డైలీ సీరియల్

జ్వాలాముఖి... మంత్రాల దీవి -- 5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయుడు విక్రముడు ముందు నడుస్తుంటే అశ్వాలు రెండు వెనుక నడుచుకుంటూ వస్తున్నాయి.
‘‘మిత్రమా ఈ అడవి కడురమణీయంగా వున్నది. ప్రకృతి కాంత సోయగాలు కనిపిస్తున్నాయి’’ విజయుడున్నాడు.
‘‘యువరాజ వారికి వివాహంమీద మనసు మళ్ళినట్టు వున్నది.... పట్ట్భాషేకమే తరువాయి... పాణిగ్రహణం
చిరునవ్వుతో అన్నాడు విక్రముడు.
అపార్థం చేసుకున్నావ్ మిత్రమా... నా మనసులో ఆ ధ్యాసలేదు... మన రాజ్యం తలమానికమై నిలవాలి... రామరాజ్యాన్ని తలపించాలి... ప్రకృతితో శోభిస్తున్న ఈ అరణ్యంలో చోరుల బెడద వుంది. సైనికులతో గస్తీ ఏర్పాటుచేయాలి.. రాత్రివేళ బాటసారులకు విశ్రాంతి గుడారాలు ఏర్పాటుచేయాలి. కాగడాల వెలుగులు కావాలి..’’ చెప్పుకుపోతున్నాడు విజయుడు.
‘‘మిత్రా నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ప్రజా శ్రేయస్సు కోసం ఆరాటపడే నీ మనసుకు శతకోటి వందనాలు.. నన్ను మన్నించు మిత్రమా’’
‘‘మిత్రుల మధ్య మన్నింపులా? అయిననూ పాణిగ్రహణం నీకైననూ, నాకైననూ తప్పదు కదా.. మనకు రాసిపెట్టి వున్న అర్థాంగులు ఎక్కడో పుట్టి వుంటారు’’ అన్నాడు మిత్రుడు భుజం తట్టి విజయుడు.
‘‘మనఃస్ఫూర్తిగా’’ అన్నాడు విక్రముడు.
విజయుడి అశ్వంమీద దర్జాగా కూచున్న రాయంచ చిలుక వీరి మాటలు వింటున్నది.
ఒక్క క్షణం చిలుక గాల్లోకి ఎగిరింది..
‘‘రాయంచా ఎక్కడికి వెళ్తున్నావ్.. దారి తప్పుతావేమో’’ విజయుడు అన్నాడు..
అలా వెళ్లిన రాయంచ వెనువెంటనే తిరిగి వచ్చి విజయుడి భుజాలమీద వాలి ‘‘మిత్రమా.. తూర్పువైపు పులి జాడ చూసాను. ఆకలిగొన్న పులి ఆవురావురుమంటూ వున్నది..’’ చెప్పింది.
అప్పటికే విజయుడు, విక్రముడు హిగ్గారీలు వుండే ప్రాంతానికి వచ్చారు.. అక్కడ రెండు పెద్ద గుడారాలు కనిపించాయి.. అందులో లెక్కకు మించి గజదొంగలు ఉన్నట్టు తెలుస్తోంది.
కొందరు బయట నిలబడి ఆయుధాలకు పదును పెట్టుకుంటున్నారు.
‘‘మిత్రమా యుద్ధమే.. శరణ్యం.. చోరులు లెక్కకుమించి ఉన్నారు. తక్షణ కర్తవ్యం ఏమిటి? కరవాలానికి పని చెబుదామా?’’ అన్నాడు విక్రముడు.
‘‘ఆ చోరులను మనం అంతమొందించడంకన్నా ఆకలితో ఆవురావురుమంటున్న పులికి ఆ బాధ్యతను అప్పగించేద్దాం’’.
ఒక్క క్షణం అర్థం కానట్టు చూసాడు విక్రముడు.. వెంటనే విజయుడు రాయంచ వైపు చూసి..
‘‘మన రాయంచ రాయబారం.. పులికి దగ్గరికి వెళ్లి మన సందేశాన్ని వినిపిస్తుంది..’’ చెప్పాడు. విభ్రాంతిగా చూసాడు విక్రముడు.
‘‘నేను సిద్ధం మిత్రమా.. ఆ పులి నన్ను ఫలహారం చేయకుండా చూసే పూచీ మీదే సుమా’’ అంది రాయంచ.
అక్కడినుంచి విక్రమ, విజయులు కదిలారు. పులి వున్న ప్రాంతానికి వెళ్లారు.
పులి కళ్లను చిట్లించి చూస్తోంది. తన ఆకలి తీరే మార్గాన్ని అనే్వషిస్తోంది. సరిగ్గా అపుడు చిలుక పులికి ఎదురుగా వున్న చిన్న బండరాయిమీద వాలింది. పులికి అభిముఖంగా వుంది.
‘‘పులిరాజాకు ఈ చిట్టి చిలుక ప్రణామాలు’’ అంది చిలుక పలుకులతో.
పులిరాజు మొహం ప్రసన్నంగా మారింది.
‘‘ఈ అడవికి మీరే రాజు.. రారాజు.. మీ దర్పం ఎవరికీ రాదు’’ చిలుక అంది.
‘‘మాటలు నేర్చిన చిట్టిచిలుకా.. ధైర్యంగా ఈ పులి ముందే నిలబడినావు. అసలే ఆకలితో నకనకలాడిపోతున్నాను..’’ అంది
