డైలీ సీరియల్

పంచతంత్రం-30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్టపెట్టెలు ఓపెన్‌చేసి, అందులోంచి నిరంజన్ చెప్పిన వస్తువులు అన్నీ బయటకుతీసారు బాల్‌రాజ్ అతడి అనుచరులు.
జర్కిన్లు, ప్యాంట్లు మొదలైన వాటివైపు చూపుతూ చెప్పాడు నిరంజన్.
‘‘మీరు వీటిని ధరించాలి. మరికొద్ది గంటల్లో వజ్రాలతో వేలాయుధం వస్తాడు. నేను ఇచ్చే డబ్బు అతడికి ఇవ్వండి. అతడు ఇచ్చే వజ్రాలు తీసుకురండి.’’
బాల్‌రాజ్ అడిగాడు ‘‘అన్నా! మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నాం... ఒకేసారి పెద్ద అవౌంట్ ఇస్తే... మాకు పనికి వస్తుంది.’’
నిరంజన్ నవ్వి చెప్పాడు.
‘‘క్యాష్ ఏం చేసుకుంటారు? దండగ?? పెద్ద నోట్లు రద్దు ఐపోయాయి కదా?.... డైమండ్స్‌రూపంలో దాచుకోండి... ఐదు సంవత్సరాల్లో డైమండ్స్ ధర పదిరెట్లు పెరుగుతుంది. కానీ ఈలోపు వాటిని కదల్చకూడదు. అమ్ముకునే ప్రయత్నం చెయ్యవద్దు.. ఈ డీల్ సక్రమంగా పూర్తయితే నేను మీకు ఒక్కళ్ళకి ఒక్కొక్క డైమండ్ ఇస్తా. అది ఒక్కక్కటి పాతిక లక్షలు చేస్తుంది.’’
చెప్పటం ఆపాడు నిరంజన్.
తమకు నిరంజన్ డైమండ్స్ ఇస్తున్నాడు అనగానే బాల్‌రాజ్, పఠాన్, బైరాగిల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి.
వాళ్లతో చెప్పాడు నిరంజన్.
‘‘నేరుగా ఇంటికి వెళ్ళండి. ఆ జర్కిన్, ప్యాంటు, బూట్లు, మాస్క్, గ్లోవ్స్ తొడుక్కుని, హెల్మెట్ పెట్టుకుని పోచమ్మ టెంపుల్ వెనక ఎదురు చూస్తూండండి. అక్కడికి ఎన్నిగంటలు వెళ్లాలో ఫోన్‌చేసి చెపుతా.. మిమ్మల్ని వేలాయుధం కలుస్తాడు. నేను ఇచ్చిన సూట్‌కేసులు అతడికి ఇవ్వండి. అతడు మీకు వజ్రాలు ఉన్న బాక్స్ ఇస్తాడు. దాన్ని తీసుకుని నాకు తెచ్చి ఇవ్వండి...! గుర్తుపెట్టుకోండి...! వేలాయుధం మీ ముఖంచూస్తే మీకు ప్రమాదం. ఆ మాస్క్ పెట్టుకుని, తలకు హెల్మెట్ తగిలించుకోండి...! వేలాయుధం కలసిన టైంలో సెల్‌ఫోన్స్ స్విచ్‌లు ఆఫ్ చెయ్యండి. అసలు ఏమీ మాట్లాడకండి. నోరు విప్పితే ప్రమాదం. నిమిషంలో మొత్తం ట్రాన్సాక్షన్ అయిపోవాలి. పని అయిన తర్వాత నాకు ఫోన్ చెయ్యండి. ఈ పని కరెక్ట్‌గా చేస్తేనే డైమండ్స్‌ని మీకు బహుమతిగా ఇస్తా! ... మీ జీప్ ఇక్కడే పెట్టండి!... షెడ్‌లో ఒక మారుతికారు ఉంది. కీస్ దానికే ఉన్నాయి అది వేసుకు వెళ్ళండి.’’
అని చెప్పి, కొద్దిక్షణాలు ఆగి ‘‘ఏదీ! ఒక్కసారి ఆ మాస్కులు తొడుక్కుని చూపించండి!’’అంటూ అడిగాడు నిరంజన్.
వెంటనే బాల్‌రాజ్, పఠాన్, బైరాగి మాస్కులు ధరించారు. వాళ్లను ఆ గెట్‌అప్‌లో చూసి, నవ్వు ఆపుకుంటూ-
‘‘జోకర్ వెధవలు!’’అని మనసులో అనుకుని-
‘‘మాస్కులు బాగా మ్యాచ్ అయ్యాయి.’’అంటూ వాళ్ళని మెచ్చుకున్నాడు.
నిరంజన్ అంతకుముందే డైలీ పేపర్లు, చిత్తు కాగితాలతో రెడీగా ఉంచిన రెండు సూట్‌కేసులను వాళ్లకు ఇచ్చి చెప్పాడు.
‘‘ఇక బయలుదేరండి!’’
జరిగేదంతా మానిటర్‌లో చూస్తున్నాడు కార్తీక్.
నిరంజన్ ప్లాన్ కార్తీక్‌కి అర్ధం అయింది. తన అనుచరులను అతడు మోసం చేస్తున్నాడు. ఒకళ్ళమీదకు ఒకళ్ళని ప్రయోగిస్తున్నారు. వాళ్లకు డబ్బు ఇవ్వటం అతడికి ఇష్టంలేదు. పైగా అవి నకిలీ డైమండ్స్ అయి ఉండాయి. రేపు ఒకవేళ అవి నకిలీవి అని బయటపడినా నిరంజన్‌కి ఏం నష్టంలేదు. తనుకూడా డబ్బు అంతా పోగొట్టుకుని నష్టపోయానని బాధపడతాడు. వేలాయుధం తనను మోసంచేసాడు అని బుకాయిస్తాడు. పైగా ఆ డైమండ్స్‌ని తామేతెచ్చి నిరంజన్‌కి ఇచ్చారు. ‘అసలు డైమండ్స్ మీరు తీసుకుని నకిలీవి నాకు ఇచ్చారు. నష్టపరిహారం కట్టండి’ అని అతడు తన అసిస్టెంట్స్‌ని నిందించవచ్చు. బెదిరించవచ్చు. వేలాయుధంతో జరిగే అసలు డీల్ గురించి తన అసిస్టెంట్స్‌కి తెలియటంకూడా అతడికి ఇష్టం లేదు.
కార్తీక్ ఆలోచిస్తుండగానే నిరంజన్ ఇంట్లోనుంచి బయటకువచ్చి జీప్ అక్కడే ఉంచి, ఆ పక్కనే షెడ్‌లో ఉన్న మారుతి కారులో బయలుదేరారు బాల్‌రాజ్, పఠాన్, బైరాగి.
వాళ్ళను అనుసరిస్తూ బయలుదేరారు జైరాం, రవి.
తర్వాత టివి చూస్తూ కూర్చున్నాడు నిరంజన్.
జన సంచారం పెరుగుతుండటంతో నిరంజన్ ఇంట్లో టేబుల్ కింద ఉన్న డ్రోన్‌ను మెల్లగా బయటకుతీసుకువచ్చాడు కార్తీక్. పవర్ ఆఫ్‌చేసి, దాన్ని బాక్స్‌లోపెట్టి, షోల్డర్‌బాగ్‌లో ఉంచుకున్నాడు. ఆ దగ్గరలో ఉన్నదో రామాలయం. బైక్‌మీద రామాలయం దగ్గరకు వెళ్లి, నిరంజన్ ఇంటి వైపుచూస్తూ నిలబడ్డాడు.
* * *
పఠాన్ ఇంటిబయట తమకు అనువైన ప్రదేశంలో నిలబడి ఉన్నారు జైరాం, రవి.
పఠాన్ ఇంట్లో బాల్‌రాజ్, పఠాన్, బైరాగి కబుర్లు చెప్పుకుంటున్నారు.
‘‘అన్నా!.... మనకు అన్న ఇచ్చే డైమండ్స్ ఏదిఅయి ఉంటుంది. వజ్రమా?... వైడూర్యమా?... మరకతమా?... మాణిక్యమా??’’అంటూ అడిగాడు పఠాన్.
‘‘మరకతం అయి ఉంటుంది’’అంటూ చెప్పాడు బాల్‌రాజ్.
‘లేదన్నా?... మాణిక్యం అయి ఉంటుంది అనిపిస్తోంది’’ అన్నాడు పఠాన్.
‘‘లేదు!.... మరకతం అయి ఉంటుంది.’’
‘‘లేదన్నా!.... మాణిక్యం...!’’
‘‘కాదు!... మరకతం.’’
వాళ్ళు అలా వాదులాడుకుంటుండగా మెల్లగా బాత్రూంలోకి వెళ్లి సెల్‌తీసి, మహేంద్ర నంబర్‌కి రింగ్ చేసాడు బైరాగి.
* * *
పోలీస్‌స్టేషన్‌లో దుర్గారావ్ ముందు కూర్చుని ఉన్నాడు మహేంద్ర. సెల్ మోగగానే, నంబర్‌చూసి- ‘‘సర్!... ఆ బైరాగిగాడు... లైన్‌లో ఉన్నాడు’’ అంటూ చెప్పి, ఫోన్ రిసీవ్ చేసుకుని, స్పీకర్ ఆన్‌చేసాడు.
అవతలి నుంచి బైరాగి వేగంగా, క్లుప్తంగా మేటర్ చెప్పేసాడు.
తర్వాత-
‘‘అన్నా!.... మళ్ళీ నాకు ఫోన్‌చేసే అవకాశం రాకపోవచ్చు. మేము బయలుదేరగానే ఒక మిస్సుడు కాల్ ఇస్తా!’’అంటూ ముగించాడు.

-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు