డైలీ సీరియల్

అన్వేషణ -8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో ఎన్నిసార్లు అడిగినా అమ్మమ్మ చెప్పలేదు. ‘ఆ ముదనష్టపోడు గురించి ఇప్పుడెందుకు?’అంటూ కసిరేది. అదే విషయం భయపడుతూ మేనమామని అడిగాడు. మేనత్తనీ అడిగాడు. ‘ఆ యెదవ గురించెందుకు... చచ్చాడు...’అనేవారే తప్ప అసలు విషయం ఎవరూ చెప్పలేదు.
తండ్రికి అన్నలో, తమ్ముళ్లో, అక్కలో, చెల్లెళ్లో ఉండాలికదా? వాళ్లెప్పుడూ ఎవరూ తమ ఇంటికి రాలేదు. వాళ్లెవరూ తనకి తెలీదు. అసలు ఎవరూ లేరా? సమాధానం లేని ప్రశ్న.
తన తండ్రి దిక్కూమొక్కూ లేనివాడా? తన తల్లిని వదిలి వెళ్లిపోయాడా? వాళ్లిద్దరిమధ్యా తగాదాలేమైనా ఉన్నాయా? అసలు తన తండ్రి బ్రతికి ఉన్నాడా? నిజంగా చనిపోయాడా? కోపంతో వీళ్లు చచ్చాడు అని అంటున్నారా?... ఎవరూ సమాధానం చెప్పని ప్రశ్నలు.
తన తల్లిని అందరూ పిచ్చిది అని అంటుంటే కూడా అతడికి బాధగా అనిపించేది. ఒక రోజు కొండబాబు చెప్పాడు; ‘మీ అమ్మ పిచ్చిదేనట్రా’ అని.
మరి ఆ పిచ్చిదానికి పెళ్లెలా అయింది? ఒకవేళ పిచ్చిని కప్పిపుచ్చి పెళ్లిచేస్తే అది ఆ తర్వాత తెలిసిపోయి తన తండ్రి భార్యని వదిలిపెట్టి వెళ్లిపోయాడా?- మళ్లీ మరిన్ని ప్రశ్నలు అతడిని చిందరవందర చేశాయి. చేస్తున్నాయి. అందుకే మరోసారి ధైర్యంచేసి అమ్మమ్మని అడిగాడు తన తండ్రి గురించి.
ఆ ప్రశ్నకు ఆమె క్షణం నిశే్చష్టిత అయ్యింది. మనవడికి ఏం సమాధానం చెప్పాలి?- అని కళవెళపడింది. ఇన్నాళ్లూ ఎన్నిసార్లు అడిగినా ఏదో చెప్పి దాటవేస్తూ వచ్చింది.
ఇప్పుడు చెప్పక తప్పదు. తను జీవితంలో చరమాంకానికి చేరుకుంది. ఇక రాలిపోవడానికి సిద్ధంగానే ఉంది. ఎవరెవరో ఏదో చెప్పేకంటే తనే తన మనవడికి వివరంగా అన్నీ చెప్పడం మంచిదనుకున్నదామె.
‘అమ్మమ్మా! మా నాన్న ఎవరే?’ ఆమె ఎంతకీ మాట్లాడకపోయేసరికి మళ్లీ అడిగాడు అనిరుధ్ దీనంగా అభ్యర్థిస్తున్నట్లు.
‘మీ నాన్న?!....’ ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్ధంకాక క్షణంసేపు ఆగిందామె.
‘ఎవరు అమ్మమ్మా?’ ఆదుర్దాగా అడిగాడు.
‘ఎవరు అంటే ఏం చెప్పనురా?... ఎవరో మాకెవరికీ తెలీదు...’ అన్నదామె బాధగా.
‘అంటే... అమ్మ... అమ్మని...’ ఇంక మాట్లాడలేకపోయాడు అనిరుధ్.
‘మీ అమ్మని చెరిచార్రా...’ గుండె లుంగచుట్టుకుపోయినట్లు బాధగా అన్నదామె.
‘అమ్మమ్మా...’ షాక్ తిన్నట్లు అరిచాడు అనిరుధ్.
‘అమ్మమ్మా... అదే మీ అమ్మ పిచ్చిది. పదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆటల్లో అది మిద్దెమీదనుంచి పడింది. తలకు బలమైన గాయం తగిలింది. తర్వాత కొన్నాళ్లకి దాని మాటలు, చేష్టలు పిచ్చిపట్టినదాన్లా తయారయ్యాయి. అప్పుడే కనక మంచి డాక్టరుకు చూపిస్తే అది మామూలు మనిషి అయ్యేది.
మీ మామయ్య అస్సలు పట్టించుకోలేదు. అప్పటికి మీ తాత చనిపోయి ఐదేళ్లయ్యింది. నేనూ, మీ అమ్మా మీ మామయ్యమీదనే ఆధారపడి ఉన్నాం. ఉన్న ఒక్క పెంకుటిల్లూ అప్పటికే మీ మామయ్య బలవంతంగా తన పేర రాయించేసుకున్నాడు. అలా రాసిస్తేనే నాకూ నా కూతురికీ ఇంత ముద్ద పెడతాననీ, దాని పెళ్లిచేస్తాననీ అన్నాడు... కానీ ఇంత ముద్దమాత్రం పెట్టేవాళ్లు. అదీ బండెడు చాకిరీ చేస్తే.. అంతకుమించిన ఆలనాపాలనా ఏం చూసేవారుకాదు. మీ అత్తమ్మ భూదేవా... పేరుకే అది బూదేవి... ఏమాత్రం ఓర్పులేని మనిషి. ... నారిముచ్చు... పైకి కనిపించదుకానీ, తడిగుడ్డతో గొంతు కోసే రకం. పదేళ్ల మీ అమ్మతో బండెడు చాకిరీ చేయించుకునేది. నన్ను చూస్తే మాత్రం- ‘అదిగో చూడండత్తయ్యా చదువుకోమంటే ఇంటి పనులు చేస్తోంది’అంటూ అబద్ధాలు చెప్పేది. ఆమె నోరు విప్పితే అన్నీ అబద్ధాలే. మీ మామయ్య సత్యం ఉన్నాడే వాడూ అబద్ధాలకోరే... ఆమె మాటలే నమ్మేవాడు. నిజం ఏమిటో తెలుసుకునే వాడుకాదు...