‘‘పులిరాజా.. నీ ఆకలి తీరే మార్గం చెబుతాను. మా యువరాజావారి నుంచి మీకు ఒక సందేశాన్ని తీసుకువచ్చాను..’’ అంది.
‘‘యువరాజా వారి నుంచా.. ఏమిటా సందేశం?’’ ఆశ్చర్యంగా అడిగింది పులి.
‘‘తోటి జంతువులను చంపి ఆకలి తీర్చుకునే బదులు దారిదోపిడీతో ప్రజల మానప్రాణాలు హరించే చోరులను చంపి మీ ఆకలి తీర్చుకోండి. ఇప్పటివరకు మీకు ఆశ్రయం కలిగిస్తున్న ఈ రాజ్యం రుణం తీర్చుకోండి. ఒక మంచి పని చేసి జంతులోకంలో మంచి పేరు తెచ్చుకోండి. మీరు చేసిన పనిని మా రాజ్యం రాజ్య ప్రజలు గుర్తుంచుకుంటారని మా యువరాజావారు తమ సందేశంగా మీకు చెప్పమన్నారు. దుష్టులైన ఆ చోరులను కడతేర్చే బాధ్యత మీకు అప్పగిస్తున్నారు’’ అని చెప్పింది చిలుక.
పులి ఆలోచనలో పడింది. ఆ వెంటనే సరేనంది.
ఒకవేళ పులి చిలుకను నోట కర్చుకుంటే చిలుకను కాపాడడానికి.. వెంటనే రక్షించడానికి విజయుడు విక్రముడు సిద్ధంగా వున్నారు. పులి మాటలు విని ఊపిరి పీల్చుకున్నారు.
‘‘కాగల కార్యం గంధర్వులు తీర్చడం అంటే ఇదే కాబోలు’’ అన్నాడు విక్రముడు.
‘‘పులిరాజా మీకు నేను దారి చూపిస్తాను’’ అంటూ చిలుక హిగ్గారీలు వున్న గుడారాలవైపు కదిలింది.
***
తమ సహచరులు ఇంకా రాకపోయేసరికి వారిని వెతుక్కుంటూ వెళ్లాలని ఆయుధాలతో బయల్దేరిన హిగ్గారీలు క్షణకాలం నిశ్శబ్దంగా ఉండిపోయారు. పులి అడుగుల శబ్దం వినిపించింది. హిగ్గారీలు తేరుకునేలోపు పులి వారి మీదికి లంఘించింది. పులి గాండ్రింపునకు సగం హడలి చచ్చారు. పులి ధాటికి ఎదురునిలిచి పోరాడే శక్తి వారికి లేదు.
వాళ్ళు ఆయుధాలు తీసేలోపు పులి తన పంజా విప్పింది. దొరికినవారిని దొరికినట్టే వేటాడింది.. వెంటాడింది, చీల్చి చెండాడింది. కొందరు హిగ్గారీలు తప్పించుకునే ప్రయత్నం చేశారు.
వారిని విజయ విక్రములు నిలువరించి హతమార్చారు.. కన్నుమూసి తెరిచేలోగా ఎంతమందినో పొట్టనబెట్టుకున్న నరరూప రాక్షసులు అయిన హిగ్గారీలు.. గజదొంగలు నామరూపాలు లేకుండా హతమయ్యారు.
పులి తన ఆకలి బాధ కొన్నాళ్లవరకూ ఉండదని సంతోషపడింది.
విజయుడు పులి ముందు నిలబడి ‘‘పులిరాజా... నిజంగా పులి రాజావి అనిపించుకున్నావు... ఈ అడవి ప్రాంతంలోకి ప్రవేశించే చోరులను పులి దాడిచేసి హతమారుస్తుందన్న దండోరా చోరుల ఒంటిలో వణుకు పుట్టిస్తుంది.. నీకొక విన్నపం... నువ్వు ఇలాగే చోరులను నీ పులిపంజాతో చీల్చిచెండాడు.. ఈ దేశపు యువరాజుగా మాట ఇస్తున్నాను... ఇకనుంచీ మహారాజు కానీ అధికారులు మంత్రులు కానీ జంతువులను వేటాడరు... వేట మన రాజ్యంలో నిషిద్ధము... జంతువులను వేటాడే వేటకు స్వస్తిచెప్పేలా శాసనం చేయిస్తాను... మీకు ఆహారం కూడా అందజేసే ప్రయత్నం చేస్తాం... సాధు జంతువులను చంపడం మానుకో...’’మాటఇస్తూ హితవు చెప్పాడు విజయుడు.
పులి కృతజ్ఞతాభావంతో విజయుడి వైపు చూసింది.
వేట పేరుతో జంతువులను పులులను వేటాడబోమనే మాట మిక్కిలి సంతోషాన్ని కలిగించింది.
‘‘కృతజ్ఞతలు మహారాజా... మీకు మాట ఇస్తున్నాను... ఈ అడవిలో బాటసారుల మీద చోరుల నీడ కూడా పడదు’’ అంది.
వెంటనే విజయుడు తన మెడలోని హారాన్ని పులిమెడలోవేసి ‘‘ఇది మా కానుక’’ అన్నాడు.
పులి యువరాజు తన మెడలో వేసిన హారాన్ని చూసుకుని మురిసిపోయింది. ‘‘యువరాజా మీకు సేవ చేయడానికి ఈ పులిరాజు సదా సిద్ధం’’ అంది.

-సశేషం

- శ్రీ సుధామయి