డైలీ సీరియల్

యమహాపురి- 63

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీ అత్తయ్య విషం కలిపిన ప్రసాదమిచ్చి మీ అన్నయ్యని తినమంది. తిన్నాడా- లేదు. అది వేరెవరికో పెట్టాడు. అలాగే మీ అత్తయ్య మీ అమ్మకి క్యాన్సరొచ్చిందంది. వస్తుందా- అదీ వేరెవరికో వెళ్లిపోతుందిలే- భయపడకు’’ అన్నాడు శ్రీకర్.
‘‘అలా ఎలా జరుగుతుంది? మీరు నన్ను మరీ చిన్న పిల్లాడనుకుని మాట్లాడుతున్నారు’’ అన్నాడు గోపాల్ ఆశగా, బాధగా.
‘‘నువ్వు చిన్నవాడివైనా, పెద్దవాడివైనా- జరిగింది మాత్రం అదే. మీ అమ్మగారికి కాన్సర్ లేదు. ఉన్నట్లు మీ అత్తయ్య అబద్ధం చెప్పింది. కారణం నీకు తెలిసిందే- మీ అన్నయ్యని భయపెట్టి బులిపించి ఎలాగో అలా శివగిరికి పంపి ఆ ప్రసాదాన్ని అతడిచేత తినిపించడం’’ అన్నాడు శ్రీకర్.
గోపాల్ ఉత్సాహంగా, ‘‘అమ్మకి క్యాన్సర్ లేదంటే- నాకిప్పుడు ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది సార్!’’ అన్నాడు.
‘‘అమ్మ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావ్. నువ్వింకా చిన్నపిల్లాడివే’’ అని నవ్వాడు శ్రీకర్.
‘‘సార్! మనమింకా ఎంతసేపు తిరగాలి? ఆటోలో పెట్రోల్ కొట్టించాలి..’’ అన్నాడు సుందరం.
‘‘గోపాల్‌ని బంకులో దింపేసి- మనం మన పనిమీద బయల్దేరుదాం’’ అన్నాడు శ్రీకర్.
***
బంకులో గోపాల్‌ని వదిలి పెట్రోలు కొట్టించుకున్నాక- డ్రైవర్ సీట్లో కూర్చుని- ‘‘ఇంత లాంగ్ డ్రైవ్ ఏ ఆటోవాలా చేసి ఉండడు సార్’’ అన్నాడు సుందరం.
‘‘ఏంటీ- అప్పుడే ఇన్నింగ్స్ ఐపోయినట్లు మాట్లాడుతున్నావ్! ఇది వనే్డ క్రికెట్ కాదు. టెస్ట్ క్రికెట్. ఇంకా సెకెండిన్నింగ్సుంది’’ అన్నాడు శ్రీకర్.
ఆటో స్టార్టయింది. ఓ సందు మొగలో యోగిని పిక్ చేసుకున్నాడు సుందరం.
యోగి తన పక్కన కూర్చోగానే, ‘‘ఏమైనా కొత్త విశేషాలు తెలిశాయా?’’ అనడిగాడు శ్రీకర్.
‘‘అవినాష్, సుధాకర్, ఉష- ముగ్గురికీ కలిపి ఒకటే విశేషం సార్’’ అన్నాడు యోగి.
‘‘వాళ్లే కాదు. వాళ్లకింకో ముగ్గుర్ని కలిపినా ఒకే విశేషం. ఆ ఆరుగురికీ జగదానందస్వామి దీవెన లభించింది..’’ నవ్వాడు శ్రీకర్.
‘‘అది కాదు సార్! ఈ ముగ్గురూ నిన్నట్నించి ఊళ్ళో లేరు సార్’’ అన్నాడు యోగి.
‘‘ఓహో’’ అని తల పంకించాడు శ్రీకర్. ‘‘కలిసి ఎక్కడికైనా వెళ్లారా?’’
‘‘వాళ్ళ ఇళ్ళలో వాకబు చేశాను సార్! ఆ ముగ్గురికీ ఒకరితో ఒకరికి పరిచయం లేదు’’
‘‘ఐతే విడివిడిగా ఎక్కడికో వెళ్లి ఉంటారు. ఇంట్లో వాళ్లని అడగలేదా?’’ అన్నాడు శ్రీకర్.
‘‘వాకబు చేశాను సార్! ఇంట్లో వాళ్లకి చెప్పలేదు’’
‘‘ఎక్కడికెడుతున్నదీ చెప్పలేదా? అసలు వెడుతున్నట్లే చెప్పలేదా?’’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఇన్ని ప్రశ్నలెందుకు సార్! నా ఇనె్వస్టిగేషన్ గురించి మీకు వివరంగా చెబుతాను’’ అన్నాడు యోగి.