‘మీ మామయ్యని కాళ్లావేళ్లాపడి బ్రతిమిలాడాను పిచ్చిపట్టిన చెల్లెలు... అంటే మీ అమ్మకి వైద్యం చేయించమని... ఆ వైద్యానికి వేలు ఖర్చవుతాయన్నాడు. తనవల్ల కాదన్నాడు. అంతంత డబ్బులుపోసి ఖర్చుపెట్టే వైద్యాలు మనవల్లేమవుతాయి... అంటూ మీ అత్తయ్య దీర్ఘాలు తీసింది... పెరుగుతున్న వయస్సుతోబాటే దానికి పిచ్చీ ముదిరింది.
చదువు చంకనాకింది. వోణీలు వేసుకునే వయస్సులోకూడా పరికిణీ జాకెట్టుతో రోడ్లమ్మట పరుగులు పెట్టేది. వచ్చేపోయే వాళ్లని పలుకరించి పిచ్చివాగుడు వాగేది. ఏదైనా పాట వినిపిస్తే చాలు రోడ్డుమీద డ్యాన్సులు చేసేది. వైద్యం చేయించమని మీ మామయ్యని, అత్తమ్మనీ ఎంతగా ప్రాధేయపడ్డా వాళ్లు లక్ష్యపెట్టలేదు... నలుగురినీ దేబిరించి, ముష్టెత్తుకున్నంత పనిచేసి కొంత డబ్బు పోగుచేసి, ఓరోజు నేనే దాన్ని ఆసుపత్రికి తీసికెళ్లి డాక్టర్‌కి చూపించాను. అప్పటికే పిచ్చి బాగా ముదిరిపోయిందన్నారు డాక్టర్లు. మూడునాలుగేళ్ల క్రిందట తీసుకొని ఉంటే ఈపాటికి పిల్ల నిక్షేపంలా ఉండేదన్నారు.
ఇప్పుడు వైద్యం చేయాలంటే చాలా ఖర్చవుతుందన్నారు. అది నావల్ల కానిపని... దానికింత విషం ఇచ్చి, నేనింత తీసుకుని చస్తే సమస్య తీరిపోతుందనుకున్నాను. గనే్నరు పప్పు తిందామని అంతా సిద్ధంచేశాను. మళ్లీ ఏదో ఆశ. ఆ భగవంతుడి దయవల్ల ఎలా పిచ్చి పట్టిందో అలాగే మరేదైనా దెబ్బతగిలి పిచ్చిపోతుందేమోనన్న వెర్రి ఆశ... చావాలనుకున్న ప్రయత్నాన్ని విరమించుకున్నాను. ఇలా చావడానికి మూడుసార్లు ప్రయత్నించాను. కానీ చేతులారా కూతుర్ని చంపుకోలేకపోయాన్రా...’
ఆయాసం వచ్చి క్షణంసేపు ఆగిందామె. లేచి వెళ్లి అనిరుధ్ మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. గటగటా తాగేసింది. సేద తీర్చుకుంటున్నట్లు కాసేపు వౌనంగా ఉండి మళ్లీ చెప్పడం మొదలెట్టింది.
‘ఏ జన్మలో నేను ఏ పాపం చేశానో భగవంతుడు నామీద కక్షగట్టాడ్రా... భర్తను తీసుకుపోయాడు. నిలువెల్లా స్వార్థం నింపుకున్న మనుషుల్ని కొడుకూ, కోడలుగా ఇచ్చాడు. ఇది చాలదన్నట్లు కూతురికి పిచ్చి... దాన్ని అనుక్షణం కనిపెట్టుకుని ఉండేదాన్ని. నేను కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు రోడ్లమీదకి పరుగెట్టేది... వయస్సు పెరుగుతోంది. ఎంత జాగ్రత్తగా చీరకట్టినా అస్తవ్యస్తం చేసుకునేది. వళ్లు దాచుకోవడం తెలీదు. ఇరవై ఏళ్లొచ్చాయి... ఒక పిచ్చి తప్పిస్తే మీ అమ్మ ఎంత అందంగా ఉండేదోరా!
పెద్ద కళ్లు...చక్కని గడ్డం, ముక్కు... బాగుండేదిరా.. ఆ అందమే దానికి శాపం అయిపోయిందేమో...! నాలుగు నెలలుపోయాక దాని పొట్ట ఎత్తుగా అనిపిస్తే అడిగాను... ఏంటే పొట్ట అలా ఉంది అని. అన్నం తింటున్నాగా బాగా... పొట్టొచ్చేసింది...అంటూ గెంతులేసుకుంటూ వెళ్లిపోయింది. పిచ్చిదాన్ని పట్టుకుని ఏమిటిలా అడిగానని తర్వాత నన్నునేను తిట్టుకున్నాను. కొందరి శరీర తత్వానికి ఆరోనెల గర్భంకూడా పెద్దగా తెలీదు. మీ అమ్మదీ అదే తీరు!... తర్వాత నాకు బాగా అనుమానంవస్తే దాన్ని బలవంతంగా ఆసుపత్రికి లాక్కెళ్లి డాక్టరుకు చూపించాను. - ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842