డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన ఇంటరాగేషన్‌కి మానసికంగా సిద్ధమై వచ్చినట్టుగా వుంది ఆమె వాలకం. చిన్నగా నవ్వుకున్నాడు.
కాఫీ షాప్‌లో కూర్చున్నాక అడిగాడు ‘‘ఉదయం నన్ను చూడగానే ఎందుకంత భయపడ్డారు?’’
ఒక్క క్షణం తడబడ్డట్టుగా చూసిందామె. తర్వాత నెమ్మదిగా అంది ‘‘సడెన్‌గా మీరలా వచ్చి అడిగేసరికి నాకు భయమేసింది. భరణి మరణించాడన్న వార్తనే నేనింకా పూర్తిగా జీర్ణం చేసుకోలేదు. ఆ మరణాన్ని పోలీసులు అనుమానిస్తున్నారన్న విషయం, అందులో భాగంగా నన్ను ప్రశ్నించడానికి ఒక డిటెక్టివ్ రావడం నాకు షాక్ తగిలినట్టనిపించింది. ఇప్పటిక్కూడా నాకు ఇదంతా షాకింగ్‌గానే వుంది. మాది చాలా సంప్రదాయకమైన కుటుంబం. ఇలాంటివాటిల్లో నా పేరు ఇరుక్కుందని తెలిస్తే మా ఇంట్లో నన్ను మర్డర్ చేస్తారు. ఉదయం మీరు వచ్చి నన్ను కలుసుకున్న తరువాత స్నేహితుల సహకారంతో నేను మీ గురించి తెలుసుకున్నాను. మీరు డీల్ చేసిన పాత కేసుల వివరాలూ, వాటిని మీరు డీల్ చేసిన విధానం తెలుసుకున్నాను. నాకు మీ మీద నమ్మకం ఏర్పడింది. అందుకే ధైర్యంగా వచ్చాను. లేకపోతే కాలేజీ ఎగ్గొట్టి పారిపోయేదాన్ని. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు బయటికి రానివ్వనని మీరు నాకు ముందుగా మాటివ్వాలి’’’.
‘‘తప్పకుండా. నాతో మాట్లాడినందువల్ల మీకే హానీ కలగదని హామీ ఇస్తున్నాను’’ అన్నాడు పాణి.
‘‘అసలు భరణిది హత్య అన్న అనుమానం మీకెందుకు వచ్చింది? ఆ విషయమీద ననె్నందుకు ప్రశ్నించాలనుకుంటున్నారు?’’ అంది హరిత.
‘‘పోస్టుమార్టమ్ రిపోర్టుల ప్రకారం భరణిది సహజ మరణం. కానీ చనిపోయే కొద్ది రోజుల ముందునుంచీ భరణికి బెదిరింపు ఉత్తరాలు వస్తున్నాయి. ఆ బెదిరంపు ఉత్తరాలు రావడం ఆగిపోయిన రోజే భరణి మరణించాడు. అదే అనుమానానికి కారణం. ఆ ఉత్తరాల్లో క్రింద ప్రతిసారీ యువర్ లవింగ్లీ అని ఉంటోంది. ఆ ఉత్తరాలు పేరు లేకుండా రాసినా, ఎవరు రాస్తున్నారో తెలుసుకోవడానికి ఆ వాక్యాలు ఒక కోడ్ వర్డ్స్‌గా ఉపయోగపడాలని రాసే వాళ్ళ ఉద్దేశ్యం అని నా అనుమానం. అంటే, ఆ రాసేవాళ్ళు భరణిని ప్రేమించి మోసపోయినవాళ్ళో, భరణి చేత ప్రేమలో నిరాకరించిబడిన వాళ్ళో అయి ఉండాలి. భరణి మీ ‘బోయ్‌ఫ్రెండ్’ అని విన్నాను. మీకు భరణి గురించి బాగానే తెలిసి ఉంటుంది. అతడి గురించి మీకు తెలిసిన నిజాలు చెబితే, నా పరిశోదనకి ఉపకరించవచ్చని మీతో మాట్లాడాలనుకున్నాను’’ అన్నాడు పాణి ఆమెని జాగ్రత్తగా గమనిస్తూ.
హరిత చురుగ్గా చూసింది పాణి వంక. ‘‘బోయ్ ఫ్రెండ్ అన్న పదాన్ని మీరే అర్థంతో వాడుతున్నారో అర్థం కావడంలేదు’’ అంది.
‘‘కాలేజీలో ఆ పదాన్ని మీరంతా ఏ అర్థంతో వాడతారో అదే అర్థంతో అడుగుతున్నాను నేను. చెప్పండి. భరణి మీ బోయ్ ఫ్రెండా కాదా?’’ చిన్నగా నవ్వుతూ అన్నాడు పాణి.
