డైలీ సీరియల్

పచ్చబొట్టు-35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అయ్యో! మీరెందుకయ్యా నాలాంటోడి కోసం అంత కష్టపడతారు’’ నొచ్చుకుంటూ అడిగాడు.
వయసులో చేసిన పాపాలు వృద్ధాప్యంలో ఇలా చుట్టుకుంటాయి బాబూ! పెళ్ళాం, బిడ్డను పట్టించుకోకుండా ఊరోళ్ళతో ఊరేగుతూ చేసిన తప్పులకు శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాను.
‘‘అయ్యో! అలా అనుకోమాకండి’’ అంటూ అతను తెచ్చిన అన్నాన్ని బొచ్చెలో వేసుకున్నాడు.
తండ్రి ఎంతకూ రాకపోవటంతో ఆమె కిటికీలోంచి బయటకు చూసింది.
‘‘ఈ బిచ్చగాడెవరబ్బా! ఇన్నాళ్ళబట్టి ఈ వీధిలో ఎప్పుడూ చూడలేదు’’ అనుకొంది.
‘‘ఇంక లోపలికి రానాన్నా!’’అని అరవబోతూ నోరును నొక్కేసుకుంది ఆ బిచ్చగాడు అనే్వష్ అని కనిపెట్టి. విస్తుపోయింది. గబుక్కున కిటికీలోంచి ప్రక్కకు తప్పుకుంది.
‘‘ఎందుకిలా వేషంవేసుకొని వచ్చాడు? అంత అవసరం ఏముంది?’’
మీ పశ్చాత్తాపమే మిమ్మల్ని కాపాడుతుంది లెండి!’’అని చెప్పి ప్రక్క గుడిసెముందుకి వెళ్ళాడు అనే్వష్.
తండ్రి లోపలికి రాగానే తలుపులు వేసేసింది తృప్తి.
ఆ ఇంట్లోకూడా తృప్తి కనిపించకపోవటంతో మరోసారి ప్రయత్నిద్దామనుకున్నాడు అనే్వష్. ఒక రోజు విశ్రాంతి తీసుకొని ఆ మరునాడు ప్రయత్నిస్తేసరి అనుకొని ఆరోజుకి బిక్షాటనకి స్వస్తి చెప్పాడు. ఒకరోజు కాకపోతే... నాలుగురోజులు... అంతకీ కాకపోతే నెల. అందరిళ్ళలో అందరూ తెలిసిపోతారు అప్పుడు. ఇలాంటివి తన వృత్తికి ఉపయోగమే కానీ. ఎప్పుడూ నిరుపయోగం కాదు అనుకున్నాడు.
* * *
హెచ్చరిక-7
హలో ఫ్రండ్స్!
ఇప్పటిదాకా మన స్వదేశీ అన్నలకు బుద్ధిచెప్పాం. ఈరోజు ఓ విదేశీ అన్నకు తెరపడింది. ఇక్కడనుంచీ వలసవెళ్ళి పెళ్ళిచేసుకున్న అమ్మాయికి త్రిలోదకాలు ఇచ్చి అక్కడ వేరే అమ్మాయితో కులుకుతున్నాడు. అలా ఆ అన్నగారిని వదిలేస్తే ఎలా? సో. ఈసారి నా పయనం పారిస్‌కు. దెబ్బకు పారిస్‌నుంచీ ఇండియాకు పరుగెత్తుకు రావాలి. దిసీజ్ మై ఛాలెంజ్.
మీ
పచ్చబొట్టు
ఆర్.విజయ్‌కుమార్,
అడ్రస్: వీనస్ అపార్ట్‌మెంట్, రూమ్ నెం.777, పారిస్.
* * *
ఈ వార్త బి.బి.సి. ద్వారా ప్రసారం చేయబడటం ఓ విశేషం. వెంటనే వెళ్ళి ‘విజయ్’ని కలిసారు పోలీసులు. అక్కడ ఇద్దరిని పెళ్ళిచేసుకోవటం నేరం కాకున్నా ఒకరికి విడాకులు ఇవ్వకుండా మరొకరిని చేసుకోవడం నేరం. ఆ విషయం వెల్లడవడంతో అతన్ని అరెస్ట్‌చేసారు. అతని ద్వారా పరిశోధన సాగుతుందని పోలీసులు ఆశించి అతన్ని ప్రశ్నించడం ప్రారంభించారు.
* * *
ఈ వార్త చదివిన అనే్వష్ ‘తృప్తి’ఇంటిని కనుక్కోవటం విషయం ప్రక్కకుపెట్టి పచ్చబొట్టు ఫారిస్ వెళ్ళిందా? వీసా ఉందా ఆమెకు? ఎప్పుడు తీసుకుంది? ఏ పేరు మీద? ఈవారం రోజులలో విమాన ప్రయాణం చేసిన అందరి పేర్లూ, అడ్రస్‌లు సేకరించాడు. అందులో అనుమానస్పదంగా ఎవరూ గోచరించలేదు. చాలామంది పెళ్ళయినవారు. పిల్లలున్నవారు. నడి వయసులో వారు ఒకరిద్దరున్నా వాళ్ళువాళ్ళు వికలాంగులవటంతో పట్టించుకోలేదు.
ఆలోచించగా ఆలోచించగా మరో ఆలోచన వచ్చింది. కొంపదీసి పచ్చబొట్టుకి పెళ్ళయిందేమో! తనతో అబద్ధమాడుతూ ఉండవచ్చుగా. ఊహలో కూడా ఆ విషయం నమ్మబుద్ధికావటం లేదు.
‘అసలు పచ్చబొట్టు ఈ పని చెయ్యకుండా ఎవరితోనైనా చేయిస్తోందా’ అనే అనుమానం వచ్చింది. లేకపోతే ఒక్కరు అన్నిచోట్ల ప్రత్యక్షమవటానికి ఆమె దేవతకాదు కదా! ఈ అనుమానం ఊరూ, వాడా పచ్చబొట్టు ప్రాకినప్పటినుంచీ తనమదిలో మెదులుతూనే ఉంది. ‘ఆత్మహత్య’వార్త లేని రోజు పేపరులో ఉండనట్లు ఈమధ్య కాలంలో పచ్చబొట్టు పొడిచినట్లు వార్త లేని రోజు లేనే లేదు. ఇన్ని చెయ్యటం ఒక్కరికి ఎలా సాధ్యమవుతుంది? అదీ ఒక ఆడపిల్లకు. తనను డైవర్ట్ చెయ్యటానికే పచ్చబొట్టు ఆడపిల్ల అని క్రియేట్ చేసారా? దానివల్ల వారికేం లాభం? తను ఒక్కడేనా? ఎందరో తమలాంటివారు పచ్చబొట్టును పట్టుకొనే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి తనకే ఎందుకు అబద్ధం చెబుతుంది? అంతా అయోమయంగా ఉంది. అయిదేళ్ళ సర్వీస్‌లో ఎన్నో కేసులు డీల్ చేసాడు. ఇంత కాంప్లికేటెడ్‌గా ఏదీ లేదు. ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోవటంతో టీ తెప్పించుకొని తాగాడు.
ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వచ్చి రిపోర్ట్‌చేసి వెళ్ళారు. ఇంతలో మెయిన్ బజారులో ఒక ఇంట్లో వృద్ధ దంపతులను హత్యచేసారని కబురు. వెంటనే అంతా అటు పరుగెత్తారు. నగా, నట్రా దోచుకుపోవటమే కాకుండా వాళ్ళను పొడిచి చంపటం ఇప్పటి వారిలో ఉన్న క్రూరత్వాన్ని చాటి చెబుతోంది. అక్కడ కార్యక్రమం పూర్తయ్యేటప్పటికి రెండుగంటలు పైనే పట్టింది. మళ్ళీ సాయంత్రం ‘పోలీసు కుక్కల’ను రప్పించారు. అవి ఎంతసేపూ ఇంటి చుట్టూరానే తిరగటం విశేషం. అంటే ఇంట్లోవాళ్ళే ఆ నేరం చేసారన్నట్లు అర్ధమవుతోంది.
