డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ...7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అవును. నువ్వంటూ ఉంటావు కదా? ఉరుము ఉరిమి మంగలమీద పడిందని. అందులో మంగలం అంటే ఎవరు?’’
అంజలి పకపకా నవ్వింది అతడి మాటలకి. ‘‘మంగలం అంటే మనిషి కాదు. మంగలం అంటే ఓటికుండ. అసలే పల్చగా ఉండే కుండ, అందునా ఓటిది. అల్పమైన అలాంటి కుండమీద ఉరుము ఉరిమి పిడుగు వచ్చిపడితే ఏమవుతుంది? అసలు ఆకాశంలో ఉరుముకీ, భూమీద ఈ మట్టి కుండకీ ఏం సంబంధం? అదీ ఆ సామెతకి అర్థం’’ నవ్వుతూనే చెప్పి అడిగింది ‘‘అయినా ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చింది ఆ సామెత?’’
‘‘ఉరుము ఉరిమింది, మంగలమీద కూడా పడింది కనుక’’ అన్నాడు పాణి.
‘‘ఎవరా మంగలం?’’ అడిగింది అనుమానంగా.
‘‘నువ్వే’’
‘‘నేనా?!’’ ఆశ్చర్యంగా అంది ఆమె.
‘‘అవును. హోటల్‌కి వస్తుంటే ఎస్సై రవీంద్ర ఫోన్ చేశాడు. నగరంలోని ఒక బిగ్ షాట్ కొడుకు గెస్ట్‌హౌస్‌లో చనిపోయాడట. పైకి సహజ మరణంలా కనిపిస్తున్నా, అది హత్యేనని ఆ బిగ్ షాట్ అనుమానం.
రాజు తల్చుకుంటే దెబ్బలకి కొదువా? అందుకే ఆయన పోలీసులమీద ఉరిమాడు. పోలీసుల నా మీద ఉరిమారు. ఉరుము ఉరిమాక పిడుగు మంగలమీద పడాలి కదా? పడింది. నువ్వు ఎన్నాళ్లనుంచో చూడాలనుకుంటున్న అరకులోయ ప్రోగ్రామ్ కేన్సిల్ అయింది. బహుశా కేసు తేలేవరకూ మరో వారం వరకూ మన మకాం హైదరాబాద్‌లోనే’’.
అంజలి కోపంగా చూసింది అతడి వంక. అదృష్టవశాత్తూ అప్పటికి కాఫీ కలపడం పూర్తయిపోవడంతో తనకిష్టమైన భార్య చేతి కాఫీ తీసుకుని, ఆమె ముఖం వంక చూడకుండా తలదించుకుని తాగడం మొదలుపెట్టాడు. అంజలి విసురుగా వాష్ రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకుంది.
కాఫీ రెండు గుటకలు వేసేలోగానే పాణి సెల్ మ్రోగింది. ఏదో తెలియని నెంబరు. ఫోన్ ఎత్తి ‘హలో’ అన్నాడు పాణి.
‘‘డిటెక్టివ్ పాణిగారా?’’ అవతలనుంచి తెలుగులో వినిపించింది.
‘‘అవును. పాణినే మాట్లాడుతున్నాను. మీరెవరు?’’ అన్నాడు పాణి.
అవతల నుంచి ఒక్క క్షణం నిశ్శబ్దం. వెనువెంటనే భారంగా ఊపిరి పీల్చుకున్న శబ్దం. ఆ తరువాత నెమ్మదిగా వినిపించింది అవతలనుంచి ‘‘నా పేరు శివ. భరణి స్నేహితుడ్ని. మీతో కొంచెం మాట్లాడాలి’’.
ఒక్క క్షణం నిటారుగా అయ్యాడు పాణి. ‘‘ఏమ్మాట్లాడాలి మీరు? నా నెంబరు ఎవరిచ్చారు మీకు?’’
‘‘ఎస్సై రవీంద్రగారు ఇచ్చారు. భరణి గురించి మీతో కొన్ని విషయాలు చెప్పాలి’’.
‘‘సరే అయితే, నేను వచ్చి కలుస్తాను. నువ్వు ఎక్కడ ఉన్నావు?’’ అడిగాడు పాణి. అవతలనుంచి మాట్లాడుతున్న యువకుడు చెప్పింది టేబిల్‌మీద ఉన్న నోట్‌పాడ్‌మీద రాసుకుని ‘‘నేను అరగంటలో అక్కడ ఉంటాను’’ అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. ఆ కాగితాన్ని చించి మడిచి జేబులో ఉంచుకుంటూ కప్పులో మిగిలిన కాఫీని గబ గబా త్రాగేసాడు.
