డైలీ సీరియల్

యమహాపురి 44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాల్ అన్న రాజా కొన్నాళ్లుగా కనిపించడంలేదు. పోలీసు స్టేషన్లో కంప్లయింటివ్వడానికి మేనత్త ఒప్పుకోవడం లేదు. రహస్యంగా ఇద్దామంటే పోలీసులతో వ్యవహారం ప్రమాదకరం అని భయం. జనాల్ని సానుభూతితో అర్థం చేసుకునే ఒకే ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్ శ్రీకర్ అని ఊళ్లో చెప్పుకోవడం విన్నాడు. తన కేసు మధురాపురి ఏరియాది కాకపోయినా- ఆయన పెద్ద మనసు చేసుకుని విని సాయపడతాడని ఎంతో ఆశతో ఇక్కడికొచ్చాడు. అలా చెబితే లోపలకు రానివ్వరని చిన్న అబద్ధం చెప్పాడు.
‘‘నేను పోలీసుని. పోలీసుగా నాకున్న మంచి పేరు డిపార్టుమెంటుకి ఎందుకు లేదు?’’ అని మనసులో నొచ్చుకుని సన్నగా నిట్టూర్చాడు శ్రీకర్. కానీ తన మంచితనాన్ని అవకాశంగా తీసుకుని- ఇలా ప్రతి ఒక్కరూ తన వెంటబడ్డం మొదలెడితే ఎందరికని సాయం చెయ్యగలడు?
కానీ ఎదురుగా రాజా ఫొటో, దానిమీద తనకి ఆసక్తి వుంది.
‘‘రాజామీద నాకు ఆసక్తి ఉన్న విషయం గోపాల్‌కి చెప్పకూడదు. నిజంగానే మానవతా దృక్కోణంలో సాయపడదల్చినట్లు అతడికి చెప్పడంవల్ల నష్టమేముంటుంది?’’ అనుకుని, ‘‘ముందు నీ ఏరియాలో కేసు నమోదు చేసి- ఆ తర్వాత నాకు చెబితే బాగుండేది!’’ అన్నాడు శ్రీకర్.
‘‘అలా చేస్తే మా అత్తయ్య ఇల్లు పీకి పందిరేస్తుందండి. నేను అన్నయ్య అదృశ్యంపై పోలీస్ కంప్లయింటిచ్చినట్లు మా అత్తయ్యకి తెలియకూడదు. అందుకే మీ దగ్గరికొచ్చానండి’’ అన్నాడు గోపాల్.
‘‘అసలేం జరిగిందో చెబుతావా?’’ అన్నాడు శ్రీకర్ విసుగుని దాచుకుంటూ.
శ్రీకర్ వాయిస్ రికార్డర్ ఆన్ చేశాడు. గోపాల్ చెప్పేది వినసాగాడు.
***
రాజా, గోపాల్ అన్నదమ్ములు. చిన్నప్పుడే తండ్రి పోయాడు..
తల్లి మాలతికి చదువు రాదు. అసహాయ దశలో ఆ కుటుంబాన్ని చేరదీసింది రాజా మేనత్త జయమ్మ.
జయమ్మకి భర్త ఉన్నాడు. పిల్లలున్నారు. అంతా ఆమె అదుపాజ్ఞల్లో ఉంటారు. తమ్ముడి కుటుంబాన్ని ఆమె ఇంటి చాకిరీ కోసమే తెచ్చుకుంది. వాళ్లు ముగ్గుర్నీ ఆమె పనివాళ్లలాగే చూసేది.
జయమ్మ మాలతిని వదినా అని పిలిచేది. రాజానీ, గోపాల్‌ని మేనల్లుళ్లుగానే అందరికీ పరిచయం చేసేది. తన భర్త కానీ, పిల్లలు కానీ- వాళ్లని పనివాళ్లుగా మాత్రమే చూడాలనేది. వాళ్లకీ వాళ్లకీ మధ్య ఏ అనుబంధాలూ ఏర్పడకుండా జాగ్రత్తపడింది.
‘‘నాకైతే పేగుబంధం. వాళ్లకేముంటుంది?’’ అనేది సంజాయిషీగా.
అలాంటి ఇంట్లో బ్రతుకీడ్వడం మొదట్లో కష్టమనిపించినా క్రమంగా మాలతి, రాజా, గోపాల్ దానికి అలవాటుపడిపోయారు.
ఎన్ని పనులు చేయించినా జయమ్మ వాళ్లకి కడుపునిండా తిండి పెట్టేది. అడపాదడపా బట్టలు కొనేది. రాజానీ, గోపాల్‌నీ చదివించింది. కానీ వాళ్లమీద పెట్టిన ప్రతిపైసాకీ ఖర్చు వ్రాసేదామె. నెల నెలా దానికి వడ్డీ కట్టేది. ఆ బాకీ తీర్చాల్సిన బాధ్యత రాజాదేనని తరచుగా గుర్తుచేస్తుండేది.
