డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ...21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింటున్న వరుణ్ మనసు ఆనందంతో గెంతులేసింది. లిస్ట్ చదువుతున్న భరణి వరుణ్ వంక క్రీగంట చూసి చిన్నగా నవ్వాడు. ఇందాకా ‘ఆ విషయం నేను చూసుకుంటాలే’ అని అతడు అభయమిస్తున్నట్టుగా అనడం గుర్తుకు వచ్చింది. ఆ లిస్టులో తన పేరూ, హరిత పేరూ వచ్చేలా భరణే కావాలని మేనేజ్ చేసాడని అర్థమైంది. అతడి మనసు భరణి పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది.
ఇంటికి బయలుదేరబోతుంటే అడిగాడు వరుణ్ హరిత అదోలా వుండడాన్ని గమనించి ‘‘ఏంటి హరిత అలా వున్నావు?’’
‘‘ఆ స్టూడెంట్స్ కమిటీలో నన్ను వేసారు.. నా కసలే అలాంటివన్నీ అలవాటు లేదు. నేను సరిగ్గా చేయగలనో లేదోనని భయంగా వుంది’’ అంది హరిత దిగులుగా.
వరుణ్ నవ్వాడు. ‘‘ప్రతిదానికీ భయపడడం నీ హాబీనా?’’ అన్నాడు. ఆ మాటలకి హరిత బాధగా ముఖం పెడితే నొచ్చుకున్నట్టుగా ‘‘నేనున్నానుగా? అన్నీ చూసుకునే పూచీ నాది! సరేనా?’’ అన్నాడు అభయమిస్తున్నట్టుగా.
‘‘్థ్యంక్యూ వరుణ్.. థాంక్యూ వెరీమచ్!’’ అంది హరిత కృతజ్ఞతగా.
వరుణ్ నవ్వాడు ‘స్నేహితుల మధ్య థాంక్సులూ సారీలూ వుండవు’’ అన్నాడు నవ్వుతూ చెయ్యి ముందుకు జాపుతూ. అతడి మాటలకి హరిత ఆనందంగా అతడికి షేక్‌హ్యాండ్ ఇచ్చింది.
***
ఆ రోజు ఆదివారం. సుదర్శనరావు ఆదివారం కూడా ఇంట్లో ఉండడు. బిజినెస్ పనులమీద తిరుగుతూ వుంటాడు. హరిత తమ్ముడు సుధీర్ స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు. సుమతి వంటింట్లో పనిలో వుంది. ఇల్లంతా ప్రశాంతంగా వుంది.
హరిత తీరిగ్గా హాల్లో కూర్చుని రిమోట్ చేత్తో పట్టుకుని ఛానల్స్ మార్చుకుంటూ టీవీ చూస్తోంది. కాసేపు మార్చి మార్చి ఏదో ఛానెల్లో సెటిలవుతుండగా ‘‘హారీ..ఇలా రామ్మా.. కాస్త నాకు వంటలో సాయం చేద్దువుగాని’’ అంటూ సుమతి వంటింట్లోంచి అరిచింది.
హరితకి ఒళ్ళు మండిపోయింది. ‘‘ఏంటమ్మా కాసేపు కూడా ప్రశాంతంగా టీవీ చూడనీయవు?’’ అంది సోఫాలోంచి లేవకుండానే.
‘‘పొద్దున్నుంచీ చూస్తున్నావు. చాలదా? చూసింది తక్కువా, ఛానల్స్ మార్చింది ఎక్కువా. అయినా పెళ్లి కావాల్సిన పిల్లవి. వంటా వార్పూ ఎపుడు నేర్చుకుంటావు?’’ అంది.
హరిత కోపంగా కాళ్ళు నేలకేసి కొడుతూ రిమోట్ పట్టుకుని వంటింట్లోకి వెళ్లింది. ‘‘వంటా వార్పూనా? ఇంజనీరింగ్ చదువుతున్నాను నేను తెలుసా?’’ అంది గర్వంగా చూస్తూ.
‘‘బాగానే వుంది. ఇంజనీరింగ్ చదివితే పెళ్లి చేసుకోవా? మొగుడికి వంట చేసి పెట్టవా?’’
‘‘అబ్బా.. నోరు విప్పితే చాలు.. ఎంతసేపూ పెళ్లీ.. మొగుడూ.. అవి తప్ప ఇంకే టాపిక్కూ దొరకదా నీకు?’’ కోపంగా అంది.
‘‘సరేలేవే.. వంట చేయకపోతే చేయకపోయావు. కాసేపిక్కడ కూర్చుని నేను చేస్తున్నదాన్ని చూస్తూ కాస్త నీ కాలేజ్ సంగతులు చెప్పు’’ అంది సుమతి తరిగిన కూరగాయ ముక్కలని పాన్‌లో వేసి కలుపుతూ.
