డైలీ సీరియల్

ఎప్పుడె ప్పుడు? -- 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీ ఆఫీసులో శాంతి వుంది కదా.. దాని దగ్గరికి వెళ్లండి.. అచ్చటా ముచ్చటా తీరుస్తుంది.. వాట్సాప్‌లో మెసేజీలు పంపిస్తారుగా’’.
‘‘వాళ్ళాయన్ను ఎంత అశాంతికి గురిచేస్తుందో.. ఆ.. శాంతి.. ఈ పెళ్లాలంతా ఇంతే..’’ అని ఎందుకైనా మంచిది రేపు శాంతిని కనుక్కుంటాను’’ అన్నాడు.
వెంటనే కిరణ్ ఒంటికి చుట్టుకున్న దుప్పటి గట్టిగా లాగింది. ఆ వేగానికి అతను మంచంమీదనుండి కిందపడ్డాడు.
ఆ ఇంట్లో కిష్కింధకాండ మొదలైంది. రాత్రి రెండు వరకూ.. ఇద్దరికీ అలసట వచ్చేవరకూ...
***
బద్ధకంగా వుంది నిహార్‌కు.. కళ్ళు తెరవాలనిపించలేదు. తెల్లవారు జామున నిద్రపోయారు. కళ్ళముందు ఎవరో నిలబడ్డట్టు.. మెడని తాకుతున్న వెచ్చని శ్వాస, అద్భుతమైన పరిమళం.. అది మనసు తాలూకు పరిమళం.. తన మనిషి తాలూకు పరిమళం.
‘అప్పుడే లేచావా?’ రెండు చేతులతో మెడ చుట్టేసి అన్నాడు.
‘‘అవును మరి.. మా ఆయనకు టిఫిన్ చేసి పెట్టాలి... క్యారేజి కట్టిపెట్టాలి.. వెళ్ళేటప్పుడు కాసిన్ని ముద్దులు పెట్టాలి.. ఇవన్నీ చేయాలంటే నేను పెందరాళే లేవాలి’’ అంది అతని నుదురుమీద ముద్దుపెడుతూ..
‘‘ఈ రోజు సెలవేమీ లేదా? పాపం కొత్తగా పెళ్లయ్యింది.. రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోయి ఉండరు.. ఓ వారం రోజులపాటు సెలవిచ్చి పెడదాం.. అన్న ఇంగితజ్ఞానం వున్న పెద్దమనుషులే కరువయ్యారు..’’ రెండు చేతులు మరింత బిగిస్తూ అన్నాడు నిహార్.
‘‘తమరు ధృతరాష్ట్ర కౌగిలి సడలిస్తే.. నేను ఇక్కడినుంచి నిష్క్రమిస్తాను’’.
‘‘అమ్మో నిన్నొదిలిపెడితే మళ్లీ అరగంట వరకూ దొరకవు’’ గట్టిగా పట్టుకుని అన్నాడు.
‘‘గుండెల్లో లైఫ్‌టైం అరెస్టు అయ్యాను కదా’’ అంది నిశ్చల.
అతనికి నిశ్చలలో నచ్చే సెన్సాఫ్ హ్యూమర్.. సర్వకాల సర్వావస్థలందు భర్తను వెన్నంటే హాస్యచతురత. తనెంత అదృష్టవంతుడు కాకపోతే ఇంత గొప్ప మనసున్న భార్య దొరుకుతుంది. ఆ ఆలోచన అతని ఛాతీని రెండు అంగుళాలు పెంచింది.
‘‘ముందు ఫ్రెషప్ అవ్వండి.. టిఫిను చల్లారుతుంది’’ చెప్పి భర్తను లేపి బాత్‌రూమ్ లోపలికి పంపించి కిచెన్ వైపు నడిచింది.
***
భయంగా కళ్ళు తెరిచాడు కిరణ్.
రాత్రి మందు తాలూకు హ్యాంగోవర్ అలానే వుంది. అది మందు తాలూకూ హ్యాంగోవర్ కదా. భార్య తాలూకు హ్యాంగింగ్ ఓవర్. కళ్ళు తెరిస్తే భార్య తాలూకూ స్టీరియోఫోనిక్ వాయిస్ తన చెవులను బద్దలుకొడుతుందన్న భయం. అడుగుల శబ్దం వినిపించింది. ఆ అడుగుల్లో కసి ధ్వనిస్తుంది. పోట్లగిత్త కుమ్మడానికి వచ్చినట్టు వుంది.
మెల్లిగా దుప్పటి తొలగించాడు.
‘‘పాల ప్యాకెట్ తీసుకువస్తే టీ నీళ్ళు మొహాన కొడతాను’’ అంది విసురుగా పావని.
‘‘పది రూపాయల ఇరానీ హోటల్‌లో కొడితే సలాం కొట్టి మరీ ఇస్తాడు’’ తాపీగా చెప్పాడు.
‘‘టీ నువ్వు తాగితే సరిపోతుందా? నేను తాగొద్దా? నీలా మందు ఎలాగూ తాగను.. కనీసం టీ నీళ్ళు కూడా తాగొద్దా? అయినా అలా ఓ పది అడుగులు వేస్తే ఏం పోతుంది? కాళ్ళు అరిగిపోతాయా?’’ రుసరుసగా అంది పావని.
‘‘కాస్త నవ్వుతూ చెబితే నీ నోరు కరిగిపోతుందా?’’ రిప్లై ఫాస్ట్‌గా ఇచ్చాడు.
‘‘పొద్దునే్న దరిద్రం.. మా పుట్టింటోళ్ళను అనాలి.. దిక్కుమాలిన మొగుడిని అంటగట్టినందుకు’’ విసుక్కుంది.
‘‘నాదీ సేమ్ ఫీలింగ్’’ అంటూ లేచాడు.
పాల ప్యాకెట్ తీసుకురాకపోతే జరిగే మహాసంగ్రామం తెలుసు.. బుద్ధిగా లేచి తనకు తానే కాంప్రమైజ్ అయి స్లిప్పర్స్ వేసుకుని బయటకు నడిచాడు.
***
షూ వేసుకుని, భార్య అందించిన క్యారేజ్ తీసుకుని అలానే చూస్తుండిపోయాడు నిహార్.
‘‘అలా చూస్తే నీ పెళ్లాన్ని దిష్టి తగులుతుంది’’ నవ్వుతూ అంది.
‘‘నిన్ను చూస్తోంటే చాలా గర్వంగా వుంది. నా లైఫ్‌ను మొత్తం మార్చేసావు.. బ్రహ్మచారి జీవితానికి, ఈ జీవితానికి ఎంతో వ్యత్యాసం వుంది. ఎప్పుడు ఇంట్లోనుంచి బయటపడదామా? అని అనుకునేవాడిని. ఇపుడు ఇల్లొదిలి పోవాలంటే దిగులుగా వుంది. పొద్దునే్న లేవగానే నిశ్శబ్దం పలకరించేది.. ఇంట్లో ఎవరుటారు? నన్ను ఆహ్వానించే ఒంటరితనం తప్ప.. కానీ ఇపుడలా కాదు.. నిశ్చల నువ్వుంటే వేల సైన్యం నా వెంట వున్నట్టు వుంది.. ప్రామిస్’’ అన్నాడు- అప్రయత్నంగా అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి.
వెంటనే తన చీరె కొంగుతో కళ్ళు తుడిచింది.
‘‘ఇప్పుడే కాదు ఎప్పుడూ నీ వెంటే వుంటాను.. మిమ్మల్ని వెన్నంటే వుంటాను.. ఇది నా.. అని ఆగి నవ్వి.. మీ ప్రామిసెస్..’’ అంది.
అతి కష్టంగా ఇంట్లోనుండి బయల్దేరాడు నిహార్.
***
బైక్ కిరణ్ ఇంటిముందు ఆగింది. నిహార్ సిక్స్త్‌సెన్స్ ఏదో వార్నింగ్ ఇస్తోంది. మెల్లిగా హారన్ కొట్టాడు. నవ్వుతూ లుంగితో బనియన్‌తో వచ్చాడు కిరణ్. ఆ నవ్వులో బోల్డు ఫీలింగ్స్ కనిపించాయి నిహార్‌కు.
‘అదేమిట్రా ఆఫీస్‌కు రావడం లేదా? నేను వెళ్లిపోనా?’’ అన్నాడు బైక్ స్టార్ట్ చేయబోతూ-
‘‘అరెరే ఎందుకురా తొందరా.. లోపలికి రా.. జస్ట్ టూ మినిట్స్‌లో ఇస్ర్తి చేసుకుంటాను’’ అంటూ నిహార్‌ను లోపలికి తీసుకెళ్ళాడు.
‘‘అమ్మోరికి బలి ఇవ్వడానికి’’ తీసుకువెళ్తున్నట్టు అనిపించింది.
‘‘అదేమిట్రా వారానికి సరిపడా ఒకేసారి ఇస్ర్తి చేయిస్తావుగా’’ అడిగాడు సందేహంగా.
‘‘్భషుగ్గా.. జతకు పది రూపాయలు.. బ్రహ్మాండమైన ఇస్ర్తి.. ఓ పందికొక్కు నలిపేసింది’’ కచ్చగా అన్నాడు కిచెన్ వంక చూస్తూ.
‘‘అదేమిట్రా పందికొక్కుకు అందేలా బట్టలు పెట్టుకున్నావా? అయినా పందికొక్కు బట్టలు పీలికలు చేస్తుంది కానీ ఇలా నలిపేయదు కదరా?’’ అనుమానం తీరక అడిగాడు.
‘‘కదా.. నాకు అదే డౌట్ వచ్చింది.. మీ ఆవిడ ఫ్రెండ్‌ని అడిగితే..’’
‘‘ఆగాగు.. మా ఆవిడ ఫ్రెండ్ ఎవ్వరురా..’’
‘‘నీ భార్య అని చెప్పక ఈ డొంక తిరుగుడు ఎందుకురా.. పాపం.. పావని ఏం చేసిందిరా?’’
‘‘బట్టలు నలిపి..’’ అని ఆగి రాత్రి గొడవయ్యాక నిద్రమత్తులో కళ్ళకు అస్పష్టంగా కనిపించిన సీన్ గుర్తుచేసుకున్నాడు.
కోపంగా భార్య తన ఇస్ర్తి బట్టలు మొత్తం నలిపేయడం గుర్తుకువచ్చింది.
నమ్మలేకపోయాడు నిహార్. కొద్దిగా మడతపడిందని మళ్లీ మళ్లీ తన చొక్కాను నీట్‌గా ఇస్ర్తి చేసిన భార్య గుర్తొచ్చింది.
‘‘నమ్మలేకపోతున్నానురా..’’ అపనమ్మకంగా అన్నాడు నిహార్.
‘‘టైం పడుతుందిరా.. నీకింకా టైం వుంది’’ అన్నాడు షర్ట్ ఐరన్ చేస్తూ..
ఆ మాటలతో వులిక్కిపడ్డాడు.. భయపడ్డాడు. కంగారుపడ్డాడు..
-సశేషం

-తేజారాణి తిరునగరి