్చింది. తాను వేదికమీదకు రాగానే జనం చప్పట్లతో స్వాగతం చెబుతున్నారు. ఇంకా అజోడా గైర్‌హాజరే. మోరీ వేదిక మీదకు వచ్చి నిలబడి మంద్ర లయలో పాటను వేదనామయంగా ఆలపించసాగింది. శ్రోతలు నిశ్శబ్దంగా భావుకతతో ఆ విషాద భరిత గానాన్ని ఆలకిస్తున్నారు. పై శృతులనుంచి కింది శృతులకు దిగి వస్తున్నపుడు ఆమె ప్రకటించే ప్రావీణ్యం, భావం శ్రోతలను భావ విహ్వలుల్ని చేస్తోంది.
పాట మధ్యలో అజోడా వచ్చి ముందు వరుసలో కూర్చున్నట్టు గమనించింది. దాంతో సహజంగా ఆమె ఉత్సాహం ఉరకలేసింది. వాయిద్యాల వాళ్ళని లయ పెంచమని సైగ చేసి ఆ పాటనే ఉల్లాసభరితంగా పాడుతూ చిందులు వేయసాగింది. దాంతో శ్రోతల హృదయాలు కూడా చిందులు వేయసాగాయి. ఆమె నర్తిస్తూ పాడుతూంటే గాన లయ నృత్యవిన్యాసాన్ని చూస్తున్న జనం సంభ్రమాశ్చర్యాలతో కరతాళధ్వనులు చేస్తూ ఆహా ఆహా, శభాష్ అనే నినాదాలు చేయసాగారు.
ఆమె మరోపాట పాడి శ్రోతల హృదయాల్లో జేగంటలు మారుమోగించి విరమించి వేదిక దిగింది. జనం ఒకరిపై ఒకరు పడుతూ ఆమె వద్దకు వచ్చి ప్రశంసల జల్లులు కురిపించారు. వాళ్ళలో అజోడా కూడా ఉన్నాడు. జనసమ్మర్దం తగ్గాక ఒంటరిగా వున్న ఆమెవద్దకు వచ్చి ‘‘నీ పాట జనాన్ని ఉర్రూతలూగించింది’’ అని అతడు ప్రశంసించాడు. మోరీ అతడి వైపు చూసి జవాబు చెప్పకుండా ఊరుకుంది.
దాంతో ‘‘నామీద కోపమా?’’ అని అడిగాడు అజోడా. ఆమె ‘‘లేదు, నేను చాలా పొంగిపోతున్నా దొరగారు రాలేదని’’ అంది ఆమె మొహం ఎత్తిపెట్టి.
‘‘నేను ఆలస్యంగా ఎందుకొచ్చానో చెప్తే నువ్వు కూడా ఒప్పుకుంటావు.’’
‘‘సాకులు చెప్పడం మగాళ్ళకు పుట్టుకతోనో వస్తుందంటారు’’
‘‘సరే, ఓ సుందరాంగి నన్ను వలలో వేసుకుంది’’.
‘‘మరి ఆ వలలోనే ఉండిపోలేకపోయారా?’’
‘‘అందుకే కదా ఇప్పుడు ఆ సుందరాంగి వలలోకి వచ్చి వాలాను. నిజానికి ఏమైందంటే ఓ దుస్సంఘటన జరిగింది. మా బండివాడు జుంబాకి తలమీద దెబ్బ తగిలింది’’.
‘‘ఏమైంది?’’ అడిగింది మోరీ కోపం దిగమింగి ఆతృతతో. ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు