డైలీ సీరియల్

అన్వేషణ -5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇంగ్లీషు?’
‘ఇంగ్లీషు వచ్చేసరికి... షిడ్నీషెల్డన్ నవలలు ఒకటో రెండో... అర్థర్ హెయిలీ నవల బహుశా ఒకటి అనుకుంటాను... అలాగే డావిన్సీకోడ్... ఆర్కేనారాయణ్ నవలలు మూడు నాలుగు చదివి ఉంటాను.’
‘చదివిన మేరకు మంచి పుస్తకాలే చదివావు... నీది మంచి టేస్టే... మరి సంగీతం?...’ అని అతడి ముఖంలోకి చూసింది హిమజ.
‘సంగీతం అంటే నాకేమాత్రం పరిజ్ఞానం లేదు... అసలు ఎప్పుడూ బాత్‌రూములో కూడా హమ్మింగ్ చేయను. కానీ క్లాసికల్ మ్యూజిక్ అంటే మాత్రం వినాలనిపిస్తుంది. మంచి మెలోడీ ఉన్న పాటలంటే ఇష్టపడతాను.’
‘చాలా మంచి టేస్టేనే...’ క్రీగంట అతడిని చూస్తూ అన్నది.
‘మరి నీకు ఏ బుక్స్ అంటే ఇష్టం... ఏ పాటలంటే ఇష్టం?’
‘నువ్వు చెప్పిన పుస్తకాలు... అలాంటివే నేనూ చదివాను... చదువుతాను... ఇక సంగీతం అంటావా... వోకల్‌లో డిప్లమో చేశాను... కచేరీలు మాత్రం ఇవ్వలేదు’ అని కిసుక్కున నవ్వింది.
‘అబ్బో! యూ ఆర్ ఎ మ్యుజీషియన్...?!’
‘ఏమనుకుంటున్నావ్ మరి?!’ అంటూ సరదాగా తన వెన్ను తనే చరచుకుని భుజాలెగరేసింది హిమజ.
ఆమెతో గడిపిన ఇలాంటి ఎన్నో మధుర క్షణాలు అతడి మనసంతా ఆనంద పారవస్యాన్ని నింపాయి... ఐదారు నెలలు గడిచిపోయాయి.
వాళ్లిద్దరూ చాలా సన్నిహితంగా అయిపోయారు. ఆమె ఒకటి రెండుసార్లు అతడి ఇంటికీ వచ్చింది. అతడు స్వయంగా పెట్టి ఇచ్చిన కాఫీ తాగింది. బాగుంది సుమా అని కాంప్లిమెంటూ ఇచ్చింది.
‘సాధారణంగా బ్రహ్మచారుల ఇల్లంటే చాలా చిందరవందరగా ఉంటుంది. నేనూ నీ ఇల్లు అలానే ఉంటుందనా, సినీమాల్లోలా ఇల్లు సర్దాలనీ అనుకున్నాను. నువ్వు నాకా ఛాన్స్ ఇవ్వలేదేంటి అనిర్? చాలా నీట్‌గా ఉంచావ్! ఇదీ మీ అమ్మమ్మ ట్రైనింగేనా?’ అనడిగిందామె మొదటిసారి అనిరుధ్ ఇంటికి వచ్చినప్పుడు.
‘అవును అమ్మమ్మ నేర్పిందే...’ దాపరికం లేకుండా చెప్పాడు.
‘రేపు నీ భార్యగా ఎవరొస్తారోగానీ, సుఖపడుతుంది అనిర్!’ అన్నది నవ్వుతూనే అతడికేసి చూస్తూ.
‘నువ్వే రాకూడదా?’ అని నోటిదాకా వచ్చిన మాటని సభ్యత కాదని గొంతులోనే దిగమింగేశాడు. అప్పుడే కాదు చాలాసార్లు తాను ఆమెను ఇష్టపడుతున్నానని చెప్పాలనుకున్నాడు. పెళ్లికి ప్రపోజ్ చేయాలనుకున్నాడు. కానీ ఏమీ చెయ్యలేకపోయాడు. సభ్యత కాదేమోనన్న బెరుకు ఏ మూలో అతడి కాళ్లకి బంధం వేస్తోంది.
అలా చెప్పడంవల్ల పరిచయాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లవుతుందని భయపడ్డాడు. ఆమె నుంచే ఆ ప్రతిపాదన వస్తే బాగుంటుందనీ అనుకున్నాడు.
‘ఆమె కూడా తనలాగే ఆలోచిస్తోందా? ఆలోచిస్తుంటే ఎప్పుడో ఒకప్పుడు బయటపడకపోతుందా అనీ అతడు ఎదురు చూస్తున్నాడు.
ఆమె చెప్పిన ‘లైక్ మైండెడ్ పీపుల్’ అన్న మాట అతడి మస్తిష్కంలో పదేపదే మెదులుతూంటుంది. ఒకే భావాలు, ఒకే అభిరుచులు, ఒకే ధోరణి కలిగిన వాళ్ళు భార్యాభర్తలు కాగలిగితే ఎంత హాయిగా ఉంటుంది? - అనీ అనుకున్నాడు చాలాసార్లు.