‘‘సారీ అంజలీ. మనం టాంక్‌బండ్‌కి వెళ్ళడం లేదు. నేను పనిమీద బయటికి వెళ్లాలి’’ అన్నాడు.
అతడ్ని మింగేసేలా చూసింది అంజలి. ‘‘త్వరగా వచ్చేస్తానులే. తలుపేసుకో’’ చెప్పి బయటికి కదలబోతున్న అతడ్ని ఆపుతూ అడిగింది ఆమె. ‘‘ఎక్కడికి వెడుతున్నారు?’’
పాణికి తను కాగితమీద రాసుకున్న అడ్రస్ గుర్తుకువచ్చింది. ‘‘టాంక్‌బండ్‌మీద నన్నయ విగ్రహం దగ్గర మీ కోసం ఎదురుచూస్తూ వుంటాను’’ అని శివ అనగడం గుర్తుకు వచ్చింది. కానీ ఆ విషయం అంజలికి చెప్పాలంటేనే భయం వేసింది.
‘‘ఊర్లోనేలే. వచ్చాక చెబుతాను’’ అంటూ దాటేసి బయటికి నడిచాడు.
****
‘‘నా పేరు శివ. ఎస్సై రవీంద్ర మా మావయ్య. భరణీ నేనూ ఒకే కాలేజీలో చదువుతున్నాం. భరణి చనిపోయాడన్న వార్త తెలియగానే నేను మా మావయ్యకి ఫోన్ చేశాను. భరణికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మా మామయ్యకి చెప్పాను. మా మావయ్య నేను చెప్పినది విన్నాక, అవి భరణి కేసుని పరిశోధిస్తున్న మీకు ఉపయోగపడతాయని చెప్పి, నాకు మీ ఫోను నెంబరు ఇచ్చి మీతో మాట్లాడమన్నారు. అందుకే మీకు ఫోను చేశాను’’ అన్నాడు శివ.
పాణి అతడ్ని పరిశీలనగా చూసాడు. అమాయకత్వం, తెలివితేటలూ కలగలిసిన ‘ఇంటిలిజెంట్ యంగ్ లుక్’ అతడిలో కనిపిస్తోంది.
‘‘డిటెక్టివ్ అనగానే సూటూ బూటూ వేసుకుని, చేతిలో తుపాకీతో చూపులతోనే చంపేసేలా ఉంటారనుకున్నాను. మీరు చూస్తుంటే మా కాలేజీలో లెక్చరర్‌లా చాలా ఫ్రెండ్లీగా కనిపిస్తున్నారు’’ అన్నాడు అతడు.
పాణి అతడి భుజమీద చెయ్యి వేస్తూ చిన్నగా నవ్వేడు. ‘‘ఇంతకీ ఏమిటి నువ్వు నాకు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం?’’
‘‘ఆ విషయం చెప్పేముందు భరణి గురించి మీకు పూర్తిగా చెప్పాలి’’
అప్పటికి పూర్తిగా చీకటి పడింది. విద్యుద్దీపాల వెలుగులో నక్లెస్ రోడ్డు మెరుస్తూ కనిపిస్తోంది. ఇద్దరూ టాంక్‌బండ్‌మీద వున్న రెయిలింగ్ మీద రెండు చేతులూ ఆన్చి దూరంగా కనిపిస్తున్న బుద్ధవిగ్రహాన్ని చూస్తున్న పాణి చూపులు మరల్చి శివ వైపు చూస్తూ ‘‘చెప్పు.. భరణి నీకు ఎన్నాళ్లుగా స్నేహితుడు?’’ అన్నాడు.
‘‘్భరణి నాకు కాలేజీలో చేరిన రోజే పరిచయం. అతడు నాతో స్నేహంగా ఉండేవాడు. అంతమాత్రం చేత అతడు నా స్నేహితుడని చెప్పలేను. ఎందుకంటే అతడు కాలేజీలో అందరితోనూ అలాగే స్నేహంగా ఉండేవాడు. అతడు మా కాలేజీలో స్టూడెంట్ యూనియన్‌కి నాయకుడు. రాజకీయ నాయకుడిలాంటి నాయకుడు కాదు అతడు. నిజమైన నాయకుడు! కాలేజీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అతడే గుర్తొచ్చేవాడు. ఎవరు ఏ చిన్న సమస్యతో అతడికి దగ్గరగా వెళ్లినా అతడు దాన్ని తన సమస్యే అన్నంతగా ఆలోచించి పరిష్కారం చూపించేవాడు. కాలేజీలో అతడి మాటే స్టూడెంట్లకి వేదం. లెక్చరర్లకి భయం.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