డైలీ సీరియల్

పంచతంత్రం -- 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతలో కార్తీక్ దగ్గర ఫోన్ మోగింది. అవతలనుంచి కార్తీక్ తండ్రి వాసుదేవరావు కంఠం వినపడింది.
‘‘కార్తీక్...! ఒకసారి ఇంటికి వస్తావా? నీతో అర్జెంట్‌గా మాట్లాడాలి’’
‘‘ఇప్పుడే వస్తున్నా....!’’అంటూ చెప్పి ఫోన్ ఆఫ్ చేసి, ఫ్రెండ్స్‌వైపు చూస్తూ అన్నాడు కార్తీక్.
‘‘మా నాన్ననుంచి ఫోన్....! మా నాన్నని కూడా వాడు బెదిరించాడేమో!!’’
అదే సమయంలో హరీష్, రవి, జైరాంల దగ్గర ఉన్న సెల్‌ఫోన్ ఒకేసారి రింగ్ అయ్యాయి.
వాళ్ళు ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. అవతలినుంచి చెపుతున్న మాటలు విన్న తర్వాత వాళ్ళ ముఖాలు వాడిపోయాయి.
అందరినీ ఉద్దేశించి చెప్పాడు జైరాం.
‘‘ఆ బాల్‌రాజ్‌గాడు మా నాన్నని కూడా కలిసాట్ట. పాత నోట్లకి స్థలం అమ్మకపోతే కబ్జాచేస్తా అంటున్నాట్ట. మనవాళ్ళు అందరూ కార్తీక్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ ఏర్పాటుచేశారు. మనల్ని రమ్మంటున్నారు.’’
వింటున్న గోపికకు విషయం అర్ధం అయింది.
గోపికతో- ‘‘నేను నీకు ఫోన్ చేస్తాను. మనం మళ్ళీ కలుద్దాం.’’ అన్నాడు కార్తీక్.
* * *
కార్తీక్ వాళ్ళ ఇంట్లో ఏర్పాటుచేసుకున్న మీటింగ్‌లో కార్తీక్, రవి, హరీష్, జైరాంల తల్లితండ్రులు అంతా పాల్గొన్నారు. ఒకళ్ళ బాధలు ఒకరు చెప్పుకున్నారు. ఆ స్థలాల మీద వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ స్థలాలను వాళ్ళు పదేళ్లక్రితం బాల్‌రాజ్ దగ్గరేకొన్నారు. ఇప్పుడు పాత నోట్ల రూపంలో ఉన్న బ్లాక్‌మనీని వైట్ చేసుకోవటానికి వాడు బెదిరింపులకు దిగాడు. తమలాగే చాలామందిని వాడు బెదిరిస్తుండవచ్చు అని వాళ్ళు అనుకున్నారు.
చివరకు వాళ్ళు ఆ స్థలాలను బాల్‌రాజ్‌కు అమ్మేయాలి అని నిర్ణయించారు. ఆ బాల్‌రాజ్‌ని ఎదిరించినవాడు ఎవ్వరూ బతకలేదు అనీ, వాడికి ఎదిరించి చావటం కంటే, వాడు చెప్పినట్టుచేసి ప్రాణాలు నిలుపుకోవటం మంచిది అనీ నిశ్చయించుకున్నారు.
కార్తీక్ అతడి మిత్రులు ఎంత ప్రతిఘటించినా వీళ్ళమాట ఎవరూ వినలేదు.
* * *
అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకి హరీష్‌కి ఫోన్ చేసాడు కార్తీక్.
‘‘మనం మన మీటింగ్ వేద్దాం.... ఎక్కడ మీట్ అవుదాం?’’.... అంటూ అడిగాడు కార్తీక్.
హరీష్ ఆలోచిస్తున్నాడు.
అంతలో కార్తీక్‌కి గుర్తుకు వచ్చింది... తమ ఏరియాలోనే ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. ఆ కాలేజీ వెనకాల ఉంది దట్టంగా చెట్లతో నిండిన అడవిలాంటి ప్రదేశం. తాము మాట్లాడుకోవటానికి అది అనువైన చోటు.
ఈ విషయం హరీష్‌తో చెప్పాడు కార్తీక్.
తర్వాత కార్తీక్, హరీష్, రవి, జైరాం, గోపికలు ఆ అడవి లాంటి ప్రదేశంలో చెట్లమధ్య కూర్చోవడానికి అనువుగా ఉన్నచోట సమావేశం అయ్యారు.
బాల్‌రాజ్‌కు తమ స్థలాలు అమ్మవద్దు అనీ, అవసరం అయితే ఎదిరిద్దాం అనీ నిర్ణయించుకున్నారు.
గోపిక చెప్పింది.
‘‘నిరంజన్ అనేవాడి దగ్గర బాల్‌రాజ్ పనిచేస్తుంటాడట’’.
నిరంజన్ గురించి వాళ్ళు విని ఉన్నారు.
‘‘మనం చాలా పెద్దవాడితో పెట్టుకుంటున్నాం..’’అన్నాడు రవి.
‘‘అందుకే జాగ్రత్తగా ఉందాం!.. మనం ఎవరమో వాడికి, వాడి మనుషులకు తెలియకూడదు.’’ అన్నాడు కార్తీక్.
‘‘అసలు ఆ నిరంజన్ అనేవాడు ఎక్కడ ఉంటాడు?’’ అంటూ అడిగాడు జైరాం.
‘‘ఆ బాల్‌రాజ్‌గాడు మన పేరెంట్స్‌ని కలవడానికి వస్తాడు. అప్పుడు మనం వాడిని ఫాలో అవుదాం.’’అంటూ చెప్పాడు కార్తీక్.
‘‘ఆ తర్వాత...?’’ అడిగింది గోపిక.
‘‘చూద్దాం..! ముందు మన సెల్‌ఫోన్స్‌లో, లాప్‌టాప్స్‌లో ఉన్న మన ఫొటోలు, మన కుటుంబసభ్యుల ఫొటోలు డిలీట్ చెయ్యండి. ఇంట్లో ఫొటో ఆల్బమ్స్ ఏమైనా ఉంటే వాటిని దాచిపెట్టండి. ఇంటి గోడల మీద ఫొటోఫ్రేమ్స్‌లో మన ఫొటోలు ఉంటే తీసేయండి. మనం ఎవరమో, మనం ఎలా ఉంటామో, మన పేర్లు ఏంటో మన శత్రువులకు తెలియకూడదు. ఆ బాల్‌రాజ్, వాడి బాస్ నిరంజన్, వాళ్ళ అనుచరుల ఫోన్ నంబర్స్ సంపాదించండి. మన పేరెంట్స్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లు ఇంట్లోవాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. ఇప్పుడు మనం డిస్‌పర్స్ అవుదాం. నేను మీకు ఫోన్ కాంటాక్ట్‌లో ఉంటా.’’అంటూ చెప్పాడు కార్తీక్.
* * *
అప్పుడు టైము సాయంత్రం ఆరు గంటలు అవుతోంది.
కార్తీక్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరుగుతోంది.
హరీష్, జైరాం, రవి వాళ్ళ ఫాదర్స్‌తో కార్తీక్ తండ్రి వాసుదేవరావు ముందు గదిలో కూర్చుని మాట్లాడుతున్నాడు.
వాళ్ళు అంతా బాల్‌రాజ్‌కోసం ఎదురుచూస్తున్నారు.
అప్పుడు లోపల హాల్‌లో టివి దగ్గర ఉన్న సెల్‌ఫోన్ మోగింది. ఆ సెల్‌ఫోన్ కార్తీక్ తండ్రి వాసుదేవరావుది. కార్తీక్ ఆ ఫోన్ తీసి చూసాడు. ఏదో కొత్త నెంబర్. ‘‘ఆ బాల్‌రాజ్‌గాడి నెంబర్ అయి ఉంటుందా?’’అని మనసులో అనుకున్నాడు. అతడు ఆ నంబర్ వైపే చూస్తూ ఉండగా ఎవరో వస్తున్న అలికిడి వినపడింది. వెంటనే అతడు ఆ ఫోన్‌ని యధాస్థానంలోపెట్టి పక్కకు తప్పుకున్నాడు. తర్వాత కార్తీక్ తండ్రి వాసుదేవరావు వచ్చి, ఆ ఫోన్ అందుకుని, మాట్లాడసాగాడు. ఆయన భయం భయంగా మాట్లాడుతున్నాడు. చాటుగా ఆయననే గమనిస్తున్న కార్తీక్‌కి లైన్లో ఉన్నది బాల్‌రాజ్ అని అర్ధం అయింది.
ఫోన్లో సంభాషణ ముగిశాక ‘‘కార్తీక్!’’అంటూ పిలిచాడు వాసుదేవరావు.
‘‘డాడీ!’’అంటూ ఆయన దగ్గరకు వచ్చాడు కార్తీక్.
‘‘ఆ బాల్‌రాజ్ ఫోన్ చేశాడు. కాసేపట్లో ఇక్కడికి వస్తాడట. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది.’’
‘‘మీరే మాట్లాడండి డాడీ!. నాకు ఇంకా టూ రౌండ్స్ ఇంటర్వ్యూలు ఉన్నాయ్‌గా. వాటి గురించి నా ఫ్రెండ్స్‌తో డిస్కస్ చెయ్యాలి...’’ రెండు క్షణాలు ఆగి చెప్పాడు కార్తీక్.
‘‘నేను కూడా ఆలోచించాను డాడీ!.. ఆ బాల్‌రాజ్‌తో గొడవ పెట్టుకోవటం ప్రమాదం. హరీష్, జైరాం వాళ్ళుకూడా ఇలాగే అనుకుంటున్నారు.’’
‘‘సరే!... ఆ స్థలంమీద ఎన్నో ఆశలుపెట్టుకున్నాను’’ అన్నాడు వాసుదేవరావు.
ఆ మాటలు అంటున్నప్పుడు ఆయన గొంతు దుఃఖంతో వణికింది. అది గమనించిన ఆ కార్తీక్‌కి బాధ కలిగింది. ఐనా మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ వౌనంగా అక్కడినుంచి నిష్క్రమించాడు.
* * *
ఓపెన్ టాప్ జీపులో వేగంగా ప్రయాణిస్తున్నాడు బాల్‌రాజ్.
పఠాన్ అనే గుండా జీప్‌ను డ్రైవ్ చేస్తున్నాడు. పఠాన్ పక్క సీట్‌లో కూర్చుని సెల్‌లో మాట్లాడుతున్నాడు బాల్‌రాజ్. అప్పుడే వీధి మలుపులోకి ప్రవేశిస్తూ, ఎదురుగా ఒక ఆటోరావటంతో సడెన్ బ్రేక్‌తో జీప్ ఆపాడు పఠాన్.
-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు