డైలీ సీరియల్

యమహాపురి 52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ యువకుడు చెప్పిన దారిలో వెడితే కాస్త దూరంగా కనబడిందో పెద్దమేడ.
రాజా అక్కడకు వెడితే- మేడ చుట్టూ పెద్ద ప్రహరీ గోడ. ఆ గోడలో ఓ గేటు. గేటుకి అటూ ఇటూ ఇద్దరు బలిష్టులైన యువకులు.
రాజా ఓ యువకుడి వద్దకు వెళ్లి అప్పన్న తనకిచ్చిన పచ్చ కాగితం చూపించాడు.
ఆ యువకుడు అందులో ఏమున్నదీ చదవలేదు. కాగితం చూస్తూనే రాజాకి శిరసు వంచి నమస్కరించాడు. రెండో బలిష్టుడు గేటు తీశాడు.
రాజా లోపల అడుగెట్టాడు. ఎందుకో అతడి గుండె గుబగుబలాడింది.
ఇంటి చుట్టూ కొన్ని ఎకరాల ఆవరణ. అందులో చెట్లున్నాయి. పూల మొక్కలున్నాయి. టెన్నిస్ కోర్టుంది. స్విమ్మింగ్ పూలుంది. ఒక మూల ఉన్న పెద్ద పశువుల పాకని కూడా చూడకపోతే- తాను కానీ ఏదైనా ఏడు చుక్కల హోటలు ప్రాంగణంలో అడుగెట్టానా అని అనుమానమొచ్చేది రాజాకి.
అపుడు రాజాకి ఈ లోకంలో ఉన్నట్లు లేదు. చూస్తున్నవన్నీ బుర్రకెక్కడం లేదు. అడుగులు మాత్రం వడిగా పడ్డాయి. మేడ చేరుకుందుకు సుమారు పది నిముషాలు పట్టిందేమో!
అది మూడంతస్తుల మేడ. సింహద్వారం ముందు నిలబడితే- ప్రతి అంతస్తుకీ కనీసం ఇటో పదీ, అటో పదీ గదులుంటాయనిపిస్తుంది.
సింహద్వారం వద్ద కూడా ఓ బలిష్ట యువకుడు ఉన్నాడు. రాజాని చూస్తూనే తలుపులు తీసి వంగి సలాం చేసి లోపలకు వెళ్ళొచ్చునన్నట్లు సైగ చేశాడు.
రాజా లోపల అడుగెట్టగానే వెనుక తలుపు మూసుకుంది. వెంటనే చల్లని గాలి హాయిగా అతణ్ణి తాకింది. నగరంలో హోటళ్లలో కానీ, థియేటర్లలో కానీ, మాల్స్‌లో కానీ ఏ ఏసీ ఇవ్వలేని చల్లదనం అది.
‘‘‘ఇలాంటి సదుపాయముంటే- జీవితాంతం ఇక్కడే స్థిరపడిపోవాలనిపిస్తుంది’’ అనుకున్నాడు రాజా.
పెద్ద హాలు. హాలుకి అటూ ఇటూ గదులు. మధ్యలో పైకి వెళ్లడానికి మెట్లున్నాయి.
హాలు మధ్యలో రాజసింహాసనంలాంటి ఓ పెద్ద కుర్చీ ఉంది. దానికి ఎదురుగా సోఫాలున్నాయి. హాలు గోడలకి తైలవర్ణ చిత్రపటాలున్నాయి.
రాజా తలెత్తి చుట్టూ చూశాడు. హాల్లో ఏం జరిగినా పై అంతస్తులనుంచి చూడ్డానికి సదుపాయముంది.
‘‘రాజమందిరంలా ఉంది’’ అనుకున్నాడు రాజా. అతడలా పైకి చూస్తూ తన చుట్టూ ఏం జరుగుతుందో గమనించలేదు. తల దించేసరికి తన చుట్టూ నలుగురు మనుషులు కనిపించారు.
ఒకడు పంచెకట్టిన వృద్ధుడు. ఒకడు లుంగీలో నడి వయస్కుడు. ఒకడు జీన్స్‌లో యువకుడు. ఒకడు నిక్కర్లో బాలుడు. నలుగురూ అతణ్ణి పరీక్షగా చూస్తూ చుట్టూ తిరుగుతున్నారు.
రాజా తన చేతిలోని కాగితాన్ని వారిలో వృద్ధుడికిచ్చాడు.
వృద్ధుడా కాగితం చదివి ‘‘రాజా అంటే మీరేనన్నమాట!’’ అన్నాడు వినయంగా.
‘‘నా గురించి మీకు ముందే తెలుసా?’’ అన్నాడు రాజా ఆశ్చర్యంగా..
