డైలీ సీరియల్

అనే్వషణ -- 7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూనియర్ కాలేజీలో కొంతమేర, కాలేజీ జీవితంలో మరి కొంతమేర ఆ ధోరణి నుంచి బయటపడినా, ఇంకా అతడు బిడియస్థుడిలానే ఉండేవాడు.
హిమజ సాహచర్యంలో కొద్దిగా అంటిపెట్టుకున్న ఆ జడత్వం నుంచి దాదాపుగా ఇప్పుడు బయటపడ్డాడు.
ఇప్పుడు ఆమెతో సమంగా అనిరుధ్ గెంతులేస్తున్నాడు. జలపాతం నీళ్లలో ఇద్దరూ అలిసిపోయేలా కేరింతలు కొట్టారు.
అయితే సినిమాలకీ, షికార్లకీ వెళ్లినా, ప్రక్కప్రక్కనే కూర్చున్నా అతడు కానీ, ఆమె కానీ ఎప్పుడూ హద్దులు దాటలేదు. ఆమె చుట్టూ చేతులు వెయ్యడంలాంటి చేష్టలెప్పుడూ అతడు చెయ్యలేదు.
అనిరుధ్ ఇంటికి ఆమె వెళ్లినపుడు గంటలసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు. ‘ఇదిగో’ అని అతడి భుజం తట్టి మాట్లాడేది. అతడూ అంతే. అంతకుమించి వాళ్లెప్పుడూ ముందుకు వెళ్లలేదు. వెళ్లాలన్న ఆలోచనా వాళ్ల మనసులో రాలేదు.
కొన్ని సంప్రదాయాలు ఆమె ఖచ్చితంగా పాటిస్తుంది. అనిరుధ్‌కీ చెప్పింది. అతడు నిజాయితీగా వినేవాడు. ఆచరించేవాడు. ‘సరే! ఇంతకీ మనం పెళ్లెప్పుడు చేసుకుందాం?’ అతడిని క్రీగంట చూస్తూ హిమజ అడిగిందో రోజు.
అతడు వెంటనే సమాధానం చెప్పలేదు. క్షణం పోయాక అన్నాడు: ‘ఓసారి అమ్మమ్మతో నీ గురించి చెప్పి వస్తాను. ఆమె మనస్ఫూర్తిగా సంతోషిస్తుంది. ఆ తర్వాత మీ పేరెంట్స్‌ని కలుస్తాను.. మా మానమామ, మేనత్త ఇందుకోసం నా తరఫున పెద్దరికం వహిస్తారన్న ఆశ నాకేం లేదు. కానీ, ఒక విధంగా ఎవరూ లేని అనాధలాంటివాడిని.. మీ పేరెంట్స్ ఏమటారో?!..’
‘అనాధనన్న భావం మనసులోంచి తుడిచేయ్ అనిర్!.. అమ్మమ్మ ఉంది.. ఇప్పుడు నేనొచ్చి కలిశాను.. ఇంక నువ్వు అనాధవెందుకవుతావు?.. అయినా నీ గురించి మా పేరెంట్స్‌కి అంతా తెలుసు.. అంటే నేను వివరంగా ఓ లెటర్ రాశాను ఇరవై రోజుల క్రిందట..’ అన్నదామె అతడి భుజంమీద చెయ్యి వేసి అనునయంగా.
‘అవునా?!..’
‘అవును..’
‘ఏమన్నారు మీ నాన్నగారు?..’
‘జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో.. చిన్నదానవు కాదు. సొసైటీని బాగా స్టడీ చేసిన దానివి..’ అని ఫోన్‌లో చెప్పారు.
‘మరి నన్ను స్టడీ చేశావా?..’ చిలిపిగా అడిగాడు.
‘చేశాకే నీతో ఇంతదూరం వచ్చాను.’ అదే చిలిపితనంతో అన్నదామె.
‘నిజంగా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది హిమా! జడపదార్థం లాంటి నేనేమిటి, ఒకమ్మాయి ప్రేమలో పడడమేమిటి అని..’
‘ఎప్పుడు, ఎందుకు, ఎలా జరుగుతుందో చెప్పలేం అంటారు పెద్దలు.. మనమధ్య అలా జరిగగిపోయిందంతే...’
‘ఎగ్జాట్లీ.. ’ అన్నాడు. ఆమె కిలకిలా నవ్వింది.
‘వచ్చేవారం అమ్మమ్మ దగ్గరకి వెళతాను. అమ్మమ్మతో అన్ని విషయాలు మాట్లాడి, ఆమె రాగలిగితే ఆమెను తీసుకుని మీ పేరెంట్స్‌ని కలిసి మాట్లాడతాను..’
అలాగే అన్నట్లు ఆమె తలూపింది. ఆ వెంటనే ఆమె చెయ్యందుకు సుతారంగా చుంబించాడు ‘హిమా!’ అంటూ.
ఆమె అందంగా నవ్వి ‘అంతేనా?’ అని అన్నది. సమాధానంగా అనిరుధ్ నవ్వేశాడు.