పుట్టిన దగ్గర్నుంచీ తనకి అమ్మమ్మ తప్ప ఎవరి దగ్గర్నుంచీ ఏ రకమైన ఆదరణ, ఆత్మీయతా లభించలేదు. మొదట్లో అందరూ తనను చీదరించుకున్న వారే. ఎవరూ పిలిచి ఏనాడూ ఇంత బెల్లం ముక్క పెట్టేవారు కాదు.
‘పుట్టి తల్లిని మింగేశాడు... అయినా ఆ తల్లి ఉంటేనేం చస్తేనేం...’ అని అంతా చీదరించుకునేవారు. అదేంటి వాళ్లు అలా అంటున్నారు అని అమ్మమ్మని అడిగితే, యెదవలు యేదో అంటూంటారు. ఆయన్నీ పట్టించుకోకురా కన్నా...’ అనేదామె.
అప్పుడప్పుడు అతడిని ఆదరించి, పిలిచి ఏ తినుబండారామో పెట్టి నవ్వుతూ పలుకరించింది ఒకే ఒక్క మనిషి - ఆమె అలివేణి!
కానీ అందరూ ఆమెను చూసి మూతి తిప్పుకునేవారు. ఆమె ఎప్పుడూ కడిగిన ముత్యంలా నీటుగా ఉండేది. ఎప్పుడోగాని బయటికి వచ్చేది కాదు.
అలివేణి గురించి ఒకసారి అమ్మమ్మని అడిగితే గాఢంగా నిట్టూర్చింది. ‘ఆ భగవంతుడు ఎవడి నుదుట ఎలా రాస్తాడో అలా జరగాల్సిందే?! ఏం చేస్తాం?... పాపం బజారు మనిషయ్యింది...’ అన్నది.
బజారు మనిషంటే - అనిరుధ్‌కి అర్థం కాలేదు. అమ్మమ్మని అడగాలనుకున్నాడు. ఆరాలు తీస్తున్నావా అని అమ్మమ్మ తిడుతుందని ఊరుకున్నాడు. వయస్సు పెరిగాక, టెన్త్‌లోకొచ్చాక తెలిసింది ఆ మాటకర్థం.
అర్థం తెలిసిన తర్వాత కూడా ఆమె మీద దురభిప్రాయం కలుగలేదు. తనపట్ల ఆమె చూపిస్తున్న ఆదరణకి ఆమెపై తనకున్న గౌరవభావం అలానే ఉంది. అతడు పెద్దయ్యాక అలివేణి ఐదూ, పదీ డబ్బు చేతిలో పెట్టి ‘ఏదన్నా కొనుక్కోరా కన్నా’ అనేది.
ఈ జ్ఞాపకాలన్నీ అప్పుడప్పుడు అతడిని కదిలిస్తూనే ఉంటాయి. గతాన్ని ఎప్పుడూ మరిచిపోకూడదురా అనిరూదూ - అంటూండేది అమ్మమ్మ. ఆమె చదువుకోలేదు. కానీ, జీవితం గురించిన అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు మనవడికి ఆమె చెప్పింది. అవన్నీ అతడి మీద బలమైన ముద్ర వేశాయి.
ఇప్పుడు హిమజ పరిచయం కూడా అనిరుధ్‌కి కొత్త కోణాలు చూపించింది. మంచి ఆలోచనలు చేయడం, మంచి పుస్తకాలు చదవడం, జీవితం మీద అవగాహనను పెంచుకోవడం లాంటివి చేసింది.
అందుకే హిమజ అంటే అతడికి అంత అభిమానం ఏర్పడిపోయింది. ఆమెకు ఎలా ప్రపోజ్ చెయ్యాలి అని నిరంతరం ఆలోచిస్తున్నాడు...
సోఫాలో కూర్చున్నవాడల్లా చాలాసేపటికి కదిలి టైము చూసుకున్నాడు. పదిగంటలు దాటుతోంది. ‘అబ్బ! ఇంతసేపు కూర్చుండిపోయానా’ అనుకుని లేచాడు.
శిల్పారామంలో హిమజతో సరదాగా గడిపి విచ్చి అలా సోఫాలో కూర్చుని గతవర్తమాన జ్ఞాపకాల అలజడిలో అతడికి సమయం తెలీలేదు.
ప్రెష్పయి, బట్టలు మార్చుకుని మెస్సుకి వెళ్ళి భోజనం చేసి వచ్చాడు.
టీవీ ముందు కూర్చున్నాడు కానీ, అతడి దృష్టి దానిమీద లేదు.
మళ్లీ గతం, వర్తమానాల ఆలోచనల మధ్య ఆలోచనలు సుడులు తిరగడం మొదలెట్టాయి.
ఆ ఆలోచనలు అటు తిరిగి, ఇటు తిరిగి మళ్లీ హిమజ వైపుకే మళ్లుతున్నాయి.
ఆమె చెబుతున్న మాటలనుబట్టి ఆమె మంచి కుటుంబానికి చెందినదని అనుకున్నాడు. మరి తను?! తండ్రెవరో తెలీదు. తల్లి ముఖం ఎరుగడు, బాల్యం అంతా కష్టాలమయం... - ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842