‘‘చెక్‌పోస్టునుంచి కబురొచ్చిందిలే’’ అన్నాడు వృద్ధుడు. తనవాళ్ళవైపు తిరిగి, ‘‘మొహంలో మంచి తేజస్సుంది. యమ పంపిన మనిషి కదా! తిరుగుండదు’’ అన్నాడు. మిగతా ముగ్గురూ చప్పున రాజాకి నమస్కరించారు.
రాజా వారికి ప్రతి నమస్కారం చేసి, ‘‘మీరెవరో నేను తెలుసుకోవచ్చా?’’ అన్నాడు.
‘‘యమ బంధువులం’’ అన్నాడు వృద్ధుడు. ‘‘కానీ యమ ప్రతినిధికి దాసులం’’ అన్నాడు.
‘‘మీరు పెద్దవారు. దాసులు అనకూడదు’’ అన్నాడు రాజా నొచ్చుకుని
‘‘పెద్దవాణ్ణి. పురాణ జ్ఞానమున్నవాణ్ణి. నేనేమన్నా దానికో అర్థముంటుంది. భారతంలో ధర్మరాజు రాజసూయయాగం చేసి మహామహులందర్నీ ఆహ్వానించాడా- ఆ వేడుకలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలీ అన్న మీమాంస వచ్చింది. అపుడు కురువృద్ధుడైన భీష్ముడే- తనకంటే ఎంతో చిన్నవాడైన శ్రీకృష్ణుడికి అగ్రపూజ చెయ్యమని చెప్పాడు. దేవుడిముందు పెద్దలంటూ ఎవరూ ఉండరు. అందరూ దాసులే. దేవుడి ప్రతినిధి అంటే దేవుడి తర్వాత దేవుడంతటివాడు’’ అన్నాడు వృద్ధుడు తడుముకోకుండా.
రాజాకీ ఏమనాలో తెలియలేదు. యమ ఆ ఊరికి దేవుడంటే ఏమో అనుకున్నాడు కానీ- ఏ దేవుడికీ లభించని విధేయత ఆయనకి అక్కడ లభిస్తోందని అర్థమైంది. కానీ అదే విధేయత తనకీ లభిస్తుందంటే అతడికి ఇబ్బందిగా అనిపించింది.
రాజా మానసికంగా రాజరికానికి వ్యతిరేకి. పదవి, హోదా, అధికారం పేరిట- మనిషి సాటి మనిషిపై జులుం చెయ్యడాన్ని సహించలేడు. ఆ విషయంలో లౌక్యం పాటించకపోవడంవల్ల అతడికి ఉద్యోగాలు దొరకలేదు. కానీ ఇక్కడ అప్పుడే తనకి కొందరు దాసులు తయారయ్యారు. ఇంకా ఎందరు రానున్నారో...
అనుకుంటుండగానే మెట్లు దిగి ఒక నడివయస్కురాలు, యువకుడు అక్కడికి వచ్చారు.
ఆమె సన్నగా, నాజూగ్గా అందంగా వుంది. కట్టిన పట్టుబట్టలు ఆమె ముఖానికి వింతగా తేజస్సునిచ్చాయి. బంగారు ఛాయలో ఉన్న ఆమెకి ఆ ఛాయలో కలిసిపోతూ వంటినిండా నగలు.
ఆ యువకుడు ఇంచుమించు తన వయసువాడే. ముఖం చాలా అమాయకంగా వుంది. లేత నీలం రంగు పాంటులో మల్లెపూవులాంటి తెల్లచొక్కా ఇన్‌షర్ట్ చేశాడు.
‘‘మాత, పుత్ర’’ అన్నాడు వృద్ధుడు.
రాజాకి అర్థమైంది. వాళ్ళు యమ భార్య, కొడుకు అని.
ఆమె దగ్గిరగా వచ్చి అతణ్ణి చూసి మందహాసం చేసింది. అది దేవత నవ్వులా మనోహరంగా ఉంది. అప్రయత్నంగా రాజా ఆమెకి నమస్కరించాడు.
‘‘నీ గురించి తెలిసింది. విదేశయాత్రలో ఉండగా ఆయన ఇదివరకెప్పుడూ ఇలా ప్రతినిధిని పంపలేదు’’ అందామె.
‘‘ఇప్పుడూ పంపలేదు’’ అనుకున్నాడు రాజా మనసులో.
‘‘వీళ్ళంతా నా మాటలు బాగా నమ్మారు. ఇది దేనికి దారితీస్తుందో’’ అని కొద్దిగా బెంగపడ్డాడు కూడా.
ఆమెకి జవాబుగా ఏమనాలో తెలియక- చిన్నగా నవ్వి వౌనంగా ఉండిపోయాడు.

ఇంకా ఉంది

వసుంధర