రెండురోజులలోనే ఆ కేసుకు చరమగీతం పాడించాడు. ఆసరాకోసం పెట్టుకున్న పనివాడు ‘ప్రదీప్’ నేరస్థుడని నిరూపించాడు.
టి.వీలో, పేపర్లలో ప్రకటనలిచ్చారు. ముసలి వయసులో ఇలా ఒంటరిగా ఉన్నవాళ్ళు తగు జాగ్రత్తలో ఉండాలని.
అలిసిన హృదయం నిద్రను ఆహ్వానించింది. ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పెట్టింది. శరీరం ఇక్కడే. ఆత్మమాత్రం ఏదో తెలియని లోకాలలో హాయిగా విహారం చేస్తోంది. అది మళ్ళీ ఎప్పుడు అనే్వష్‌ని చేరిందో దానికే తెలియాలి.
* * *
వినీల్ ఒక ఇల్లు చూసాడు. అది అతనికి నచ్చటంతో ‘విద్య’ను తీసుకువెళ్ళి చూపెట్టాడు. ఆ ఇల్లు హాస్పిటల్‌కి దగ్గరగా కూడా ఉంది. హైదరాబాద్ నుంచీ చార్మినార్‌ను తీసుకొచ్చిన అనుభూతి కలిగింది ఆ భవనాన్ని చూడగానే. కానీ తాము ఎందుకు అందులో మారబోతున్నారో తలచుకోగానే దిగులు వచ్చింది.
విద్య ముఖంలో క్రమ్ముకుంటున్న భావాలు చూడగానే ఇట్టే పసిగట్టేసాడు. వాళ్ళ దిగులు పోగొట్టడానికి తన ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పట్లో వాళ్ళిద్దరూ అందులోంచి బయటపడలేరని అర్ధమవుతోంది అతనికి. పనిలో ఉన్నంతసేపూ వారు ఓ.కే. ఇంటికి వచ్చారంటే మాత్రం మారిపోతున్నారు. అందుకే ఈ ఇల్లు మారే కార్యక్రమం. ఈ ఇంటికి ఇంకో సౌకర్యం. ఒక రూమ్ సపరేట్‌గా లాక్ చేసుకునేందుకు వీలుగా ఉంది. దానికి అటాచ్‌డ్ బాత్రూమ్ కూడా. పెళ్ళి అయ్యేవరకూ తను ఆ రూమ్‌లో అడ్జస్ట్ అయిపోవచ్చు.
‘విద్యా! ఈ బిల్డింగ్ చూడటానికి బాగుండటమేకాదు సాయంత్రం పూట ఇలా వరండాలో కుర్చీలు వేసుకొని కూర్చుంటే ఎదురుగా ఎంత మంచి దృశ్యమో చూడు.
అవును. ఈ రూట్‌లో ఎప్పుడయినా వెళ్ళేప్పుడు బాగుందే అనుకొనేది. చుట్టూ ఇళ్ళు, మధ్యలో కోనేరు. దానిచుట్టూ మెట్లు. చూడటానికి కనుల పండువగా ఉంది. దాన్ని చూస్తూ ఎంత సమయమయినా గడిపెయ్యవచ్చు.
‘‘అమ్మా, నాన్న ఉంటే ఎంత ఆనందించేవాళ్ళు?’’ అటు తిరిగి ఇటు తిరిగి ఆలోచనలు మళ్ళీ అక్కడికే వెళతాయి. అయినవారు దూరమైతే ఇంత బాధా? చచ్చిపోయారని వినటమే. బాధపడతారు వారంతా అనుకోవటమే. చావులో ఇంత దుఃఖం ఉందని ఇప్పుడే కదా తెలుస్తోంది. ఏదో అగాథాలలో పడిపోయినట్లే ఉంటోంది. ఇంటికి వస్తే ఏం చేయబుద్ధికాదు. అలా శూన్యంలోకి చూస్తూ కూర్చోవటమే. అమ్మ నాలుగురోజులు రావటం ఆలస్యమైతేనే భరించలేకపోయింది. అలాంటిది ఆమె ఇక శాశ్వతంగా దూరమయి పోయిందని తెలిసాక కూడా తాము బ్రతికే ఉన్నామే! ఇదేనా అనుబంధం?

-సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206