ఆ తర్వాత అనుకున్నట్లుగానే అమ్మమ్మ దగ్గరికి రెండు మూడు రోజుల్లో వెళ్లాలని అనిరుధ్ అనుకుంటున్న సమయంలో ఓ తెల్లవారు జామున స్నేహితుడు కొండబాబు ఫోన్ చేశాడు.
‘అమ్మమ్మకి బాగా లేదురా.. బయల్దేరిరా..’ అన్నాడు ఆదుర్దాగా.
రెండు రోజులుగా ఆమెకు నలతగా ఉందిట. డాక్టర్‌కి చూపించాడు కొండబాబు. కానీ ఆ రాత్రి హడావిడి చేసింది. దాంతో ఎందుకేనా మంచిదని అనిరుధ్‌కి ఫోన్ చేసి చెప్పాడు కొండబాబు.
కబురు విన్న వెంటనే కారు మాట్లాడుకుని వెంటనే వెళ్లాడు అనిరుధ్. అతడు వెళ్లేసరికి అమ్మమ్మ నిస్త్రాణంగా నిద్రపోతోంది. ఊపిరి తీసుకుంటుంటే డొక్కలు ఎగరవేస్తోంది.
ఆరు నెలల క్రిందట అనిరుధ్ చూసినప్పటికంటే ఇప్పుడు బాగా చిక్కినట్లనిపించింది. అస్థిపంజరానికి బట్టలు చుట్టబెట్టినట్లుంది.
‘పెద్దగా జబ్బంటూ ఏమీ లేదంట్రా.. వయస్సు కారణం అన్నాడు డాక్టరు. ఈమధ్య బాగా తిండి తగ్గించేసింది. తినాలంటే పోటల్లేదురా అంటోంది’ కొండబాబు చెప్పాడు.
కాస్సేపటికి కళ్లు తెరచిన ఆమె మనవడిని చూసి చాటంత ముఖం చేసుకుంది. ఆప్యాయంగా మనవడి చేతులు పట్టుకుని ‘నీకు కబురెట్టేశారా?.. ఏదో కాస్తంత నీరసం. అంతే.. పాపం కొండబాబు మూడుపుటలా వచ్చి చూస్తున్నాడ్రా..’ అన్నదామె.
ఆమెనలా చూసేసరికి అనిరుధ్‌కి ఏడుపొచ్చేసింది.
‘ఏమిటే అమ్మమ్మా! నిన్ను నాతో వచ్చెయ్యమన్నానుగా..’ అన్నాడు.
‘ఏడిశావ్‌లేరా అనిరూదూ! నేనక్కడికొచ్చి ఏం చేస్తాను?.. ఇక్కడంటే వీళ్లంతా ఉన్నారు..’ అంటూ నవ్వింది.
ఆమె అలా నవ్వినపుడు నోట్లో చాలాచోట్ల పళ్లూడిపోవడం గమనించాడు అనిరుధ్.
‘వయస్సు మీదపడుతున్నపుడు ఇలా ఉండక ఎలా ఉంటాన్రా పిచ్చిసన్నాసి?! ఇలాగే లేస్తా పడతా ఉంటారు..’ కళవెళపడుతున్న మనవడి ముఖం చూసి అన్నదామె.
అది నిజమే అయినా అతడి ఆదుర్దా అతడిది. అతడి బాధ అతడిది: ‘వయస్సు మాట సరే అమ్మమ్మా! నిన్నిలాంటి స్థితిలో చూస్తే నాకేడుపొచ్చేస్తోంది.. అదే నువ్వు నా దగ్గరుంటే నాకు ధైర్యంగా ఉంటుంది’ అన్నాడు. దానికి సమాధానంగా ఆమె నవ్వేసి మనవడి తలనిమిరింది ఆప్యాయంగా.
ఆ రాత్రి చాలాసేపు కొండబాబు కూర్చుని కబుర్లుచెప్పి వెళ్లిపోయాడు. కొండబాబు భార్య పంపిన భోజనం ఇద్దరూ తిన్నారు.
రాత్రి పదిగంటలు దాటుతున్న సమయంలో అనిరుధ్‌ని పిలిచింది అమ్మమ్మ. ఆమె మంచం ప్రక్కనే బొంత వేసుకుని కూర్చున్న అనిరుధ్ మంచం దగ్గరగా జరిగాడు ‘ఏమిటమ్మమ్మా’ అంటూ.
‘నేనింక ఎంతోకాలం బతకనురా’ అన్నది అతడి తల నిమురుతూనే నెమ్మదిగా.
‘అలా అనకే అమ్మమ్మా’అన్నాడు బేలగా.
‘పెద్దదాన్నయిపోయాను కదరా’ అన్నది.
‘నీకన్నా పెద్దవాళ్లు హాయిగా బతుకుతున్నారే అమ్మమ్మా...’
మనవడి తల నిమురుతూనే అతడి మాటలకు ఆమె నవ్వేసింది.
‘అమ్మమ్మా! మా నాన్న ఎవరే?’ అప్రయత్నంగా, అప్రస్తుతంగా అడిగాడు అనిరుధ్ కాస్సేపయ్యాక. తన తండ్రి గురించి వివరాలు తెలుసుకోవాలని ఎప్పటినుంచో అతడి మనసులో సుడులు తిరుగుతున్న ప్రశ్న అది.

--ఇంకా ఉంది

-- సర్వజిత్ 9010196842