‘‘ఊ’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఓహో, సెకెండ్ ఇన్నింగ్స్‌లో మళ్లీ లాంగ్‌డ్రైవ్!’’ అనుకున్నాడు సుందరం.
***
యోగి ముందు అవినాష్ ఇంటికి వెళ్లాడు. తాను జయలంక అనే గ్రామం నుంచి వస్తున్నట్లు చెప్పాడు.
అవినాష్ కోసం ఎక్కడెక్కడినుంచో మనుషులు రావడం ఆ ఇంటికిప్పుడు మామూలే కాబోలు. పనేమిటని కూడా అడక్కుండా, ‘‘మావాడు ఊళ్ళో లేడు బాబూ!’’ అంది ఓ వృద్ధురాలు.
మాట్లాడిన తీరును బట్టి- ఆమె అవినాష్ తల్లి అయుండొచ్చనుకున్నాడు యోగి. అతడామె వయసుకి చేతులు జోడించి, ‘‘అర్జంటుగా ఆయన్ను కలుసుకోవాలి. ఏ ఊరెళ్లారో చెబుతారా?’’ అన్నాడు.
‘‘తెలియదు బాబూ!’’ అందామె.
‘‘పోనీ- ఆయన భార్యకి తెలుసేమో! అడిగి చెబుతారా?’’
‘‘నా మొహం, వాడేం చేసినా ముందు నాకు చెబుతాడు. నాకు చెప్పకపోతే దానికీ చెప్పడు’’ అందామె.
‘‘అయ్యో! మా ఊరి గుడిలో ఓ వారం పాటు ఆయన ప్రవచనాలు పెడదామనుకున్నాం. లక్ష రూపాయలు మా బడ్జెట్! గొణుక్కుంటున్నట్లు అన్నా గట్టిగానే అన్నాడు యోగి.
అంతలో లోపల్నుంచి చటుక్కున ఒకామె వచ్చింది. చుడీదార్లో ఉన్నా- అసలు సిసలు భారత గృహిణి అనిపిస్తుంది. అతడామె పవిత్రతకు చేతులు జోడించాడు.
‘‘ఎప్పుడూ మీ ఊళ్లో ప్రవచనాలు?’’ అందామె.
‘‘నెల్లాళ్ల లోపులో ఎప్పుడైనా సరే- డేట్సు గురువుగారి వీలునిబట్టి ఫిక్స్ చెయ్యొచ్చు’’
‘‘మీ ఫోను నంబరివ్వండి. ఆయన రాగానే ఫోన్ చేయిస్తాను’’ అందామె.
‘‘మీరెవరో తెలుసుకోవచ్చా?’’ అన్నాడు యోగి అనుమాన నివృత్తికోసం.
అతడి ఊహ తప్పు కాలేదు. ‘‘అదేం- అలా అడిగారు? నేనాయన భార్యని’’ అందామె.
‘‘ఆయన ఉపన్యాసాల్లో మన చీర కట్టు ప్రాధాన్యం గురించి తెగ చెబుతారు..’’ నసిగాడు యోగి.
‘‘చెబితే? మా సరదాలు మాకుండవా? ఆయన కూడా ఇంట్లో ఉన్నప్పుడు బెర్ముడాలో తిరుగుతారు..’’
యోగి గతుక్కుమని, ‘‘నా ఉద్దేశ్యం అది కాదు. మీ అత్తగారనుకుంటాను. ఆయనేం చేసినా ముందు తనకే చెబుతారంటేనూ...’’ అన్నాడు మాట మార్చి.
‘‘అదంతా ఒకప్పటి మాట! ఈ ఇంట్లో నేనడుగెట్టేక- ఆయనతో సహా ఎవరైనా సరే- నేను సిట్టంటే సిట్టూ, స్టాండంటే స్టాండూనూ. ఇది నా మాట కాదు. మా అత్తగారే ఈ చుట్టుప్రక్కల అందరికీ రోజుకొకసారైనా చెబుతూంటారు..’’ అందామె.
‘‘ఆ.. అక్కడికి నేనన్న ప్రతిమాటా ఒప్పుకున్నట్లు! ఈ ఇల్లంతా నా పొలంమీదొచ్చే అయివేజుతో నడుస్తుందంటాను. ఒప్పుకుంటుందా? నా పొలంమీద పెట్టుబడి వెనక్కొస్తే అది పదివేలుట- ఊరంతా టాంటాం వేస్తుంది’’ అంది అవినాష్ తల్లి.
ప్రవచనాల పండితుడింట్లో అత్తాకోడళ్ల అహాల పోరాటం. యోగి దాన్నించెలా బయటపడాలా అని ఆలోచిస్తూంగా- లోపల్నుంచి పదహారేళ్ల అమ్మాయి వచ్చింది.
వంటిమీద జీన్స్, ముఖంలో చదువు, సంస్కారం, వయసుకు తగిన అపురూపమైన అమాయకత్వం.

ఇంకా ఉంది

వసుంధర