రాజా నీతినీ, నిజాయితీని నమ్ముకున్న మనిషి, సమాజంలో ఎక్కడ అవినీతి, దౌర్జన్యం కనిపించినా సహించక ఎదిరించేవాడు. ఇంట్లో మేనత్త ఆగడాల్ని సహించాడంటే- తల్లిమీద గౌరవమే అందుకు కారణం.
రాజాకి ఇంటర్లో మంచి మార్కులొచ్చాయి. ఇంజనీరు ఔదామనుకున్నాడు.
జయమ్మ ఒప్పుకోలేదు. ‘‘నిన్ను ఇంజనీరింగు చదివించే స్తోమత నాకు లేదు. చదువై ఉద్యోగంలో చేరాక నీకు స్తోమతుంటే- నీ తమ్ముణ్ణి ఇంజనీరింగు చదివించుకుందువుగాని’’ అందామె.
రాజా బియస్సీ ఫస్టు క్లాసులో ప్యాసయ్యాడు. ఉద్యోగాల కోసం అనే్వషణ మొదలెట్టాడు. కానీ అతడికి ఆవేశం ఎక్కువ. అతడి ఆశయాలు వినడానికి బాగుంటాయి కానీ ఆచరణలో చాలామందిని ఇబ్బందికి గురిచేస్తాయి. అందువల్ల రాజాకి ఉద్యోగం దొరకడం కష్టమైంది. దొరికినా అది మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యేది.
చివరకు ఇది పని కాదనుకున్నాడు రాజా. స్వతంత్రంగా స్వశక్తిమీద బ్రతకాలనుకున్నాడు.
రాజా లెక్కల్లో అఖండుడు. అర్థం చేసుకోవడంలోనే కాదు, అర్థమయ్యేలా చెప్పడంలోనూ అతడి ప్రావీణ్యం అసాధారణం. అందుకని ట్యూషన్లు ప్రారంభిస్తే, మొదలెట్టిన నెల్లాళ్లకే రాజా ప్రతిభకు గుర్తింపు వచ్చింది. అతడివద్ద ట్యూషన్లు చెప్పించుకోవటానికి- టెన్తు, ఇంటర్ చదివే కుర్రాళ్లు ఎగబడ్డారు. మూడు నాలుగు నెలలయ్యేసరికి- ఉద్యోగాలకంటే ట్యూషన్లనుంచే మంచి రాబడి వస్తుందని గ్రహించాడు.
తనకొచ్చే ఆదాయంలోంచి పెద్దమొత్తాల్నే నెల నెలా జయమ్మకి బాకీ కింద చెల్లు వేసేవాడు. ఐతే ఎంత చెల్లు వేసినా అది మేనత్త బాకీలో వడ్డీకే చాలడంలేదు. ‘ఇలా ఎన్నాళ్లు’ అని బాధపడేవాడు రాజా.
‘‘అది కుబేరుడి అప్పురా నాన్నా, ఓ పట్టాన తీరదు’ అని నవ్వేది మాలతి.
ఇలాంటి పరిస్థితుల్లో రాజాకి అనుకోకుండా జగదానందస్వామి దీవెన లభించింది.
****
‘‘అది అన్నయ్యకు జీవితంలో ఊహించని మలుపు..’’ అన్నాడు గోపాల్.
అనాసక్తంగా వినడం మొదలెట్టిన శ్రీకర్ ఈ కథ విని చలించిపోయాడు. రాజా గురించి తను ఏమేమో అనుకున్నాడు. కానీ, పాపం మధ్య తరగతి జీవితాల్లో ఏ వ్యక్తిని కదిపినా ఏదో ఒక విషాదరాగం వినిపిస్తుంది.
గోపాల్ ముఖంలోకి చూస్తే- అతడు అబద్ధం చెప్పడంలేదని, అతడి పోలీసు కళ్లకి అనిపించింది.
‘‘ఆ స్వామి దీవెన ఎంతో అదృష్టవంతులకిగానీ లభించదంటారే! నువ్వంటున్న మలుపు ఏ అదృష్టానికి దారితీసింది?’’ అన్నాడు శ్రీకర్. అడిగాడు కానీ తర్వాతేం జరిగిందో తెలుసు కాబట్టి గోపాల్ జవాబులో ఉత్సాహకర వార్త ఏదీ ఉండదని అతడికి తెలుసు.
‘‘నాకైతే జగదానందస్వామి గురించీ, ఆయన దీవెనకున్న మహిమ గురించీ తెలియదు. కానీ సరిగ్గా అన్నయ్యకి దీవెన లభించిన రోజునే మాకు సంబంధించిన ఓ దురదృష్టకర ఘటన జరిగింది’’ అన్నాడు గోపాల్.
‘‘ఏం జరిగింది?’’ కుతూహలంగా అడిగాడు శ్రీకర్.

ఇంకా ఉంది

వసుంధర