హరిత శాంతిస్తున్నట్లుగా ఆమె చేస్తున్న పనిని పరిశీలిస్తూ అక్కడే గట్టుమీద కూర్చుంటూ అంది ‘‘అన్నట్టు నాన్న ఫ్రెండ్ రావుగారి అమ్మాయిని కలుసుకోమన్నావు కదా? ఆ రోజు కలవడం మర్చిపోయాను. ఆమె నిన్న కనిపించింది’’ అంటూ జరిగిన విషయం చెప్పింది.
‘‘అలాగా? ఆ లక్ష్మి కాకుండా ఇంకా ఎవరైనా స్నేహితులయ్యారా?’’
‘‘అయ్యారు..’’ అంటూ కొత్తగా పరిచయమైన స్నేహితులు పేర్లు వరుసగా చెప్పింది. అలా చెబుతుంటే ఆమెకి వరుణ్ గుర్తుకువచ్చాడు. వరుణ్ పేరు తల్లికి చెబుదామా వద్దా అనుకుంటూ ఒక్క క్షణం ఆగింది. అంతలో సుమతి అంది.
‘‘హమ్మయ్యా.. అన్నీ అమ్మాయిల పేర్లే చెప్పావు. ఇంకా అబ్బాయిల పేర్లు ఎక్కడ చెబుతావో అని హడిలి చచ్చాను. ఆ రోజుల్లో ఎల్.కె.జి పిల్లలనడిగినా ఫ్రెండ్స్ పేర్లు చెప్పమంటే అమ్మాయిలు అబ్బాయిల పేర్లూ చెబుతున్నారు!’’
హరిత మారు మాట్లాడలేదు. తల్లి తన స్నేహితుల పేర్లు అడగడం ఆసక్తితో కాదని, తనని చెక్ చేసే వుద్దేశ్యంతోనన్న విషయం అర్థమయి తను వరుణ్ పేరు చెప్పకుండా తను మంచి పనే చేసానని అనుకుంది.
***
కాలేజీ క్లాసులు మొదలయ్యాయి. చదువు మాటెలా వున్నా, కబుర్లూ, అల్లరీ షికార్లతో బాగా కాలక్షేపం అయిపోతోంది అందరికీ. రోజూ ఉదయమో, సాయంత్రమో లంచవర్లోనో ఏదో ఒక సమయంలో వచ్చి హరితని పలకరిస్తున్నాడు వరుణ్.
అందరిలో అతడలా తనని ప్రత్యేకంగా చూడడం కొంచెం ఆనందంగా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది హరితకి. కాలేజీకి బయలుదేరేముందు అద్దంలో చూసుకుంటుంటే ఆమెకి అప్రయత్నంగా తన వంక ఆరాధనగా చూసే వరుణ్ చూపులే గుర్తుకువస్తున్నాయి. అతనికోసం ప్రత్యేకంగా తయారై రావాలని అనిపించేది. మధ్య మధ్యలో కాలేజ్ కమిటీ మీటింగ్‌లకి వరుణ్‌తోపాటూ వెళ్లి వస్తోంది. వరుణ్‌కీ ఆమెకీ మరికొంత మంది వీళ్ళ బ్యాచ్‌లో స్టూడెంట్స్‌కి లైబ్రరీ కమిటీ మెంబర్స్‌గా డ్యూటీ వేశారు.
ఆ రోజు లైబ్రరీలో పని పూర్తయ్యాక ఏదో పుస్తకం చదువుతూ టైమ్ చూసుకోలేదు హరిత. అప్పటికే బాగా లేటైపోవడంతో చదువుతున్న పుస్తకాన్ని లైబ్రేరియన్‌కి ఇచ్చేసి తన బుక్స్ తీసుకుని బయటికి వచ్చేసింది. ఆమె లైబ్రరీ నుంచి వచ్చేసరికి ఆకాశం అంతా మబ్బులు పట్టి వర్షం వచ్చేట్లుగా వుంది వాతావరణం. గాలి చల్లగా వీస్తోంది. హరిత కంగారుగా మెట్లు దిగుతుంటే కనిపించాడు వరుణ్.
‘‘ఏమిటి? నువ్వింకా ఇంటికి వెళ్లలేదా? అంతా వెళ్లిపోతే నువ్వు కూడా వెళ్లిపోయావేమోననుకున్నాను’’ అంది హరిత ఆశ్చర్యంగా.
‘‘వెళ్ళేటప్పుడు చెబుదామని నీ దగ్గరికి వస్తే నువ్వేదో పుస్తకం సీరియస్‌గా చదువుతూ కనిపించావు. నిన్ను డిస్టర్బ్ చేయడమెందుకని వచ్చేశాను.
ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