‘‘బోయ్‌ఫ్రెండ్ అంటే ఫ్రెండ్‌కీ లవర్‌కీ మధ్యనుండే స్టేజి. మేము వాడే అర్థం అది. ఒక అమ్మాయికి ఇద్దరు బోయ్‌ఫ్రెండ్సు ఉండచ్చు. కానీ ఇద్దరు లవర్స్ ఉండరు. అది చాలా సేఫ్ జోన్ కనుక, కాలేజీలో అబ్బాయిలూ అమ్మాయిలూ కూడా ఆ స్టేజీలో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతారు’’.
ఆమె చెప్పిన నిర్వచనానికి పాణి నవ్వాడు. ‘‘ఇంతకీ భరణితో మీకున్న స్నేహం ఎలాంటిది?’’.
ఒక్కసారి భారంగా ఊపిరి పీల్చి వదిలింది హరిత. ‘‘పాణిగారూ, మీరన్నట్టుగా భరణి నాకు బోయ్‌ఫ్రెండే. కానీ దీనికన్నా ముందు మీరు తెలుసుకోవలసిన విషయం మరొకటుంది. నాకు ఒక లవర్ కూడా ఉన్నాడు!’’ తటపటాయిస్తున్నట్టుగా నెమ్మదిగా అంది.
పాణి ఉలిక్కిపడ్డట్టుగా చూసాడు ఆమె వంక. ‘మాది చాలా సంప్రదాయకమైన కుటుంబం’ అన్నది ఈమేనా?!
‘‘ఉదయం బస్సు ఎక్కుతున్నప్పుడు సూర్యచంద్రులూ, నిజం మరుగుపరచినా మరుగుపడనివని అన్నారు మీరు. నిజమే. మీ మాటలు విన్నాక నాక్కూడా ఎప్పుడో చదివిన ఒక సూక్తి గుర్తుకు వచ్చింది. నిజం ఎప్పుడూ మూడు దశలని దాటుకుని ప్రయాణం చేస్తుందిట. మొదటి దశలో ఎగతాళి చేయబడుతుంది. రెండో దశలో దారుణంగా వ్యతిరేకించబడుతుంది. స్వానుభవం వల్ల స్పష్టంగా తెలిసే మూడో దశలోనే మనిషి ఏ నిజాన్నైనా అంగీకరిస్తాడు. నేను కూడా కొన్నాళ్ళ క్రితమే ఇలాంటి మూడు స్థాయిలనీ దాటి స్వానుభవం వల్ల ఒక నిజాన్ని తెలుసుకున్నాను. ఆ నిజాన్ని తెలుసుకునే క్రమంలో నాకు ఎదురైన వ్యక్తుల్లో ఒకరు భరణి. నేను మీకు భరణి గురించి చెప్పను. నా కథ చెబుతాను. ఆ కథ వింటే మీకు భరణి గురించి తెలుస్తుంది.’’
పాణి ఆసక్తిగా ఆమె వంక చూశాడు. ఆమె తను అనుకున్నలాంటి ‘సామాన్యమైన అమ్మాయి’ కాదని అతడికి అర్థమైంది. ఆమెతో మాట్లాడడం ఈ కేసుని తప్పకుండా ముందుకు తీసుకెడుతుందన్న నమ్మకం కూడా కుదిరింది. ‘‘చెప్పండి’’ అన్నాడు.
‘‘ఉదయం మీరు నన్ను కలిసిన బస్టాపు గుర్తుంది కదా? ఆ బస్టాపుకి నాలుగు సందుల వెనుక ఉన్న కాలనీలోనే మా ఇల్లు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఒక రోజు, ఇవాల్టిలాగే బెదురుతున్న చూపులతో ఆ బస్టాప్ దగ్గరికి వచ్చాను నేను మొదటిసారి కాలేజీకి వెళ్ళడానికి..’’ అంటూ తన కథ చెప్పసాగింది హరిత.

హరిత చెప్పిన ప్రేమకథ
బస్‌లు వెళ్లిపోన్నాయి. హరిత మరోసారి వాచీ చూసుకుని, రోడ్ చివరిదాకా దృష్టిని సారించింది. అపుడు కనపడిందామెకు దూరం నుంచి నడిచి వస్తున్న కావేరి. కావేరిని చూసాక ఆమెకి రిలీఫ్‌గా అనిపించింది.
‘ఏమిటలా వున్నావు?’ అడిగింది కావేరి రాగానే.
‘‘నువ్వొస్తావో రావో ఒక్కదానే్న ఎలా వెళ్ళాలా అని టెన్షన్ పడుతున్నాను’’ అంది హరిత.
కావేరి నవ్వింది. ఇద్దరూ కలిసి రెండు బస్సులు మారి కాలేజీకి చేరుకున్నారు. గేట్ దాటుకుని లోపలికి అడుగుపెడుతూనే విశాలమైన దారి. దారికిరువైపులా చెట్లు.. పక్కనే పెద్ద పెద్ద భవనాలు!

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